మరో కాలచక్ర అవృత్తిలో అమరావతి

22 Oct, 2015 00:52 IST|Sakshi
మరో కాలచక్ర అవృత్తిలో అమరావతి

నిన్న మొన్నటి వరకూ కోస్తాంధ్రుల రాజకీయ పరతంత్ర జీవితం వేళ్లు ఇన్ని వందల ఏళ్ల చరిత్రలో ఉన్నట్టు అర్థమై కాలం తాలూకు అఖండత్వం కళ్లకు కడుతుంది. శాతవాహన యుగం తర్వాత కోస్తాంధ్ర ప్రాంతం తూర్పు చాళుక్యులైన వేంగిరాజుల పాలనలో; వారి మాతృక అయిన కర్ణాటక చాళుక్యులు, తమిళ చోళులు, కళింగులు, వాళ్ల వాళ్ల సామంతుల ముప్పేట దాడులతో నిర్విరామ యుద్ధక్షేత్రం అయింది.
 
 చరిత్ర మన కళ్లముందే తనను తాను రచించు కుంటూ ఉంటుంది. వర్తమానంలో దానికి సాక్షులైన మనమే, అది గతంగా మారగానే పాఠకులుగా మారిపోతాం. మనం చూస్తుండగానే కొన్ని తేదీలు కొండగుర్తులుగా మారి చరిత్రలో నాటుకుపోతాయి. రేపటి అనేకానేక తరాలు ఆ తేదీలను పదేపదే నెమరు వేసుకుంటూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరుగుతున్న అక్టోబర్ 22 అలాంటి ఒక ముఖ్యమైన తేదీ.

 తన కథను తానే వినిపిస్తూ..
 కాలం మన చూపులకు చిత్రమైన మాయతెరలు కప్పుతుంది. తను అఖం డమే అయినా ఖండితంగా ఉన్నట్ట్టు కనిపిస్తూ మనల్ని బోల్తా కొట్టిస్తుంది. అందుకే  ఆధునికమనో, వర్తమానమనో మనకు తెలియకుండానే చూపులకు హద్దులు గీసుకుని అందులోనే తిరుగుతూ ఉంటాం. మాయతెరలనే కనుక ఛేదించుకుని చూస్తే కాలం అఖండంగానే కాక, గతం నేరుగా వర్తమానంలోకి ప్రవహించడం స్పష్టంగా కనిపిస్తుంది. రాజధానిగా అమరావతి నుంచి ఇప్పుడే కొత్తగా పడుతున్నాయనుకునే అడుగుల వెన్నంటి గతకాలపు అడుగు జాడలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. రాజధాని సొగసులు దిద్దుకుంటున్న అమరావతి తన చరిత్ర తనే చెప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది.
 
అమరావతి చేయి పట్టుకుని వెనక్కి వెడుతున్నకొద్దీ ఎన్నో విశేషాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో సాదృశ్యాలు. ఎక్కడికక్కడ ఎడతెగని లింకులు. ఎప్పుడో రెండు వేల సంవత్సరాలకు పైబడిన క్రితమే అమరావతి రాజధాని. కాకపోతే ఆంధ్ర బౌద్ధానికి రాజధాని. ఆంధ్ర బౌద్ధంలోనే కాక, మొత్తం బౌద్ధమతంలోనే జరిగిన అనేక కీలక పరివర్తనలకు వేదిక. చరిత్రకారుల ప్రకారం, ఒకనాటి ధాన్యకటకమే నేటి అమరావతి. శాతవాహనులకే కాదు, అశోకుడికీ ధాన్యకటకం తెలుసు. అతని శాసన శకలం ఒకటి అక్కడ దొరికింది. చైనా, టిబెట్, సింహళం తదితర బౌద్ధ దేశాలకూ, రోమ్ లాంటి విదేశాలకూ అది సుపరిచితం. ధాన్యకటకంలో రోమన్ స్థావరాలుండేవి. రోమన్ బంగారు నాణేలు దొరికాయి. బౌద్ధ నిర్మాణాలలో రోమన్లు పాలు పంచుకొనేవారు.
 
 మెగస్తనీస్, ఏరియన్ లాంటి గ్రీకు చరిత్రకారుల ప్రకారం క్రీ.పూ.4వ శతాబ్దం నాటికి ఆంధ్రులకు గొప్ప సైనికబలం, ముప్పై రాజ్యాలు ఉండేవి. ధాన్యకటకం వాటిలో ఒకటి. అయితే, అవి నగర రాజ్యాలు. ప్రాచీన మెసపొటేమియా, ఈజిప్టు, సింధు, గ్రీసులలో ఉన్న నగర రాజ్యాలతో ఆంధ్రకు అలా పోలిక కుదిరి, రాజ్యం పుట్టుకలో ప్రపంచవ్యాప్త అనుభవాన్ని ఆశ్చర్యకరంగా ప్రతిబింబిస్తుంది. ఆనాడు నగర శ్రేష్ఠులతో వాణిజ్య సంఘాల రూపంలో నిగమ సభలు ఉండేవి. ధాన్యకటకం నేడు మనం వినని ఎన్ని భాషలు విందో,  తన ముంగిట్లో ఎన్ని దేశాల జనాన్ని చూసిందో! ప్రాకృత వాఙ్మయంలో అది సిరిఠన. బౌద్ధ సంస్కృత రచనల్లో పూర్వశైలం. ధాన్య కటకాన్ని ఒరుసుకుని ప్రవహించే కృష్ణానది, ప్రాకృతంలో కణ్ణబెణ్ణ. అంత వరకూ బౌద్ధ క్షేత్రంగా ఉన్న ధాన్యకటకం, వేంగిరాజు చాళుక్య భీముని కాలంలో (క్రీ.శ.892) పంచారామాలుగా పేర్కొనే ఐదు శైవ క్షేత్రాలలో ఒకటై అమరారామమైంది. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోనూ అది అమరారామం. పందొమ్మిదో శతాబ్ది నుంచే అమరావతి అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.
 
 బౌద్ధం ఉత్థానపతనాలు రెండూ చూసింది
 తను కళ్లు విప్పేనాటికి అమరావతికి తెలిసింది బౌద్ధమే. రెండువేల ఏళ్లకు పైబడిన తన అస్తిత్వంలో అది బౌద్ధ విజృంభణనూ చూసింది, పతనాన్నీ చూసింది. కొంతవరకు జైనాన్నీ తిలకించింది. ఆంధ్రలో జైనవ్యాప్తికి కృషి చేసిన అశోకుడి మనవడు సంప్రతి పేర అమరావతికి దగ్గరలోని వడ్లమాను కొండ వద్ద సంప్రతి విహారం ఏర్పడింది. కళింగరాజు ఖారవేలుడు (క్రీ.పూ. 183) అక్కడే మహామేఘవాహన విహారం నిర్మించాడు. తన గడ్డ మీద ఊపిరి పోసుకున్న బౌద్ధ సంప్రదాయాలను చైనా లాంటి దేశాలకు అమరావతి ఎరు విచ్చింది. తన కనుసన్నలలో బౌద్ధ దార్శనికతలో వచ్చిన కీలకమైన చీలి కలకూ మౌనసాక్షి అయింది.
 
 సనాతనవాదులైన థేరవాదులుగా, పురో గమనశీలురైన మహాసాంఘికులుగా బౌద్ధులు చీలిపోయినప్పుడు అమరా వతి మహాసాంఘికులకు ఆటపట్టు అయింది. బుద్ధుణ్ణి దశావతారాలలో చేర్చడమూ, బౌద్ధ చిహ్నాల ఆరాధనా అక్కడే మొదలయ్యాయి. ఈ పరివర్తనలనే మహాయానంగా మలచిన ఆచార్య నాగార్జునుని జన్మస్థానమూ అమరావతికి దగ్గరేనని ఊహ. ప్రసిద్ధ దార్శనికుడు భావవివేకుడూ అమరా వతివాసే. సిద్ధ నాగార్జునుని నేతృత్వంలో మహాయానం నుంచి తాంత్రిక ప్రాధాన్యం కలిగిన వజ్రయానం పుట్టుకా అమరావతికి దగ్గరగా తెలుసు. అక్కడికి సమీపంలోని ఓ కొండగుహలో వజ్రపాణి అర్చన జరుగుతుండేది.
 
 తన బౌద్ధ ఆహార్యాన్ని ఒకటొకటిగా తొలగించి హిందూ ముస్తాబు చేయడాన్నీ అమరావతి కళ్లప్పగించి చూసింది. తన నట్టింట శైవులు పాశు పతులుగా, కాలాముఖులుగా చీలిపోయి బౌద్ధ, జైన విధ్వంసరూపంలో సాగించిన  వీరతాండవాన్నీ వీక్షించింది. వాళ్లలో మరింత తీవ్రవాదులైన కాలాముఖులకు తనే స్థావరమూ అయింది. అమరావతిలోనే కాక, బెజవాడ మొదలైన చోట్ల వీరు సింహ పరిషత్తులు స్థాపించి మత ప్రచారం చేశారు.
 
 కాలపు అఖండత్వాన్ని దర్శించాలంటే...
 రాజకీయంగా చూస్తే, ఆంధ్రులకు సంబంధించి తొలి శాసన ప్రమాణమైన మైదవోలు శాసనం (క్రీ.శ.300) ప్రకారం, ధాన్యకటకం అప్పటికి ఆంధ్ర రాజధాని. ప్రాచీన పల్లవ రాజైన శివస్కంధవర్మ వేయించిన శాసనం అది. ఆ తర్వాత కొన్ని వందల ఏళ్ల పాటు కొనసాగిన రాజకీయ పరిణామాల ప్రవా హంలో అమరావతికి ఉన్న ఏ కాస్త రాజకీయ ప్రాధాన్యమూ గల్లంతైపోయి, అనామకంగా మారి, ఆధునిక కాలానికి వస్తున్న కొద్దీ ఒక చిన్న జమీగా మిగిలిపోయింది.

అయినా సరే, మనకు తెలియని అనేక రాజకీయ, మత, సాంఘిక, ఆర్థిక పరిణామాల చరిత్ర, యుద్ధాలలో మడుగులు కట్టిన రక్త ధారల చరిత్ర అమరావతికి తెలుసు. వెలనాటి చోడుల (క్రీ.శ.11,12 శతాబ్దాలు) ఏలుబడిలో తను ఆరువేలనాడు లేదా వెలనాడులో భాగమై వెల నాటి బ్రాహ్మణశాఖ పుట్టుకనూ, నియోగి, వైదీకి చీలికనూ చూసింది. కమ్మ, వెలమ, రెడ్డి తెగల అవతరణకూ తను సాక్షి. ఆధునికమైన మన చూపుల ముందు కాలం కట్టిన ఉక్కు గోడలను ఛేదించుకుని చూస్తే, గత పదిహేను వందల ఏళ్ల ఆంధ్రుల చరిత్రలో ఎందరో రాజుల పేర్లే కాదు; ఎన్నో వ్యక్తి త్వాలు, కుట్రలు, కూహకాలు, జనకల్లోలాలు, యుద్ధాలు, నిరంతరాయమైన వలసలు, అశాంతి, అనైక్యత విరాడ్రూపంలో కనిపించి మనల్ని విచలితుల్ని చేస్తాయి.
 
 కాలంలో వెనక్కి ప్రయాణిస్తూ ఒకనాటి సజీవ సమాజాన్ని దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది. అంతకంటే విశేషంగా, నిన్న మొన్నటి వరకూ కోస్తాంధ్రుల రాజకీయ పరతంత్ర జీవితం వేళ్లు ఇన్ని వందల ఏళ్ల చరిత్రలో ఉన్నట్టు అర్థమై కాలం తాలూకు అఖండత్వం కళ్లకు కడుతుంది. శాతవాహన యుగం తర్వాత కోస్తాంధ్ర ప్రాంతం తూర్పు చాళుక్యులైన వేంగిరాజుల పాలనలో; వారి మాతృక అయిన కర్ణాటక చాళుక్యులు, తమిళ చోళులు, కళింగులు, వాళ్ల వాళ్ల సామంతుల ముప్పేట దాడులతో నిర్విరామ యుద్ధక్షేత్రం అయింది.
 
 వీటికి తోడు దాయాదుల అంతఃకలహాలు రాజ్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తూ అరాచకపు దారి పట్టిస్తూ వచ్చాయి. వేంగి సురక్షితం కాదని గ్రహించే చాళుక్య భీముని మనవడు అమ్మరాజు (క్రీ.శ.920) రాజ ధానిని అక్కడి నుంచి తూర్పు గోదావరి తీరానికి మార్చి రాజమహేంద్రుడన్న తన బిరుదు నామంతో రాజమహేంద్రవరాన్ని నిర్మించాడు. దాయాదుల ఘర్షణల కారణంగా యుద్ధమల్లుడి (క్రీ.శ.930) లాంటి వాళ్లు కృష్ణ దక్షిణ ప్రాంత పాలనకే పరిమితమైన ఘట్టాలూ ఉన్నాయి. అప్పుడే బెజవాడ కొంత కాలం రాజధాని అయిందని చరిత్రకారుల ఊహ. అరుదుగానే అయినా వేంగీ రాజులు పరాయి భూములకు వెళ్లి విజయపతాకను ఎగరేసిన సందర్భాలు ఉన్నప్పటికీ మొత్తం మీద ఎక్కువకాలం ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలతో సామంత జీవితమే గడిపారు. దాదాపు వెయ్యేళ్లపాటు కోస్తాంధ్ర అశాంతి, అల్లకల్ల్లోలాల కింద మగ్గిపోయింది. రాజకీయ ఐక్యత లోపించడం అలా ఉండగా, కోస్తాంధ్ర, రాయలసీమలు రాజధాని రూపంలో ఒక మహానగరా నికీ, దానిని అంటిపెట్టుకుని ఉండే స్వతంత్ర సాంస్కృతిక ధోరణులకూ దూరంగానే ఇప్పటికీ ఉండిపోయాయి.
 
ఈ నేపథ్యంలో ఒకనాటి ఆంధ్ర బౌద్ధ రాజధాని అమరావతి, బెజ వాడను కలుపుకుంటూ భారత ప్రజాస్వామిక రాజ్యాంగ ఛత్రం కింద నవీన ఆంధ్రప్రదేశ్‌కు రాజకీయ రాజధానిగా అవతరిస్తోంది. బుద్ధుడు స్వయంగా ఇక్కడ కాలచక్ర తంత్రాన్ని ప్రవర్తింపజేశాడన్నది ఎంత నిజమో తెలియదు కానీ; రెండు వేల ఏళ్లను మించిన తన కాలచక్ర భ్రమణంలో ఇప్పుడు మరో ఆవృత్తిని ప్రారంభిస్తోంది. నేటి అత్యాధునిక సాంకేతికపు హంగులతో సర్వాంగ సుందరమైన రాజధానిగా తనను తీర్చిదిద్ద్దుకుంటూ అమరావతి వేయబోయే అడుగులు సరికొత్త అభ్యుదయం వైపు, వినూత్న సాంస్కృతిక వికాసం దిశగా పడతాయని ఆశిద్దాం.  
 (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు) kalluribhaskaram9gmail.com

మరిన్ని వార్తలు