త్రిశంకు నరకంలో బంగ్లా బీహారీలు

27 Mar, 2014 23:58 IST|Sakshi
త్రిశంకు నరకంలో బంగ్లా బీహారీలు

1947 నాటి దేశ విభజనతో లక్షలాది బీహార్ ముస్లింలు సర్వం వదిలి తూర్పు పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. 1971 బంగ్లా స్వాతంత్య్రం వారిని మరోసారి సర్వం కోల్పోయేట్టు చేసింది. ద్రోహులుగా ముద్ర వేయించుకొని వారు స్వదేశంలోనే శరణార్థులుగా బతుకుతున్నారు.
 
 శాపగ్రస్త జాతులకు ప్రపంచంలో కొదవ లేదు. అలాంటి వారందరిలోకీ విచిత్రమైన దైన్యం బంగ్లాదేశ్ బీహారీలది. వారు పౌరులు కాని పౌరులు, శరణార్థులు కాని శరణార్థులు. దేశం లేని ప్రజలు. అలాంటి బీహారీలంటే అందరికీ చిన్న చూపే, వివ క్షే. ఒకప్పుడు వృత్తి నిపుణులుగా, వ్యాపారులుగా, ప్రభుత్వోద్యోగులుగా బతికిన చోటే హఠాత్తుగా నాలుగు దశాబ్దాల క్రితం  శరణార్థులయ్యారు. జనాభాలో 94 శాతం నిరక్షరాస్యులుగా దిగజారారు.
 
 13 ప్రాంతాల్లో దాదాపు 70 శరణార్థి శిబిరాలనే మురికికూపాల్లో అంటరానివారిలా బతుకున్న దైన్యం బీహారీలది. అంతర్జాతీయ సంస్థల నిర్వచ నాల ప్రకారం వారు శరణార్థులూ కారు, వారు ఉంటున్నవి శరణార్థి శిబిరాలూ కావు! వారు విదేశీయులూ కారు స్వదేశీయులూ కారు. వారు 1947 దేశ విభజన చేసిన గాయాలు. 1971 బంగ్లాదేశ్ విమోచనా పోరాటపు బలి పశువులు. భారతదేశ విభజన సమయంలో చెలరేగిన అల్లర్లు, అత్యాచారాల ఫలితంగా ముస్లింలు పెద్ద ఎత్తున అటు పశ్చిమ పాకిస్థాన్‌కు (నేటి పాక్). ఇటు తూర్పు పాకిస్థాన్‌కు (నేటి బంగ్లాదేశ్) వలసపోయారు. ‘బంగ్లా బంధు’గా పిలిచే ముజిబుర్ రెహ్మాన్ (నేటి ప్రధాని షేక్ హసీనా తండ్రి) అప్పట్లో మతకల్లోలాలతో అట్టుడి కిన బీహార్ గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి ముస్లింలను తూర్పు పాకిస్థాన్‌కు రావాలని ప్రోత్సహించారు. లక్షలాది మంది  బీహారీలు అలా తూర్పు పాకిస్థాన్ చేరారు. వృత్తి నిపుణులు, రైల్వే వర్కర్లయిన బీహారీలను మొదట్లో బెంగాలీలు సాదరంగానే ఆహ్వానించారు. వృత్తి పనివారుగా, వ్యాపారులుగా చాలా మంది స్థిరపడ్డారు. భారత్‌కు తలిపోయిన హిందువుల స్థానంలో విద్యావంతులైన బీహారీలు ప్రభుత్వోద్యోగాలలో సైతం చేరారు.
 
 అయితే పశ్చిమ పాక్ పాలకులు తూర్పు పాక్‌లోని బెంగాలీల పట్ల ఎప్పుడూ అనుమానాస్పద దృష్టితోనే ఉండేవారు. అసలు బెంగాలీ భాషంటేనే భారతీయమైనదనే భావన వారిని వేధించేది. అందుకే ఉర్దూ మాట్లాడే బీహారీలను ఉన్నత ప్రభుత్వోద్యోగాలలో నియమించారు, అన్నివిధాలా ప్రోత్సహించారు. సహజంగానే ఇది బెంగాలీలకు కంటగింపుగా మారింది. బెంగాలీల పట్ల పాక్ అణచివేత ధోరణే 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసింది. బంగ్లా స్వాతంత్య్రానికి నేరుగా కారణమైన 1970 ఎన్నికల్లో బీహారీలు పశ్చిమ పాక్ పాలకుల ముస్లిం లీగ్‌ను సమర్థించారు. అంతేకాక బంగ్లా విముక్తి పోరాట కాలంలో పాక్ సైన్యం సాగించిన అమానుష హత్యాకాండలో, అత్యాచారాల్లో కొందరు బీహారీలు పాల్గొన్నారు.
 
 దీంతో మొత్తంగా బీహారీలపై దాడులు, ఊచకోతలు సాగాయి. బంగ్లాదేశ్ ఏర్పడ్డాక కూడా ఇదే వైఖరి కొనసాగి రెడ్‌క్రాస్ స్వయంగా బీహారీల రక్షణ కోసం నిలవాల్సి వచ్చింది. ఎట్టకేలకు 1972లో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బీహారీలకు బంగ్లా పౌరులుగా ఉండే హక్కును కల్పించింది. ఆరు లక్షల మంది బంగ్లాలో స్థిరపడాలని కోరుకోగా,  5,39,000 మంది రక్షణ లేదని భావించి పాక్‌కు వెళ్లాలని భావించారు. వారి తరలింపుకు అంగీకరించిన పాక్ హక్కుల సంస్థల ఒత్తిడి మేరకు దఫదఫాలుగా 1,70,000ల మందిని మాత్రమే ఆమోదించింది. మిగతావారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి తీరుగా మారింది.
 
 1947లో ఒకసారి దేశ విభజన కల్లోలానికి సర్వం వదిలి తూర్పు బెంగాల్ చేరిన బీహారీలు మరోసారి, సర్వం కోల్పోయి ఎక్కడికీ పోలేక, ఉన్నచోట బతకలేక బతుకులీడ్చాల్సిన దుస్థితిలో బతుకుతున్నారు. పాక్ రక్షణను నమ్మి అక్కడికి వెళ్లిన వాళ్ల పరిస్థితి కూడా అదే దీన స్థితి కావడమే విషాదం. 2008లో సుప్రీంకోర్టు  ఉర్దూ మాట్లాడే బీహారీల పిల్లలకు మాత్రమే   పౌరసత్వాన్ని, ఓటు హక్కును కల్పించింది. దీంతో పరిస్థితి పెద్దగా మారిందేమీ లేదు. బీహారీ శిబిరాల్లో పుట్టిన ప్రతి ఐదుగురు శిశువుల్లో ముగ్గురు మూడు నెలలైనా నిండక ముందే కన్నుమూయడమే అందుకు నిదర్శనం.

 

బీహారీల క్యాంపులను దాటి బెంగాలీలతో కలిసి విద్యాసంస్థల్లో చేరినవారు పరీక్షల్లో గట్టెక్కిన దాఖలాలు లేవు. బీహారీలను బెంగాలీలలో విలీనం చేసుకునే ప్రయత్నాల పేరిట ప్రభుత్వం వారికి బెంగాలీ భాషను నేర్పి, బెంగాలీలోనే విద్యాబోధనను ప్రోత్సహిస్తున్నామని అంటోందే తప్ప బీహారీలందరికీ పౌరసత్వ హక్కులను మాత్రం కల్పించడానికి సిద్ధం కావడం లేదు. బెంగాలీలు వారిని పాకిస్థానీలుగానే పరిగణిస్తున్నారంటే మరి పరిగణించ రా? పాక్‌లోని బీహారీలకు పట్టిన గతిని చూసి నేడు ఎవరూ పాక్‌కు వెళ్లాలనుకోవడం లేదనేది ఎవరికీ అక్కర్లేదు. అంతర్జాతీయ మైనారిటీల హక్కుల సంస్థలు ఎప్పటికప్పుడు బంగ్లా ప్రభుత్వాలకు బీహారీల హక్కుల సమస్యలను గుర్తు చేస్తూనే ఉన్నా... ఆ ‘బంగ్లా ద్రోహుల’ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకోవాలి?     
 -పిళ్లా వెంకటేశ్వరరావు

 


 

>
మరిన్ని వార్తలు