కేసీఆర్‌కు ‘షా’ చెప్పగలరా?

20 May, 2017 23:53 IST|Sakshi
కేసీఆర్‌కు ‘షా’ చెప్పగలరా?

త్రికాలమ్‌
వర్తమాన రాజకీయాలలో ఘటనాఘటన సమర్థుడిగా నిరూపించుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా రేపు తెలంగాణలో అడుగుపెడుతున్నారు. షా మూడు రోజుల పర్యటనపైన బీజేపీ తెలంగాణ  నాయకులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడి  రాజకీయాలను షా పర్యటన మార్చివేస్తుందంటూ ప్రకటించారు. తెలం గాణలో ఉన్న రాజకీయ శూన్యాన్ని పూరించేందుకు షా పకడ్బందీ వ్యూహంతో వస్తున్నారంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో పాటించిన  రణనీతినే ఇక్కడా అమలు చేయబోతున్నారంటూ ఉత్సాహం ప్రద ర్శిస్తున్నారు.  తెలంగాణలో రాజకీయ శూన్యం ఉన్నదా? ఒక వేళ  ఉన్నా సదరు శూన్యాన్ని భర్తీ చేసే శక్తి బీజేపీకి ఉన్నదా? యూపీలో ఫలితాలు ఇచ్చిన వ్యూహం తెలంగాణలో పనిచేస్తుందా?

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సాధించిన అనూహ్యమైన, అసాధారణమైన విజ యం సహజంగానే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాల ప్రతిష్ఠ ఆకాశం ఎత్తు పెంచింది. బీజేపీని మొట్టమొదటిసారి కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన వాజ పేయి–అడ్వాణీ జోడీ కంటే మోదీ–షా జోడీ అత్యంత శక్తిమంతమైనదనీ, గెలుపే ధ్యేయంగా పోరాడే మనస్తత్వం ఉన్న జంట అనీ దేశ ప్రజలంతా గుర్తిం చారు.  విజయం సాధించడమే పరమావధి  అనే లక్ష్యంతో రూపొందించిన వ్యూహాన్ని మోదీ–షా ఈశాన్య రాష్ట్రాలలో, గోవాలో, ఉత్తరాఖండ్‌లో, యూపీలో సమర్థంగా అమలు చేసి చూపించారు.

బీజేపీ సునామీ
బీజేపీ 2014 ఎన్నికలలో 282 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది. 1985లో ఇందిరాగాంధి హత్య అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో  రాజీవ్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ అద్భుత విజయం సాధించిన తర్వాత, అంటే మూడు దశాబ్దాల తర్వాత, ఒక పార్టీ లోక్‌సభలో మెజారిటీ స్థానాలు గెలుచు కోవడం అదే ప్రథమం. మోదీ ప్రాభవం అద్వితీయంగా ఉన్నప్పటికీ పార్టీ ఓడిపోయిన 130 స్థానాలను గుర్తించి ఆ నియోజకవర్గాలలో పార్టీని బలో పేతం చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో 95 రోజులపాటు పర్యటించి పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మించేందుకు అమిత్‌షా కంకణం కట్టుకున్నారు. దేశంలోని 29 రాష్ట్రాలనూ, ఏడు కేంద్రపాలిత రాష్ట్రాలనూ ఏ, బీ, సీ లుగా వర్గీకరించి ఏ కూట మికి చెందిన రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో మూడురోజుల పాటు, బీ రాష్ట్రాలలో రెండురోజుల పాటు, సీ రాష్ట్రాలలో ఒక్కొక్క రోజు పర్యటించి నాయకులనూ, కార్యకర్తలనూ, సాధారణ ప్రజలనూ, మేధావులనూ, అనేక రంగాలకు చెందిన వారినీ కలుసుకోవాలని షా ప్రయత్నం. ఎన్నికలలో ప్రాముఖ్యం ఆధారంగా ఈ వర్గీకరణ జరిగింది. 14 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. నాలుగు రాష్ట్రా లలో అధికారం పంచుకుంటోంది. బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో పార్టీని నిర్మిం చడానికి మహాప్రయత్నాన్ని షా జమ్మూతో ఏప్రిల్‌ 29న ప్రారంభించారు.

చార్‌ప్రదేశ్‌
ఇది వరకు బీజేపీ నినాదం: ఆజ్‌ చార్‌ ప్రదేశ్, కల్‌ సారా దేశ్‌. ఇప్పటి సరికొత్త నినాదం: అబ్‌ చార్‌ ప్రదేశ్‌. ముఖ్యంగా నాలుగు  రాష్ట్రాలపైన దృష్టి కేంద్రీ కరించాలని షా బీజేపీ నాయకులకు చెప్పారు. అవి: తెలంగాణ, ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్‌. ఈ  నాలుగు రాష్ట్రాలలో కలిపి 102 లోక్‌సభ స్థానాలు ఉంటే వాటిలో 2014లో బీజేపీ గెలిచింది నాలుగు మాత్రమే. ఇప్పుడు ఒడిశాలో వాతా వరణం బీజేపీకి ఆశావహంగా మారింది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ లోగడ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది. మొత్తం పోలైన ఓట్లలో 34 శాతం బీజేపీకి దక్కాయి. నవీన్‌ పట్నాయక్‌ నాయకత్వంలోని బిజూ జనతాదళ్‌ (బీజేడీ) ఇప్పటికీ మొదటి స్థానంలోనే ఉంది. జిల్లా పరిషత్‌ స్థానాలలో సగానికి పైగా బీజేడీ కైవసం చేసుకున్నది. ఇతర రాష్ట్రాలలో మాదిరి ఒడిశాలో కూడా కాంగ్రెస్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా ఉంది. పశ్చిమ బెంగా ల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌నీ, కేరళలో వామపక్ష సంఘటననూ, కాంగ్రెస్‌నూ అధిగమించడం అంత తేలికకాదు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో బీజే పీకి 10.2 శాతం ఓట్లు వచ్చాయి. కేరళలో బీజేపీ వాటా 10.6 శాతం. పార్టీ దృష్టి పెట్టవలసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ లేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి.

ఒకటి, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో బీజేపీ అధికారం పంచుకుంటున్నది. రెండు, అక్కడ బలమైన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీ ఉంది.  ఏపీలో అన్ని స్థానాలకూ పోటీ చేసే బలం తనకు లేదనే అంచనా బీజేపీకి ఉంది. ఈ నెల 25న తెలంగాణ పర్యటన ముగించుకొని విజయవాడకు వెళ్ళనున్న అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడురోజులు పర్యటించబోతున్నారు. అంటే ఏపీ కూడా ఏ కేటగరీలోనే ఉంది. ఈ రెండు రాష్ట్రాలలో కలిపి 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి–ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17. ఒడిశా లాగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌ నామమాత్రమే. తెలంగాణలో అన్ని లోక్‌సభ స్థానాలకూ, అన్ని శాసనసభ స్థానాలకూ పోటీ చేయవచ్చుననే విశ్వాసం బీజేపీ నాయకులు వెలిబుచ్చుతున్నారు. వారి విశ్వాసానికి తెలంగాణ నేపథ్యం కార ణం. వామపక్ష భావజాలం ప్రభావం బలంగా ఉన్న  కారణంగా బీజేపీని తెలం గాణ  ప్రజలు ఆమోదించబోరనే వాదన ఒకటి ఉన్నది. తెలంగాణ చరిత్రలో బీజేపీకి ఉపకరించే రెండు అంశాలను ఆ పార్టీ నాయకత్వం గుర్తించింది. అందుకు అనుగుణంగానే అమిత్‌ షా పర్యటనలో నల్లగొండ జిల్లాలోని కార్యక్ర మాలను రూపొందించారు. ఒకటి: రజాకార్ల దురాగతాలు. రెండు: నక్సలైట్ల హింస. నల్లగొండ మకాంలో మొదటి రోజున షా తెరాట్‌పల్లిలో ప్రజలను కలు సుకుంటారు. ఈ గ్రామంలో 1999లో నేత పనివారి సంక్షేమం కోసం పని చేస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి జి. మైసయ్యను నక్సలైట్లు కాల్చిచంపారు. తమ పార్టీ వామపక్ష తీవ్రవాదానికి బద్ధ వ్యతిరేకి అని చాటడం ఒక ఉద్దేశం. మర్నాడు చినమాదారం గ్రామం సందర్శిస్తారు. అక్కడ బీజేపీకి చెందిన మహిళా సర్పంచ్‌ సాధించిన ఘనవిజయాలను ప్రస్తుతిస్తారు.

ఆ గ్రామంలో జన్‌ధన్, సురక్ష బీమా వంటి కేంద్ర పథకాలు జయప్రదంగా అమలు జరుగుతున్నాయి. అన్ని ఇళ్ళలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. మోదీ కార్యక్రమాలను త్రికర ణశుద్ధితో అమలు చేస్తున్న సర్పంచ్‌ను ప్రశంసించడం ఈ కార్యక్రమం లక్ష్యం. మూడోరోజు చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లిని సందర్శిస్తారు. ఈ గ్రామంలో ఒకే రోజున రజాకార్లు 160మందిని ఊచకోత కోశారు. రజాకార్ల దురాగతాల పట్ల వ్యతిరేకత తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నారు.

ఒంటరిగా పోటీ
తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ టీడీపీతోనే కలసి పోటీ చేసింది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ బలహీన పడింది కనుక  ఒంటరిగానే అన్ని స్థానా లకూ పోటీ చేయాలని సంకల్పం. పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా విస్తరించేందుకు విస్తారక్‌లను నియమిస్తున్నారు. ఇది కూడా అమిత్‌ షా జాతీయ ప్రణాళిక. దేశం మొత్తం మీద 3.5 లక్షల మంది వలంటీర్లను నియమించారు. వీరిలో కొందరు పదిహేను రోజులు మాత్రమే పనిచేస్తారు. తక్కినవారు సంవత్సరమంతా పనిచేస్తారు. వీరు కాకుండా 600మంది పూర్తికాలం పనిచేసే శక్తిమంతులను నియమిస్తారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క లోక్‌సభ నియోజవర్గంలో పనిచేస్తారు. వీరితో పాటు ఎన్నికలలో విజయం సాధించడమే పరమావధిగా పనిచేసే ప్రత్యేక బృందాలు ఉంటాయి. ఒక బృందానికి  నాలుగు లేదా అయిదు ప్రతికూల నియోజకవర్గా లను అప్పజెబుతారు. స్థానిక పరిస్థితులను బట్టి, కార్యకర్తల సూచనలను బట్టి అక్కడ బీజేపీ పరిస్థితి మెరుగుపరచడానికి ఈ బృందాలు ప్రయత్నిస్తాయి.

తెలంగాణకు యూపీ నుంచి 150 బైకులు తెప్పించారు. విస్తారక్‌ యోజ నలో వీటిని వినియోగిస్తారు. మే 29 నుంచి జూన్‌ 12 వరకూ జరిగే ఈ విస్తారక్‌ యోజనలో పదివేల మంది పార్టీ కార్యకర్తలు 50 లక్షల కుటుంబాలను పల కరిస్తారు. జనసంఘ్‌ వ్యవస్థాపకుడు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా ఒవైసీల చేతుల్లోనే ఉన్న హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తుందనీ, అవసరమైతే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సేవలు సైతం వినియోగించుకుంటామనీ స్థానిక నాయకులు చెబుతున్నారు.

యూపీ వ్యూహం ఏమిటి?
యూపీ వ్యూహం అమలు చేస్తామంటూ బీజేపీ నాయకులు పదే పదే చెబు తున్నారు. ఇంతకీ ఏమిటా వ్యూహం? యూపీ అసెంబ్లీ బరిలో బీజేపీ దిగిన ప్పుడు ఆ పార్టీ మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో సమాజ్‌వాదీ, రెండో స్థానంలో బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఉన్నాయి. అటువంటిది బీజేపీ అగ్ర స్థానంలోకి ఎట్లా వచ్చిందంటే అందరూ చెప్పే సమాధానం అమిత్‌షా మాయా జాలం అని. యూపీలో అమిత్‌షా ఏమి చేశారు? బూత్‌ కమిటీలను నియమిం చారు. బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశం అయినారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కార్యోన్ముఖుల్ని చేశారు. బీఎస్‌పీ, కాంగ్రెస్‌ల నుంచి పలుకు బడిగల నాయకులను బీజేపీలోకి లాక్కున్నారు. అది అస్సాంలో, ఉత్తరాఖండ్‌లో జయప్రదంగా అమలు చేసిన సూత్రమే.

దీనికి తోడు యూపీలో వెనుకబడిన వర్గాలలో యాదవ్‌లపైన ఉన్న ఆగ్రహాన్ని సొమ్ము చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఒక్క టిక్కెట్టు కూడా ముస్లిం అభ్యర్థికి ఇవ్వకుండా హిందువులను సంఘటితం చేయడానికి ప్రయత్నం చేశారు. దాదాపు 200 సమా వేశాలను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో సమీకరణాలను బీజేపీకి అనుకూలంగా మార్చడానికి ఈ సమావేశాలు విశేషంగా దోహదం చేశాయి. యూపీలో అంతటి ఘనవిజయాన్ని మోదీ, షా కూడా ఊహించలేదు. ఊహిస్తే మోదీ చివరి మూడురోజులూ ఒక్క వారణాసిలోనే గడిపేవారు కాదు. అంత తీవ్రంగా ప్రచారం చేసేవారు కాదు.
   
తెలంగాణలో ఇప్పుడే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయ కులు సైతం చెప్పలేరు. కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ను ప్రతిఘటించి నిలబడే శక్తి ఆ పార్టీకి కానీ, కాంగ్రెస్‌కి కానీ ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అనిపించదు. కాంగ్రెస్‌ బహునాయకత్వంతో కొట్టుమిట్టాడుతోంది.  ఆ పార్టీ సంఘటితంగా పోరాడి టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇస్తుందని అనుకోవడానికి ఆధారాలు లేవు.  ప్రొఫెసర్‌ కోదండరాం భవిష్యత్‌ ప్రణాళిక ఏమిటో తెలియదు. ఈ నేపథ్యంలో బీజేపీకి వాతావరణం అనుకూలంగా మారవచ్చు. ముస్లింలను ఆకట్టుకోవాలన్న ప్రయత్నంలో వారికి 12 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ కేసీఆర్‌ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానం చేయించారు. దీని వల్ల ముస్లిం ప్రజానీకానికి తక్షణ ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఇదే కారణంపైన వెనకబడిన కులాలవారిలో టీఆర్‌ఎస్‌ పట్ల ప్రతికూల భావం ఏర్పడింది. దాన్ని బీజేపీ రాజేసి వినియోగించుకునే అవకాశం ఉంది. మైనారిటీలను సుముఖం చేసుకునేందుకు కేసీఆర్‌ అమితోత్సాహం ప్రదర్శించి బీజేపీకి వెనుకబడిన కులాలలో ప్రాబల్యం పెంచుకునే అవకాశం అప్పనంగా ఇచ్చారు. కొంతకాలంగా బీజేపీ నాయకులు ఈ అంశాన్ని అదే పనిగా ప్రస్తావి స్తున్నారు. పాకిస్తాన్‌పైనా, ఇస్లామిక్‌ ఉగ్రవాదులపైనా, ఒవైసీలపైనా విమర్శనాస్త్రాలు సంధించడం స్థానిక బీజేపీ రాజకీయంలో ప్రధానమైన అంశం. హైదరాబాద్‌లో ఘోషామహల్‌ శాసనసభ్యుడు రాజాసింగ్‌ లోధా పాతబస్తీని మినీ పాకి స్తాన్‌గా అభివర్ణించడం కూడా మతరాజకీయంలో భాగమే. ముందస్తు ఎన్ని కలకు కేసీఆర్‌ వెడతారని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీని తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారా?


కె. రామచంద్రమూర్తి

మరిన్ని వార్తలు