‘విమోచన’కు విలువ ఇవ్వరా?

7 Sep, 2017 01:10 IST|Sakshi
‘విమోచన’కు విలువ ఇవ్వరా?

విశ్లేషణ
‘సెప్టెంబర్‌ 17’ను తెలంగాణ విమోచన దినంగా గుర్తించి అధికారికంగా నిర్వహించాలని సబ్బండ తెలంగాణ ప్రజలందరి బలమైన కోరిక. ప్రభుత్వం జరపకపోతే బీజేపీ నేతృత్వంలో ప్రజలే ఆ బాధ్యత తీసుకుంటారు.


రాష్ట్ర ‘‘బీజేపీ నాయకులకు కేంద్రంలో పలుకుబడి లేక, ఉనికి చాటుకోవడం కోసం విమోచన యాత్రలు చేస్తున్నారు.’’ ఇది, ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ చేసిన వ్యాఖ్య. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ కే లక్ష్మణ్‌ చేపట్టిన తెలంగాణ విమోచన యాత్రను టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకున్న తీరిది. అధికార దర్పం, మత్తు తలకెక్కడంతో వారు ప్రజల మనోభావాలను పూర్తిగా మరచిపోయారని ఇది స్పష్టం చేస్తోంది. అందువల్లనే తెలంగాణకు నిజమైన స్వాతంత్య్ర దినంగా సెప్టెంబర్‌ 17ను గుర్తించి, అధికారికంగా ఆ ఉత్సవాన్ని జరపమనే డిమాండ్‌ వారికి ఉత్త హడావుడిగా కనిపిస్తోంది.

నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి విషయంలో జాతీయ స్థాయిలో సైతం తీవ్ర విమర్శలకు గురైనాక, నెల రోజులకు తీరుబడిగా... అది దురదృష్టకరం అని, ఒక ఎస్సైని సస్పెండ్‌ చేసి, ఎస్పీని విహారయాత్రలకు పంపిన ప్రభుత్వాధీశులు విమోచన దినంపై స్పందిస్తారనుకోవడం అత్యాశేనేమో! విమోచన దినానికి రాజకీయ ప్రా«ధాన్యం లేనే లేదు, ఔట్‌ డేటెడ్‌ సబ్జెక్ట్‌ అంటూ మరో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధి సుదీర్ఘంగా విశ్లేషించారు. తెలంగాణ ప్రజల పట్ల వారికున్న అభిప్రాయం ఏ పాటిదో, ఎవరు ఏమన్నా ప్రజల గోడు వినం అనే వారి మంకు పట్టు ఎలాంటిదో అందరికీ అర్థమయ్యింది.

1948 సెప్టెంబర్‌ 17న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో జరిగిన పోలీసు చర్య ద్వారా నిజాం పాలన నుండి హైదరాబాద్‌ సంస్థానంలోని ప్రజలకు విమోచనం కలి గింది. హైదరాబాద్‌ ప్రాంతం (నేటి పూర్తి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని జిల్లాలు) భారతదేశంలో భాగమైంది. కావున సెప్టెంబర్‌ 17 ముమ్మాటికీ విమోచన దినమే. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో భాగమవ్వాలని తెలంగాణ ప్రజలు పోరాడారు, బలిదానాలు, త్యాగాలు చేశారు. స్వాతంత్య్రం కోసం మిగతా దేశమంతా చేసిన పోరాటానికి అవి ఏ మాత్రం తీసిపోవు. హైదరాబాద్‌ రాష్ట్రంలాంటి కొన్ని ప్రాంతాలు మినహా, దేశమంతా మువ్వన్నెల జెండా ఎగిరిన ఆగస్టు 15ను భారత స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోడానికి ఏ అభ్యంతరాలూ కనపడని పాలకులకు... తెలంగాణ ప్రజలకు అసలైన స్వాతంత్య్రం వచ్చిన రోజును ‘విమోచన దినోత్సవం’గా జరుపుకోవడానికి ఎందుకంత కినుక.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో ఆంధ్ర పాలకులారా! విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించరు? అన్న వారే, నేడు ప్రభుత్వాధినేతలుగా మారాక అందుకు పూర్తి భిన్నంగా అదసలు ముఖ్య విషయమే కాదన్నట్టు ప్రవర్తిస్తున్న తీరును చూసి తెలం గాణం విస్తుపోతున్నది. నాడు ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ‘తెలంగాణ’ అనే పదాన్ని వినడానికి కూడా ఇష్టపడని ఆంధ్రా వలస పాలకులకు, నేటి పాలకులకు తేడా ఏమిటని ప్రశ్నిస్తున్నది. పార్టీ కార్యాలయంలో జెండా లెగరేస్తాం, ప్రభుత్వపరంగా చేయమన్న వైనాన్ని చూసి తెలం గాణ తల్లి తెలతెలబోతున్నది. రజాకార్ల వారసులున్న పార్టీలకు భయపడి తెలంగాణ చరిత్రను గౌరవించకుండా, ఆత్మ గౌరవాన్ని మంటగలుపుతున్న పాలకుల తీరును చూసి దిగ్భ్రాంతి చెందుతున్నది.
భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వీరులందరినీ మననం చేసుకోవటానికి, నివాళులర్పించటానికి లేని భయం, ఒక చాకలి ఐలమ్మను స్మరించుకోవటానికి, ఒక రేణిగుంట రామిరెడ్డికి నివాళులు అర్పించుకోవటానికి, ఒక షోయబుల్లాఖాన్‌ బలిదానాన్ని గౌరవించటానికి వచ్చేసరికి ఎందుకు మటుమాయమైంది, ఎవరికి భయపడి వెనుకంజ వేయాలి? రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల భావదారి ద్య్రానికి ఇది నిదర్శనం కాదా? మత ఛాందసుల ఓట్ల పిడికిలికి భయపడి వెన్నుచూపడం కాదా? టీఆర్‌ఎస్‌ నేతల ఈ మాట మార్చుడు రాజకీయాలను తెలంగాణ ప్రజానీకం గమనిస్తున్నది. ఇది ‘ఔట్‌ డేటెడ్‌ సబ్జెక్టు’ అంటున్న వాళ్లని ఔట్‌ డేటెడ్‌ చేసే రోజు కోసం ఎదురుచూస్తున్నది. ఆత్మగౌరవానికి, స్వాతంత్య్ర భావాలకు కూడా ఎక్స్‌పైరీ తేదీని నిర్ణయించే నయా నియంతృత్వ ధోరణికి మంగళం పాడే తేదీ కోసం కాచుకొని ఉన్నది.

తెలంగాణ ప్రజానీకం స్వాతంత్య్రం కోసం నిజాంపై జరిపిన మహత్తర పోరాట స్ఫూర్తిని... బీజేపీ చేపట్టిన విమోచన యాత్ర పల్లెపల్లెకు గుర్తు చేస్తున్నది. ఆత్మగౌరవ యాత్రను అమోఘంగా నిర్వహిస్తూ ఆనాటి పోరాట చారి త్రక స్థలాలను చుట్టివస్తూ, స్వాతంత్య్ర సేనానులకు నివాళులర్పిస్తూ... స్వేచ్ఛా పరిమళాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నది. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలం గాణ సిద్ధించిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలను గౌరవించని నేటి పెత్తందార్ల వ్యవస్థను ప్రజాగళమై ప్రశ్నిస్తున్నది. ప్రభుత్వం ‘సెప్టెంబర్‌ 17’ను తెలంగాణ విమోచన దినంగా గుర్తించి అధికారికంగా నిర్వహించాలని సబ్బండ తెలంగాణ ప్రజలందరి బలమైన కోరిక. అదే డిమాండ్‌తో ప్రజలతో మమేకమై తెలంగాణ యావత్తూ పర్యటిస్తూ బీజేపీ చేపట్టిన తెలంగాణ విమోచన యాత్ర నేడు పాలమూరు జిల్లా అప్పంపల్లిలో ముగుస్తున్నది. అదే స్ఫూర్తితో సెప్టెంబర్‌ 17 వరకు ప్రభుత్వాన్ని నిలదీసే కార్యాచరణ కొనసాగుతుంది. ప్రభుత్వం జరపకపోతే బీజేపీ నేతృత్వంలో ప్రజలే ఆ బాధ్యత తీసుకుంటారు. నేడు ముగుస్తున్నది విమోచన యాత్ర మాత్రమే. పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.

ఆర్‌. శ్రీధర్‌ రెడ్డి
వ్యాసకర్త బీజేపీ సీనియర్‌ నాయకులు,
తెలంగాణ విమోచన కమిటీ ఉపాధ్యక్షులు ‘ 99855 75757

మరిన్ని వార్తలు