వాళ్లకు నీళ్లు... మనకు బీళ్లు

17 Dec, 2013 23:16 IST|Sakshi
వాళ్లకు నీళ్లు... మనకు బీళ్లు

  రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఆంధ్ర, తెలంగాణల మధ్య
 కృష్ణా జలాల సమస్య పరిష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం.
 
 
 కృష్ణ మిగులు జలాలను సంపూర్ణంగా విని యోగించుకునే స్వేచ్ఛను హరించి, కరవు పీడిత ప్రాంత ప్రజల ఆశలను ఆవిరి చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలుగుజాతి పాలిట అశనిపాతమే. సర్ ఆర్థర్ కాటన్ కృష్ణా నదిపై 1852-56 మధ్య విజయవాడ వద్ద ఆనకట్టను నిర్మించడం ద్వారా డెల్టా, గుంటూరు కాలువల లోను, కృష్ణ ఉపనది తుంగభద్రపై 1861-72 మధ్య కాలంలో సుంకేసుల ఆనకట్టతో కర్నూ లు- కడప కాలువలోను నీరు పారించాడు. నాగా ర్జునసాగర్ ప్రాజెక్టుకు 1955లోను, తుంగభద్ర ప్రాజెక్టు ఎగువ కాలువ రెండవదశకు 1956లోను ప్రాణం పోశారు. ఇదే జరగకుంటే నేడు తెలుగుజాతి దుస్థితి ఎలా ఉండేదో ఊహించలేం!
 
 భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని 1960లో జరిగిన అంతర్రాష్ట్ర మహా సభ చర్చించింది. 1951కి ముందు నిర్మితమై నీటిని వినియోగించుకొంటున్న, 1950 నాటికి ప్రణాళికా సంఘం ఆమోదంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి రక్షణ కల్పించాలని ఆ సభ ఆమోదించింది. ఆ నిర్ణ యమే రక్షాకవచమై కృష్ణా నదిలో 75 శాతం విశ్వసనీయత ఆధారంగా లభి స్తున్న 2060 టీఎంసీలలో మన రాష్ట్ర వాటా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 800 టీఎంసీలు సురక్షితంగా ఉన్నాయి.
 
 బ్రిజేశ్ తీర్పు అలా పరిణమించడానికి మూల కారణం మన రాజకీయ వ్యవస్థ వైఫల్యమే. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఈ అవకాశాన్ని ఉప యోగించుకొని కృష్ణా జలాల పునః పంపకం తాము కోరుకొన్న రీతిలో ఉం డేటట్టు బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుతో సాధ్యం చేసుకున్నాయి. అర్థ దశాబ్దంగా ప్రజల జీవన్మరణ సమస్యలను పట్టించుకునే తీరిక మన ప్రభుత్వానికి మాత్రం లేదు. అసలు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉన్నప్పటి నుంచే కర్ణాటక, మహారాష్ట్రలు మిగులు జలాలపై కన్నేసి, రాయలసీమలో, మహబూబ్‌నగర్, నల్లగొండ (తెలంగాణ), ప్రకాశం (కోస్తా) జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు లపై అభ్యంతరాలు లేవదీస్తూనే ఉన్నాయి. 2000 మే 31న ట్రిబ్యునల్ గడువు ముగియగానే అవి ఈ సమస్యపై వివాదాన్ని రేపి, అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయో గించి విజయం సాధించాయి. మనకి మాత్రం జలయజ్ఞంలో భాగంగా ఇప్పటికే 30 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించిన తెలుగు-గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ, నెట్టెంపాడు, కల్వకుర్తి, శ్రీశైలం ఎడమగట్టు కాలు వ, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకాల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.
 
 ఇరుగు-పొరుగుకు అనుకూలంగా...
 నీటి లభ్యతను నిర్థారించడానికి బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎంచుకొన్న ప్రమాణం అసంబద్ధమైనది. కర్ణాటక, మహారాష్ట్రల కోర్కెలకు అనుగుణంగా నీటిని కేటా యించడానికే కొలమానాలను ఎంచుకున్నట్టు భావించేటట్టుగా ఉంది. మూడు రాష్ట్రాల జలాశయాలలో స్థూలంగా 1919 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న దని, 1518 టీఎంసీల (మహారాష్ట్ర+కర్ణాటక+ఆంధ్రప్రదేశ్‌ః 483.24+479.35+ 555.84= 1618.43) మేరకు సజీవ నీటి నిల్వ సామర్థ్యం ఉన్నదని, గరిష్టంగా 2313 టీఎంసీ (మహారాష్ట్రలో 551.65 టీఎంసీలు, కర్ణాటకలో 695.97 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌లో 1065.44 టీఎంసీల) నీటిని వినియోగించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనా వేసింది. తదనుగుణంగా 65 శాతం విశ్వసనీయత ఆధారంగా 2293 టీఎంసీలు లభిస్తాయని నిర్ధారించి, పం దారం చేసింది. 1518.43 టీఎంసీలలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయా లలో ‘క్వారీ ఓవర్’ నిల్వకు అనుమతించిన 150 టీఎంసీలను మినహాయిస్తే 1368.43 టీఎంసీ సజీవ నిల్వ సామర్థ్యంతో, నీటి నిల్వ - వినియోగ నిష్పత్తి 1:1.40గా ఉంటుందని ట్రిబ్యునల్ పేర్కొన్నది. నిర్మాణం పూర్తి కాని పులిచిం తల జలాశయం నిల్వను కూడా లెక్కించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, తుంగభద్ర జలాశయాల్లో పూడిక వల్ల తగ్గిపోయిన నీటి నిల్వను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే ప్రకాశం ఆనకట్ట వద్ద నుంచి అనివార్యంగా సముద్రం పాలవుతున్న నీటిని లెక్కలోకి తీసుకోలేదు.
 
 హేతుబద్ధం కాని కొలమానాలు
 బచావత్ ట్రిబ్యునల్ 1894-95 నుంచి 1971-72 వరకు అందుబాటులో ఉన్న 78 సంవత్సరాల నదీ ప్రవాహ గణాంకాలను పరిగణనలోకి తీసుకొని 75 శాతం ప్రామాణికంగా 2060 టీఎంసీ నికర జలాలు, 70 టీఎంసీల పునరుత్పత్తి నీళ్లు లభిస్తాయని నిర్ధారించింది. ఆ మేరకు మహారాష్ర్టకు 585 (560 నికర జలాలు+ 25 పునరుత్పత్తి జలాలు) టీఎంసీలు, కర్ణాటకకు 734 (700+34) టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 811 (800+11) టీఎంసీలు కేటాయించింది. కానీ 112 ఏళ్ల నదీ ప్రవాహ గణాంకాలు ఉన్నప్పటికీ 1961-62 మొదలు 2007-08 వరకు 47 ఏళ్ల నదీ ప్రవాహ గణాంకాలను మాత్రమే బ్రిజేశ్ ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకొని 65 శాతం విశ్వసనీయత ఆధారంగా నికర జలాలు 2293 టీఎంసీలు లభిస్తాయని నిర్ధారించింది. అలాగే 75 శాతం విశ్వసనీ యతపై 2173 టీఎంసీలు లభిస్తాయని, బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న నికర జలాలు 2060+70 పునరుత్పత్తి నీరు కలిపితే 2130 టీఎంసీలకు ఇవి సరిస మానంగా ఉన్నాయని పేర్కొన్నది. కాబట్టే, బచావత్ ట్రిబ్యునల్ చేసిన నికర జలాల కేటాయింపును యథాతథంగా కొనసాగిస్తూ, మిగిలిన 163 (2293- 2130) టీఎంసీలను మూ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయించింది.
 
 గంగలో కలిసిన జాతీయ విధానం
 నదీ జలాలను మొదట త్రాగు నీటికి, తరువాత వ్యవసాయానికి, అటుపై విద్యు దుత్పాదనకు కేటాయించాలని జాతీయ నదీ జలాల విధానం పేర్కొన్నది. కానీ తద్భిన్నంగా ముంబై, దాని పరిసర ప్రాంతాల విద్యుత్ అవసరాల దృష్ట్యా కోయినా జల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రస్తుతం ఉన్న 67.5 టీఎంసీలతో పాటు మరో 25 టీఎంసీలను, సాగునీటి ప్రాజెక్టులకు 18 టీఎంసీలు, మొత్తం 43 టీఎంసీలను మహారాష్ట్రకు కేటాయించింది. కర్ణాటకకు 65 టీఎంసీలను వివిధ సాగు నీటి పథకాలకు కేటాయించింది.
 అక్కడితో ఆగకుండా వార్షిక సగటు నీటి లభ్యత 2578 టీఎంసీలుగా నిర్ధారించి, 65 శాతం విశ్వసనీయతపై పేర్కొన్న 2293 టీఎంసీలు పోను 285 టీఎంసీలు మిగులు జలాలు లభిస్తాయని, వాటిలో మహారాష్ట్రకు 35 టీఎంసీ, కర్ణాటకకు 105 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయించడం ద్వారా కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు పొంది ప్రాజెక్టులను నిర్మిం చుకోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. పెపైచ్చు మిగులు జలాలను కూడా పంపిణీ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇక మీదట నికర లేదా మిగులు జలాలన్న వివక్ష ఉండదని సెలవిచ్చింది. ఇది చాలా ప్రమా దకరమైనది. మొత్తంగా మహా రాష్ట్రకు 666 (585+4+35+3) టీఎంసీలు, కర్ణాటకకు 911 (734+65+105+7) టీఎంసీల కేటాయింపు జరిగింది. ఆ మేరకు ప్రాజెక్టులను నిర్మిస్తే ఇహ మన రాష్ట్రానికి నీళ్లు వచ్చే అవకాశాలు మృగ్యం.
 
 వాదనలు పట్టని ట్రిబ్యునల్
 మన రాష్ట్రం పట్ల ట్రిబ్యునల్ దుర్మార్గంగా వ్యవహరించింది. 65 శాతం విశ్వసనీ యత పద్దు కింద 43 టీఎంసీలను కేటాయించినట్లు పేర్కొంటూనే, కనికట్టు మాయాజాలం చేసింది. ఒక్క జూరాలకు మాత్రమే నిజాయితీగా 9 టీఎంసీ లను కేటాయించింది. మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఏడు ప్రాజెక్టులకు నీటిని కేటాయించమని కోరితే పట్టించుకోకుండా ముసాయిదా తీర్పులో పొందుపరచిన రాజోలిబండ మళ్లింపు పథకం కుడి కాలువకు 4 టీఎంసీలను మంజూరు చేసి, వివాదానికి ఆజ్యం పోసింది. దారుణమైన అంశం ఏమిటంటే 65 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన రాష్ట్రానికి కేటాయించిన మిగిలిన 30 టీఎంసీలను కరవు పీడిత ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న పథకాలకు కేటాయిం చకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో క్యారీ ఓవర్ పద్దు కింద జమ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ 150 టీఎంసీల మిగులు జలాలను క్యారీ ఓవర్ నిమిత్తం నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాల్లో మన రాష్ట్రానికి 145 టీఎంసీలను మంజూరు చేసి, అందులో 120 టీఎంసీలను, వాటికి తోడు 65 విశ్వసనీయత ఉన్న 30 టీఎంసీలను వెరసి 150 టీఎంసీలను క్యారీ ఓవర్ నిల్వ కోసం కేటాయించింది. మూడు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న తెలుగు-గంగకు మాత్రం వస్తాయో, రావో తెలియని మిగులు జలాల నుంచి 25 టీఎంసీలను కేటాయించింది. పైగా ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ లభిస్తేనే ఇది వర్తిస్తుందని షరతు విధించింది. ఇది రాయలసీమను దగా చేయడమే. గడచిన అనుభవం ఆధారంగా నికర జలాల వినియోగంలో మహారాష్ర్టకు 99 శాతం, కర్ణాటకకు 97 శాతం సఫలీ కృత నిష్పత్తి (సక్సెస్ రేటు) ఉన్నదని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 68 శాతం ఉన్నదని మొరపెట్టుకున్నా ట్రిబ్యునల్ చెవికెక్కలేదు.
 
 కరవు ప్రాంతాలపై వివక్ష ఏల?
 కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్రలో 50,242 చదరపు కిలోమీ టర్లు, కర్ణాటకలో 52,375 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 45,493 చదరపు కిలోమీటర్ల మేరకు కరువు పీడిత ప్రాంతాలు ఉన్నట్లు డీపీఏపీ గణాం కాలను బట్టి స్పష్టమవుతున్నదని ట్రిబ్యునల్ గుర్తిస్తూనే, 65 శాతం విశ్వనీయత ఆధారంగా లభిస్తాయని అంచనా వేసిన 163 టీఎంసీలు, మిగులు జలాలు 285 టీఎంసీలు, మొత్తం 448 టీఎంసీల నీటిని పంపిణీ చేసేటప్పుడు మాత్రం మన రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు ట్రిబ్యునల్ మొండి చేయి చూపెట్టింది. మరొక వైపున రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదిం చిన ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జల వివాదాల పరిష్కారానికి మరొక జలమండలిని కేంద్ర జలవనరుల శాఖమంత్రి నేతృ త్వంలో నెలకొల్పాలని సిఫార్సు చేసింది. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసిన ఆ బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే ఆంధ్ర, తెలంగాణల మధ్య కృష్ణా జలాల సమస్య పరి ష్కార బాధ్యతను అప్పగిస్తామని పేర్కొనడం మరీ హాస్యాస్పదం.  

మరిన్ని వార్తలు