‘మరణం నను వరించి వస్తే ఏమంటాను’

24 Jul, 2017 00:25 IST|Sakshi
‘మరణం నను వరించి వస్తే ఏమంటాను’

జూలై 29న సినారె జయంతి
ప్రణయానికి రూఢికెక్కిన గజల్‌ను మానవీయ దక్పథానికీ ప్రగతిశీలానికీ వాహికగా స్వీకరించడం సినారె గజళ్ళలోని విశేషం. గజల్‌ ప్రణయేతరాలను తీసుకోవడం సరికొత్త ప్రయోగం కూడా. ఉర్దూలో కూడా గజల్‌ను అధిక్షేపానికి మలుచుకున్న వాళ్ళున్నారు. ఫైజ్‌ అహమ్మద్‌ ఫైజ్, సాహిర్‌ లుద్యాన్వీ వంటివారు ఈ ప్రయోగంలో విజయం సాధించారు.

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి కమ్మగా పాడతారని కేవలం ఆయన కవిత్వంతోనే పరిచయం ఉన్నవారికి తెలియకపోవచ్చు. ప్రత్యక్షంగా ఆయనను వినటం తటస్థిస్తే నిజంగా అదో అనుభవం! మాటలో, పాటలో, హావభావాల్లో ఒక వింత లయను నిసర్గ రమ్యంగా కూర్చుకున్న విశిష్ట కవి సినారె.

ఆయన ‘తెలుగు గజళ్ళు’ పుస్తకం 1984లో వెలువడింది. దీనిలో 35 గజళ్ళున్నాయి. ఆ రోజుల్లోనే కవి వీటిని స్వయంగా గానం చేసి బాణీలు కూడా కూర్చి క్యాసెట్ల రూపంలో విడుదల చేశారు. విడుదల సభల్లో బాష్ప తుషారాలు నిండటం అనేకుల స్మృతిపథాల్లో నిలిచిపోయింది. కవే గాయకుడుగా రవళించటం తెలుగులో ఇదే ప్రథమం.

తెలుగు గజళ్ళు సంపుటిలోని అనేక చరణాలకు ఎగిరే రెక్కలున్నాయి. దూసుకుపోయే నైశిత్యముంది. ‘రాతిరియున్‌   పవల్‌ మరపురాని’ కలవరముంది. వినగానే గుర్తుండిపోయే ధారణానుకూల శిల్పముంది. కళ్ళకు కనిపించే అక్షరాల వెనక వినిపించే రాగమాలికలున్నాయి.

గజల్‌ అంటే ఆడవాళ్ళతో మాట్లాడటం అని కొందరు రాశారు. ‘మాషో కాసే గుఫ్తగూ’ అని కొందరు విమర్శకులన్నారు. అంటే ప్రియురాలితో సల్లాపం అన్నమాట! నారాయణరెడ్డి రెండో అర్థాన్ని గ్రహించనట్టున్నది.
గజల్‌కు కొన్ని లక్షణాలున్నాయి. గజల్‌ పల్లవిని ‘మత్లా’ అనీ, చరణాన్ని ‘మక్తా’ అనీ అంటారు. చరణం చివర రెండు రకాల ప్రాసలుంటాయి. వాటిని ‘రదీప్‌ కాఫియా’లంటారు. రదీప్‌ కాఫియాలు గజల్‌ ప్రధాన లక్షణాలు. రదీప్‌ అంటే అంత్యప్రాస. కాఫియా అంటే అంత్యప్రాసకు పూర్వపదం.

ఉదాహరణకు:
‘మంచు పొగలుండేవి మరికొన్ని నిమిషాలే
ఆ పిదప నిండేవి ఆదిత్య కిరణాలే’
అనేది పల్లవి. దీనిలోని ‘కిరణాలే’ అనే మాట తర్వాతి రెండు పాదాల్లో వచ్చే అంత్యప్రాసలను రూపొందిస్తుంది. ‘చరణాలే’, ‘హృదయాలే’, ‘నయనాలే’, ‘ఉదయాలే’ అనే మాటల్లో ‘అలె’ అనేది రదీప్‌. దీనికి పూర్వపదాలుగా భిన్నపదాలుండవచ్చు. రదీప్‌ను ఏక పద పునరుక్తిగా కొందరు పొరపడుతుంటారు. తెలుగు ఛంద:ప్రమాణాలు కూడా గజల్‌కు పూర్తిగా పట్టవు. ‘వసంతం’, ‘సుఖాంతం’, ‘దిగంతం’ అనే రదీపుల్లో స్థూల దృష్టికి అంత్యప్రాసలు కుదరలేదనిపిస్తుంది. ఉర్దూ తెలిసిన చెవికైతే సుఖంగా పడ్డ మాటలు అనిపిస్తాయి. ఉర్దూలో ‘దీవార్‌’, ‘కిర్దార్‌’, ‘హత్యార్‌’, ‘బాకార్‌’’ అనేవి రదీపులు. ‘ఆర్‌’ అంత్యప్రాస. అంత్యప్రాసకు ముఖ్యమైన స్వరం ‘ఆర్‌’. అంత్యప్రాస నియుక్తికి దోహదం చేసిన పరమ ధ్వనిమంతమైన యూనిట్‌ ఇది. అట్లాగే కాఫియా అంటే అంత్యప్రాసకు పూర్వపదం అనుకున్నాం. ఇది అంత్యప్రాసను పెంచే మారాకు.

‘ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక
ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక’
అన్న రెండో గజల్‌లో ‘తీయని కోరిక’, ‘మెత్తని మాలిక’, ‘తీరని వేడుక’, ‘పచ్చని వాటిక’, ‘పల్చని జీవిక’ల్లోని అంత్యప్రాస పూర్వపదాలు కాఫియాలు. మరో గజల్‌లో కంఠశోష, శ్వాస, ఘోష, ధ్యాస, ఆశ అనే ప్రాసలున్నాయి. ఉర్దూ సంప్రదాయం తెలియనివారికి ష, శ, స లకు ప్రాసలేమిటి అనిపిస్తుంది.

ప్రణయానికి రూఢికెక్కిన గజల్‌ను మానవీయ దృక్పథానికీ ప్రగతిశీలానికీ వాహికగా స్వీకరించడం ఈ గజళ్ళలోని విశేషం. ప్రణయం గజల్‌ మూలతత్త్వం కాదు. అది ప్రక్రియ. గజల్‌ ప్రణయేతరాలను తీసుకోవడం సరికొత్త ప్రయోగం కూడా. ఉర్దూలో కూడా గజల్‌ను అధిక్షేపానికి మలుచుకున్న వాళ్ళున్నారు. ఫైజ్‌ అహమ్మద్‌ ఫైజ్, సాహిర్‌ లుద్యాన్వీ వంటివారు ఈ ప్రయోగంలో విజయం సాధించారు. సినారెకు ప్రణయం కొత్త కాదు. సినీ గీతాల్లో ముఖ్యంగా ‘ఏకవీర’లో గజల్‌ ప్రయోగాలు చేశారు. ఇక చాలనుకున్నారేమో! గజల్‌ పంజరంలోంచి ప్రణయాన్ని తప్పించడం వల్ల వచ్చిన ప్రళయం ఏమీ లేదు.

గజళ్ళలో ఏకసూత్రత ఉండాలనే నిర్బంధం కూడా ఏమీ లేదు. అవి ముక్తకాలు. ఏ పాదానికాపాదం స్వతంత్రంగా వుంటుంది. గజళ్ళు కొసమెరుపుల్తో తీయగా కాటేస్తాయి. కాటునిండా అమృతం. వాటిలో అనుస్యూతంగా ఉండే విద్యుత్తు గానమే కాని భావం కాదు. ‘నజమ్‌’ అయితే వస్త్వైక్యం అవసరం. గజల్‌లో వచ్చిన భావమే మళ్ళీ రావొచ్చు. భావ ప్రయోగం ఐచ్ఛికం.

ఇక వస్తువు విషయానికి వస్తే సినారె కవిత్వంలో ‘విశ్వంభర’కు ముందు నుంచి కూడా తాత్త్విక ఛాయలు కనపడుతున్నాయి. విశ్వంభరలో మరీ ఎక్కువ. ‘మరణం నను వరించి వస్తే’ అని పైకి సరదాగా కనిపించే ఈ గజల్‌ను చూడండి.
మరణం నను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను
పాలుపట్టి జోలపాడి పడుకోమంటాను                ‘‘మరణం‘‘
లంచం నను భజించి వస్తే ఏమంటాను నేనేమంటాను
తిరుమల గిరి హుండీలో జొరబడమంటాను                ‘‘లంచం‘‘
కామం నను కలవరపెడితే ఏమంటాను నేనేమంటాను
అలిగి వున్న పడుచు జంటతో కలబడమంటాను                ‘‘కామం‘‘
క్రోధం నను కవ్విస్తుంటే ఏమంటాను నేనేమంటాను
పస చచ్చిన పేడి జాతిలో బుసలిడమంటాను                ‘‘క్రోధం‘‘
లోభం నను బులిపిస్తుంటే ఏమంటాను నేనేమంటాను
తెగ వొలికే కవి పలుకుల్లో దిగబడమంటాను                ‘‘లోభం‘‘
అహంకార మెదురై వస్తే ఏమంటాను నేనేమంటాను
నరుని వదలి కొండనెత్తిలో స్థిరపడమంటాను                ‘‘అహంకారం‘‘
కాలం పులిలా గాండ్రిస్తే ఏమంటాను నేనేమంటాను
దిగులెందుకు ఓయి సినారె తెగబడమంటాను                ‘‘కాలం‘‘

దీనిలో కవి మరణానికి భయపడడు. పైగా మరణంలో ప్రేయసీత్వాన్నీ సహచరీత్వాన్ని దర్శిస్తాడు. సూఫీ కవుల్లో, రవీంద్రునిలో కూడా ఈ ధోరణి కనిపిస్తుంది. దీనిలో సినారె ప్రదర్శించిన నవ్యత ఏమిటంటే మరణం అనివార్యమని గ్రహిస్తూనే తప్పని మరణాన్ని చూసి నీరుగారిపోక, దాన్ని శిశువుగా మార్చుకొని తాత్త్వికస్పర్శతో జోకొడతారు. మరణంలో మరోప్రాణి వికాసాన్ని భావించడం దీనిలో కనిపిస్తుంది. ‘చావులో చావకు చావులో జన్మించు, నిరంతర సజీవ చైతన్యవంతుడికి చావు పక్కలో నిదురపోయే పసిపాప వంటిది’ అని భావం. ‘మృతిలోనే బతుకంతా నవ్వుకుంటా’ అంటాడు ఫైజ్‌ ఓ చోట.

గజల్‌కి చివర తఖల్లుస్‌ (కవి నామ ముద్ర) ఉంటుంది. గీతం చివర కవి తన్ను తాను సంబోధించుకుంటాడు. ‘సినారె’ అనేది ఈ గీతాల్లోని తఖల్లుస్‌. సంప్రదాయం తెలియని వారికి ఇది ఆత్మాశ్రయ ధోరణిగా తోచవచ్చు. సామాజికానికీ ఆత్మాశ్రయానికీ మధ్య స్పష్టమైన గీత గీయడం కష్టం. శ్రీశ్రీ ‘ఐ’లో వినగలిగితే సామాజిక స్పందనలు వినిపిస్తాయి. ‘వేమన’ను ఆత్మాశ్రయ కవిగా తేల్చలేము కదా! సినారె తఖల్లుస్‌లో ప్రగతి ధ్వనులు వినిపిస్తాయి.

‘గజల్‌’కు తెలుగు పేరు కాయన్‌  చెయ్యకుండా తెలుగు గజళ్ళు అని పేరు పెట్టడం ఉచితంగా వుంది. సానెట్‌ను సానెట్‌ అంటేనే బాగుంటుంది. తెలుగు గజళ్ళు తెలుగు కవితా రంగంలో మంచి ప్రయోగం. సామాజిక వస్తువుతో రాయడం అప్పటికి తెలుగులో తొలి ప్రయత్నం.
    డాక్టర్‌ ఎన్‌ .గోపి
    040–27037585

మరిన్ని వార్తలు