ప్రజా చైతన్యమా, పార్టీల దైన్యమా?

27 May, 2016 00:18 IST|Sakshi
ప్రజా చైతన్యమా, పార్టీల దైన్యమా?

విశ్లేషణ
 
భారత్‌ను వివిధ జాతుల సమాహారంగా భావిస్తూ, ఇది ఏకశిలా సదృశమైన ‘భారత జాతి’ మాత్రమే కాదన్న సిద్ధాంతాన్ని బీజేపీ అంగీకరిస్తున్నదా? అలాంటిదేమీ లేదు. అంటే ఇది అసోం ప్రజల జాతీయ భావాన్ని వాడుకుని, ఈశాన్య భారతంలో అధికారం చేపట్టాలన్న ఎత్తుగడల పొత్తు మాత్రమే. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే 1.5 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అసోంలో బీజేపీ విజయం నిరూపించినదేమంటే అవకాశవాద పొత్తుల ఎత్తుగడలలో కాంగ్రెస్ కంటే బీజేపీదే పైచేయి.
 
 
క్రమం తప్పకుండా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరగడం, లేదా ప్రత్యేక పరిస్థితులలో మధ్యంతర ఎన్నికలు జరగడం - ఇవి మాత్రమే ప్రజాస్వా మ్యంలో పరిపాలన రూప ఔన్నత్యానికి ప్రతిబింబాలు కావు. మరేమిటి? ఆ ప్రజాస్వామ్య ప్రక్రియ నిర్వహణ ఎలా ఉంది? దానితో ప్రజాజీవితంలో ఏ మేరకు సానుకూల మార్పు చోటు చేసుకుంది? వివిధ మతాలకు, సంస్కృ తులకు ఆవాసమైన ఈ దేశంలో ప్రజల జీవన ప్రమాణాలకు అత్యంతా వశ్యకమైన లౌకికతత్వం ఏ మేరకు విస్తరించింది? ఏ విధమైన అక్రమ నిర్బం దాలు, అణచివేతలు లేకుండా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రజలు ఏ మేరకు అనుభవిస్తున్నారు? వంటి అంశాలను అధ్యయనం చేయడం, విశ్లేషించు కోవడం హేతుబద్ధమనిపించుకుంటుంది.
 
 ఎన్నికలలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు సాధించింది? ఆయా పార్టీలకు పడిన ఓట్ల శాతం ఎలా ఉంది వంటి అంశాలను పట్టుకుని పార్టీల పేర్ల చుట్టూ పరిభ్రమించకుండా; ఎలాంటి విధానాలకు ప్రజలు ఆమోద ముద్ర వేశారు? ఆ విధానాలు క్షేత్రస్థాయిలో ఎంత వరకు ప్రజా శ్రేయస్సుకు దోహద పడగలవు అనే అంశాలను స్పృశించడం ముఖ్యం. అలాగే ప్రజాభిప్రాయాన్ని గమనించడం మరింత అవసరం. జనం ఓటింగ్‌లో పాల్గొని ఏదో ఒక పార్టీకి, ఏదో ఒక గుర్తుకు ముద్ర వేసి, అక్కడితో తమ బాధ్యత అయిపోయిందని భావిస్తున్నారేమో పరిశీలించాలి.
 
 ఈ మొత్తం తతంగంలో రాజకీయ పార్టీల ప్రత్యక్ష పరోక్ష ప్రలోభాల ప్రభావం ఏ మేరకు? అలాగే, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను రాజకీయ పార్టీలు నెరవే రుస్తున్నాయా? ఒకవేళ అవి హామీల సంగతి మరచిపోతే, వాటిని అమలు జరిపించుకునేందుకు ప్రజలకు వ్యవస్థాగత అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఐదేళ్ల దాకా ఆగాలా? ఇంతలో రాజకీయ పార్టీ, ఎన్నికైన అభ్యర్థి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించ వచ్చునా? ఇలాంటి అంశాలపై విశ్లేషణ మాత్రమే ఒక వ్యవస్థలో ప్రజాస్వామ్య ప్రక్రియ స్వరూప స్వభావాలను వెల్లడిస్తుంది.
 
 ఈ ప్రచార యుగంలో ప్రచారార్భాటాలు, ప్రసార ప్రావీణ్యాలు ఒక వాస్తవం. ఇవి వాస్తవానికి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం, దాని ఫలితం, ప్రభావం ఏ విధంగా ఉంది? పార్టీలు ప్రవచించే సిద్ధాంతాలకీ, వాటి తక్షణ ఆచరణకు మధ్య వైరుధ్యం ఎలాంటిది? అవకాశవాద రాజకీయాలను, పదవీ వ్యామోహంతో వ్యవహరించే నేతలను ప్రజలు పట్టించుకున్న తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? అలాంటి జాడ్యాలకు ఏ విధంగా కనువిప్పు కలిగిస్తున్నారు? ఇలాంటివి మాత్రమే ప్రజాస్వామ్య ప్రక్రియ అమలును సమీక్షించే క్రమంలో సమాధానాల కోసం చూడవలసిన ముఖ్యాంశాలు.

ఇలా పేర్కొనడమంటే ఈ మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నార్థకం చేయడం కాదు. ప్రజా చైతన్యాన్ని శంకించడం కూడా కాదు. ఒక ప్రహసనంలా, మొక్కుబడిగా ఎన్నికలు జరిగి ప్రయోజనం లేద ని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలైన ఎన్నికలు, ప్రజాప్రాతినిధ్య సంస్థలు, రాజకీయ పార్టీలు అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా ఉన్నాయా లేవా అని ప్రశ్నించుకోవాలి.
 
ఆంధ్రలో సరికొత్త ఆరంభం
ఆంధ్రప్రదేశ్ అనుభవం పై ప్రశ్నలకు చక్కని ఉదాహరణ. 2014లో బీజేపీ పొత్తుతో తెలుగుదేశం గెలుపొంది, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఏం జరిగింది? ‘బీజేపీ మతతత్వ పార్టీ, 2004లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశాం, ఇక అలాంటి తప్పిదం చేయబో’నని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ శిక్షార్హుడని చంద్రబాబు ఎలుగెత్తి చాటారు. 2014 ఎన్నికలు ప్రకటించేసరికి వాటన్నిటినీ పూర్వపక్షం చేసేశారు.
 
మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, బీజేపీ తోనే పొత్తు పెట్టుకున్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేదా నెలకు రెండు వేల రూపాయల భృతి - ఇలా చంద్రబాబు వాగ్దానాల వర్షం కురిపించారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఆ హామీల ఊసే లేదు. పైగా ఆ వాగ్దానాల మాటేమిటని నిలదీసిన మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులకు లాఠీలతో సమాధానం చెప్పారు. గణాంకాల మేరకు, ప్రజా స్వామ్య ప్రక్రియ ద్వారా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం అధికారం పొందిన మాట వాస్తవం. కానీ ఆ ప్రజాస్వామ్య ప్రక్రియ ఆధారంగానే, ఇది ప్రజల విజయంగా చెప్పడం దుస్సాహసం కాదా!


 2015లో జరిగిన పలు ఎన్నికలలో రాజకీయ పార్టీల తీరు ఇదే తీరున సాగింది. చెప్పే మాటకూ, ఆచరణకు మధ్య ఆమడ దూరం అన్న తీరులో బీజేపీ వ్యవహరించింది. తన భావజాలానికి పూర్తి విరుద్ధమైనప్పటికీ జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో పీడీపీతో పొత్తు పెట్టుకుంది. ప్రభు త్వంలో భాగస్వామి అయింది. ‘కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అనడానికి ముందు అక్కడి ప్రజల హృదయాలను గెలవాలి’ అని ఎవరైనా అంటే, వారిని దేశద్రోహులుగా బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ భావించేవి. కానీ పీడీపీ ఈ అభిప్రాయాలకు పూర్తి విరుద్ధమైన వైఖరి కలిగినది. అంటే అధికారం కోసమే బీజేపీ, పీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇది బీజేపీ విజయమా? అవకాశవాద పొత్తు విజయమా?


 అసోంలో అవకాశవాద విజయం
 మొన్న అసోం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల తీరూ ఇంతే. అక్కడ బీజేపీ విజయాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. ‘భారత జాతి’, ‘అఖండ భారత్’ ఆ పార్టీ నినాదాలు. ‘అసోం, అసోం జాతీయుల ప్రయోజనాలకే రక్షణ. అన్యులకు ఇక్కడ అవకాశం లేదు’ అన్న నినాదం అందుకున్న పార్టీ అసొం గణపరిషత్(ఏజీపీ). ఇదే నినాదంతో ఒకప్పుడు ఏజీపీ అధికారం చేపట్టింది. అలాగే బోడోల్యాండ్ పార్టీ. బోడో ప్రాంతం ఆ తెగలకే చెందాలంటుంది.  ‘భారతజాతి’, ‘అఖండ భారత్’ అని నినదించే పార్టీ బోడో పార్టీతో, ఏజీపీతో పొత్తు పెట్టుకుంది.
 
 పోనీ బీజేపీ భావజాలాన్ని మార్చుకుందా? భారత్‌ను వివిధ జాతుల సమాహారంగా భావిస్తూ, ఇది ఏకశిలా సదృశమైన ‘భారత జాతి’ మాత్రమే కాదన్న సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నదా? అలాంటిదేమీ లేదు. అంటే ఇది అసోం ప్రజల జాతీయ భావాన్ని వాడుకుని, గుడారంలో ఒంటె మాదిరిగా ఈశాన్య భారతంలో అధికారం చేపట్టాలన్న ఎత్తుగడల పొత్తు మాత్రమే. కాబట్టి ఇది అసోం ఫలితాన్ని ప్రజావిజయంగా భావిం చలేం.

అంతేకాదు, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే 1.5 శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కనుక అసోం ఎన్నికలలో బీజేపీ విజయం నిరూపించినదేమంటే అవకాశవాద పొత్తుల ఎత్తుగడలలో కాంగ్రెస్ కంటే బీజేపీదే పైచేయి. తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలలో ఏ పార్టీ గెలిచినా, తమిళ జాతీయవాదమే గెలిచినట్టు. ఓట్లు కొనుగోలు చేసేందుకు పార్టీలు తమ నిధుల నుంచి గాక, ప్రభుత్వ ఖజానా నుంచే ‘ఉచితాలు’ అంద జేస్తామంటూ ఓటర్లకు గాలం వేయడంలో ద్రవిడ పార్టీలు దొందూ దొందే!
 
లెఫ్ట్‌కు బెంగాల్, కేరళ అనుభవాలు
 బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలుపు ఏ అంచనాలకూ అందదు. అక్కడ సుభాశ్ చంద్రబోస్, బి.సి.రాయ్, జ్యోతిబసు వంటివారు వారి వారి రాజ కీయ సంస్థలకే ప్రతినిధులు కారు. బెంగాలీ జాతీయతకు ప్రతినిధులు. బసు ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ, ఆ బెంగాలీ జాతీయ అంశం మార్క్సిస్టు పార్టీ నేతృత్వంలోని వామపక్ష సంఘటనకు కలసివచ్చింది. బసు తర్వాత, ఆ స్థాయి నాయకుడిని ఆ కూటమి సృష్టించుకోలేక పోయింది. పైగా, కేంద్రం అనుసరిస్తున్న ఉదారవాద ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు 2006-11 మధ్య బెంగాల్లో వామపక్ష సంఘటన ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రజల ముందుంచకుండా అదే విధానాలను అనుసరించడం ద్వారా సింగూర్ - నందిగ్రామ్ వంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి.
 
 నాటి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం రైతుకూలీల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నది. రైతులపై కాల్పులకు కూడా వెనకాడకుండ ఆ పాలన అమా నవీయంగా వ్యవహరించింది. దీనితో సహజంగా సీపీఎం వెనుక ఉండాల్సిన రైతులు, కష్టజీవులు, అసంఘటిత కార్మికులు తదితరులు పార్టీకి దూరమ య్యారు. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకుని వామపక్ష సంఘటనపై ఆ ప్రజల తరఫున తీవ్ర పోరాటం చేసి, తనవైపు తిప్పుకో గలిగారు మమతా బెనర్జీ. పైగా మధ్యతరగతి కూడా ఆమె పక్షానజేరి ఆమెకు ఒక బెంగాలీ జాతీయనేత స్థాయి కల్పించారు.
 
 కేంద్ర నిర్ణయానికి విరుద్ధంగా బెంగాల్ ప్రత్యేక పరిస్థితిలో మమతా బెనర్జీ దూకుడు, దుస్సాహసాలకు అడ్డుకట్ట వేయాలని బెంగాల్ సీపీఎం భావించింది. ఆ క్రమంలోనే ఇన్నాళ్లుగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని సీపీఎం చేసిన నిర్ణయం ఫలించలేదు. ‘కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోక పోయినట్లయితే బీజేపీ రెండవస్థానంలో ఉండేది’ అంటూ రాష్ట్ర సీపీఎం కార్యదర్శి చేసిన వ్యాఖ్యలోని వాస్తవాన్ని అటుంచితే, కాంగ్రెస్‌తో ఒప్పందాన్ని బెంగాల్ ప్రజానీకం చేత పార్టీ మెప్పించలేక పోయింది. ఫలితంగా, ఈ అవగాహనను ప్రజలు అర్థం చేసుకోలేక, అవకాశ వాదంగానే భావించారు.
 
 సీపీఎం కూటమి మూడో స్థానంలోకి దిగజారడం దాని ఫలితమే. ఇకనైనా మిగిలిన ఆర్థిక, రాజకీయ పోరాటాలతోపాటు ‘బెంగాలీ జాతీయత’ అంశంపై కూడా అక్కడి వామపక్షాలుదృష్టి పెట్టాలి. మరొకమాట. ఈ ఫలితాలతో ఏ ‘జాతీయ పార్టీ’ దేశంలో అన్ని జాతుల (పోనీ రాష్ట్రాల) ఆమోదం పొందిందని చెప్పే వాతావరణం లేదు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేకుండా ఏ జాతీయ పార్టీ దేశాన్ని పాలించే స్థాయిలో తీర్పును పొందలేదనే అనిపిస్తున్నది. ఇక కేరళలో ప్రతి ఎన్నికలలోనూ అధి కారంలో ఉన్న కూటమిని ఓడించడం, ప్రతిపక్ష కూటమికి విజయం చేకూర్చడం ఆనవాయితీ.
 

వామపక్షాలకు అడ్డదారులా?
 ఏది ఏమైనా ఏంగిల్స్ అన్నట్టు ‘ఎన్నికలు ప్రజా చైతన్యానికి గీటురాళ్లు!’ ప్రజా ఉద్యమమే ప్రజా చైతన్యాన్ని పెంచుతుంది. వామపక్షాలు ఈ విషయంపై శ్రద్ధపెట్టి ఎక్కడికక్కడ పాలకుల అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలు, నిరంకుశ ధోరణులను ఎండగడుతూ, ఆర్థిక పోరాటాలమీదే కాదు, సామాజిక, జాతీయ అంశాలపై ఉద్యమాల ద్వారా ప్రజా చైతన్యాన్ని పెంచాలి! ఓట్ల కోసం సీట్ల కోసం అడ్డదారులు తొక్కడం దోపిడీదారుల పార్టీలకు చెల్లుతుందేమోగానీ, వామపక్ష శక్తులకు కాదు.

ఏపి విఠల్
 వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు  9848069720

>
మరిన్ని వార్తలు