ఆయన సంకల్పబలం అద్భుతం

25 Feb, 2015 01:04 IST|Sakshi
ఆయన సంకల్పబలం అద్భుతం

‘తెలంగాణ రాష్ట్రం ఆవి ర్భవించే వరకు మరణం నా దరిచేరదు’ అని సంక ల్పబలాన్ని చాటిన ధీశాలి భూపతి కృష్ణమూర్తి. ఆయన అన్నట్టే ప్రత్యేక రాష్ట్రంలోనే ఆయన తుది శ్వాస విడిచారు. ఇలాంటి అరుదైన చారిత్రక దృశ్యా లు కృష్ణమూర్తి జీవితంలో కొన్ని కనిపిస్తాయి. భార త స్వాతంత్య్రోద్యమాన్ని అహింసా పథంలో నడి పించిన గాంధీజీని ఆరాధిస్తూనే, హైదరాబాద్ సంస్థానంలో జరిగిన నిజాం వ్యతిరేక పోరాటంలో తన వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించిన పోరాట శీలి ఆయన. 1946లో టి. హయగ్రీవాచారితో కలసి ఓరుగల్లు కోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కృష్ణమూర్తిగారు, అదే సమయంలో రజాకార్ల దాష్టీ కాన్ని కూడా చవి చూశారు.
 
 మహాత్మాగాంధీతో, 1944లో ఆయన జన్మదినం అక్టోబర్ 2న వార్ధా ఆశ్ర మంలో గడిపే అరుదైన అవకాశం ఆయన పొం దారు. గాంధీజీ పిలుపునిచ్చిన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు.  2009లో ఇక్కడి పెద్దలు ఆయనకు ‘తెలంగాణ గాంధీ’ అని బిరుదునిచ్చి సత్కరించుకున్నారు. చివరికంటా గాంధేయవాది గానే జీవించిన కృష్ణమూర్తికి ఇది గొప్ప గౌరవం. తెలంగాణను చైతన్యవంతం చేసిన గ్రంథాలయో ద్యమంలో కూడా ఆయనది కీలకపాత్రే.
 
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. ప్రారంభం నుంచి (1956 నుంచి) అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటివరకు కూడా ప్రత్యేక తెలంగాణ ఆశయాన్ని సడలించుకోని  మహోన్నత వ్యక్తి భూపతి కృష్ణ మూర్తి. తెలంగాణను కోస్తాంధ్ర జిల్లాలతో కలపొ ద్దనీ, ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచాలనీ ఎవరు కలసి వచ్చినా రాకున్నా అవిశ్రాంతంగా పోరాటం చేశారా యన. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం అసం భవం, ఇక  రాదేమోనని ఎందరో నిరాశ పడుతున్న సమయంలో ఆయన ఏనాడూ ధైర్యాన్ని కోల్పో లేదు. నిరాశపడనూ లేదు. 1968లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసి తెలంగాణ వాదులలో మరోసారి ఆశను రేకెత్తించారు. వారిని ఏకం చేశారు.
 
‘నా జీవితకాలంలోనే తెలంగాణ రావాలి. నేను తెలంగాణను చూసిన తర్వాతనే చివరిశ్వాస విడుస్తా’ అని చెప్పేవారు. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు, ఆచార్య కొత్తపల్లి జయశంకర్, సామల సదాశివ వంటి మహానుభావులు తాము జీవించి ఉండగా తెలంగాణ రాష్ట్రం కల సాకారం కావాలని అనుకునేవారు. కానీ మన మధ్య ఉండగా వారి కల సాకారం కాలేదు. భూపతి కృష్ణమూర్తి  సంకల్పబలం ఎంతగొప్పదంటే తాను చెప్పిన మాటకు కట్టుబడి తెలంగాణ వచ్చిన తరువాతనే వెళ్లిపోయి మాట నిలబెట్టుకున్నారు. 

2014 సెప్టెంబర్ 9న కాళోజీ శతజయంతి ఉత్సవాలు జరిగినప్పుడు నేనే స్వయంగా ఆయనను స్టేజీ పైకి తీసుకురావడం మంచి జ్ఞాపకం. ఆ వేదికపై ఆయనను సన్మానించాం. ప్రతి ఏడాది కాళోజీ పేరిట అందజేసే అవార్డును 2015 సంవత్సరానికి గానూ భూపతి కృష్ణమూర్తి గారికే ఇవ్వాలను కున్నాం. దురదృష్టం కొద్ది ఇంతలోనే ఆయన మరణ వార్త వినవలసి వచ్చింది. ఆయన సంకల్పబలానికి నా జోహార్లు.
 (వ్యాసకర్త ప్రముఖ నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత)

మరిన్ని వార్తలు