శబ్దతపస్సులో సముద్రం

19 Jun, 2017 00:19 IST|Sakshi
శబ్దతపస్సులో సముద్రం

నిన్న  సాయంత్రం సముద్రాన్ని దర్శించాను
అదే సముద్రం, చిన్నప్పటినుంచి విన్నది, కన్నది,
ఎంత దగ్గరగా చూసినా ఇంకా అపరిచితమైనది,
ఎన్ని ధ్వని తరంగాల్ని çసృష్టించి, సంపుటీకరించినా
ఇంకా శబ్దంలో తపస్సు చేస్తున్నది
ఓ మాట అటూ ఇటైతే చాలు, కళ్లల్లోకి కళ్లుపెట్టి చూస్తున్నది
కలవరపెడుతున్నది, కలల్ని పంచుతున్నది
ఎన్ని పడుచు గుండెలకు పాట నేర్పిన సముద్రమో
ఎన్ని జంటగీతాలకు కొత్త వరసలు కూర్చిన సంగీతమో
ఎన్ని అనుప్రాసల హŸయలొలికిన లకుమ నృత్య నీరాజనమో
ఎన్ని నల్లని రాళ్ల గుండె సడి వినిపించిన విశ్వంభర గీతమో
ఎంత మానవాభ్యుదయాన్ని కీర్తించిన ఆధునికతా
    భాష్య ప్రస్థానమో

తెలుగు పదసిరిని పలుకు పలుకులో రవళించింది
తెలుగయ్యల విభవాన్ని మళ్లీ జ్ఞానపీఠినెక్కించింది
భావగంగోత్రి ప్రవహించి ప్రవహించి
కవితా సముద్రమై కళ్లెదుట నిలిచింది

నిన్న సాయంత్రం అదే సముద్రాన్ని చూశాను
అలల హోరు తగ్గిన శబ్దసముద్రాన్ని చూశాను
‘లోకజ్ఞత’ విశ్రమించిన భావసముద్రాన్ని చూశాను
ఒకప్పుడు గళం వెంట ఉరకలెత్తిన శబ్దం
ఇప్పుడు కనులలో రేకులు విప్పుతోంది
అప్పుడు వడివడిగా ధ్వనించేది
ఇప్పుడు తడితడిగా ధ్యానిస్తోంది
‘విస్మృతిలో స్మృతి’ వెన్నెల దర్శిస్తోంది

పండిన దోసపండులా అదే పసిడివన్నె మోము
కంటి చూపులో తళుక్కుమనే తడి దోసగింజ మెరుపు
పెదాలపై అదే చల్లందనాల మందహాసం
ఒక్కమాటయినా, అదే ఆర్ద్ర స్విన్న వాక్యం
‘వాక్యం రసాత్మకం కావ్యం’గా సాగిన వాక్ప్రవాహం
‘రమణీయార్థ ప్రతిపాదకశ్శబ్దం’ జల్లుల్ని చిందిస్తున్న వైనం
అయినా అదేమి చిత్రమో, ఆగని కవితాగానం
గొంతు విప్పితే అదే భారతీ దేవి వీణానిక్వణం

మహాంధ్రభారతి ముంజేతి చిలుక తెలుగుపాట సినారె
బహుళోక్తి మయ ప్రపంచంలో తెలుగు సిరుల
    వెలుగుతోట సినారె

(ఈ ఫిబ్రవరి 28న ప్రపంచ కవితా దిన సందర్భంగా సినారెను దర్శించినప్పుడు పొందిన కలత అనుభూతిలో)

                       - ప్రొ. గంగిశెట్టి లక్ష్మినారాయణ
                             9441809566


 

మరిన్ని వార్తలు