మరపురాని మనిషి

23 Jan, 2014 00:38 IST|Sakshi
మరపురాని మనిషి

ఆయనో సమష్టి విజయరూపం. అటువంటి మహావ్యక్తి తనువు చాలిస్తే కన్నీరు పెట్టుకోకూడదు. కానీ, మాట వింటే అది కన్నీరు అవదు కదా! అందుకే తెలుగునాట ప్రతి కనుపాప చెమర్చుతున్నది. ప్రతి కళాహృదయం బరువెక్కుతున్నది.
 
 వందేళ్ల తెలుగు సినిమా రంగం... అందులో ఎన్నో వేల మంది నటులు, దర్శకులు, సంగీత దర్శకులు, కళాకారులు... అద్భుత ప్రతిభావంతులు. కానీ, ఎన్నేళ్లు గడిచినా, ఎన్ని తరాలు మారినా, పరిస్థితులు ఎలా పరిణమించినా, ఎంత సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లినా మరపురాని, మదిని వీడిపోని ప్రతిభ కొందరు కళాకారుల సొంతం. అలాంటి కొద్దిమందిలో అక్కినేని నాగేశ్వరరావు అగ్రేసరులు.
 
 ఆయన రంగంలో ఆయనకి ముదిమి లేదు. భయం లేదు. జంకూ లేదు. నిత్యనూతనంగానే ఆయన జీవితం గడిచింది. మనిషికి మరణం తప్పదు. కానీ అక్కినేని మాత్రం మరణించని మనిషే. ఎన్నో లక్షల మంది కన్నీటి గురుతుల వెనుక, పన్నీటి జల్లు వంటి చల్లటి జ్ఞాపకాల కింద, అభిమానుల గుండె సవ్వడిలో, వందల చలనచిత్రాల ద్వారా అక్కినేని చిరంజీవి. అనారోగ్యానికి దొరికిపోయినా వందేళ్లూ బతుకుతానని మొన్నమొన్ననే ధీమాగా పలికిన వ్యక్తి, ఎవరో పిలిచినట్టు ఇంతతొందరగా వెళ్లిపోవడం కొంచెం బాధగానే ఉంటుంది. ఇది దురదృష్టమే. ఈ దురదృష్టం చలనచిత్ర సీమ మొత్తానిది. యావత్తు ప్రేక్షకలోకానిది.
 దేవదాసు, విప్రనారాయణ, బాటసారి, మాయాబ జార్, మహాకవి కాళిదాసు, మిస్సమ్మ, అమరశిల్పి జక్కన్న... ఇలా చిరస్థాయిగా నిలిచే వెండితెర రూపా లు ఎన్నో! ఎంతటి జీవన ప్రవాహాన్నయినా పట్టుకుని నిశ్శబ్దంగా తెర మీద నటన ద్వారా ఆవిష్కరించగ లిగిన, అనుభూతికి రూపాన్ని ఇవ్వగలిగిన ఆయన అరుదైన ప్రతిభను ‘నటన’ అన్న పదంతో తూచడం సాధ్యం కాదు. అదో కళాసంస్కారం. అదో నిత్య అధ్యయన కృషి ఫలితం.
 
 ‘అక్కినేనిని తొలిసారి తెర మీద ఎప్పుడు చూశాం?’ అని ఎవరికి వారు ప్రశ్నించుకుని, ఆ బిందువు నుంచి తెలుగు సినిమా గతాన్ని నెమరు వేసుకుంటే ఎవరికి వారికే ఒక చరిత్ర భాగం తయారవుతుంది. తెలుగు ప్రజలతో అక్కినేనికి ముడిపడిన బంధం ఎలాంటిదో ఆ చరిత్ర అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఆనాడు మనకి సినిమా అంటే కేవలం రెండు మూడు గంటల కాలక్షేపం కాదు. మన సామాజిక జీవితంలో అదొక భాగం. సినిమాకు వెళ్లడం అంటే, అందునా అక్కినేని సిని మాకు వెళ్లడం అంటే, అదో గొప్ప కళాయాత్ర. 1960 ప్రాంతాలలో ఏలూరులో నా అనుభవం- సినిమా విడుదలైన రోజు నుంచి ప్రతిరోజూ గోపాలకృష్ణా టాకీస్ దగ్గర (కర్రవంతెన) ఎన్ని ఎడ్లబళ్లు విడిసి ఉన్నాయో లెక్క వేసేవారు. బళ్లు నిలబెట్టుకోవడానికే అన్నట్టు ఉండే ఆ విశాలమైన స్థలంలో చుట్టుపక్కల ఊళ్ల నుంచి, కుటుంబాలను తరలించుకు వచ్చిన  బళ్లు అవన్నీ. ఒక్కటి మాత్రం బాగా గుర్తు. అక్కినేని సినిమాకు వచ్చినన్ని బళ్లు మరే నటుడి సినిమాకు వచ్చేవి కాదు.
 
 అక్కినేని స్వయం కృషితో చదువు నేర్చుకున్నారు. చదువు విలువ తెలిసిన వారు. తన గమనంతో, సహృదయతతో పదిమందికీ బతువు చదువును కళాత్మకంగా నేర్పిన ధన్యజీవి. నలుగురి మధ్య సామాన్య మాన్యుడు. కోట్లకొద్దీ సామాన్యులకి మాన్యుడు. అసామాన్యుడు. తెలుగుతనానికి రాయబారి. వ్యక్తిగా, కళాకారుడిగా, గృహస్థుగా... ఆయనో సమష్టి విజయరూపం. అటువంటి మహావ్యక్తి తనువు చాలిస్తే కన్నీరు పెట్టుకోకూడదు. కానీ, మాట వింటే అది కన్నీరు అవదు కదా! అందుకే తెలుగునాట ప్రతి కనుపాప చెమర్చుతున్నది. ప్రతికళాహృదయం బరువెక్కుతున్నది.
 
 అక్కినేనితో ఓ తరం నటుల యుగం ముగిసిపోయినట్టే. ఆ తరం అంటే వెండితెర మీద బంగారు పంట.  మాయాబజార్‌ను గుర్తుకు తెచ్చుకుని, ఆ అద్భుత కళాఖండం కోసం పని చేసిన కళాకారులలో ఇం కా ఎందరు మిగిలారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే చెప్పలేని దిగులు. సాత్వికమైన కళాభివ్యక్తి కలి గిన, పరిపుష్టమైన ఓ తరం తిరిగిరాని లోకాలకి మరలిపోయిందన్న దిగులు. సుస్వరం, సుశబ్దం మౌనంగా నిష్ర్కమిస్తున్నాయన్న వేదన మరో వైపు.
 
 అరవై, డెబ్భై దశకాలు తెలుగు కుటుంబ గాథా చిత్రాలకు స్వర్ణయుగం. అలాంటి చిత్రాల మూలస్తం భాలలో ప్రధానంగా చెప్పుకోవలసి వస్తే ఏయన్నార్ పేరే మొదటిగా చెప్పుకోవాలి. తమ్ముడు, అన్న, కాలేజీ విద్యార్థి, జవాన్, కిసాన్, కవి, కార్మికుడు, జులాయి, భక్తుడు, దేవుడు, డాక్టర్, యాక్టర్ అన్నింటికీ మించి ప్రేమికుడు.. ఆయన ధరించని పాత్ర లేదు. సాంఘిక ం, జానపదం, పురాణ చిత్రం అన్న భేదం ప్రేక్షకుడికే గానీ ఆయనకు లేదేమోననిపిస్తుంది. కాళి దాసు, జయంతుడు, అభిమన్యుడు -పాత్రల మధ్య నిశితమైన వైవిధ్యం చూపుతూ, సునాయసంగా నటించారాయన. ప్రేమికుడిగా ఆయన నటనను చూస్తుంటే, ఓ భగ్నప్రేమికునిగా చూస్తూ ఉంటే... అక్కినేని ఒక పాత్రలో దర్శనమిస్తున్నారని మరచిపోయి, ఆ ప్రేమికుడి భావాలతో ప్రేక్షకులు మమేకమైపోయిన సందర్భాలు ఎన్నో! ఆయన మన కుటుంబంలోని వాడేనన్న మధుర భ్రాంతి. ఆయన నటించిన సినిమాలలో ఒక కాల పు సినిమాలకు రంగులు లేకపోయినా, ఆయన కలలే వేరే రంగులు లేని లోటును తీర్చేవి. మనకున్న చక్కటి కుటుంబ కథాచిత్రాలు చాలా గొప్పవి. ఆ గొప్పతనంలో సింహభాగం అక్కినేనిదే. 1979 నుంచి వరసగా, 2013 నాటి గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాన్ని కూడా వీక్షించిన అనుభవం, 35 ఏళ్లుగా చూసిన ఎన్నో వందల చిత్రాలు కలిగించిన అనుభూతి ద్వారా నాకు కలిగిన నమ్మకమిది. అక్కినేని లేని వెండితెర చరిత్రకు పరిపూర్ణతలేదు. నటనేకాదు, ఆయన ప్రసంగం కూడా నిర్దుష్టంగా ఉంటుంది. నిర్దిష్టంగా కూడా ఉంటుంది. విరిసిన వెన్నెల వంటి నవ్వు. జీవితసారం మీద అనేక ఇంటర్వ్యూలలో అలవోకగా చేసిన వ్యాఖ్యలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు దేనికవే. అన్నింటి మీదా అక్కినేని ము ద్ర సుస్పష్టం. కొన్ని వందల చిత్రాలలో కనిపించిన అక్కినేని రూపం ఇవాళ నుంచి చరిత్ర పుటగా మారిపోయింది. స్టార్ ఏయన్నార్ ఇప్పుడు వెండితెరను వీడి దివికేగిన నక్షత్రం.
 
 వి. రాజారామమోహనరావు,  సినిమా విమర్శకుడు, నవలా రచయిత
 

మరిన్ని వార్తలు