ఆలిస్ మన్రో ‘నోబెల్’ కథలు

6 Jan, 2014 00:07 IST|Sakshi
ఆలిస్ మన్రో ‘నోబెల్’ కథలు

ఆలిస్ మన్రో కథలు
 తెలుగు: జి.లక్ష్మి
 వెల: రూ. 70
 ప్రతులకు: విశాలాంధ్ర
 
 ఆడపిల్లల జీవితాలను, కుటుంబంలో వారి బాధలను, సంతోషాలను, ఎదిగే వయసులో వారు ఎదుర్కొనే సంశయాలు, సందిగ్ధాలను ఎంతో నైపుణ్యంతో అతి మంద్రంగా అంతే నిశితంగా కళ్ల ముందుంచిన  ఆలిస్ మన్రో కథలు ఇవి. రచయిత్రిగా ఇవి ఆమె ఆత్మను పట్టిస్తాయి. ఇటీవలే, సాహిత్యానికి ఇచ్చే నోబెల్ బహుమతిని పొందిన ఈ కెనడా దేశపు రచయిత్రి కథలు ఏడింటిని జి.లక్ష్మి తెలుగులోకి తర్జుమా చేసి తెలుగు కథానికా ప్రపంచంలో చిరకాలంగా ఉన్న ఓ లోటును కొంతలో కొంతయినా తీర్చారు. స్త్రీవాదులుగా చెప్పుకునే రచయిత్రులు, అంతకు మునుపు తెలుగు కథానికా రంగంలో లబ్ధ ప్రతిష్టులుగా ఉన్న రచయితలు, రచయిత్రులెవరూ ఎదుగుతున్న ఆడపిల్లల జీవితాలను, వారి దృష్టికోణం నుంచి చిత్రించిన దాఖలాలు కానరావు. పది పన్నెండేళ్ల వయసులో ఉండే అమ్మాయికి తన కుటుంబసభ్యులతో ఉండే సంబంధ బాంధవ్యాలలోని లోతు  పాతులను రచయిత్రి తన స్వానుభవం నుంచి, లేదా సహానుభూతి చెంది రాస్తే తప్ప ఇటువంటి సాధికారమైన కథలు వెలుగు చూడవు. ముఖ్యంగా తల్లికి/తండ్రికి తమ కూతురితో ఉండే అనుబంధంలోని వైరుధ్యాలను రచయిత్రి ఎంతో సున్నితంగా అక్షరబద్ధం చేశారు. కళ్యాణ సుందరీ జగన్నాథ్, జలంధర, పి.సత్యవతి వంటి అతి కొద్దిమంది, అంతకు మునుపు సౌరిస్, కొమ్మూరి పద్మావతీ దేవి, ఆచంట శారదాదేవి, శివరాజు సుబ్బలక్ష్మి, రంగనాయకమ్మ వంటి రచయిత్రులు మరి కొందరు అగ్రకుల, మధ్య  తరగతి స్త్రీల కుటుంబ జీవనాన్ని తమ స్వీయానుభవం నుంచి చిత్రిక పట్టారు. ఆడ  పిల్లల పెంపకంలో ఇమిడి ఉన్న కుటుంబ రాజకీయాన్ని ఓల్గా తన ‘రాజకీయ కథలు’లో వ్యంగ్యంగానైనా బట్టబయలు చేశారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో కనబరిచే వివక్షకు ‘బాయ్స్ అండ్ గాళ్స్’ కథ అద్దం పడుతుంది. అలాగే ‘హెవెన్’ కథ కళాకారిణులైన స్త్రీల పట్ల పురుషులు చూపే అసహనం, వివక్షలను కళ్లకు కడుతుంది. భర్త తొలినాళ్ల ప్రియురాలు, హటాత్తుగా తమ జీవితంలోకి ప్రవేశిస్తే ఒక భార్య పడే వేదన, అంతర్మథనం ‘డాలీ’ కథ ఇతివృత్తం. నెలసరి (రజస్వల)కి చేరువైన ఆడపిల్ల మానసిక చిత్రణ, తండ్రి కలిగించిన సాంత్వన వలన సంఘర్షణ నుంచి బయటపడిన తీరు ‘నైట్’ కథలో చూస్తాం. ఈ సంకలనంలోని అన్ని కథలు... ఆడపిల్లలకు కౌమార దశలో బయటి లోకంలో ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులు వారి అంతర్లోకంలో చెలరేగే ఘర్షణలు, దేవులాటలు. భార్యగా, తల్లిగా స్త్రీలు ఎదుర్కొనే అంతఃసంఘర్షణలకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయి. మన్రో కథలు చదివి రచయిత్రులు పాఠాలు నేర్చుకోగలిగితే తెలుగు కథకు మరింత పుష్టి చేకూరుతుంది. మన్రోను సమర్థంగా తెలుగు చేసిన రచయిత్రి జి.లక్ష్మికి అభినందనలు. ప్రచురించిన ‘విశాలాంధ్ర’కు అభివందనాలు.
 - అం. సురేంద్రరాజు
 

>
మరిన్ని వార్తలు