‘ఉదారవాద’ శవపరీక్ష

7 Nov, 2015 01:30 IST|Sakshi
‘ఉదారవాద’ శవపరీక్ష

జాతిహితం
నెహ్రూవాద ఉదారవాద భారతమనే భావనను ఆయన వారసులు ధ్వంసం చేస్తున్నప్పుడు మన ఉదారవాద వామపక్షంలో చాలావరకు అందుకు సహకరించింది. అసహనం, సంకుచితత్వం ఎలాంటిదయినా వ్యతిరేకించి తీరాల్సిందే. అయితే, ప్రస్తుత నిరసనల్లో కొంత ఏడుపు కూడా వినవస్తోంది. అది ప్రభుత్వ ఆదరణను కోల్పోయామన్న ఆక్రోషం నుంచి పుట్టుకొస్తున్నది. నేటి కొత్త తరం వామపక్ష- ఉదారవాదమనే పాత ఫక్కీ భావనను అంగీకరించదు. కాబట్టి  హిందూ ఉదారవాదాన్ని ఎదుర్కోవడానికి  కొత్త ప్రధాన స్రవంతి ఉదారవాదం అవసరం.
 
ఈ ప్రశ్నను మీరు చాలా రకాలుగా అడగొచ్చు. భారత ఉదారవాదులది ఏపాటి ఉదారవాదం? వారు ఎంతగా వామపక్షం? లేదా భారత వామపక్ష వాదులు ఎంతగా ఉదారవాదులు? ఇంకా చెప్పాలంటే, భారత ఉదారవాద భావన ముప్పును ఎదుర్కొంటోందా? అదే నిజమైతే, దేశం దాన్నెలా ఎదు ర్కోవాలి? అసలు దాన్ని ఎందుకు ఎదుర్కోవాలి? అసలు మనమంతా ఆందోళన చెందుతున్నది నెహ్రూవాద ఉదారవాద భావన గురించేనా? అందుకే అయితే దాని పరిరక్షణకు సమయం మించిపోయి దశాబ్దాలు గడచి పోయాయి.

భూస్థాపితమైన నెహ్రూ ఉదారవాదం
సోవియట్ యూనియన్‌కు జూనియర్ భాగస్వామిగా ఉండటానికి అంగీక రిస్తూ ఆ దేశంతో వ్యూహాత్మక ఒప్పందంపై నెహ్రూ కుమార్తె సంతకం చేస్తున్న ప్పుడే ఆ పని చేయాల్సింది. 1969లో, మితవాది అని అస్పష్టంగా అని పించిన వారిని సైతం కాంగ్రెస్ నుంచి గెంటిపారేసి, కంటికి కనిపించిన ప్రతి దాన్నీ ఆమె జాతీయీకరణ చేసేస్తున్ననాడే దాన్ని పరిరక్షించాల్సి ఉండింది. ఇక ఆమె విధించిన అత్యవసర పరిస్థితి ఇంకా ఏమైనా మిగిలి ఉన్న అసలైన నెహ్రూవాద భారతదేశమనే భావన అవశేషాలను సైతం తుడిచి పెట్టేసింది. 1969-1989 మధ్య రెండు దశాబ్దాల కాలంలోనే మనం మన అలీన విధా నాన్ని, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఇంకా మిగిలి ఉన్న కొద్దిపాటి ఆర్థిక స్వాతం త్య్రాలను కోల్పోయాం, అత్యవసర పరిస్థితిని భరించాం. తిరుగుబాటు ఉద్య మాలు పెచ్చరిల్లడం, ఆర్టికల్ 356ను ప్రయోగించి అలవోకగా ప్రజలు ఎన్ను కున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేయడం, పుస్తకాలు, సినిమాలపై నిషేధం విధించడం, షాబానో కేసు తీర్పును తిరగరాయడం, అయోధ్య తాళాలు తెరవడం, రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన (శిలాన్యాస్) జరగడం, రామరాజ్యాన్ని తెస్తామనే వాగ్దానంతో రాజీవ్ గాంధీ అయోధ్య (ఫైజాబాద్) నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం చూశాం.

ఉదారవాద సమాజం ఈ రెండు దశాబ్దాల్లో ఎన్నడూ బారికేడ్ల వద్ద కానరాకపోవడం కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనలను, న్యాయ వ్యవస్థను ‘‘సామాజికంగా శక్తివంతమైనది, సమంజసమైనది’’గా చేయడం కోసం అందులో జోక్యం చేసుకోవడాన్ని, స్వేచ్ఛా వాణిజ్యాన్ని నాశ నం చేయడాన్ని, క్యాంపస్‌లపై భావజాల దురాక్రమణలను వాస్తవానికి వారు ప్రశంసించారు. దర్బారీ సృజనాత్మక వర్గాలు, కవులు, సంగీత కళాకారులు, బాలీవుడ్‌లలో ఏ ఒక్కరూ నోరెత్తింది లేదు. జయప్రకాష్ నారాయణ్ సోష లిస్టు అనుచరులు, లౌకికవాదేతర మితవాదులైన జనసంఘ్, దాని అను బంధ సంస్థలు, శిరోమణీ అకాలీదళ్‌లే అత్యవసర పరిస్థితికి వ్యతిరేక పోరా టం సాగించారు. నాడు నిరసన తెలిపిన ఏకైక సినిమా స్టార్ దేవానంద్ మాత్రమే.

కుహనా ఉదారవాదుల శోకాలు
నెహ్రూవాద ఉదారవాద భారతమనే భావనను ఆయన వారసులు ధ్వంసం చేస్తుండిన ఈ రెండు దశాబ్దాల కాలంలో మన ఉదారవాద వామపక్షంలో చాలావరకు అందుకు సహకరించిందనేదే దీని సంక్షిప్త సారాంశం. దర్బారు వారికి ప్రవేశించాల్సిన సొగసైన స్థలమైంది. అధికారానికి దగ్గరగా ఉండటం వల్ల వారికి క్యాంపస్‌లపైన, బోధనాంశాలపైన ఆధిపత్యం చలాయించగల, ప్రత్యామ్నాయ దృక్కోణాలకు చెందిన ఆలోచనల పీక నులిమేయగల శక్తి లభించింది. భారత మితవాదపక్షం నుంచి వచ్చిన నిజమైన, ఆరోగ్యవం తమైన, వివేకవంతమైన భావనలను సైతం అభివృద్ధి చెందనీయలేదు. దాని ఫలితంగానే నేడు బుద్ధితక్కువ మితవాదం తలెత్తింది. గోపూజ, దానికి తోడు గోబర్ గ్యాస్ కలిసి వారి ఆలోచనలను, పక్షపాత వైఖరులను పవిత్రమైనవిగా మార్చాయి.  వారి చారిత్రక జ్ఞానం జానపద గాథలకు, విజ్ఞానశాస్త్రం ‘‘వేద’’ కాల్పనికతలకు పరిమితమైనది. భారత ప్రజలు ఇప్పుడు ఆ శక్తులనే అధికారంలోకి తెచ్చారు.

అసహనం, సంకుచితత్వం ఎలాంటిదయినా వ్యతిరేకించి తీరాల్సిందే. అయితే, ప్రస్తుతం సాగుతున్న నిరసనల్లో కొంత ఏడుపు కూడా వినవస్తోంది. అది ప్రభుత్వ ఆదరణను  కోల్పోయినామన్న ఆక్రోషం నుంచి పుట్టుకొస్తు న్నది. ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ ఆర్‌ఎస్‌ఎస్‌కు, ఐఎస్‌కు మధ్య పోలికలను చూడటమే అందుకు మంచి ఉదాహరణ. ఆర్‌ఎస్‌ఎస్ చింతనలో చాలానే తప్పుంది, దాన్ని తిరస్కరించాల్సిందే. అయితే చర్చించాల్సినది కూడా అందులో చాలా ఉంది. కానీ దాన్ని హిందూ ఐఎస్‌గా పిలవడం అసలుకే ఎసరు తెస్తుంది. హిందూ మితవాదులు, తమ విమర్శకులను పాకిస్తాన్‌కు పొమ్మ నడం లేదా యోగి ఆదిత్యనాథ్, షారుఖ్ ఖాన్‌ను హఫీజ్ సయీద్‌తో పోల్చడం లాగే అది కూడా అంతే దూషణ, అసహనం. అదీ ఓటమివాదమే, ప్రజాస్వామ్యాన్ని అవ మానించడమే. ఆర్‌ఎస్‌ఎస్ మన ఐఎస్ అయినట్టయితే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? నాగపూర్ మీద, జందేవాలన్(ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం) మీద బాంబులు వేయమని అమెరికావాళ్లనో, ఫ్రెంచివాళ్లనో, ఇరాన్‌వాళ్లనో పిలుస్తారా?

దర్బారు ఉదారవాదం
వామపక్ష మేధో కపటత్వానికి సంబంధించి ఇది అత్యంత పెడధోరణే. కానీ అలా అని ఇది ఏదో ఒక్క ఉదంతం మాత్రమే కాదు. అలాంటిదే మరొకటి వినాయక్ సేన్ వ్యవహారం. మావోయిస్టులకు సహాయం చేస్తున్నారంటూ ఆయనను రాజద్రోహ నేరం కింద విచారించారు. ఆ చట్టం బ్రిటిష్ వాళ్లు చేసినది కాబట్టి  తక్షణమే ఉదారవాదులు దాన్ని ఒక జనాకర్షక ఉద్యమంగా మార్చేశారు. సేన్‌ను ఉదారవాద హీరోగా ఆకాశానికెత్తారు. బెయిల్‌పై బయ టకు వ చ్చిన ఆయనను ప్రణాళికా సంఘానికి చెందిన ఒక కమిటీ సభ్యునిగా కూడా నియమించారు. మావోయిస్టులకు సహాయపడే వారు ఎవరైనా గానీ, నేను వారిపట్ల సానుభూతిచూపను. కానీ ఆ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం చాలానే ఉంది. గుజరాత్ నుంచి తమిళనాడు వరకు, పాటిదార్ నేత హార్దిక్ పటేల్ నుంచి జానపద గాయకుడు ఎస్ కోవన్ వరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఇటీవలి కాలంలో అదే చట్టాన్ని ప్రయోగించాయి. ఇదే ఉదార వాద నాయకులు ఆ ఘటనల పట్ల తెలిపిన నిరసన దాదాపు శూన్యం.  సేన్ వామపక్ష సానుభూతిపరుడు, కార్యకర్త.  పటేల్, కోవన్‌లు వారి సహప్రయా ణికులు కారు.

సంస్కరణలపట్ల గుడ్డి వ్యతిరేకత
యూపీఏ పాలనలో ప్రభుత్వాన్ని నియంత్రించినది ప్రధానికాదు, 10 జన్‌పథ్ (సోనియా నివాసం) దర్బారు వాసులు. అందువల్ల ఆ కాలమంతటా ఈ కార్యకర్తలు మరింత ఎక్కువ అధికారాన్ని అనుభవించారు. యూపీఏ చేపట్టిన ప్రతి సంస్కరణవాద చర్యను... విమానాశ్రయాల ప్రైవేటీకరణ నుంచి ఎఫ్‌డీఐ పరిమితుల పెంపుదల, డబ్ల్యూటీఓ, పేటెంట్లు, ఉన్నత విద్యాసం స్కరణ, చివరికి ఆధార్‌ను సైతం వారు వ్యతిరేకించారు. సోనియా గాంధీ/ ఎన్‌ఏసీ జనాకర్షక పథకాలనన్నిటినీ వారు ప్రశంసించారు. ప్రస్తుత నిరసనల్లో ముందు వరుసన ఉన్న ప్రముఖులలో చాలా మంది ఆ కోవకు చెందినవారే. ఒక్కరి గురించి మాత్రమే చెబుతాను. రిటైర్డ్ నౌకాదళం అధిపతిగా పదవీ విరమణ చేసిన అడ్మిరల్ రామ్‌దాస్ మనిషిగానూ, సేనాయోధునిగానూ కూడా అద్భుతమైన వ్యక్తి.

యూపీఏ ప్రభుత్వాన్ని అడ్డగించడానికి లేదా అస్థిరీకరించడానికి చేపట్టిన ప్రతి చర్యలోనూ ఆయన పాల్గొన్నారు. భారీ మౌలికసదుపాయాల ప్రాజెక్టులను, ఉన్నతస్థాయి నియామకాలను సైతం వ్యతిరేకించారు. ఆయన ఇప్పుడు స్వేచ్ఛను కోల్పోయామంటూ నిరసన తెలియజేస్తున్నారు. నయా ఉదారవాదియైన మన్మోహన్‌సింగ్ పట్ల వారి అయిష్టం ఎంతటి ప్రబలమైనదంటే... మన వామపక్ష మేధావివర్గం ఆయన ప్రభుత్వాన్ని కూలదోయడానికి  తీవ్ర మితవాదపక్షంతో చేతులు కలిపింది. 9 శాతం వృద్ధిని నమోదు చేసిన ఆయన పాలనా కాలాన్ని ‘‘91 శాతం వినాశం’’గా దూషిస్తూ హేళన చేసింది. యూపీఏను కూలదోయడానికి ప్రవేశ పెట్టిన విశ్వాసరాహిత్య తీర్మానానికి అనుకూలంగా రాజకీయ వామపక్షం, బీజేపీతో కలిసి ఓటు వేయడానికి, ఇది సరిగ్గా సరిపోయింది. పనిచేయనివ్వని ప్రభుత్వంతో నెట్టుకురావడం కంటే నిర్ణయాత్మక ప్రభుత్వమైతే చాలనుకు నేటంతగా ఓటర్లు విసిగిపోయారు.

సరికొత్త ఉదారవాదాన్ని నిర్మించాలి
 వామపక్షవాద మేధావివర్గం ఆధునిక భారత చింతనపై ఆధిపత్యం వహిం చింది. దీనికి తోడు గాంధీ వంశం దానికి గట్టిగా అంటిపెట్టుకోవడం... ‘‘లౌకికత’’ అనే పదం ముస్లింకు పర్యాయపదంగా మారేటంతటి సోమరి, నిశ్చల రాజకీయాలకు దారితీసింది. పావు దశాబ్దకాలపు సంస్కరణ  భావజా లానంతర, వ్యాపార దక్షతగల కొత్త తరం భారతీయులను సృష్టించింది. తమ ఊహాశక్తులను ప్రజ్వరిల్లజేయగల నూతన భావాలు, నేతలు వారికి అవసరం. అలాంటి నేత రాహుల్ గాంధీ కాదు, నరేంద్ర మోదీ అని వారు నిర్ణయిస్తే... అందుకు మీరు వారిని తప్పు పట్టలేరు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఐఎస్ లాంటిదే వంటి ప్రేలాపనలు వారిని మెప్పించలేవు.

దరిద్రగొట్టువాదం అన్నా కూడా వారు విసిగిపోయారు. రాజకీయంగా, వామపక్షం ఇప్పుడు దేశవ్యాప్తంగా క్షీణించిపోతున్న శక్తి, బిహార్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కుల  రాజకీయాలు కూడా అలా క్షీణించిపోతున్న బాపతే.  

ఈ కొత్త తరం, అతిజాతీయవాద ధోర ణిగలదే గానీ, కచ్చితంగా సంకుచి తమైనది కాదు. ఆదిత్యనాథ్ ప్రలాపాల్లాగే ఇర్ఫన్ హబీబ్ ప్రలాపాలను కూడా వారు నవ్వుకోవాల్సినవిగా తీసిపారేస్తారు. వారికి ఉద్యోగాలను కల్పిం చడంలో, వృద్ధిని సాధించడంలో నే టి ప్రభుత్వం విఫలమైతే... ఓట్లను కూడగ ట్టుకోవడం కోసం బీజేపీ చేపడుతున్న నిలువునా ప్రజలను చీల్చే వైఖరి కూడా ఆమోదయోగ్యమైనది కాదని గుర్తిస్తారు. అంతేగానీ, వారు హైఫన్ సహిత ఉదారవాదమనే (వామపక్ష-ఉదారవాదం) పాత ఫక్కీ భావనను మాత్రం అంగీకరించరు. కాబట్టి  హిందూ ఉదారవాదానిదే పైచేయి అవు తుంది. దాన్ని ఎదుర్కోవడానికి మీరు కొత్త ప్రధాన స్రవంతి ఉదారవాదాన్ని నిర్మించాల్సి ఉంటుంది. భావజాల ప్రలాపాలను పేలవమైన జోకులుగా తీసిపారేస్తారు.

శేఖర్ గుప్తా (twitter@shekargupta)

మరిన్ని వార్తలు