కళ్లముందే కరిగిన కల

9 Jul, 2016 01:16 IST|Sakshi
కళ్లముందే కరిగిన కల

సందర్భం

 

పేదలకు నాణ్యమైన వైద్యం కోసం కలగన్న  మనిషి అర్ధంతరంగా అంతర్థాన మయ్యాడు. ఒక గొప్ప స్వప్నం కళ్లముందే ఆవిరైపోయింది. ప్రపంచానికే ఆద ర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పథకం కొందరి నిర్వాకాలకు నీరుగారిపోయింది.

 

కారు నడుపుతున్న సుశీల భర్త ఉన్నట్టుండి కారు పక్కకు తీసి స్టీరింగుపై వాలిపో యాడు. చీకటి ప్రదేశంలో దిక్కుతోచని స్థితి ఆమెది. ఏం చెయ్యాలి? పీతాంబరం స్థితి మంతుడు. మనుమడికి నీళ్ల విరోచనాలు మొదలైనాయి. ఊళ్లో ఫోన్లు ఉన్నా ఆసుపత్రే లేదు. ఆసుపత్రికి వెళ్లడానికి బస్సులు లేవు. ఏం చెయ్యాలి? ఏకాంబరం ఊళ్లో ఆసుపత్రి వుంది. డాక్టరు ఉండడు. రోగం రొష్టూ వస్తే మళ్లీ నాటువైద్యమే గతి. సోమయ్య ఊళ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. డాక్టరు ఊళ్లోనే ఉన్నా.. రక్తపరీక్షకు, ఎక్స్‌రేలకు పక్కన వున్న బస్తీకి వెళ్లాలి. తీరా వెడితే కరెంటు ఉండదు. అది ఉన్నా ఎక్స్‌రే తీసేవాడు ఉండడు. ఏం చెయ్యాలి?

 

ఇవన్నీ వైద్య సమస్యలే. కాని పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదని నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నమ్మకం. స్వయానా డాక్టరు కావడంతో పరిష్కారం దిశగా ఆలోచన చేశారు ప్రజా రోగ్యం విషయంలో ఆదర్శాలు కలిగిన మరికొంత మంది వైద్యులు జత కలిశారు. నిబద్ధతగల అధికారులు తోడయ్యారు. ఆ విధంగా అప్పటికే జనాదరణ పొందిన 108కి తోడుగా 104 రూపు దిద్దుకుంది.

 

అయితే వైఎస్‌ఆర్ కల అంతటితో ఆగలేదు. గుండెజబ్బుల వంటి పెద్ద సమస్యలు ఎదురయితే చిన్న వాళ్లు ఏమైపోవాలి? ఆ ఆలోచనలోంచే ఆరోగ్యశ్రీకి అంకురార్పణ జరిగింది. చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా కోసం నిత్యం అందుబాటులో ఉండే 104 ఉచిత కాల్ సెంటర్. నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనం, అత్యవసర వైద్యసాయం కోసం 108 అంబులెన్సు, ఇక పెద్ద రోగాల పాలబడి ఎవరు కాపాడుతారని ఎదురుచూసేవారి కోసం ఆరోగ్యశ్రీ.. ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో.

 

108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి కేవలం ఎనభై రూపాయలు మాత్రమే. అంటే వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్‌లో పది శాతం కన్నా తక్కువన్నమాట. ఆ రోజుల్లో జరిగిన సమావేశాల్లో సీఎం వైఎస్ అనేవారు.. కడుపుతో వున్న ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చి, పురుడు పోయించి, తిరిగి తల్ల్లీ బిడ్డను క్షేమంగా అత్తారింటికి పంపడం తల్లిదండ్రుల బాధ్యత. ఇక నుంచీ ప్రతి పేదింటి ఆడపిల్లకూ ప్రభుత్వమే పుట్టిల్ల్లు. వాళ్ల బాధ్యత ప్రభుత్వానిదే.

 

ఇంతేకాదు. 104కాల సెంటర్‌కు ఇంకా విస్తృత మైన లక్ష్యాలు నిర్దేశించారు. రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు, నర్సింగ్ హోమ్‌లు, ప్రైవేట్ క్లిని క్‌లు ఔషధ దుకాణాలు, బ్లడ్‌బ్యాంకులు ఇలా వైద్య రంగానికి సంబంధించిన సమస్త సమాచారం సేకరించి ఒక్కచోటే నిక్షిప్తం చేశారు. అర్ధరాత్రి, అపరాత్రి అన కుండా రాష్ర్టంలో ఏమూల నుంచి ఫోన్ చేసినా వారు ఉండే ప్రదేశానికి ఇవన్నీ ఎంత దూరంలో ఉన్నాయి, ఏ సమయాల్లో పనిచేస్తాయి అనే వివరాలు తెలియచేయడా నికి వీలుగా ఈ ఏర్పాటు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నాణ్యత కలిగిన ైవైద్య చికిత్సలను కలిగిన వారికే కాదు, పేదసాదలకు కూడా అందుబాటులోకి తేవాలనేది మొత్తం ఆరోగ్య శ్రీ లక్ష్యం.

 

ఆ దార్శనికుడు కన్న కల సాకారం అయ్యే కృషి మొదలయింది. అందులోని వైశిష్ట్యం ఎలాంటిదో ప్రజ లకు క్రమంగా అవగతమవుతోంది. దురదృష్టం. అప్పుడే విధి వక్రించింది. దొంగచాటుగా మృత్యుపాశం విసిరింది. పేదలకు ఉచిత వైద్యంపై కలగన్న  మనిషి అర్ధంతరంగా అంతర్థానమయ్యాడు. కంటున్న కల ఆయన కనురెప్పల్లోనే కరిగిపోయింది. ఒక గొప్ప స్వప్నం ఆవిష్కారానికి ముందే ఆవిరి అయిపోయింది. అంత చక్కటి పథకం అరకొరగా మిగిలి పోయింది. రాజకీయ విషక్రీడకు బలయిపోయింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దోచి పెట్టే పథకంగా ముద్రవేసి, అసం పూర్తిగా దాన్ని అటక ఎక్కించారు.

 కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పథకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్థాలకు బలయిపోయింది. ఇంకొందరి అహాలను చల్ల్లార్చడానికి మాడి మసైపోయింది. రాజ కీయ చదరంగంలో చిక్కుకుపోయి ఎత్తులు, పై ఎత్తు లకు చిత్తయిపోయింది. ఇప్పుడీ పథకం ఉందా అంటే ఉన్నట్టు, లేదా అంటే లేనట్టుగా ఉంది.

 ఆయన అదృష్టవంతుడు, దాటిపోయాడు. ఊళ్లకు దూరంగా, వైద్య సౌకర్యాలకు నోచుకోకుండా కొండలు, కోనల్లో నివసించే వారు దురదృష్టవంతులు. వారి బతు కుల్ని మార్చే గొప్ప పథకానికి వారు దూరం అయ్యారు.

 

- భండారు శ్రీనివాసరావు

(వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా...)

వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు  9849130595

మరిన్ని వార్తలు