పొరుగింట చిచ్చే సొంతింటికి రక్షా?

16 May, 2015 00:20 IST|Sakshi
పొరుగింట చిచ్చే సొంతింటికి రక్షా?

(విశ్లేషణ)

అమెరికా ప్రజలు పాలు, మాంసం తదితర ఆహార పదార్థాల్లో జీఎమ్ సంబంధిత అంశాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఆర్గానిక్ ఆహారం వైపు మొగ్గుతున్నారు. ఆర్గానిక్ ఆహారోత్పత్తికి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా నేతృత్వం వహిస్తున్నారు. శ్వేత సౌధంలో ఆమె ఆర్గానిక్ ఆహారాన్ని పండిస్తున్నారు. అతిథులకు ఆర్గానిక్ ఆహారమే వడ్డిస్తున్నారు. పరిశోధనా క్షేత్రాల్లో జీఎమ్ పంటల పరిశోధన సులభమే. అయినా క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతిని కోరడం విత్తనాల ఉత్పత్తి ప్రయోజనాల కోసమనేది బహిరంగ రహస్యం.
 ఇక్కడ మన దేశంలో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జన్యు మార్పిడి (జీఎమ్) పంటల క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతులను సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... అమె రికా వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ఒత్తిడిని తట్టుకోవడం కోసం మరింత ఎక్కువగా ఆర్గానిక్ ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుండటం విశేషం.

 అమెరికా మెచ్చేది ఆర్గానిక్ ఆహారమే
 అమెరికా ఆర్గానిక్ ట్రేడ్ అసోసియేషన్, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సి టీలు కలసి ప్రోది చేసిన గణాంక సమాచారం ప్రకారం అమెరికన్ల ఆర్గానిక్ (సేంద్రియ) ఆహార దిగుమతుల బిల్లు పెరిగిపోవడానికి ప్రధాన కారణం మొక్కజొన్న, సోయాబీన్‌లే. ఆ రెండు పంటలే అమెరికాలోని ప్రధాన జన్యు మార్పిడి పంటలు! మొక్కజొన్న, సోయాబీన్‌లను అక్కడ ఎక్కువగా ఉప యోగించేది పశువుల దాణాగానే. అయినా అక్కడి ప్రజలు రోజురోజుకీ ఎక్కు వగా పాలు, మాంసం తదితర ఆహారపదార్థాల్లో జీఎమ్ సంబంధిత అంశా లు లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు.
 2014లో భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకున్న సోయాబీన్ దిగుమతులు రెట్టింపునకు పెరిగి, 7.38 కోట్ల డాలర్లకు చేరాయి. కాగా, రుమే నియా నుంచి ఆర్గానిక్ మొక్కజొన్న దిగుమతులు 2013లో కేవలం 5,45,000 డాలర్లు కాగా, ఒక్క ఏడాది వ్యవధిలోనే, 2014 నాటికి 1.16 కోట్ల డాలర్లకు గంతు వేశాయి. రుమేనియా, టర్కీ, నెదర్లాండ్స్, కెనడా, అర్జెంటీనా, భార త్‌ల నుంచే అమెరికా ప్రధానంగా ఆర్గానిక్ మొక్కజొన్న, సోయాబీన్‌లను దిగుమతి చేసుకుంటోంది.

 ఇక్కడ జీఎమ్... అక్కడ ఆర్గానిక్   
 భారత్‌లో నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు- ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్-  జన్యుమార్పిడి పంటల క్షేత్ర స్థాయి పరీక్షలను అనుమతించాయి. మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే బాట పట్టాలని ఓత్తిడి పెరుగుతోంది. జన్యు మార్పిడి పంటల క్షేత్రస్థాయి పరీక్షల అనుమతులకు ఆటంకాలు తొలగేలా వాటి నియంత్రణ క్రమాన్ని వేగంవంతం చేయాలని ‘అసోసియేషన్ ఆఫ్ బయోటెక్ లెడ్ ఎంటర్‌ప్రైజెస్’ నేతృత్వంలో బయోటెక్ పరిశ్రమ ప్రధాని నరేంద్రమోదీకి రాసినట్టుగా కూడా తెలుస్తోంది.
 అమెరికాలో కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి పదార్థాలు లే నే లేని ఆహార పదార్థాల అమ్మకాలు 2014లో 3,590 కోట్ల డాలర్లకు చేరినట్టు ‘బ్లూమ్‌బర్గ్’ సంస్థ అంచనా. అంటే ఏడాదికి 11 శాతం వృద్ధి. ఇది అమెరికా ప్రజలు ఆర్గానిక్ పద్ధతుల్లో ఉత్పత్తయిన ఆహారాన్ని రోజు రోజుకూ ఎక్కువగా ఎంచుకుంటున్నారని సూచిస్తోంది. ఆర్గానిక్ ఆహార ఉత్పత్తికి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా నేతృత్వం వహిస్తుండటం విశేషం. ఆమె శ్వేతసౌధంలోని సువిశాలమైన కాయగూరల తోటలో ఆర్గానిక్ ఆహా రాన్ని మాత్రమే పండిస్తున్నారు. అధ్యక్ష భవనానికి వచ్చే అతిథులకు వడ్డిం చేది కూడా పూర్తిగా ఆర్గానిక్ ఆహారమే. అమెరికా వినియోగదార్లలో సురక్షిత మైన, ఆరోగక్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం వేగంగా పెరుగుతోంది.

 క్యాన్సర్ కారక సూపర్ కలుపు  
 చాలా వరకు జీఎమ్ పంటలకు ‘గ్లైసోఫైట్’ వంటి రసాయనిక కలుపు నాశన కారులను రెట్టింపు మోతాదులో వాడాల్సి వస్తోంది. కాబట్టి వాటి వినియోగం 2012 నాటికే 28.35 కోట్ల పౌండ్లకు పెరిగిపోయింది. అంతేకాదు అది ఏ కలుపు నాశనులకు లొంగని సూపర్ కలుపు మొక్కల ఆవిర్భావానికి, అవి 6 కోట్ల ఎకరాల పంట భూమిలో వ్యాపించిపోవడానికి దారితీసింది. ఇలా పర్యావరణపరమైన దుష్ఫలితాలను విపరీతంగా పెంచే ఈ జీఎమ్ పంట లను ప్రోత్సహించాల్సిన అవసరమేమిటని పలువురు ప్రశ్నలు సంధిస్తు న్నారు. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ గ్లైసోఫైట్‌ను ‘కార్నికోజెన్’ (క్యాన్సర్ వ్యాధికారిణి) కావడానికి అవకాశం ఉన్నదిగా వర్గీకరించింది కూడా. ఆ కార ణంగా సైతం అమెరికాలో కిరాణా అమ్మకాలు క్రమంగా రసాయనాలు, జన్యుమార్పిడి పదార్థాలు లేని సురక్షిత ఆహారం వైపునకు మొగ్గుతున్నాయి. ఇది మారుతున్న ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.

 మన ‘సోయామీల్’కు తప్పిన గండం
 అమెరికాకు భారత్ నుంచి సోయామీల్ ఎగుమతులలో పెరుగుదల కనిపి స్తుండగా, ఇరాన్, జపాన్లకు పశువుల దాణాగా దాని ఎగుమతుల్లో తగ్గుదల కనిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఆ రెండు దేశాలే మన సోయామీల్‌కు ప్రధాన మార్కెట్లుగా ఉండేవి. నేడు చైనా, బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి చౌకగా లభించే సోయామీల్‌ను అవి దాణాగా దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రధానంగా ‘సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌ఓ పీఏ) ప్రతిఘటన వల్లనే ఒకప్పటి వ్యవసాయ మంత్రి అజిత్ సింగ్ హయాంలో జీఎమ్ సోయాబీన్ క్షేత్రస్థాయి పరిశోధన, పరీక్షలను వ్యతిరేకిం చారు. జీఎమ్ పంటల ప్రవేశంతో భారత సోయామీల్ ఉత్పత్తుల పట్ల దిగుమతిదార్ల విముఖత పెరగుతుందని అప్పట్లో సోయా పరిశ్రమ వాదించి, ఒప్పంచగలిగింది.

 జీఎమ్ వరి.. బియ్యం ఎగుమతులకు ఉరి  
 బాస్మతి బియ్యం లాంటి వస్తువుల విషయంలో కూడా అదే వాస్తవం. అయినా ఇప్పటికే బాస్మతి సహా పలు వరి రకాల జన్యుమార్పిడి పంటలకు రంగం సిద్ధమైంది. సుసంపన్నమైన జీవవైవిధ్యం ఉన్న ఒడిశా వంటి కీలక ప్రాంతాలను మినహాయించే అయినా... వరి జీఎమ్ రకాలను ఒక్కసారి అనుమతించారంటే, దాని వ్యాప్తిని అరికట్టజాలం. ఒక్క జన్యువు బయట పడిందీ అంటే ఇక అది బయటే. కొన్ని దేశాలు వరి, మొక్కజొన్న పదార్థాలు గల మన ఆహార ఎగుమతులను కొన్నింటిని వాటిలో జన్యుమార్పిడి పదార్థాలు ఉన్నాయనే కారణంతో తిప్పి పంపాయి. ఆ విషయాన్ని పరిగణన లోకి తీసుకుంటే జీఎమ్ రకాల ప్రవేశంతో మన బియ్యం ఎగుమతులు కూడా పెను సవాలు ఎదుర్కోవాల్సివస్తుంది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే  అతి పెద్ద బియ్యం ఎగుమతిదారు. 

ఏ ఒక్క జీఎమ్ పంట వల్లా ఉత్పాదకత పెరిగిన దాఖలాలు కనబడని ప్రస్తుత సమయంలో జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షలకు తలుపులు తెరవడం విషయంలో అత్యంత జాగరూకత వహించడం అవసరం. మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దెబ్బతినిపోవడాన్ని మనం ఎంత మాత్రం అనుమతించలేం. పరిశోధనా క్షేత్రాలలో పూర్తి రక్షణ మధ్య పరి శోధన సులభ సాధ్యమే. అయినా క్షేత్ర స్థాయి పరీక్షలకు (విస్తార ప్రాంతాల్లో) అనుమతిని కోరడం విత్తనాల ఉత్పత్తి ప్రయోజనాల కోసమేననేది బహిరంగ రహస్యం.
 

(వ్యాసకర్త రవీందర్ శర్మ... వ్యవసాయరంగ నిపుణులు)
 

మరిన్ని వార్తలు