ఇక్కడ ఇలా ముగించినా...

26 Dec, 2015 10:12 IST|Sakshi
ఇక్కడ ఇలా ముగించినా...

పార్లమెంటులో ఏం జరిగింది- 47

పోలవరం గురించి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎందుకు తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తున్నారో, ఆయనను ఎలా ఒప్పించాలో కేసీఆర్ సవివరంగా చెప్పారు. చివరిగా, ఆ రోజు విమాన ప్రయాణంలో ఆయన ఉపన్యాసం ముగిస్తూ, సీమాంధ్ర నాయకులంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధించాలని కోరారు. ‘రాజమండ్రి వచ్చి ఈ విషయాలన్నీ చెప్పొచ్చు కదా!’ అన్నాను. ‘రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి నా ఉపన్యాసం ఉంటే గొడవ చెయ్యకుండా ప్రజలు వింటారా?’ అని ప్రశ్నించారు కేసీఆర్.


(ఆరోజు కేసీఆర్‌తో జరిగిన మొత్తం సంభాషణ గురించి నా పుస్తకం ‘ఏం జరిగింది?’లో రాశాను. త్వరలో విడుదల కాబోతున్న ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను ధారావాహికంగా ప్రచురించినందుకు ‘సాక్షి’ యాజమాన్యానికీ, ముఖ్యంగా ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి గారికీ కృతజ్ఞతలు. ఈ ధారావాహికను చదివిన పాఠకులకూ, అభిప్రాయాలు చెప్పిన వారికీ కూడా ధన్యవాదాలు.
రాష్ట్ర విభజన విషయంలో ఏయే పార్టీ, ఎవరెవరు నాయకులు ఎలా ప్రవర్తించారో, ప్రభుత్వం-పార్లమెంట్ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించాయో, సుప్రీం కోర్టులో కేసుల వివరాలు, వాటి అనుబంధాలు సహా అందించే ప్రయత్నం అందులో చేశాను.

2013 జూలై నెలాఖరులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ప్రకటన చేసిన రోజు నుంచి, 20-2-2014న రాజ్యసభలో విభజన బిల్లు ‘పాస్’ అయినట్లు ప్రకటించిన రోజు వరకు ... ఏ రోజు ఏం జరిగిందో నాకు తెలిసినంత వరకూ పుస్తకరూపంలోకి తెచ్చాను. ఇందులో కొన్ని విషయాలు ఇప్పటికే ప్రతికలలో వచ్చినవి ఉన్నా, పత్రికలలో, చానళ్లలో రాని విషయాలు కూడా ‘అనేకం’ ఉన్నాయి. దిగ్విజయ్‌సింగ్ ఆధ్వర్యంలో నేనూ, జైపాల్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు- నలుగురమూ ‘వార్‌రూం’లో ఏం చర్చించాం... చర్చలు ఎందుకు విఫలమయ్యాయి...?

వర్కింగ్ కమిటీ తెలంగాణను ఏర్పాటు చేయాలంటూ తీర్మానం విడుదల చేసిన రోజున, సీమాంధ్ర ఎంపీలం దరూ కలసినప్పుడు ఏం చర్చ జరిగింది...? ఎందుకు అందరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయాం...?

‘వార్ రూం’లో ఎంపీలందరూ ఉన్న సమావేశంలో దిగ్విజయ్‌సింగ్ నామీద ఎందుకంత ఆగ్రహం వెలిబుచ్చారు?
 కేవీపీ మనవరాలి పుట్టినరోజు పార్టీలో సీమాంధ్ర ఎంపీలు ఎందుకు ‘తన్నుకునేంత’ స్థాయిలో గొడవ పడ్డారు?

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో జరిగిన సమావేశాలూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ వెంకటాచలయ్య గారితో ముఖాముఖీ, మరో విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పట్నాయక్ పంపిన ‘ఒపీనియన్’, అటార్నీ జనరల్ వాహనవతి అభిప్రాయాలు మొదలైన అనేక విషయాలు, ఇప్పటి వరకూ బైటకు రాని అనేక ఇతర విషయాలను చర్చించాను.

‘తెలంగాణ రాష్ట్ర విభజన’ అనేది ఒక చాలెంజ్. కానీ ఈ సవాలును రాజ్యాంగ బద్ధంగా ఎదుర్కొనడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయన్నదే నా వాదన.

2009 ఎన్నికల్లో అన్ని పార్టీలూ తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తూ మ్యానిఫెస్టోలు ప్రకటించి, ఎన్నికలైన తర్వాత అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ ... ఎలా ఆ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలి అనే ఆలోచన పక్కనపెట్టి, ‘ఆ సమస్య’ ద్వారా రాజకీయ లబ్ధి ఎలా పొందాలనే ఆలోచనే అన్ని పార్టీల్లోను అధికమయింది.  దాని ఫలితమే-ఈ అఘాయిత్యం.
ఈ రోజుతో ఈ ‘సీరియల్’ ముగిసింది. తొందరలోనే ‘ఏం జరిగింది?’ పుస్తకం మీ ముందు ఉంటుంది.)

ఉండవల్లి అరుణ్ కుమార్
వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు
a_vundavalli@yahoo.com

 
 

మరిన్ని వార్తలు