లౌక్యవాద మతతత్వం!

13 Dec, 2013 00:09 IST|Sakshi
లౌక్యవాద మతతత్వం!


విశ్లేషణ
 పిళ్లా వెంకటేశ్వరరావు
 
 ‘జీవించడమంటే భయపడటాన్ని వెన్నంటే మరణించడమంటే భయం పుట్టుకొస్తుంది’ (మార్క్ టై్వన్). కాంగ్రెస్‌ను ప్రస్తుతం రెండో భయం వెంటాడుతోంది. దురదృష్టంలో అదృష్టంలాగా ఢిల్లీ జాదూగర్ కేజ్రీవాల్ దుమారంలో పడి కాంగ్రెస్ మృత్యుకళకు అంత ప్రాధాన్యం లభించడం లేదు. ఎన్నికలకు ముందు వరకు జాతీయ వార్తల్లో ప్రధాన వ్యక్తిగా నిలిచిన నరేంద్రమోడీని అతి చిన్న రాష్ట్రమైన ఢిల్లీ హీరో వెనక్కు నెట్టేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోనే కాదు ఢిల్లీలో సైతం మోడీ హవా కనిపించిందని బీజేపీ ఢంకా బజాయిస్తుంటే, కాంగ్రెస్ అది మోడీ గాలి కానే కాదని వాదిస్తోంది.

 

జాతీయ మీడియాలో ఇప్పుడు వీస్తున్నది మాత్రం కేజ్రీవాల్ గాలే. ఆ గాలిలో పడి కొట్టుకుపోయే కంటే మధ్యప్రదేశ్ ఫలితాల నుంచి ప్రారంభిస్తే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీల గీత ఎలా ఉండబోతోందో అర్థంకావచ్చు. ఎంపీలో శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉన్నందున అధికారపార్టీ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ కొండంత ఆశ పెట్టుకుంది. కాంగ్రెస్ ఓడిపోవడంలో అంత ఆశ్చర్యపడాల్సిందేమీ లేకపోవచ్చు. కానీ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అక్కడ గతం కంటే గణనీయంగా ఎక్కువ సీట్లను తెచ్చుకోగలిగింది. ఇది ఆ పార్టీకి ఢిల్లీ, రాజస్థాన్‌లతో పోల్చదగిన పరాభవం.
 
 

ఎంపీలో బీజేపీ ఘన విజయాన్ని మోడీకి అంటగ ట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోయి ఉంటే మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకొని ఉండేవారమని స్థానిక నేతలు దృఢంగా చెబుతుండటం విశేషం, అలాంటి ఆశ్చర్యకర పరిణామమే మరొకటి కూడా కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 7 శాతంగా ఉన్న ముస్లిం ఓటర్లలో 70 శాతానికిపైగా సంప్రదాయకంగా కాంగ్రెస్‌కు ఓటు చేసేవారు. ముస్లింలకు అది కేటాయించిన 8 స్థానాల్లో ఈసారి కాంగ్రెస్‌కు దక్కింది ఒక్కటే. ముస్లింలలో 60 శాతం మంది బీజేపీకి ఓటు చేశారు!
 
 ఎంపీకి భిన్నంగా ముక్కోణపు పోటీ జరిగిన ఢిల్లీలో ముస్లిం నేతలు బహిరంగంగానే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అక్కడ కాంగ్రెస్ 70 శాతం ముస్లిం ఓట్లను కోల్పోయింది. ప్రముఖ ముస్లిం పండితుడు ముఫ్తి ఆర్షద్ ఖ్వాస్మి ‘‘లౌకిక ప్రభుత్వాలుగా చెప్పుకునేవారు ముస్లింలు ఎక్కడికిపోతారు? అని అనుకుంటున్నారు. మోడీ పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టి వాళ్లకు ఓటు చేసేలా ఇక చేయలేరు. ఢిల్లీలో నమూనా రుచి చూపించాం అంతే’’ అని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను బీజేపీ మోడీ అనుకూల వ్యాఖ్యలుగా ప్రచారం చేసుకుంటోంది. కానీ ముస్లింలలో మోడీపట్ల వ్యతిరేకత అంతరించిపోలేదు. ముస్లిం నేతలు కాంగ్రెస్, బీజేపీలను ఓడించమని పిలుపునిచ్చి, ఆమ్ ఆద్మీని గెలిపించమని చెప్పకనే చెప్పారు. ఢిల్లీ ముస్లింల వైఖరిని స్థానిక కారణాలతో వివరించడం పొరబాటు. గతంలో ముస్లింలు బీజేపీని ఎవరు ఓడించగలిగితే వారికే వ్యూహాత్మకంగా ఓటు చేసేవారు.
 
 ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయాలున్న ప్రతి చోటా వారిద్దరికీ వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా ఓటు చేస్తారని చెప్పవచ్చు. బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్‌కో లేక ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్‌కో కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఈ పరిణామాన్ని గుర్తించారు కాబట్టే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్‌తో పొత్తు చర్చలకు స్వస్తి పలకాలని ఆరాటపడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖీ పోటీలు నెలకొన్న చోట్ల ప్రాంతీయ, స్థానిక పరిస్థితుల మీద ఆధారపడి ఏ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలో వారు నిర్ణయించుకునే అవకాశాలు ఎక్కువ. కనీసం యూపీ, బీహార్, బెంగాల్ వంటి రాష్ట్రాల వరకైనా ఈ వ్యూహాత్మక ఓటింగ్ తప్పదనే చెప్పొచ్చు. 540 లోక్‌సభ స్థానాల్లో 150 నియోజక వర్గాల్లో ముస్లింలు కేంద్రీకృతమై ఉండి గెలుపు ఓటములను నిర్ణయించే స్థానంలో ఉన్నారు.
 
 

ఎంపీలో చౌహాన్ సంక్షేమ పథకాలే ఆయనకు ముడో దఫా పట్టం గట్టాయనేది తిరుగులేని వాస్తవం. కాంగ్రెస్‌వి మైనారిటీలను బుజ్జగించే ఓటుబ్యాంకు రాజకీయాలని తిట్టిపోసే బీజేపీకి చెందిన ఆయన ప్రత్యేకించి ముస్లింల కోసం పలు సంక్షేమ పథకాలను, చర్యలను చేపట్టి వారి అనుకూల ఓటును సంపాదించారు! కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో సైతం ముస్లింలు దానికి ముఖం చాటేయడం విశేషం. కాంగ్రెస్ 16 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దిం చగా ఒక్కరూ గెలవలేదు. బీజేపీ ముగ్గుర్ని నిలిపగా ఇద్దరు గెలిచారు! కాంగ్రెస్ ఓటమి ఊహించినదే. కానీ అది అక్కడ తుడిచి పెట్టుకు పోవడానికి కారణం మోడీ కాదు. జాట్లు కలిసికట్టుగా కాంగ్రెస్‌కు బద్ధవ్యతిరేకులుగా మారడమే అందుకు కారణం. ఎస్సీ, ఎస్టీలను సైతం కాంగ్రెస్ ఓటు బ్యాంకులుగా పరిగణించలేని స్థితి ఏర్పడింది. 34 ఎస్సీ స్థానాల్లో ఒక్కటీ దానికి దక్కలేదు. 25 ఎస్సీ స్థానాల్లో 4 మాత్రమే దక్కాయి. మోడీ ప్రభావం ఏమైనా ఉంటే అది ఢిల్లీలో ఆమ్ ఆద్మీని అధికారానికి ఆమడ దూరంలో నిలిచేలా చేయడంలో మాత్రమే ఉంది.
 
 మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసి సంఘ్ నాయకత్వం తప్పు చేసిందా? 1996లోఎల్‌కే ఆద్వానీకి బదులుగా ఏబీ వాజపేయిని ప్రధానిని చేయడానికి కినిసిన సంఘ్... నేడు ఆ ఆద్వానీని కాదని మోడీకి పట్టం గట్టడానికి సిద్ధం కావడంలోని మతలబే ఆ ప్రశ్నకు సమాధానం చెబుతుంది. 2002 గోధ్రా అల్లర్ల తదుపరి ముస్లింలు బీజేపీకి బద్ధ వ్యతిరేకులయ్యారు. కానీ 2012 గుజరాత్ ఎన్నికల్లో 25 శాతం ముస్లింలు మోడీకి ఓటు చేశారు!  భయభీతావహులను చేసి ముస్లింలు చివరికి తమనే శరణుకోరేలా చేసుకునే ఎత్తుగడల్లో మోడీ సాధించిన ఘన విజయం ఇది. కాగా మతతత్వవాద ఎజెండాతో ఎదురుదెబ్బలు తింటున్న సంఘ్ మోడీలో పరిపాలనా దక్షుణ్ణి, అభివృద్ధి సాధకుడ్ని ‘కనుగొంది’.
 
 ఈ ప్రచారంతో అది గోధ్రాతో కోల్పోయిన హిందూ లౌకికవాద ఓటర్లను తిరిగి ఆకర్షించగలగడమే కాదు, పట్టణ మధ్యతరగతి విద్యావంతుల్లో మోడీని సమర్థుడైన పాలకునిగా చె ల్లుబాటు చేయగలుగుతోంది. ఆమ్‌ఆద్మీ సరిగ్గా ఇక్కడే ఢిల్లీలో బీజేపీని మట్టి కరిపించింది. మోడీ కర్ణాటక ఎన్నికల్లో పరిపాలన, అభివృద్ధి పాట పాడారు. ఢిల్లీ ఎన్నికల్లో సామరస్యాన్ని బోధిం చారు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌పై కత్తి దూసారు. ఏ రోటికాడ ఆ పాటమోడీ, బీజేపీల నేటి వ్యూహం. కాబట్టే చౌహాన్ మైనారిటీల సంక్షేమ కర్త కాగలిగారు. ఇది నిజానికి సంఘ్ అలవరుచుకున్న రాజకీయ లౌక్యం. బీజేపీకి అది తయారు చేసిన లౌక్యవాద మతతత్వం టానిక్. ఇది సంఘ్ పరివార్ మౌలిక భావజాలానికి పొసగదనే సందేహం అక్కర్లేదు. కాషాయం రంగు వెలిసిపోతోందని లౌకికవాదులు సంతోషించాల్సింది ఏమీ లేదు. దాని మతతత్వం పదిలంగానే ఉంది. సామదానబేధ దండోపాయాలను అన్నిటినీ ఏకకాలంలో ప్రయోగించగల మోడీ ప్రస్తుతం ఆమ్‌ఆద్మీ డిల్లీలో అనుసంచిన ఎత్తుగడలను అమలుచేసే ప్రయత్నంలో ఉన్నారు, ఒక్కొక్క నియోజకవర్గంలో 90 వేల మంది 18-24 ఏళ్ల యువ ఓటర్లున్నారని లెక్కగట్టి వారిని నియోజకవర్గాల వారీగా ఆకర్షించే వ్యూహాలను స్థానిక నేతలతో కలిసి రచిస్తున్నారు.
 
  2014 ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ జాదూను ప్రదర్శిస్తామని కేజ్రీవాల్ అంటున్నారు. ‘కేజ్రీ ఫ్యాక్టర్’ సార్వత్రిక ఎన్నికలపై ఎలా ఉండబోతోం దంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఢిల్లీ ఫలితాలు మధ్యతరగతి, విద్యావంతులు కీలకపాత్ర ధారులుగా ఉన్న ఒక మహానగరానికి సంబంధించినవనే విషయం కీలకమైనది. రానున్న ఐదు మాసాల్లో దేశవ్యాప్తంగా ఆ పార్టీ నిర్మాణాన్ని విస్తరించడం అసాధ్యం. అంతకు మించి పట్టణ ప్రజలను దాటి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ప్రత్యామ్నాయంగా నిలవడం అంతకంటే అసాధ్యం. పైగా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయాలుగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లోకి చొచ్చుకుపోవడం తేలికేం కాదు.
 
 రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలక, నిర్ణయాత్మక శక్తులు కానున్నాయనే అంచనాను మార్చుకోవాల్సిన స్థాయిలో ‘కేజ్రీ ఫ్యాక్టర్’ పనిచేసే అవకాశం లేదనే చెప్పాలి. అయితే పట్టణ మధ్యతరగతి యువత, విద్యావంతులు రాజకీయాల పట్ల, సామాజిక సమస్యల పట్ల ఆసక్తిలేని వారనే భ్రమలను ఆమ్‌ఆద్మీ పటాపంచలు చేసింది. ఢిల్లీలో ఇటీవలే సాగిన రెండు గొప్ప ప్రజా ఉద్యమ కెరటాలపై నుంచి ఎదిగి వచ్చిన ఆ పార్టీ చట్టధిక్కారానికి పాల్పడి మరీ పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలపై ఆందోళనలు సాగించి విజయం సాధించింది. అవినీతి వ్యతిరేక ఎజెండాతో ప్రారంభమైన ఆమ్‌ఆద్మీ... సామాన్యుని వెతలను తీర్చగల ఆర్థిక సామాజిక కార్యక్రమాన్ని రూపొందించుకొని, సమైక్యంగా నిలిస్తే 2019 ఎన్నికల నాటికి ఒక నిర్ణయాత్మక శక్తి కాగలుగుతుంది. ఇప్పటికైతే ప్రజల దైనందిన సమస్యలకు పరిష్కారాలను దాటవేస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లు ఆడుతున్న నాటకం ముగిశాక జరిగే కూడికలు తీసివేతల ప్రహసనాన్ని చూడక తప్పదనే అనుకోవాలి. కాంగ్రెస్ ఓడిందేగానీ బీజేపీ గెలుపునకు చాలా దూరంలో ఉంది. ఆ లోగా ఏమైనా జరగవచ్చు.     
 

>
మరిన్ని వార్తలు