పంథా మారేనా! పరువు దక్కేనా!

23 Feb, 2015 00:24 IST|Sakshi
పంథా మారేనా! పరువు దక్కేనా!

రెండువేల ఏళ్ల క్రితం రోమన్ చక్రవర్తి ఒకరి దగ్గర ఎప్పుడూ ఒక బంటు ఉండేవాడట. అతని బాధ్యత - ‘మీరు దేవుడు కాదు, మానవమాత్రులే సుమా!’ అని సదా చక్రవర్తికి గుర్తు చేస్తూ ఉండడమే. ఇలాంటి స్పృహ కలిగించడం మన నేతలకు కూడా అవసరం. అయితే మోదీకి ప్రతిపక్షాల విమర్శలు  ఒక వరంలా పరిణమించే అవకాశమే ఎక్కువ. ‘శత్రువు తప్పు చేస్తూ ఉంటే అడ్డుపడకు’ అంటాడు నెపోలియన్ బోనాపార్టి. విపక్షాలు నిరంతరం మోదీని విమర్శిస్తూ పప్పులో కాలు వేయకుండా జాగ్రత్త పడేటట్టు మాత్రం చేస్తున్నాయి.
 
 
 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ, నరేంద్ర మోదీలకు ఒక హెచ్చరిక గానే వెలువడ్డాయి. ఆ ఎన్నికలూ, వాటి ఫలితాలూ గొప్ప ప్రాధాన్యం ఉన్నవి కావు. అయినా వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోక తప్పని ఒక వ్యూహంలోకి బీజేపీని దింపారు. దారుణమైన మూల్యాన్ని చెల్లించి తెచ్చుకునే విజయానికే చరిత్రలో ‘పైరిక్ విజయం’ అన్న పేరు. శక్తికి మించిన మూల్యాన్ని చెల్లించి విజయం కోసం పాకులాడనక్కరలేదని పురాతన గ్రీకుల భావన. పైరిక్ విజ యం అంటే అలాంటిదే. ఢిల్లీ ఎన్నికలలో స్వయంగా నరేంద్ర మోదీ కూడా ప్రచారానికి పూనుకున్నారు. సర్వశక్తులు ఒడ్డారు. నిజానికి అక్కడ గెలిచినంత మాత్రాన బీజేపీకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు.
 
 భిన్నాభిప్రాయాలు
 నరేంద్ర మోదీ పనితీరు ఇంతవరకు విజయవంతంగానే ఉన్నదని జనాభి ప్రాయం. అదే సమయంలో వ్యవహార శైలిని ఆయన మార్చుకోవడం అవసర మన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. లేకపోతే ఆయన వైఫల్యాల పర్వం ప్రారంభం కాక తప్పదు. ప్రఖ్యాత న్యాయవాది రాం జఠ్మలానీ మోదీకి పెద్ద మద్దతుదారుడు. ‘వైఫల్యాలు తొలిదశలోనే మోదీ దృష్టికి వెళ్లడం ఆయన అదృష్టం, ఆ వైఫల్యాలతో పతనం కావడానికి ముందే సరిదిద్దుకోగలరు’ అన్నారాయన. నిజానికి గడచిన ఐదేళ్లలో భారత ఆర్థికవ్యవస్థ కుదేలైంది. విదే శాంగ విధానాన్ని పూర్తిగా విస్మరించారు. ఓట్లు ఎలా సాధించాలి? జాతీయ సలహా మండలి వంటి అంశాలను గురించి మాత్రమే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆలోచించారు.
 
 స్వప్రయోజనాలు, రాజకీయ మనుగడ గురించి తప్ప, దేశం కోసం ఆమెకు ప్రత్యేకమైన వ్యూహం కూడా ఏదీ లేదు. కానీ మోదీ అధి కారం చేపట్టాక గడచిన 9 మాసాలలో ఆర్థిక వ్యవస్థ పుంజుకో వడం ప్రారం భించింది. జైరాం రమేశ్, జయంతి నటరాజన్‌లు పర్యావరణ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినపుడు ఐదు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పథకాలు అతీగతీ లేకుండా ఉండిపోయాయి. వారి అసమ ర్థత, అవినీతి వల్ల మన్మోహన్  సింగ్ ప్రభుత్వ ప్రతిష్టతో పాటు దేశ ప్రతిష్ట కూడా దిగజారింది.
 
 ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కాకుండా మోదీ నిలువరించగలిగారు. అలాగే దేశ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను వెతకడం ప్రారంభించారు. మోదీ ఇచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో పరిశ్రమలపైన, చైనాలో ఉద్యోగాల కల్పన జరిగిన తీరు గురించీ భారతీయులు దృష్టి పెట్టేలా చేసింది. ఇక్కడ కూడా ఇలాంటి ప్రయత్నం జరగాలన్న ఆలోచన ఆరంభమైంది. స్వచ్ఛ భారత్ కూడా మంచి కార్యక్రమం. ఎనిమిది, తొమ్మిది మాసాల మోదీ హయాంలో విదేశీ వ్యవహారాలు కూడా విజయవంతమైనాయి.
 
 భారత్ ఉనికిని ప్రపంచ దేశాలకు చాటడంలో ఆయన విజయం సాధించారు. మోదీ అమెరికా పర్యటన; అమెరికా, చైనా దేశాల అధ్యక్షుల భారత పర్యటన కూడా విజయవంతంగానే జరిగాయి. ఆర్థిక, భద్రత వంటి అంశాలలో విజయవం తమైన ఫలితాలు సాధించడానికి భారత్‌కు పటిష్టమైన విదేశాంగ విధానం అవసరం. మన ఇరుగు పొరుగు అంతా శత్రువులు తప్పితే మిత్రులు కాన రారు. దీనికి పరిష్కారం మంచి విదేశాంగ విధానమే. ఈ విషయంలో మోదీ ధైర్యంగా ముందడుగు వేశారు.
 
 ఎల్.కె. అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి నాయకులకు విశ్రాంతి ఇచ్చి ఉండవలసింది కాదని ఒక వర్గం మీడియా అభిప్రాయపడుతోంది. కానీ అలాంటి నాయకులతో పార్టీకి ఒనగూడిన గొప్ప ప్రయోజనం ఏమీ లేదు. వారు ప్రజాదరణ కోల్పోయారు కూడా. నాలుగు దశాబ్దాల పాటు అధికారం లో ఉండి, కొత్తవారికి అవకాశం లేకుండా వారు చేశారు. కానీ మోదీ కొత్త తరానికి అవకాశం ఇచ్చారు. మోదీ పగ్గాలు చేపట్టిన తరువాత, ఇంతవరకు ఆట్టే ఉనికి లేని రాష్ట్రాలకు సైతం పార్టీని విస్తరించారు.
 
 కేరళ మొదలుకొని తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం- ఈశాన్య రాష్ట్రాలలో కూడా పార్టీ ఉనికిని చాటుకోగలిగింది. ఈ రాష్ట్రాలన్నిం టిలోను 250 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కానీ వాటిలో బీజేపీ ఖాతాలో జమ అయినవి కేవలం పదిహేను.  2014 మే నెల నుంచి ఆయా ప్రాంతాల లో కమలం తన ఉనికిని చాటుకునే క్రమం మొదలైంది. ఇటీవల అసోం, బెంగాల్ రాష్ట్రాలలో  జరిగిన ఉప ఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ నిలబడింది. ఒడిశాలో ఇప్పటికే ప్రతిపక్షం. ఇలాంటి విజయాలు పాతతరం నేతలు సాధించి ఉండేవారా?
 
  తప్పిదాలను అంగీకరించాలి!
 మంచి రాజకీయవేత్తలు తప్పిదాలను అంగీకరించడానికి వెనుకాడరు. ఈ విషయంలో గాంధీజీ నుంచి మోదీ నేర్చుకోవాలి. బీజేపీ ప్రభుత్వం మోదీ అనే ఏక వ్యక్తి తమాషాగా కనపడుతున్న మాట వాస్తవం. నియంతృత్వాలలో ఇలాంటిది సాగినా, ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికైన ప్రధాని అందుకు తగిన రీతిలో వ్యవహరించడం అవసరం. నిజానికి ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానుల వ్యవహార శైలి అంతా  నియంతల శైలినే మరిపిస్తుంది.
 
 అన్ని అంశాలు వారి కనుసన్నలలో సాగాలనీ, తనను మించి ఎవరూ మిన్నగా కనిపించరాదన్నట్టూ వారు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇలాం టి ముద్ర ప్రజాస్వామ్యంలో సరికాదు. నిజం చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నది కూడా ఏక వ్యక్తి తమాషాయే! కేజ్రీవాల్ మాదిరిగా ప్రజల దృష్టిలో ఉండాలని మోదీ భావించకున్నా, ఆయన ఎవరి మాట ఆలకించరు అన్న అపప్రథ మాత్రం లేకుండా చూసుకోవాలి. ఎవరు ఏమి చెప్పినా ఆయన వింటారన్న భావన ఉండాలి.
 
 బీజేపీ మంత్రిమండలి చాలా బలహీనమైనది. మంత్రులు మంచి ఫలితాలను సాధించలేకపోతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యత మాత్రం మోదీదే అవుతున్నది. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కారీ, రాజ్‌నాథ్‌సింగ్‌లు తప్ప మిగిలినవారు అత్తెసరు మార్కులు కూడా తెచ్చుకోవడం లేదు. ఇతర మంత్రులలో చాలామంది మీడియాతో చక్కగా మాట్లాడడం తప్పిస్తే, పాలనానుభవం లేనివారే. ఈ మంత్రులను మార్చకుంటే, మోదీ వైఫల్యం మొదలైపోతుంది.  
 
 మోదీ ధరించే దుస్తుల విషయం కూడా వివాదాస్పదంగా తయారైంది. ఖరీదైన ‘సూటు’ వ్యవహారం ఇంతవరకు ఆయన మీద ఉన్న సదభిప్రా యాన్ని మారుస్తోంది. యథాతథంగా కాకున్నా, తనకు పూర్తి భిన్నంగా ఉండే ‘మఫ్లర్ మ్యాన్’ కేజ్రీవాల్‌ను మోదీ గమనంలోకి తీసుకోవాలి. అలా అని రాహుల్ గాంధీ శైలిలో అతి నాటకీయత జోలికి మాత్రం మోదీ వెళ్లవలసిన అవసరం లేదు. రాహుల్ ఒక రాత్రి పూరి గుడిసెలో నిద్రిస్తారు. కానీ నెల నెలా విదేశాలకు విహారయాత్రలకు వెళతారు. పార్లమెంటులో మోదీ, ఆయన మంత్రివర్గ సహచరుల నైపుణ్యం కూడా విజయవంతంగా లేదు.
 
 ప్రతిపక్షాల దాడిని వారు అధిగమించలేకపోతున్నారు. మోదీ కూడా ప్రతిపక్ష నేతలకు దగ్గర కావాలి. వారిని గౌరవించాలి. లాలూ ప్రసాద్, ములాయం వంటి వారిని ఇరుకున పెట్టాలని భావించడం సరైన రాజకీయం కాదు. ఇలాంటి వైఖరిని మార్చుకోకుంటే మోదీ ప్రభుత్వ పతనం మొదలైపోతుంది. పార్ల మెంటరీ ప్రజాస్వామ్యం అంటే, పార్లమెంటులో మనకి ఆధిక్యం ఉన్నప్పటికీ ప్రతిపక్షాలతో సర్దుకుపోవడమనే సంప్రదాయం పాటించాలి.
 
 ఈ వైఖరి మారాలి
 భారీ వ్యాపార, వాణిజ్య వర్గాలను సంతృప్తి పరచడానికి మోదీ చేస్తున్న ప్రయ త్నం ప్రమాదకరమైనది. వారు ప్రభుత్వం నుంచి ఆశించేది వారి పరిశ్రమ లకు భూములు, ప్రభుత్వం నుంచి రాయితీలు, విదేశాల నుంచి పెట్టుబడు లు. మోదీ ఆదరాబాదరా తీసుకువచ్చిన భూసేకరణ చట్టంతో దేశంలో చాలా గందరగోళమే మొదలైంది. చాలా వాస్తవాలను పరిగణనలోనికి తీసుకోకుం డానే మోదీ దేశంలోని భారీ వాణిజ్య, వర్తక వర్గాల మెప్పు కోసం ప్రయత్నిసు ్తన్నారని అనిపిస్తుంది. ఈ విధానాన్ని కూడా మోదీ ఆపివేయాలి. అలాగే ఆయ న భావిస్తున్నట్టు ఇతర దేశాల నేతలు మోదీకి మిత్రులు కారు.
 
 మోదీని వారం తా గౌరవిస్తున్నారంటే, అందుకు కారణం వారి మధ్య వ్యక్తిగత మైత్రి కాదు, మోదీ ఈ దేశానికి ప్రధాని. ‘దేశాలకు శాశ్వత మిత్రులు లేదా శత్రువులు ఉండరు, కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి’ అని రెండు వందల ఏళ్ల క్రితం నాటి బ్రిటిష్ ప్రధాని మార్ల్‌బరో చెప్పాడు. ఇటీవల బరాక్ ఒబామా వచ్చినప్పుడు మోదీ ఆయనను పేరు పెట్టి పిలవడం దేశ ప్రజలకు ఇబ్బందిక రంగా తోచింది. రెండువేల ఏళ్ల క్రితం రోమన్ చక్రవర్తి ఒకరి దగ్గర ఎప్పుడూ ఒక బంటు ఉండేవాడట. అతని బాధ్యత - ‘మీరు దేవుడు కాదు, మానవమా త్రులే సుమా!’ అని సదా చక్రవర్తికి గుర్తు చేస్తూ ఉండడమే. ఇలాంటి స్పృహ కలిగించడం మన నేతలకు కూడా అవసరం. అయితే మోదీకి ప్రతిపక్షాల విమర్శలు  ఒక వరంలా పరిణమించే అవకాశమే ఎక్కువ. ‘శత్రువు తప్పు చేస్తూ ఉంటే అడ్డుపడకు’ అంటాడు నెపోలియన్. విపక్షాలు నిరంతరం మోదీ ని విమర్శిస్తూ పప్పులో కాలు వేయకుండా జాగ్రత్త పడేటట్టు చేస్తున్నాయి.

పెంటపాటి పుల్లారావు

(వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు  మొబైల్ :9868233111)

>
మరిన్ని వార్తలు