అక్షరమైన విభజన చరిత్ర

24 Sep, 2016 01:41 IST|Sakshi
అక్షరమైన విభజన చరిత్ర

పరిచయం
సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి రెండేళ్లు దాటిపోయింది. విభజనకు పూర్వం,  తరువాత హైదరాబా దులో స్థిరపడిన సీమాంధ్రుల మనస్సుల్లో వున్న కొన్ని భయ సందేహాలు సద్దుమణిగాయి. ఏవో రాజకీయపరమైన చిటపటలు మినహాయిస్తే మొత్తం మీద అటూ, ఇటూ జనాలు సర్దుకుపోయారనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో విభజన కథ పేరుతో అలనాటి విషయాలను తవ్వి తీస్తూ ఒక పుస్తకం రాయడం ఎందుకనే  ప్రశ్న తలెత్తడం సహజం. గ్రంథ రచయిత ఉండవల్లి అరుణ్ కుమార్. వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి వివాహానికి హైదరాబాదు నుంచి కొందరు పాత్రికేయులం రైల్లో పులివెందుల వెడుతున్నప్పుడు ఆయనతో నాకు తొలి పరిచయం.
 
కాంగ్రెస్ అగ్రనాయకుల ఇంగ్లిష్,  హిందీ ప్రసంగాలకు తెలుగు అనువాదం చేసే అవకాశాన్ని వైఎస్‌ఆర్  కల్పించినది మొదలుగా ఇక ఆయనకు అడ్డులేకుండా పోయింది. అంగబలం,  అర్ధబలం,  సామాజిక బలం లేని ఉండవల్లి రెండుసార్లు ఎంపీ కాగలిగారు. ‘మాట మార్చను,  మడమ తిప్పను’ అంటుండే  వైఎస్సార్ ఆప్తవర్గంలోని మనిషి కావడం వల్లనేమో ఆయనకూ తాను మాట మార్చను అనే ఓ నమ్మకం. విభజన బిల్లు పాసవ్వదు అనేది ఆయన నమ్మకం. బిల్లు ఆమోదం పొందినా కూడా ఆయనది అదే మాట, కాకపొతే అది ‘బిల్లు పాసవ్వలేదు’ గా మారింది.  బిల్లు పాసు కాకుండానే తెలంగాణ ఏర్పడిందా! అదెలా సాధ్యం? అది  చెప్పడానికే ఈ రచన.
 
‘‘బిల్లు పాసవలేదు అని చెప్పడం అంటే తెలం గాణను వ్యతిరేకించడం కాదు. ఆనాడు చట్ట సభలో చోటుచేసుకున్న పొరబాట్లను ఎత్తి చూపి అటువంటివి పునరావృతం కాకుండా వుండేందుకు మాత్రమే ఈ గ్రంథరచన అని అంటారాయన. డైరీలో రాసుకున్న విశే షాల ఆధారంగా ఆయన ఈ  పుస్తకం రాశారు. కొన్ని తేదీల వారీగా వున్నాయి. మరి కొన్ని తనకు సంబంధం లేని, అంటే తాను ప్రత్యక్షంగా లేని, చూడని సన్నివేశా  లను, సంభాషణలను ఆయా వ్యక్తుల స్వభావాలను అర్థం చేసుకున్న వ్యక్తిగా, వారు కొన్ని సందర్భాలలో ఎలా, యేమని మాట్లాడుకుని వుంటారో ఊహించి రాశారు. అదీ జీవించి వున్న వ్యక్తుల విషయంలో ఇటువంటి ప్రయోగం చేయడం నిజంగా సాహసమే. ముఖ్యంగా విభజన  బిల్లు ఓటింగు విషయంలో స్పీకర్  చాంబర్లో జరిగిన సమావేశం. స్పీకర్, జైపాల్‌రెడ్డి నడుమ జరిగిన సంభాషణ ఉండవల్లి కల్పనాశక్తికి చక్కని ఉదాహరణ. ఒక్క ముక్కలో చెప్పాలంటే చక్కని స్క్రీన్ ప్లే. అది చదివితే, ఒక స్థాయికి చేరిన తరువాత రాజకీయాలు ఏ తీరుగా సాగుతాయో అనే అనుమానం కలుగుతుంది.
 
సభలో ఏం జరగాల్సింది జైపాల్ రెడ్డి ఎటువంటి శషభిషలు లేకుండా సూటిగా స్పీకర్‌తోనే చెప్పేసినట్టు ఉండవల్లి రాశారు. సభ మొదలు కాగానే టీవీ ప్రసారాలు నిలిచిపోతాయనీ, వాటిని బాగుచేసేలోగా బిల్లు పాసయిపోతుందనీ ఆయన చెప్పారు. పాలక పక్షం, ప్రతిపక్షం కలిస్తే బిల్లు ఆమోదం పొందడం చిటికెలో పని అని నచ్చచెప్పారు. జైపాల్ రెడ్డి స్పీకర్ చాంబర్ నుంచి బయటకు వచ్చిన తరువాత  టీ. కాంగ్రెస్ ఎంపీలతో కూడా ఇదే తీరులో మాట్లాడారు. స్పీకర్  చాంబర్లో జరిగింది మరిచి పొండి. ఆ మాటలు నేను అనలేదు,  మీరు వినలేదు. ఇప్పుడు అయితే అయినట్టు. లేకపోతే తెలంగాణ ఎప్ప టికీ రాదని వారితో అన్నారు.
 
ఏతావాతా ఉండవల్లి ఈ పుస్తకం ద్వారా చెప్ప దలచింది ఒక్కటే. రాష్ట్ర విభజన జరిగిన తీరు నియ మానుసారంగా లేదని. ఏదిఏమైనా, ఈ పుస్తకంలోని విషయాలతో ఏకీభవించినా లేకపోరుునా,  తెలుగు ప్రజల జీవితాలతో ముడిపడిన ఒక చారిత్రక సందర్భానికి సంబంధించిన అనేక అంశాలకు అక్షర రూపం కల్పించడం శ్లాఘనీయం.

 భండారు శ్రీనివాసరావు,
 వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు  98491 30595

 

మరిన్ని వార్తలు