నైతికాధికారానికి నిలువుటద్దం

1 Aug, 2015 00:43 IST|Sakshi
శేఖర్ గుప్తా

అంతటి అత్యున్నత స్థాయి ప్రేమ, గౌరవ శిఖరాలను అందుకునేలా చేసినది కలాంలో ఏముంది? స్వాతంత్య్రానంతర కాలంలో ఏ కొందరికో పరిమితమైన నైతిక అధికారం ఆయనకు ఉండేది. ప్రధానంగా అది ఆయనలోని నమ్రత నుంచి సంక్రమించినది. ఇస్రో-డీఆర్‌డీఓ సాధించిన విజయాల్లో ఏ ఒక్కదాన్నీ ఆయన తనదిగా చెప్పుకోవడం విని ఎరుగం. ఇనుప తెరకు వెనుక ఉండే ఒక సంస్థలో జీవితమంతా గడిపిన వారెవరికైనా కొన్ని ఫిర్యాదులు ఉండే ఉండాలి. కానీ వాటిని ఆయన ఎన్నడూ వైఫల్యాలకు సాకులుగా చూపడానికి వాడుకోలేదు.
 
 దేశ ప్రజలు అత్యంత అమితంగా ప్రేమించే ప్రజా ప్రముఖులలో ఒకరి జీవితాన్ని ఇలా అంచనా వేయడం నిర్లక్ష్యపూరితమైనదే అవుతుంది. అయినా దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఎలాంటి వారు కారని చెప్పు కోవాలో వాటిలో కొన్నిటిని ముందుగా చూద్దాం. సాటి శాస్త్రవేత్తలు సమీక్షిం చిన పరిశోధనా పత్రాలు పెద్దగా ఆయన పేరుతో వెలువడలేదు. కాబట్టి సంప్రదాయక అర్థంలో ఆయన అసలు సైంటిస్టే కారు. ఇక అణుబాంబుకు సంబంధించి, అది అణు ఇంధనశాఖ (డీఏఈ)కు చెందిన రెండు తరాల సైంటిస్టులు సమష్టిగా తయారు చేసినది. కాబట్టి ఆయన భారత అణు బాంబు సృష్టికర్తా కారు. పోనీ ఆయనేమైనా అనర్గళోపన్యాసకునిగా వరం పొందిన వారా? అంటే అదీ కాదు. ఆయన, తాను అంతకు ముందే చెప్పిన సామాన్య విషయాలనే పదేపదే చె బుతూ ఉండేవారు. ఢిల్లీలోని దేశ అధికార పీఠం లాంటి రైసినాహిల్‌లో ఆయనకు ముందు ఎంతో గొప్ప సాహితీవేత్తలు నివసించారు. కలాం ఏమంతపాటి రచయిత కారు. ఆయన పెళ్లే చేసుకో లేదు. కాబట్టి కుటుంబ జీవీ కారు, పిల్లలూ లేరు. పైగా పెంపకం వల్లనో లేదా శిక్షణ ద్వారానో తయారైన రాజకీయవేత్త లేదా ప్రజా ప్రముఖుడు కూడా కారు. ఆయన జీవితంలో చాలా భాగం ఆయుధాల డిజైన్లను రూపొం దించే రహస్య ప్రపంచంలోనే గడచింది. ఎంతగా సంస్కృత శ్లోకాలను వల్లించినా, రుద్రవీణను పలికించినా ఆయన భగవద్భక్తిగల సామాన్య ముస్లిం మాత్రమే.
 
 హిందూ మెజారిటీ మెచ్చిన ముస్లిం
 
 ఇప్పుడిక ఆయన చివరికి ఏ స్థాయికి చేరారో చూద్దాం. సీవీ రామన్, జగదీశ్ చంద్రబోస్‌ల వంటి మన అతి గొప్ప సైంటిస్టులలో ఒకరుగా, ఆయనకు మార్గదర్శుల తరానికి చెందిన హోమీబాబా, విక్రమ్ సారాభాయ్‌ల కంటే లేదా డీఏఈ, భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో), రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లలోని వారి సాటివారి కంటే కూడా ఉన్నతునిగా కీర్తించే స్థానానికి చేరారు. మన దేశానికి అణు ప్రతినిరోధ సామర్థ్యాన్ని ప్రసాదించిన వ్యక్తిగా ఆయన మనందరి సమష్టి జ్ఞాపకంలో చిరస్మరణీయుల య్యారు. దేశంలోని భిన్న తరాలకు, భౌగోళిక ప్రాంతాలకు, ప్రజలకు ఆయన  అత్యంత జనరంజకమైన ఉపన్యాసకులయ్యారు. ఆయన ఎక్కడ మాట్లాడినా హాలు కిటకిటలాడి, ఇరువైపులా జనం నిలిచి ఉండాల్సిందే. ఆయన రాసిన పుస్తకాలు, ఉదాహరణకు ‘భారత్ 2020’ లాంటివి ప్రవచనాలవంటివే. అయినా అవే మన చరిత్రలో అత్యంత ఎక్కువగా అమ్ముడైన పుస్తకాలు. ఇంకా చాలా కాలంపాటూ కూడా అవి  అలాగే అమ్ముడుపోతుంటాయి. చాచా నెహ్రూ తర్వాత మన పిల్లలు అమితంగా ప్రేమించిన నాయకుడా యనే. ఆయన ఎంతటి అసాధారణమైన స్థాయికి చేరారంటే... అత్యంత రాజకీయ ముద్రగల రాష్ట్రపతి ఆయనే అయ్యారు. అది కూడా అత్యంత వివేచనాయుతమైన, పక్షపాతరహితమైన రీతిలో. అన్ని మతాలు, జాతుల ప్రజలు ఆయనను ప్రేమించారు, విశ్వసించారు. అక్బర్ సామ్రాట్టు గురించి అత్యంత ఉదారవాద చరిత్రకారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే తప్ప... మొత్తంగా మన చరిత్రలోనే దేశంలోని హిందూ మెజారిటీ అతి ఎక్కువగా ప్రేమించిన ముస్లిం ఆయనే. ఇక చివరిగా, దశాబ్దాల తరబడి రాటుదేలి, విమర్శలను ఖాతరు చేయని నా బోటివాడు సైతం చెప్పడానికి జంకే విషయం... ఆయనకు అసలు సిసలు పీహెచ్‌డీ డాక్టరేట్ ఎన్నడూ లేదు. ఆయనకున్న డాక్టరేట్లన్నీ గౌరవార్థం ఇచ్చినవే. అయితే గౌరవసూచకమైన ఆ ‘‘డాక్టర్’’ ఆయనకు అద్భుతంగా నప్పింది. అణు-క్షిపణి వ్యవస్థలో ఆయనను అతి తీవ్రంగా విమర్శించేవారు సైతం ఈ విషయాన్ని బహిరంగంగా ఎత్తి చూపడానికి సాహసించలేదు.
 
 అరుదైన నైతిక అధికారం ఆయన సొత్తు
 
 అంతటి అత్యున్నత స్థాయి ప్రేమ, గౌరవ శిఖరాలను అందుకునేలా చేసినది కలాంలో ఏముంది? స్వాతంత్య్రానంతర కాలంలో ఏ కొందరు భారతీ యులలోనో కనిపించే నైతిక అధికారం ఆయనకుండేది. ప్రధానంగా అది ఆయనలోని నమ్రత నుంచి సంక్రమించినదేనని చెప్పుకోవాలి. ఇస్రో- డీఆర్‌డీఓలు సాధించిన విజయాల్లో ఏ ఒక్కదాన్నీ ఆయన తనదిగా చెప్పు కోవడంగానీ, మరి ఏ రకమైన గొప్పలు చెప్పుకోవడంగానీ లేదా ఎవరికి వ్యతిరేకంగానైనా మాట్లాడటం, దేని గురించైనా ఫిర్యాదు చేయడం ఎన్నడూ విని ఎరుగం. అధికార యంత్రాంగమనే ఇనుప తెరకు వెనుక ఒక సైంటిఫిక్- ఇంజనీరింగ్ సంస్థలో జీవితమంతా గడిపిన వారెవరికైనా ఏవో కొన్ని ఫిర్యాదులు ఉండే ఉంటాయి. కానీ ప్రజలను ఆకర్షించడానికో లేదా వైఫల్యాలకు సాకులుగా చూపడానికో వాటిని ఆయన ఎన్నడూ వాడుకోలేదు. 2001 ఏప్రిల్‌లో నేను ఆయనను తీవ్రంగా విమర్శిస్తూ ‘కలామ్స్ బనానా రిపబ్లిక్’ శీర్షికతో ‘జాతిహితం’ కాలమ్‌లో రెండు వ్యాసాలు రాశాను. (టజ్ఛిజుజ్చిటజఠఞ్ట్చ.జీ/2001/04/జ్చ్చుఝటఛ్చ్చ్చట్ఛఞఠఛజీఛి/)  ఆ తర్వాత నేను ఆయనకు మొట్టమొదటిసారి ఎదురుపడ్డది... దక్షిణ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో. ఆయనకు వ్యతిరేక దిశ నుంచి జాగింగ్ చేస్తూ వస్తున్న నేను నిజంగానే ఆయనకు ‘ఎదురుపడ్డాను.’ ఆయన అప్పట్లో ఆసియా క్రీడల గ్రామం పక్కనే ఉండే డీఆర్‌డీఓ గెస్ట్ హౌస్‌లో నివాసముండేవారు.  సాయంకాలం నడకకు ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వస్తుండే వారు. భయంతో నేను ఆయనతో చూపు కలపకుండానే తప్పుకోవాలని యత్నిస్తుండగా ఆయన నన్ను గమనించారు. పెద్దగా నవుతూ ఆయన అక్కడే ఆగి, ఆ వ్యాసాన్ని తాను బాగా ఆస్వాదించానని, అందులోని అన్ని విషయాలతోనూ తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. ‘‘అధికార వర్గాలు కూడా అది చదివి ఉంటా యని ఆశిస్తాను. డీఆర్‌డీఓలో చాలా లోటుపాట్లున్నాయి, అది తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది’’ అని అన్నారు. ఆయన మొహంలో ఎక్కడైనా ఎకసెక్కం కనిపిస్తుందేమోనని వెదికాను. కానీ, కలాం ఎన్నడూ నర్మ గర్భితంగా మాట్లాడేవారే కారు. కాలక్రమేణా అది అందరికీ తెలిసింది.
 
 దేశం తర్వాతే ఏమైనా
 
 రాష్ట్రపతి అభ్యర్థిగా కలాం ఎంపిక వాజ్‌పేయి, అద్వానీల అద్భుత రాజకీయ చాతుర్యం. బీజేపీ నేతృత్వం వహిస్తున్న మొట్టమొదటి ప్రభుత్వం వారిదే. అది సమ్మిళితమైనదనే భావన కలిగించాల్సిన అవసరం ఉన్నదనే స్పృహ వారికి ఉంది. అప్పటికే జాతీయ హీరోగా గుర్తింపు పొందిన ముస్లిం నామ ధేయులు ఒకరుంటే  వారికది రాజకీయంగా గొప్ప పెన్నిధి అవుతుంది.  అయితే రాష్ట్రపతి పదవీ బాధ్యతలతో కలాం ఎదిగిన తీరు వారిని సైతం ఆశ్చర్యచకితులను చేసి ఉండాలి. పాకిస్తాన్‌తో సైనికపరమైన ప్రతిష్టంభన (ఆపరేషన్ పరాక్రమ్ 2001-2002) నెలకొన్న ఏడాది కాలంలో ఏ చిన్న ఘటనైనా యుద్ధానికి ప్రేరణ అయ్యే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఆయన రాష్ట్రపతిగా ఉండటం మనకు నిబ్బరాన్నిచ్చింది. గుజరాత్ అల్లర్ల తదుపరి దేశానికి స్వస్థతను చేకూర్చగల స్పర్శ సరిగ్గా ఆయన రాష్ట్రపతి కావడమే అయింది. ఎంతో సావధానంగానూ,  పరిణతితోనూ, ఏ మాత్రం పక్షపాతం ధ్వనించ కుండానూ ఆయన తన ప్రభావాన్ని చూపారు. అయినా తన ఆలోచన ఏమిటో స్పష్టంగా విశదమయ్యేట్టు చేశారు. ఆనాటి పరిస్థితుల్లో ఆయనదే అత్యంత సమర్థ మధ్యవర్తిత్వమైంది. పైగా అది ఎంతో నైపుణ్య వంతమైనదిగా, వివేచనాయుతమైనదిగా, ఆకట్టుకునేదిగా ఉండేది. కాబట్టే హిందువులు సైతం చివరకు ఆయనను మరింత ఎక్కువగా గౌరవించ సాగారు.
 
 అణు ఒప్పందం ఆయన చలవే
 
 కలాం వారసత్వం కేవలం ఇంతే కాదు. అంతకంటే బలీయమైనది. ‘ఇండియా టుడే’ గ్రూపు కోసం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేశారు. మన్మోహన్ ఆ సందర్భంగా కలామ్ ప్రభావం ఎంతటి ప్రబలమైనదో నొక్కి చెప్పారు. ఆయనే జోక్యం చేసుకోకపోతే అమెరికాతో అణు ఒప్పందం కుదిరి ఉండేదే కాదని గుర్తు చేశారు. 2008 పార్ల మెంటు వర్షాకాల సమావేశాలు మొదలుకావడంతోనే ప్రకాశ్ కారత్ యూపీఏకు తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నామని, బీజేపీతో కలసి అణు ఒప్పందం అంశంపై ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రకటించారు. లోక్‌సభలో సంఖ్యాబలం మన్మోహన్‌కు వ్యతిరేకంగా ఉంది. అయినా ఆయన ప్రభుత్వం మనగలగడమే కాదు, అత్యంత ప్రమాదభరితమైన ఆ రాజకీయ పోరాటంలో ములాయంసింగ్ యాదవ్ ఫిరాయింపు సాయంతో మన్మోహన్ గెలుపొందారు కూడా. నిజానికి ములాయం, ప్రత్యేకించి బలమైన తమ ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని అమెరికాతో అణు ఒప్పందాన్ని గట్టిగా వ్యతిరేకించారు.
 
 అయితే, కాంగ్రెస్ ఆయనతో తెరచాటున ఇచ్చి పుచ్చుకునే బేరసారాలు సాగిస్తుండటంతో ఆయన మద్దతు సాధ్యమే అనిపిం చింది. కానీ ములాయంకు అందుకు ఏదో ఒక కుంటిసాకు కావాలి. కలాం ఆ ఒప్పందాన్ని దృఢంగా ఆమోదించడంతో ఆయనకు ఆ సాకు దొరికింది. ఆ క్షణం నుంచి ములాయం, అమర్‌సింగ్‌లు ఇద్దరూ ‘‘డాక్టర్ కలాం అది మంచిది అన్నారంటే, తప్పనిసరిగా అది మంచిదే అయి ఉండాలి’’ అని చిలుక పలుకలు వల్లిస్తూ వచ్చారు. ఆనాటి అవిశ్వాస తీర్మానంపై పార్ల మెంటులో జరిగిన చర్చను ఒక్కసారి మీరు తిరిగి చూస్తే... అసదుద్దీన్ ఒవైసీ తమ రాజకీయాలను తలకిందులు చేసి, ఎంత ఆవేశంగా అణు ఒప్పందాన్ని సమర్థించారో కనిపిస్తుంది. దేశభక్తుడైన కలామే ఆయనకు కూడా ముసుగ్గా నిలిచారు. ఈ విషయంలో ఆయన నెరపిన ప్రభావం ఇప్పటికీ తక్కువగా గుర్తుకు తెచ్చుకుంటున్న విషయం కావడం ఆశ్చర్యకరం. ఆయనపై రాసిన లెక్కలేనన్ని సంస్మరణలలో ఏదీ ఈ విషయాన్ని ప్రముఖంగా గుర్తించలేదు. కానీ, అణు రంగంలోని సైనిక, పౌర విభాగాలను వేరు చేసి, ఆ రెంటినీ రహస్య ఏకాంతవాసంలోంచి బయటకు తెచ్చే అణు ఒప్పందానికి కలాం మద్దతు తెలిపేంత వరకు... ‘‘సెక్యులర్’’ పార్టీలకు మాత్రమే కాదు, అణు శాస్త్ర వ్యవస్థలో సైతం దాని పట్ల తీవ్ర అనుమానాలుండేవి. కలాం తన మద్దతుతో వాటిని నివృత్తి చేశారు. ఒప్పందానికి ఆయన మద్దతు తెలపడానికి కారణం దేశ ప్రయోజనాలను ముందు నిలపడమే. సరిగ్గా అంతకు ఏడాది క్రితమే కాంగ్రెస్, రెండో దఫా రాష్ట్రపతి బాధ్యతలను చేపట్టే ఆవకాశాన్ని నిరాకరించి ఆయనను అవమానించింది. ఏకగ్రీవంగానైతే ఆ బాధ్యతలను స్వీకరించడానికి ఆయన సిద్ధపడ్డారు. కానీ కాంగ్రెస్ అందుకు తిరస్కరించింది. నిజానికి అది యూపీఏకు తగిన శాస్తి చేయడానికి, తనకు భారతరత్నను, రాష్ట్రపతి పదవిని ఇచ్చి ఆదరించిన బీజేపీ రుణం తీర్చుకోడానికి సరైన సమయం. కానీ ఆయన దేశాన్ని ముందు నిలిపారు. కలాం ఇంకా ఏమేంకారో వాటిలో మరి కొన్నిటిని కూడా చెప్పుకోవాల్సి ఉంది. ఆయన చిల్లమల్లర, అల్పబుద్ధిగల, స్వార్థపర, ప్రతీకారాత్మక, సూత్రరహిత, అహంకారి కారు. అందుకే వంద కోట్లకు పైబడిన ప్రజలు దశాబ్దాల తరబడి ఆయనను తమ అత్యంత ప్రియతమ నేతగా గుర్తుంచుకుంటారు.
 
 తాజాకలం: కలాం గురించి నాకు అత్యంత ఇష్టమైన కథ ఆయనతో నా అనుబంధపు తొలినాళ్లది. 1994లో ‘‘ఇస్రో గూఢచార కుంభకోణం’’తో దేశం దద్దరిల్లిపోయింది. ఇస్రోకు చెందిన ఇద్దరు సైంటిస్టులు పాకిస్తానీ గూఢచార సంస్థకు చెందిన ఇద్దరు మగువల వలపు గాలానికి (హనీ ట్రాప్) చిక్కి, పట్టు బడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. విస్తృతస్థాయిలో వాటిని నమ్మారు కూడా. మాల్దీవులకు చెందిన ఆ మహిళలకు వారు వ్యూహాత్మక రాకెట్ రహస్యాలను అందజేశారని ఆరోపించారు. ఆ కథనంపై నేను ‘ఇండియా టుడే’ కోసం పరిశోధన చేపట్టాను. మొత్తంగా ఆ కథనమంతా హాస్యాస్పదమైనది, కాల్ప నికమైనది అని అర్థమైంది. ‘ఇండియా టుడే’ ప్రచురించిన కథనం కేరళ పోలీ సులు, ఇంటెలిజెన్స్ బ్యూరోల వాదనలను తునాతునకలు చేసింది. ఆ శాస్త్ర వేత్తల్దిద్దరూ నిర్దోషులనే పూర్తి సమర్థనతో, సగౌరవంగా ఆ ఆరోపణల నుంచి విముక్తులయ్యారు. వారిపై కేసులను ఉపసంహరించుకున్నారు. ఇలా ‘హనీ ట్రాప్’ తప్పుడు కేసులో ఇరుక్కున్న శాస్త్రవేత్తలకు నగదు రూప నష్ట పరిహా రాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా. అంతకుముందు... అప్పటికే కట్టుదిట్టంగా అల్లి, బహుళ ప్రాచుర్యం పొందిన ఆ కథనానికి వ్యతి రేకంగా మాట్లాడటమంటేనే ఎంతో ఒత్తిడికి గురికావాల్సి వచ్చేది. నాటి ఇంట ర్నెట్ పూర్వ కాలంలో సైతం అలా మాట్లాడినందుకు మేం ఎన్నో అవమా నాలకు గురి కావాల్సి వచ్చింది.
 
 ఆ తర్వాత ఒక జనవరి 15, సైనిక దినోత్సవం రోజున, కలాం నన్ను మాట్లాడటానికి పిలిచారు. మెల్లగా నా ఛాతీని ఎడమవైపున తట్టి, నువ్వు చేసి నది గాయపడ్డ మా హృదయాలకు నవనీతం పూయడంలాంటిదని అన్నారు. దేని గురించి అంటున్నారని అడిగాను. మా ఇస్రో కథనం గురించని, ఆ సైం టిస్టులు అద్భుతమైన వ్యక్తులని, పూర్తి అమాయకులని తెలిపారు. ఆ తప్పు డు కేసు నా ఇస్రోను (అసలు ఆయన అక్కడే పనిచేశారు) నాశనం చేసి ఉం డేదే అన్నారు. ఆ కథనాన్ని మీరు ‘ఇండియా టుడే’ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
twitter@shekargupta

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు