ఏ ఒక్కరూ సంతోషంగా లేరు..!

21 Jun, 2017 01:39 IST|Sakshi
ఏ ఒక్కరూ సంతోషంగా లేరు..!

కొమ్మినేని శ్రీనివాసరావుతో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా లేరని వైఎస్సార్‌ సీపీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో కొన్ని కోట్లు వెచ్చిస్తే పూర్తయ్యే చిన్న చిన్న పనులు కూడా పూర్తి కావడంలేదని, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 80 శాతం పూర్తి చేసిన పనులు కూడా గత మూడేళ్లుగా అలాగే ఉన్నాయన్నారు. సాగునీటి, తాగునీటి రిజర్వాయర్ల తుది నిర్మాణ పనులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ప్రజలకు చేరాల్సిన పథకాలు వారికి అందడం లేదని, ఎన్నోసార్లు బాబుకు పిటిషన్లు పెట్టినా పరిష్కరించడం మాటేమో గానీ, కనీసం పిటిషన్‌ తమవద్దకు చేరిందన్న అక్నాలెడ్జ్‌మెంట్‌ కూడా తిరిగి పంపలేదని విమర్శించారు. ఒక పార్టీ వారిని కోట్లు పెట్టి కొనేయడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రాజకీయ నేతలు చేసే వ్యాపారాలపై ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టే అలవాటు ప్రభుత్వాలకు ఉందంటున్న బుట్టా రేణుక అభిప్రాయాలు ఆమె మాటల్లోనే...

రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఎలా వచ్చింది?
నా భర్త ప్రోత్సాహమే కారణం. ఆయన, మా సోదరుడు యుగేందర్‌ కూడా నన్ను రాజకీయాల్లోకి ప్రోత్సహించారు. విద్యతో పాటు రిటైల్, ఆటోమొబైల్‌ బిజినెస్‌లో ఉన్నాం. బిజినెస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి రాజకీయాలపై అంత ఆసక్తి చూపేవాళ్లం కాదు. వైఎస్‌ జగన్‌ అన్న కొత్తగా అభ్యర్థుల కోసం చూస్తున్న సమయంలో కొంతమంది రాజకీయ స్నేహితుల వల్ల పరిచయాలు పెరిగాయి. నా భర్తకు ఆఫర్‌ వచ్చింది. రాజకీయాల్లోకి నాకంటే నీవే ఉత్తమం అని చెప్పి నా భర్త నన్ను ప్రోత్సహించారు. అంతకుముందు పూర్తిగా విద్యపైనే దృష్టి పెట్టాను.

ఎంపీగా ఎన్నికైన వెంటనే కాస్త గడబిడి అయినట్లుంది కదా?
అది అనుకోకుండా జరిగిన సందర్భం. ఎస్పీవైరెడ్డి ఎంపీగా గెలిచిన తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన పార్టీ మారి టీడీపీలో చేరిన సమయంలో నా భర్త అక్కడే ఉన్నారు. ఆ క్షణంలో అలా జరిగింది. నేను వెళ్లలేదు. ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. నేను వైఎస్సార్‌ సీపీలో ఉన్నాను. మా ఆయన టీడీపీలో ఉండటం అసంభవం. ఆయన గైడెన్స్‌ నాకు అవసరం కదా. ఆయనకు బాబుతో ఎలాంటి సంబంధం లేదు.

మీరు ఇక్కడ, మీవారు టీడీపీలో ఉంటే సేఫ్‌ గేమ్‌ ఆడొచ్చుకదా..?
లేదండి. అంత గేమ్స్‌ ఆడే స్థాయికి నేనింకా ఎదగలేదు (నవ్వుతూ), నా భర్త గైడెన్స్‌ వల్లే నియోజకవర్గంలో ఏదైనా చేయగలుగుతున్నాను. ఆయన ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తుంటారు. నియోజకవర్గంలో ఇలా తిరగాలి, ప్రజలను ఇలా చేరాలి, వారి పనులు ఏవిధంగా చేయాలి. ఎలాంటి మేలు చేయాలి అనే అంశాల పట్ల ఆయన నాకు వెనుక నుంచి మార్గనిర్దేశనం చేస్తుంటారు. చాలాసార్లు ఆయన పార్టీ మీటింగులకు వస్తూ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

పార్టీ మారమని మీపై ఒత్తిడి చేయలేదా?
లేదండి. పార్టీనుంచి ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి తీసుకోవడం అనేది రాజ్యాంగబద్ధం కాదు. చట్టబద్ధం కాదు. ఒక పార్టీ నుంచి ఎన్నికయినప్పుడు దానికే కట్టుబడి ఉండాలి. ప్రజలకు అలా సందేశం కూడా ఇవ్వాలి. మనలో మారాలనే సంసిద్ధతను బట్టి అవతలివాళ్లు ఆఫర్లు చేస్తారు.

మీకలాంటి ఆఫర్లు పంపలేదా? ప్రలోభాల వల్లే మీ జిల్లాలో 5 గురు పార్టీ మారారా?
నా నియోజకవర్గం విషయం చూస్తే మావాళ్లపై కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఏ పనులూ జరగలేదు. ప్రత్యేకించి ఎమ్మెల్యే స్థాయిలో మా పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టడం, కొన్ని సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరించడం.. ఇలాంటివి కొన్ని నా నోటీసుకు వచ్చాయి. ఇలాంటి ఒత్తిళ్లు ఎదుర్కోవడం ఎమ్మెల్యేలకు కొంచె కష్టం.

చంద్రబాబు పాలన ఎలా ఉందనుకుంటున్నారు?
కచ్చితంగా ప్రజలు సంతోషంగా లేరు. పథకాలు తీసుకోండి. చేసిన వాగ్దానాలు తీసుకోండి.. చిన్న చిన్న పనులు కూడా జరగడం లేదు. నిజం చెప్పాలంటే నా నియోజకవర్గం వరకు చూస్తే ఎలాంటి అభివృద్ధీ కనిపించడం లేదు. నా నియోజకవర్గంలో ఒక చిన్న ప్రాజెక్టు.. రిజర్వాయర్‌ ఉంది. దానికి 20 కోట్లు ఖర్చుపెడితే చాలు వస్తుంది. సాగునీరు, మంచినీరు సమస్యలు తీరిపోతాయి. 20 కోట్లు అనేది ప్రభుత్వానికి చాలా తక్కువ మొత్తం. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నేడు పూర్తి కాని పరిస్థితులే ఉన్నాయి. రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు 80 శాతం పనులు పూర్తి చేశారు. వాటికి కూడా 25 లేక 30 కోట్లు ఖర్చుపెడితే అవి వినియోగంలోకి వస్తాయి.

పార్టీ మారితే 40 కోట్లు ఇస్తున్నారు.. అంత ఖర్చుపెట్టావు. నీకేం మిగిలింది, ఏం సాధించావు అని మీ పిల్లలు మిమ్మల్ని అడగరా?
లేదండి. పార్టీ మారినవారికి, పార్టీలోనే ఉన్నవారికి ప్రజల్లో ఉన్న గౌరవం, వ్యత్యాసం చూస్తే అసలు ఆ ఆలోచనే రాదు. పైగా వ్యాపార నేపథ్యం నుంచి వచ్చాం కాబట్టి రాజకీయాల్లో పార్టీలు మారడం కంటే బిజినెస్‌ చేసుకుంటే ఇంకా ఉత్తమం అనే ఎరుకతో ఉన్నాం. రాజకీయాల్లో కంటే బిజినెస్‌లో గౌరవప్రదమైన సంపాదన ఉంటుంది. అందుకే రాజకీయాలను బిజినెస్‌ చేయకూడదు.

జగన్‌ నాయకత్వంపై మీ అభిప్రాయం?
అన్నను చాలాసార్లు కలిశాను. ఎంతో సహృదయం ప్రదర్శించారు. మంచి వ్యక్తి, సమస్యలు వచ్చినప్పడు కూడా చక్కటి సలహాలు ఇస్తారు. నా విషయానికి వస్తే, ‘కొంచెం బలంగా ఉండాలమ్మా, ఇంకా గట్టిగా ఉండాలి’ అని చెబుతారు. అంటే వాయిస్‌ని కొంచెం పెంచాలి అని సూచిస్తారు. తప్పకుండా పికప్‌ అవుతానన్నా అంటాను. కొంచెం కొంచెంగా మార్పు వస్తోంది. విమర్శించడం నా స్వభావం కాదని కూడా అన్నతో చెప్పాను. నేనే నేరుగా చెప్పిన తర్వాత అన్న ఎందుకు ఫోర్స్‌ చేస్తారు? ఈ మూడేళ్లలో అన్న నన్ను చక్కగా అర్థం చేసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్‌ వస్తుందా?
అన్న పిలిచి చెప్పేంతవరకు నేను ఎవరి మాటా నమ్మను. ఈసారి నన్ను ఎమ్మెల్యేగా పంపే అవకాశం ఉందని కూడా ఇప్పటికే పుకార్లు ఉన్నాయి. కానీ మా అధినేత ఈ విషయంపై ఏదీ చెప్పనప్పుడు నేనెందుకు బాధపడాలి? ఇప్పటికైతే నా ఆసక్తి ఎంపీగా కావాలనే. రేపు ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి. నా ఆసక్తి, పార్టీ ఆసక్తి రెండింటిపైనే నేనేమిటి అనేది ఆధారపడి ఉంటుంది. జగనన్న ఇప్పటివరకు నా విషయంలో హ్యాపీగానే ఉన్నారు.

జగన్‌ సీనియర్లను కూడా లెక్కచేయరని అధికార పార్టీ నేతల విమర్శ?
నాకు తెలిసినంతవరకు అన్న అందరినీ గౌరవిస్తుంటారు. నా మూడేళ్ల అనుభవంలో తను మంచి వ్యక్తిగానే కనిపించారు. చిన్నవాళ్లం, తానూ మేమూ సేమ్‌ బ్యాచ్‌. మాకే అంత గౌరవం ఇస్తున్నప్పుడు పెద్దవారికి గౌరవం ఇవ్వరా? తనకంటే పెద్దవారైన నేతలకు అన్న ఎలాంటి గౌరవం ఇస్తారో కళ్లారా చూశాను కూడా.

వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై మీ అభిప్రాయం?
నిజం చెప్పాలంటే ఒక్కసారి కూడా ఆయనను నేను వ్యక్తిగతంగా కలవలేదు. చూడలేదు. ఆయనని కలవకున్నా, ఇంటరాక్ట్‌ కాకున్నా, ప్రజలద్వారా నాకు తనపై మంచి అభిప్రాయం కలిగింది. రియల్లీ గ్రేట్‌ లీడర్‌. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆయన పేరు చెపితేనే వారి ముఖాల్లో అంత సంతోషం కనబడుతుంది. ఒక నాయకుడు ప్రజల్లో అంత మంచి గౌరవాన్ని పొందడం నిజంగా గొప్ప విషయం.

మరి మీ పార్టీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు?
మొత్తంమీద మా పార్టీ పరిస్థితి అన్ని ప్రాంతాల్లోనూ బాగానే ఉంది. 2014లో అతి తక్కువ మెజారిటీ ఓట్లతో మేం దెబ్బ తినడం విచారకరం. ఇప్పుడయితే ప్రజల్లో మాకు చాలా మంచి గుర్తింపు ఉంది. మంచి మంచి నేతలు మా పార్టీలోకి రావటం. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో మా పార్టీపై మాకు ఎంతో నమ్మకం ఉందండి. 2019లో తప్పకుండా మేం అధికారంలోకి వస్తాం. ప్రజల్లో కూడా ఆ నమ్మకాన్నే ఇస్తున్నాం. మేం గెలుస్తాం, పనులు చేయగలుగుతాం అని నమ్మకంగా చెబుతున్నాం.
(బుట్టా రేణుకతో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://goo.gl/QoF28k
https://goo.gl/uJJzMN

మరిన్ని వార్తలు