సామాజిక న్యాయ శిల్పి బీఎస్

11 Dec, 2014 01:15 IST|Sakshi
సామాజిక న్యాయ శిల్పి బీఎస్

1936 మే 30న బొంబాయిలో జరిగిన ప్రథమ మహర్ సదస్సుకు అధ్యక్షత వహించే గౌరవం బీఎస్ వెంకట్రావ్‌కి దక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వయంగా రైల్వే స్టేషన్‌కి వెళ్లి, స్వాగతం పలికి ఏనుగు అంబారీపై ఆయనను తీసుకెళ్లారు. ఆ సభలో వక్తలంతా బీఎస్‌ను ‘హైదరాబాద్ అంబేద్కర్’గా ప్రశంసల వర్షం కురిపించారు. 1947లో లాయక్ అలీ మంత్రి వర్గంలో హైదరాబాద్ విద్యా మంత్రిగా చేరిన బీఎస్ ఏడున్నర దశాబ్దాల క్రితమే దళితులకు రిజర్వేషన్ల కోసం, భూముల కోసం ఉద్యమించిన నేత. విద్యామంత్రిగా దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్పుల చెల్లింపు కోసం సకల సంపదలను కుదువ పెట్టి... సర్వస్వం కోల్పోయి చివరికి రెండు గదుల ఇంట్లో గడిపిన అరుదైన అసాధారణ ప్రజా నాయకుడు.   
 
 జాతి సంపద, అవకాశాలు, సౌకర్యాలు, వనరుల పంపిణీ సమంగా జరగాలనేది సామాజిక న్యాయసూత్రం. అయితే సామాజిక, సామూహిక ప్రయోజనాలు కాక, వ్యక్తిగత స్వార్థం, కొద్దిమంది ప్రయోజనాలే సామాజిక న్యాయంగా చలామణీ అవడం ఇటీవలి కాలంలో పెరిగి పోయింది. పదవులు, ఉద్యోగాలు, ప్రమోషన్లు, హోదాలు అన్ని వర్గాలకు అందాలి. ప్రత్యేకించి అణగారిన వర్గాలకు కూడా ఈ అవకాశాలు అందాలి. ఆ లక్ష్యంతోనే భారత రాజ్యాంగంలో పొందు పరచిన విద్య, ఉపాధి అవకాశా లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ఏర్పాటును ఆధునికమైన యోచనగా భావిస్తున్నాం.
 
  కానీ ఏడున్నర దశాబ్దాల క్రితమే నిజాం సంస్థానంలో అంటరాని కులాల రిజర్వేషన్ల కోసం కృషి చేసి, సాధించిన సామాజిక న్యాయ యోధుడు బత్తుల సాయన్న వెంకట్రావ్. స్వార్థంతో, వ్యక్తిగత ప్రతి ష్టల పాకులాటతో   సామూహిక, సామాజిక ప్రయోజనా లకు నీళ్లు వదులుతున్న కాలమిది. అందుకు భిన్నంగా ఆస్తిపాస్తులు, సిరిసంపదలు, హోదాలు, అధికారాలు అన్నీ కింది వర్గాల ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగప డాలని తహతహలాడే వారు చాలా అరుదు. నూటికో కోటికో ఒకరుగా కనిపించే అటువంటి వ్యక్తులే చరిత్రను సృష్టిస్తారు. తమ వెంట సమాజాన్ని నడిపిస్తారు. బీఎస్ వెంకట్రావ్‌గా నేటికీ తలుచుకునే ‘రావు సాహెబ్’ అలాం టి పథ నిర్దేశకుడే.  
 
 ‘హైదరాబాద్ అంబేద్కర్’
 శిలలకు తన చేతితో ప్రాణం పోసి శిల్పాలుగా మలచిన బీఎస్ వెంకట్రావ్... తరతరాలుగా పాతుకుపోయిన సామాజిక రుగ్మతల చీడను వదిలించడానికి నడుం బిగించి సామాజిక న్యాయశిల్పిగా మారారు, దళితులకు సామాజిక న్యాయం కల్పించాలనే తపనతో సర్వస్వాన్ని లక్ష్య సాధనకే ధారపోశారు. ఆస్తిపాస్తులకు కొదవలేని వ్యక్తి, నిజాం హయాంలో విద్యామంత్రిగా పనిచేసిన వ్యక్తి చివరకు చిన్న గదిలో నిరాడంబరంగా బతికారు. వ్యక్తిగత సంపదను, కీర్తి ప్రతిష్టలను గడ్డిపోచలా త్యజించి, తన జాతి జనుల ఉద్ధరణకు అంకితమైన బీఎస్ వెంకట్రావ్... హైదరాబాద్ అంబేద్కర్‌గా గుర్తింపు పొందిన మహనీ యుడు. ఆయన సికింద్రాబాద్‌లోని న్యూబోయిగూడలో డిసెంబర్ 11, 1898న సాయన్న, ముత్తమ్మ దంపతులకు జన్మించారు.
 
 చదివింది 8వ తరగతే. శిల్పిగా శిక్షణ పొందిన ఆయన దానినే బతుకుదెరువుగా మార్చుకు న్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పునాకు వెళ్లి ఉద్యోగంలో చేరారు. యుద్ధానంతరం హైదరాబాద్‌కి తిరిగి వచ్చి నిజాం సాగర్ ప్రాజెక్టులో అసిస్టెంట్ రిక్రూట్ మెంట్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరారు. కానీ ఉద్యోగం తన ఆశయాలకు అడ్డుగా ఉందని రాజీనామా సమర్పించారు. హైదరాబాద్ రాష్ట్రంలోని అంటరాని కులాల పక్షాన ఉద్యమిస్తున్న భాగ్యరెడ్డివర్మ, దేశ వ్యాప్తంగా అంటరాని కులాల ఉద్యమ నాయకుడిగా వెలుగొందిన బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్‌ల ప్రభావం బీఎస్ వెంక ట్రావ్‌ను సామాజిక న్యాయ పోరాట స్రవంతిలోకి తీసుకు వచ్చాయి. ఆయన ప్రచారానికే పరిమితం కాని ఆచరణ శీలి. మేధాసంపత్తిని ఉపయోగించి సామాజిక ఉద్య మాలు సాగించడం, రాజకీయ వ్యూహంతో ప్రభుత్వాన్ని ఒప్పించడం, ఆర్థిక సంపత్తితో దళితులను ఆదుకొని, వారి ఆత్మస్థైర్యాన్ని పెంచడం అనే త్రిముఖ వ్యూహం ఆయనది.  హైదరాబాద్ రాష్ట్రంలో ఆయన ఎన్నో సంఘాలను స్థాపిం చారు. ఎంతో మంది నాయకులను సమన్వయ పరిచారు. వాటిలో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్, హైదరాబాద్ దళిత జాతి సంఘం, అరుంధతీయ యువజన సంఘం ముఖ్యమైనవి.
 
 నిజాం హయాంలోనే దళిత రిజర్వేషన్లు
 సికింద్రాబాద్‌లోని ఘాస్ మండి ప్రాంతంలో రోడ్డు వెడల్పు ద్వారా ఇళ్లు కోల్పోయిన దళితుల పక్షాన నిలబడి వారికి కొత్త ఇళ్లను నిర్మింపజేయడానికి రాత్రింబవళ్లు కృషి చేశారు. అవసరమైన వాళ్లకు మార్వాడీల ద్వారా అప్పులి ప్పించి తోడ్పడ్డారు. స్వయంగా బిల్డింగ్ కాంట్రాక్టరు కావ టం వల్ల కాలనీ ప్లాన్ తయారు చేసి, కట్టడంలోనూ సహాయపడ్డారు.
 
 ఒకవైపు పేద దళితుల పక్షాన పోరాడుతూనే మరో వైపు ఆ కులాల విద్యార్థులను సమీకరించారు. కౌన్సిలర్‌గా ఉన్న బీఎస్ 1940 డిసెంబర్ 15న పది డిమాండ్లతో ఒక మెమొరాండం ప్రభుత్వానికి సమర్పించారు. అందులో దళిత కులాల విద్యార్థులకు ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, పారితోషికాలు కల్పించి, అర్హులైన వారిని విదేశాల్లో చదు వుకు పంపించాలనేది మొదటి డిమాండ్. ఏడున్నర దశా బ్దాల క్రితమే బీఎస్ ఇలాంటి ఆలోచన చేయడం ఆశ్చర్య కరం.  అంతేకాదు, ప్రభుత్యోద్యోగాలలో, మిలిటరీలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు అప్పటి ప్రభుత్వం అంగీకరించింది. టీచర్లుగా, పోలీస్ ఇన్‌స్పెక్టర్లుగా దళితు లను నియమిస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా ఆయన నేతృత్వం వహించిన డిప్రెస్డ్ క్లాసెన్ అసోసి యేషన్ కూడా శక్తివంతంగా దళిత కులాల సమస్యలను నిజాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలిగింది. అప్పటికీ అంబేద్కర్ ప్రతిపాదించిన ప్రత్యేక నియోజకవర్గాల డిమాండ్‌ను అసోసియేషన్ ముందుకు తీసుకొచ్చింది.
 
  దాదాపు ఆరు అంశాలతో రూపొందించిన చార్టర్ ఆఫ్ డిమాండ్స్‌లో ప్రతి దళిత కుటుంబానికి సాగు భూమి ఇవ్వాలని, దానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. దళితులకు భూమి అనే నేటి డిమాండ్ కోసం నాడే ఎలుగెత్తడం గమనార్హం. 1946 డిసెంబర్ శాసనసభ ఎన్నికల్లో బీఎస్ రిజర్వుడ్ స్థానంలో కాక జనరల్ సీటులో పోటీ చేశారు. పోటీగా నిలిచిన అభ్యర్థులకు అగ్రవర్ణ బలం, ఆర్థిక బలం ఉన్నప్పటికీ దళిత నాయకుడిగా వెంకట్రావ్ విజయం సాధించ గలిగారు.
 
 హైదరాబాద్ రాష్ట్రంలోనే కాక మహారాష్ట్రలో కూడా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 1936 మే 30వ తేదీన బొంబాయిలో జరిగిన ప్రథమ మహర్ సదస్సుకు అధ్యక్షత వహించే అరుదైన గౌరవం వెంక ట్రావ్‌కి దక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వయంగా దాదర్ రైల్వే స్టేషన్‌కి వచ్చి స్వాగతం పలికి ఏనుగు అంబారీపై ఆయనను తీసుకెళ్లారు. ఆ సభలో బీఎస్ వెంక ట్రావ్ ఉర్దూలో చేసిన ప్రసంగం ఎంతో మందిని ఆకట్టుకుంది. ఆ సభలోనే ఉపన్యాసకులు బీఎస్ వెంక ట్రావును హైదరాబాద్ అంబేద్కర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
 
 గరీబుగానూ ప్రజాసేవే!
 1947లో లాయక్ అలీ మంత్రి వర్గంలో విద్యాశాఖ మం త్రిగా బాధ్యతలు స్వీకరించిన బీఎస్ వెంకట్రావ్ ఔరంగా బాద్‌లో అంబేద్కర్ స్థాపించిన మరట్వాడా విశ్వవిద్యాల యానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అంద జేశారు. దానికి నిజాం చేత స్థలాన్ని ఇప్పించింది కూడా వెంకట్రావ్ గారే కావడం విశేషం. ఆయనలాగా  నిస్వార్థ వ్యక్తిత్వంగల వ్యక్తులు అరుదు. సివిల్ కాంట్రాక్టర్‌గా ఆయన ఆనాడే ఎంతో సంపదను గడించారు. ఆయనకు పన్నెండు భవనాలుండేవి. ఘాస్ మండిలో మూడు, మార్వాడీ బస్తీలో రెండు, జీరాలో నాలుగు, న్యూబోయి గూడలో మూడు ఇళ్లు ఉండేవి. బస్సులు కూడా ఉండేవి. అయితే నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఆయన షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వ ఖజానాలో డబ్బు లు లేవు. నిజాం అనుమతితో తన సొంత ఇళ్లనన్నింటినీ కుదవబెట్టి స్కాలర్ షిప్‌లు అందించారు. సరిగ్గా ఆ సమ యంలోనే భారత ప్రభుత్వ మిలిటరీ యాక్షన్‌తో ప్రభు త్వమే పడిపోయింది. అప్పులిచ్చిన వారే ఆ భవనాలన్నీ కాజేశారు. అయినా ఆయన ఏ మాత్రం చెక్కుచెదరలేదు. ఆయన కుటుంబ సభ్యులు నేటికీ రెండు గదుల చిన్న ఇంటిలో జీవనం సాగిస్తున్నారు! 1950 తరువాత కూడా బీఎస్ వెంకట్రావ్ రాజకీయాల్లో నుంచి వైదొలగలేదు. 1951లో ఇండిపెండెంట్‌గా రాజ్యసభకు ఎన్నిక కావడం దళిత నాయకునిగానే గాక, ప్రజా నేతగా ఆయనకున్న పేరు ప్రతిష్టలకు అదే నిదర్శనం. 1953 నవంబర్ 4న ఆ అసాధారణ నేత కన్నుమూశారు.
 
20వ శతాబ్దం అర్థ భాగంలోని హైదరాబాద్ దళిత ఉద్యమ చరిత్రను రచించిన బీఎస్ సహచరుడు పీఆర్ వెంకటస్వామి మాటల్లో చెప్పాలంటే ‘‘బీఎస్ వెంకట్రావ్ ఒక పిడుగు లాగా రాజకీయాల్లోకి వచ్చాడు. 30 ఏళ్ల పాటు తిరుగులేని నాయకుడిగా నిలిచి వెలిగాడు. బంగారు బస్తీలోని సాయన్న అనే సామాన్యుని కొడుకు జాతికే వెలుగవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆ నిస్వార్థ ప్రజాసేవకుని ప్రజలు మన్ననతో ‘రావ్ సాహెబ్’ అని ఆప్యాయంగా పిలిపించుకోగలిగారు. ఆయన గుండె దిటవు, మాట గాంభీర్యత, సేవానిరతి పరిశీలించినప్పుడు ఆ రోజుల్లోని నాయకుల్లో అతనొక శిఖరంగా కనిపిస్తాడు. అలాంటి వ్యక్తి మళ్లీ మనలో కనిపించడు. అతను లేని లోటు మరెవరూ పూడ్చలేరు. బీఎస్ వెంకట్రావ్ మర ణంతో మా పోరాటం ముగిసిపోయింది.’’
  (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
 మొబైల్ నం: 9705566213)
 మల్లెపల్లి లక్ష్మయ్య

మరిన్ని వార్తలు