‘నలందా’ రాజకీయం

22 Feb, 2015 00:27 IST|Sakshi
‘నలందా’ రాజకీయం

ఎనిమిది వందల ఏళ్ల నాటి విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించడం, తద్వారా ఆసియా దేశాల మధ్య సాంస్కృతిక వారధిని పునర్ నిర్మించడం వంటి మహ దాశయాలతో ఆరంభమైన పథకం వివాదాలలో చిక్కుకోవడం పెద్ద విషాదమే. గడచిన సెప్టెంబర్ 1 నుంచి బోధన ప్రారంభించిన నలందా విశ్వవిద్యాలయం అప్పుడే పెద్ద కుదుపునకు గురైంది. ఆ విశ్వవిద్యాలయం చాన్సలర్, నోబెల్ బహు మతి గ్రహీత ఆచార్య అమర్త్యసేన్  రెండు రోజుల క్రితం ఆ పదవి నుంచి నిష్ర్కమి స్తున్నట్టు ప్రకటించడం సరికొత్త వివాదం మాత్రమే. మరోసారి తను కొనసాగడం ప్రభుత్వానికి సమ్మతం కాదని అనిపిస్తున్నందున పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించినట్టు సేన్ ఇప్పటికే ప్రకటించారు.
 
 ఈ జూలైతో ముగుస్తున్న ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పెంచుతూ విశ్వవిద్యాలయం పాలక మండలి తీర్మా నం చేసి పంపిన ఫైలు మీద రాష్ట్రపతి సంతకం చేయలేదు. ఇదే డాక్టర్ సేన్‌ను మన స్తాపానికి గురి చేసింది. నిజానికి  ‘అర్థశాస్త్రం’ వంటి అసాధారణ రాజనీతిశాస్త్రాన్ని భారతదేశానికి అందించిన చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో పనిచేశాడు. ఆ గ్రంథమంతా వ్యూహప్రతివ్యూహాలకు ప్రతీతి. కానీ 21వ శతాబ్దంలో పునః ప్రారంభమైన  నలందా విశ్వవిద్యాలయంలో అంతకు మించిన రాజకీయ వ్యూహాలు చోటు చేసుకుంటున్నాయి.
 
  థాయ్‌లాండ్‌లో జరిగిన తూర్పు ఆసియా దేశాల సదస్సులో (2009) నలంద పునరుద్ధరణ ప్రతిపాదన వచ్చింది. సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి జార్జి ఎవో ఇందులో కీలకంగా వ్యవహరించారు. ఇంగ్లండ్, చైనా, సింగపూర్ దేశాల నుంచి నిపుణులను ఇక్కడ బోధనకు నియమిం చాలని కూడా భావించారు. 2010 ఆగస్ట్‌లో భారత పార్లమెంట్ నలందా విశ్వవిద్యాలయం పునరుద్ధరణకు సంబం ధించిన బిల్లును ఆమో దించింది. ప్రస్తుతం పట్నాకు సమీపంలోని రాజగృహ అనే బౌద్ధకేంద్రం పరిసరాలలో, 800 ఏళ్ల నాటి పురాతన నలందా విశ్వవిద్యాలయం శిథిలాల దగ్గర 500 ఎకరాలలో కొత్త విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించారు.
 
 పది బిలియన్ రూపాయలతో, 2020 కల్లా దీనికి ఒక రూపు తేవాలని పథక రచన కూడా జరిగింది. నాటి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇందుకోసం విశేష కృషి చేశారు. నిజానికి యూపీఏ-2 ప్రభుత్వమే ఈ పథకం పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ పనికీ సకాలంలో నిధులు కేటాయించలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సెప్టెంబర్ 19, 2014న మన విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ 15 మంది విద్యార్థులతో, ఆరుగురు ఆచార్యులతో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. భారతీయ పురాతన విజ్ఞానశాస్త్రాలు, పర్యావరణ అధ్యయనాలు మొదట ఆరంభమైనాయి. సామాజిక శాస్త్రాలు, తత్వం వంటి అంశాలను తరువాత ప్రవేశపెట్టాలని అనుకున్నారు.
 
 అయితే ఈ ప్రారంభోత్సవానికి అప్పటికి బిహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన నితీశ్‌కుమార్‌కు ఆహ్వానం వెళ్లలేదు. అధికారంలో ఉన్న జీతన్ రామ్ మాంఝీ మాత్రం హాజరయ్యారు. ఇది కూడా వివాదమైంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత విశ్వవిద్యాలయం వ్యవహారంలో రాజ కీయ జోక్యం మితిమీరిందని డాక్టర్ సేన్ ఆరోపణ. తనకు మరో సంవత్సరం అవ కాశం ఇవ్వకూడదని అనుకోవడంతో పాటు, విశ్వవిద్యాలయం పాలక మండలిని పునర్ నిర్మించాలని కూడా మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని, ఇది చట్ట వ్యతిరేక మని కూడా డాక్టర్ సేన్ చెబుతున్నారు. నిజానికి మోదీ అధికారంలోకి రాగానే డాక్టర్ సేన్ చాన్సలర్ పదవి మీద నీలినీడలు ప్రసరించాయని అనిపిస్తుంది.
 
 గడచిన మే మాసంలో లోక్‌సభ ఎన్నికల సమయంలోనే మోదీ ప్రచారంలో ఉన్నపుడు ఆయన ప్రధాని కావడం సరికాదని  డాక్టర్ సేన్ ప్రకటించి సంచలనం సృష్టించారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో కూడా డాక్టర్ సేన్ చిరకాలంగా మోదీని తప్పు పడుతున్నారు. అయినా పునరుద్ధరించిన నలందా విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించడానికీ, దాని ఏర్పాటు ద్వారా సాధించ దలచిన ఫలితాల సాధనకూ డాక్టర్ సేన్ వంటి అంతర్జాతీయ విద్యావేత్త  అవసర మని ఎందరో భావించారు.
 
 హార్వర్డ్‌లో పనిచేయడం, అర్థశాస్త్రంలో నోబెల్ పుర స్కారం తీసుకోవడం డాక్టర్ సేన్ నాయకత్వానికి బలాన్ని ఇచ్చాయి. పురాతన నలందా విశ్వవిద్యాలయం (క్రీస్తుశకం 413-1193) పరిపూర్ణమైన రూపు తెచ్చు కోవడానికి రెండు వందల సంవత్సరాలు పట్టింది. కానీ కొత్త విశ్వవిద్యాలయం పునాదులలోనే రాజకీయాలు చోటు చేసుకోవడం విషాదమే. రాజకీయాల కార ణంగా గొప్ప ఆశయం మీద నీలినీడలు ప్రసరించడం అందరినీ కలవరపరుస్తోంది.
 

మరిన్ని వార్తలు