చెట్టూ చేమా.... రచన...

4 Nov, 2013 01:12 IST|Sakshi
చెట్టూ చేమా.... రచన...

పుస్తకం నుంచి...
తుపాను హెచ్చరికలు వినిపిస్తే తప్ప ఆకాశం వైపు చూడని రోజులొచ్చాయి. గ్రహణం రోజు తప్ప చంద్రుణ్ణి పరికించే తీరిక లేని దురదృష్టం. పాఠకులు సరే. రచయితలన్నా చూస్తున్నారా? పాఠకులను అటు చూడమని చెప్తున్నారా. అలాంటి పాత్రలు సృష్టిస్తున్నారా? ఊరటనిచ్చే జీవితాన్ని ప్రేరేపించే ప్రకృతి ప్రేమని బుచ్చిబాబు పలుమార్లు రాశారు. ఆయన ఆత్మకథ ‘నా అంతరంగ కథనం’ నుంచి ఈ వ్యాసఖండం.
 
 ‘‘మేం బాపట్లలో ఉన్న రోజులు. స్కూల్లో భూగోళ శాస్త్ర పాఠాలు తప్ప, స్కూలు పాఠాలు నాకెక్కలేదు. పొపకాటు పటల్, సవానా, సస్కాచివాన్, నయగారా, అమెజాన్ అడవులు, జాంబెసి... ఈ పేర్లు మధురంగా ఉండేవి. తరచూ పేలే వెసూవియస్ అగ్నిపర్వతం, దోవ తప్పి ప్రవహించే చైనాలో నదులు, భూకంపాలకు గురి అయ్యే జపాన్, తెల్లవారు చూడని టిబెట్ ప్రాంతం, ట్రాన్స్ సైబీరియన్ రైల్వే- ఇవన్నీ అద్భుతంగా తోచేవి. అగ్నిపర్వతాలు, భూకంపాలు, టార్పెడొలు, ఉత్తర ధ్రువంలో మంచుకొండలు, హిమాలయ శిఖరాల మీద నుండి జారే మంచు నదులు ఇవన్నీ ప్రత్యక్షంగా చూడాలనిపించేది.


 బాపట్లలోనే కొన్ని రోజులు మా అమ్మమ్మ ఉండేది మాతో. ఆ ఊళ్లో ఆలయంలో ఒక నెలరోజుల పురాణ కాలక్షేపమూ, హరికథలూ జరిగేవి. వాటిని వినేటందుకు బండి మీద అమ్మమ్మను తీసుకు వెళ్లేవాడిని. ఏసూ బేగ్ అనే మా నౌకర్ కూడా మాకు తోడుగా వచ్చేవాడు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ వచ్చేవారు. స్త్రీలలో చాలామంది వితంతువులే. ఈ హరికథలు, పురాణ కాలక్షేపాలు కేవలం వితంతువుల కోసమే అనుకొనేవాడిని. మొదటి రోజుల్లో నిద్రపోయినా రాను రాను హరిదాసు ఛలోక్తులతో, పిట్టకథలతో ఆకర్షించి, లేచి కూర్చునేటట్టు చేసేవారు. రామాయణ కథలో సీత, ఊర్మిళ, మండోదరి మొదలైన స్త్రీలకి ప్రాముఖ్యం ఉండేది.
 
  సీత ఒక గొప్ప వ్యక్తిగా, మహా ఇల్లాలుగా నాలో ఒక అభిప్రాయం ఏర్పడింది. అమెలో హుందాతనం, నమ్రత, అమాయకత్వంతో కూడుకున్న వ్యక్తిత్వం- నాకెంతో గొప్పలక్షణంగా కనబడ్డాయి. ఎందుకా అని అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆమె నిరాడంబర జీవి. ఆభరణాలు విడిచేసి మేడలు, మిద్దెలు వదిలేసి నార చీరతో భర్తతో అడవులకు సిద్ధమైంది. రెండు- నాకు మల్లే సీతకి పూరి గుడిసెలు, చెట్లు, మొక్కలు, సెలయేళ్లు, పక్షులు, జంతువులు ఇష్టం. అరటి చెట్లు, లేళ్లు, సెలయేర్లు, పూలు, పిట్టలు- ప్రకృతి కావాలి. ఆమెకి నాగరికత అక్కర్లేదు. అందుకే సీతంటే గౌరవం.  ఇలా నాగరికత నుండి ప్రకృతిలోకి పారిపోయే వ్యక్తులన్నా, అట్టివారిని గూర్చిన కథలన్నా నాకెంతో ఇష్టం. అలా నాకు ఇష్టుడైన  రచయిత రాబర్టు లూయీ స్టెవెన్సన్.
 
 ఈయన గాడిద మీద అడవుల్లో సంచరించాడు. ఒక్కడూ నట్టడివిలో, కొండలోయల్లో, నక్షత్రాలకేసి చూస్తూ, గడ్డిలో పడుకుని, మిణుగురు పురుగుల మైత్రి చేశాడు. సోమర్‌సెట్ మామ్ రచనలంటే నాకిష్టం ఏర్పడ్డానికి ఆయన ఇల్లాంటి వ్యక్తులని గురించి ఎక్కువగా రాయడమే కారణమనుకుంటాను. ‘మూన్ అండ్ సిక్స్ పెన్’ అనే నవలలో నాయకుడు, పెళ్లాం పిల్లలు- సంసారం త్యజించి నాగరికతకే దూరమైన, నిర్జనమైన స్థలంలోకి పారిపోతాడు. ‘రేజర్స్ ఎడ్జి’ అనే నవలలో నాయకుడు పెద్ద హోదాగల ఉద్యోగం, విద్యాధికురాలై తన్ను ప్రేమించిన స్త్రీని విడిచేసి దేశదిమ్మరై దేన్నో అన్వేషిస్తూ తిరుగుతాడు. అయితే అందరు ఇల్లాగ ప్రకృతిలోకి పారిపోవాలి అనను. కొందరం బస్తీలలో ఉండి నాగరికతను పెంపొందించే సామాజిక విలువల్ని సాధించి, పాటుపడి నిత్య జీవితపు రథచక్రాల్ని నెట్టాల్సిందే. కాని కొందరు ఇల్లా ఉండలేరు. వారికి ప్రశాంత వాతావరణం కావాలి.  పోటీ పడలేరు. దానితో వచ్చే పలుకుబడి, హోదా వారికి అక్కరలేదు. విశ్వాన్ని తిలకించడంలో ఆనందం ఉంది. ఆ ఆనందం వారికి కావాలి. సీత ఈ మహదానందాన్ని అనుక్షణమూ అనుభవించగలిగిన మహా ఇల్లాలు.
 
 నాగరికత పరాకాష్ఠనందుకున్న ఉన్నత దశలో ద్రౌపది లాంటి స్త్రీ ఆ నాగరికతకి ప్రతినిధిగా బైలుదేరొచ్చుగాని సీత వంటి స్త్రీలు అప్పుడవతరించరు. దీన్నొక ప్రాచీనతత్వం (ప్రిమిటివిజమ్) అనుకున్నా తప్పులేదు. మట్టిలోంచి పుట్టింది. మళ్లా మట్టిలోకే చేరుకుంటుంది సీత. భూగర్భంలో ఉద్భవించి మళ్లా భూదేవిలో ఐక్యం అయినట్లు చూపడం మహా ప్రతిభాశాలికే సాధ్యమౌతుంది. ఆమె జీవితం అంతా ఉద్యానవనాలలోనూ, అడవుల్లోనూ గడిపింది. లంక నుండి తిరిగి వచ్చాక ఎన్నో రోజులు రాజభవనంలో ఉండలేదు. నీ కోర్కె ఏమిటంటే- రుష్యాశ్రమంలోకి వెళ్లాలని ఉందని చెప్పుకుంది. అట్లా కోరిందని ఊహిస్తేనే నా కళ్లంట నీళ్లు తిరుగుతాయి. రేడియోలు, సినిమాలు, కార్లు, విమానాలు, నగలు, చీరలు, పుట్టింటివారికి కానుకలు- ఇవేవీ అడగలేదు. తోటలో, పాకలో ఉండాలని ఉందిట. కంచర్ల గోపన్న (రామదాసు) వెర్రివాడు. సీతమ్మకి చేయిస్తి చింతాకు పతకాము అని రాముడితో మొరెట్టుకున్నాడు. ఆయన రామభక్తుడు. సీతను ఎరగడు. ఎరిగి ఉంటే సీతమ్మకు వేయిస్తి మామిడి తోపు అని పాడి ఉండును. నాగరికతను విడిచేసి ప్రకృతిలోకి పారిపోవాలన్నది పాశ్చాత్య దేశాలలో ఉద్యమంగా లేవ దీసింది ‘రూసో’. టాల్‌స్టాయ్ ఆస్తినంతా వప్పగించేసి, వేరే ఆశ్రమం ఏర్పరుచుకున్నాడు. గాంధీగారు ఆఫ్రికాలో ఫీనిక్స్ ఆశ్రమం ఏర్పరుచుకున్నారు. మనవారిలో వేమన్న ప్రకృతిలోకి పారిపోయి నగ్నంగా జీవించాడు.
 
 జవహర్‌లాల్ నెహ్రూ తన చివరి రోజుల్లో ‘నాలోన కొండల నడుమ తిరుగాడే ఆటవికుడు వొక్కడున్నాడు’ అని ఎక్కడో చెప్పుకున్నాడు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీకి ఆటవికుల మధ్య గడపాలన్న కోరిక ఉండేది. అది సాధ్యం కాక ఆటవికులని గురించిన పుస్తకాలు చదవడంలో తృప్తి పడింది. ఈ ప్రాచీనతత్వం ఛాయలు నన్ను కూడా ప్రేరేపించాయి. అందుకే యెంకి, నాయుడుబావల ప్రేమ కథనంగా ‘ఉత్తమ ఇల్లాలు’ నాటకం రాశాను.’’
 (ఈ పుస్తకం విశాలాంధ్రలో లభ్యం. వెల: రూ. 55)

మరిన్ని వార్తలు