అగ్రరాజ్యమే అసలు దోషి

21 Dec, 2013 00:50 IST|Sakshi
అగ్రరాజ్యమే అసలు దోషి

 విశ్లేషణ: పిళ్లా వెంకటేశ్వరరావు
 
 దేవయాని వ్యవహారాన్ని పనిమనుషుల హక్కుల సమస్యతో కలగాపులగం చేస్తే బాధితురాలిని దోషిగా మార్చే అమెరికా ఇంద్రజాలానికి  సహకరించడమే అవుతుంది. వెట్టిచాకిరి గురించిగానీ, విదేశీ శ్రామికుల హక్కుల గురించి గానీ మాట్లాడే అర్హత అమెరికాకు లేదు.
 
 అమెరికాలో అత్యంత అవమానకరమైన రీతిలో అరెస్టుకు గురైన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే కథ తిరగాల్సిన మలుపులన్నీ తిరుగుతోంది. బాధితురాలు దోషిగా బోనెక్కాలనే నినాదాలు జంతర్ మంతర్‌లో మారుమోగే పరిస్థితి ఏర్పడింది. పలుకుబడిగల భారతీయ దొరబాబులు, దొరసానులు పనిమనుషులకు కనీస వేతనాలు, పనిగంటలు లేకుండా వెట్టి చేయించడాన్ని ‘ప్రశ్నించిన’ అమెరికాను నిరసించడమేమిటని ఘరేలూ కామ్‌గార్ సంఘటన్ నిలదీ స్తోంది. సంఘటన్ మాటలు న్యూయార్క్ ప్రాసిక్యూటర్ లేదా అటార్నీ జనరల్ ప్రీత్ భరారా పాడుతున్న పాటకు ప్రతిధ్వని. భారత్‌లాంటి బడు గు దేశాల దౌత్యవేత్తల ఇంటి పనిమనుషుల హక్కుల పరిరక్షణ కర్తగా అమెరికా వల్లిస్తున్న చిలుకపలుకులనే మన జాతీయ మీడియా కూడా పలకడం మొదలు పెడుతోంది. భరారాతో పాటూ మన మీడియా కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్న స్ట్రాస్‌ఖాన్ అరెస్టు ఉదంతమే నిజానికి అమెరికా కపట నాటకాన్ని బయటపెడుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మాజీ అధ్యక్షుడంతటి వాడిని, ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం ఎక్కడానికి పరుగులు తీస్తున్నవాడిని నిలిపి సంకెళ్లు వేశామని భరారా గొప్పలు పోతున్నారు. చిత్తకార్తె కుక్కలాంటి మనిషిగా పేరున్న స్ట్రాస్ ఖాన్ హోటల్‌లోని ఆప్రికన్ మహిళా సేవకురాలిపై అత్యాచారం జరిపిన కేసులో అమెరికా ఆయనకు సంకెళ్లూ వేసింది. అత్యాచారాన్ని అంగీకారంతో కుదిరిన లైంగిక కార్యకలాపంగా ‘రుజువు’ చేసి, బాధితురాలినే దోషిని చేసింది! నేడు దేవయాని అరెస్టు వ్యవహారంతో పనిమనుషుల హక్కుల రక్ష ణ సమస్యతో కలగాపులగం చేస్తే బాధితురాలిని దోషిగా మార్చే అమెరికా ఇంద్రజాలానికి సహకరించడమే అవుతుంది. వెట్టిచాకిరి గురించిగానీ, ఇమ్మిగ్రేంట్ లేబర్ హక్కుల గురించి మాట్లాడే అర్హత అమెరికాకు లేదు. చట్ట విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది విదేశీ యుల కన్నీళ్లు, చమట, నెత్తురు ఇంకిన రొట్టెనూ, మాంసం ముక్కనూ తినే భరారా సహా అంతా బతుకుతున్నారు. వారిని ఉద్ధరిస్తే ప్రపంచాన్ని ఉద్ధరించినట్టే.
 
 వియన్నా మాయాజాలం

 వియన్నా ఒప్పందాలకు లోబడే దేవయాని అరెస్టు జరిగిందని అమెరికా అం టుంటే, మన విదేశాంగమంత్రి సల్మాన్ ఖుర్షీద్ అది ఆ ఒప్పందాలను బేఖాతరు చేసిందని అంటున్నారు. 1961 నాటి వియన్నా దౌత్యసంబంధాల ఒప్పందం  దౌత్య సిబ్బందికి మాత్రమే పౌర, క్రిమినల్ చట్టాల నుంచి, అరెస్టుల నుంచి పూర్తి రక్షణను కల్పిస్తుంది. కాన్సులేట్ సిబ్బందికి అలాంటి పూర్తి రక్షణ ఉండదని మాత్రమే 1963 నాటి వియన్నా కాన్సులేట్ సంబంధాల ఒప్పందం పేర్కొంది. ఆ రక్షణకు ఉన్న పరిమితులను నిర్వచించలేదు. కాన్సులేట్ సిబ్బందికి ఎవరికీ తమ క్రిమినల్ చట్టాల నుంచి, అరెస్టుల నుంచి ఎలాంటి రక్షణా లేకుండా అమెరికా చేసింది. కాబట్టే కాన్సులేట్ అధికారిణి దేవయాని అరెస్టును మన దౌత్య కార్యాలయానికి తెలిపి చేతులు దులుపుకున్నారు. అమెరికా వియన్నా ఒప్పందాలను గౌరవించలేదనే అనుకున్నా ఆ వివాదాన్ని తీర్చే దెవరు? ఇలాంటి వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానంలో పరిష్కరించుకునే అంశాన్ని సభ్య దేశాల ఇష్టాయిష్టాలకే పరిమితమైన ఒప్పందంగా విడిగా గుర్తించారు. ఆ తప్పనిసరి కాని ఒప్పందాన్ని తొలుత అంగీకరించిన అమెరికా 2005లో దాన్నుంచి వైదొలగింది!  దేవయాని కేసును వియన్నా ఒప్పందాల చట్రానికి కుదించడమంటే ఆమె అరెస్టు, తనిఖీలు అన్నీ సమంజసమేనని అంగీకరించడమే. కాకపోతే కరడుగట్టిన నేరస్తుల వలే ‘కావిటీ సెర్చ్’కు గురి చేయడం మాత్రమే అమెరికా చేసిన తప్పవుతుంది.

 పనిమనిషి సంగీత రిచర్డ్, ఢిల్లీలో ఉన్న ఉన్న ఆమె భర్త ఫిలిప్ రిచర్డ్‌లు తనను మోసం, వంచన, వేధింపులకు గురిచేశారని, డబ్బు కోసం బెదిరింపులకు దిగారని దేవయాని ఢిల్లీ పోలీసులకు జూలైలోనే ఫిర్యాదు చేశారు. అంతకు ముందే సంగీత కనబడటం లేదని అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేయబోతే ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు అవసరమని వారు కేసు నమోదు చేసుకోలేదు. అయితే సంగీత మన్‌హట్టన్ అటార్నీ కార్యాలయం నుంచి దేవయానితో చర్చలు జరిపి భారీ మొత్తం డబ్బు, సాధారణ వీసా ఇప్పించాలని డిమాండు చేశారని దేవయాని కథనం. అది సంగీత న్యాయవాది సమక్షంలోనే జరిగిన వ్యవహారం. ఆ చర్చలు విఫలం కావడంతో దేవయానిపై విదేశీ కోర్టుల్లో కేసులు దాఖలు చేయరాదని ఢిల్లీ న్యాయస్థానం సంగీతకు ఆదేశాలను జారీ చేసింది. నవంబర్‌లో ఫిలిప్ అరెస్టుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా ఇచ్చింది. ఇవన్నీ తెలిసి తెలిసి అమెరికా విదేశాంగ శాఖ సంగీత నుంచి దేవయానిపై ఫిర్యాదును స్వీకరించి కోర్టు ధిక్కారానికి పాల్పడింది. అంతకు మించి హాలివుడ్ తరహాలో ‘ఆపరేషన్ దేవయాని’ని చేపట్టింది. సంగీత కేసులో సాక్షిగా నిలబెట్టడానికి నిందితుడ్ని గుట్టుచప్పుడు కాకుండా అమెరికాకు తరలించింది. అందుకోసం అమెరికా రాయబార కార్యాలయం చేత స్వదేశంలో క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్న ఫిలిప్‌కు, వారి పిల్లలకు వీసాలు జారీ చేసింది.

 ఇది మన న్యాయ వ్యవస్థనే కాదు, ప్రభుత్వాన్నే వంచించడం అతి పెద్ద నేరం. ఆ వెంటనే నాటకీయంగా దేవయానిని అక్కడ అరెస్టు చేసి, అవమానించారు. భారత్‌కు నమ్మకమైన మిత్ర దేశంగా చెప్పుకుంటున్న అమెరికా మన కు ఇస్తున్న విలువ ఇది. ఇలాంటి దేశ దౌత్యవేత్తలకు, వారి కుటుంబాలకు ప్రత్యేకమైన హక్కులను, మర్యాదలను అందించి అడుగులకు మడుగులు ఒత్తుతున్నాం. నిజానికి అలాంటి విశేష హక్కులను కల్పించడమంటేనే భారత్, అమెరికాతో సమానమైన హోదా గల దేశం కాదని అంగీకరించడం. కాబట్టే అది మన ‘స్థానం’ మనకు చూపింది.
 
 బోనెక్కాల్సింది ఎవరు?

 అమెరికా దురహంకార పూరితమైన దౌత్య నేరాలు, కోర్టు ధిక్కారాలతో పోలిస్తే దేవయానిపై ఉన్న వీసా మోసం, కనీస వేతనాల చట్టం ఉల్లంఘనలు అసలు లెక్కలోకి వచ్చేవేనా? సంగీత వీసా కోసం దేవయాని అమెరికా కనీస వేతనాల చట్టానికి అనుగుణంగా ఒక తప్పుడు ఒప్పంద పత్రాన్ని సమర్పించినట్టు స్పష్టం అవుతోంది. ఆ ఒప్పం దంలో పేర్కొన్న దాని కంటే చాలా తక్కువకే (నెలకు రూ. 30 వేలు) ఆమె సంగీతతో నిజమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ నేరానికి దేవయానిని అరెస్టు చేసేట్టయితే అంతకంటే ముందు మన విదేశాంగ శాఖను అరెస్టు చేయాలి. అమెరికా కనీస వేతనాల చట్టం ప్రకారం పనిమనుషులకు వేతనాలను చెల్లించాలంటే వర్థమాన దేశాల దౌత్యవేత్తలలో అత్యధికుల జీతాలు మొత్తం సరిపోవు. కనీస వేతనం చెల్లించలేనంత తక్కువ వేతనాలను దౌత్యవేత్తలకు చెల్లిస్తున్నందుకు భరారా భారత ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదు. ఇదేదో తెలియని విషయం కాదు కూడా. దేవయానికి ముందు సైతం మరో ముగ్గురు భారత అధికారులు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుని ఎలా బయటపడ్డారో ఊహించడం కష్టం కాదు. 2008లో వివిధ వెనుకబడిన దేశాలకు చెందిన 42 మంది దౌత్యవేత్తలపై ఇలాంటి కేసులను బనాయించే ప్రయత్నం చేసింది. ఎందుకో పాకిస్థాన్‌లో ఇద్దరు పౌరులను చంపిన సీఐఏ కాంట్రాక్టర్ రేమండ్ డేవిస్ ఉదంతం చెబుతుంది. అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతటి వాడే డేవిస్ తమ దౌత్యవేత్త అని వకాలతు పుచ్చుకున్నారు. అమెరికా దౌత్య అధికారులకు సీఐఏ అధికారులకు మధ్యన వ్యత్యాసం పెద్దగా లేదు. లిబియా, సిరియా ‘విప్లవాల్లో’ దౌత్యకార్యాలయాలు సీఐఏ హెడ్‌క్వార్టర్స్‌గా బహిరంగంగానే పనిచేశాయి. దౌత్యవేత్తలంతా ఏ దేశంలో ఉన్నా ఎప్పుడైనా ఇంటెలిజెన్స్ సేకరణ కూడా చేయాలని అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసిన ఆదేశాలను వికీలీక్స్ రెండేళ్ల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. అన్ని దేశాల దౌత్యవేత్తలతోనూ ‘సంబంధాలను’ పెంచుకొని ఇన్‌ఫార్మర్లను తయారు చేసుకోవడం సీఐఏకు అలవాటు. అలా పుట్టుకొచ్చిందే విదేశీ దౌత్యవేత్తల పనిమనుషుల వేతనాలు స్థితిగతులపై నిఘా. లేకపోతే మిత్ర ప్రభుత్వాలను తమ దేశంలో జరుగుతున్న చట్టాల ఉల్లంఘనల గురించి హెచ్చరించి ఉండేది. దేవయాని అరెస్టుకు సరిగ్గా వారం ముందు న్యూయార్క్‌లో రష్యా కాస్సులేట్ ఆధికారులు 45 మంది ఇన్సూరెన్స్ మోసంలో ఇరుక్కోగా... వారితో మెతకగా వ్యవహరించాలని విదేశాంగశాఖ అదేశించింది. రష్యా ప్రత్యర్థి కాగా, మనం అలుసుగా దొరికిన మిత్రులం!
 
 చట్టవిరుద్ధ విదేశీయుల అమెరికా

 అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 1.17 కోట్లు. ఇలాంటి కార్మికుల శ్రమపైనే ఆధారపడ్డ దక్షిణాది రాష్ట్రాలైన టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ అలబామా, జార్జియా, ఆరిజోనా వంటి రాష్ట్రాల్లో వారి పరిస్థితులు 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో  నేడు అలాగే ఉన్నాయి. ప్లోరిడాలో 5 లక్షల మంది ఏడెళ్ల లోపు పిల్లలు పంటపొలాల్లో తోటల్లో రోజుకు ఏడు నుంచి పది గంటల వరకు పనిచేస్తున్న వైనం ఇటీవల అక్కడి టీవీల్లో ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఆరు లక్షల మంది మైక్సికన్‌లలోఏ 52 శాతం అక్రమంగా వలస వచ్చినవారే. అలాంటి వారికి అతి తక్కువ వేతనాలేగాక, పని పరిస్థితులు దుర్భరం. వారిపై ఎలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినా అడిగేవారు లేరు.  ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కు పంపేస్తారని భయంతో వారు నోరెత్తరు. అలాంటి అక్రమ విదేశీయుల వెట్టి వల్లనే అమెరికాలో ఆహార పదార్థాల ధరలు అందుబాటులో ఉన్నాయనేది బహిరంగరహస్యం. సంగీత గోడు పట్టిన అమెరికాకు తమ దేశంలోని కోటి మంది వెట్టి వారిగోడు వినిపించకపోడంలో ఆశ్చర్యంలేదు.    
 

మరిన్ని వార్తలు