పౌర సమాజమే పగ్గమేయాలి

23 Jul, 2015 23:38 IST|Sakshi
పౌర సమాజమే పగ్గమేయాలి

సమకాలీనం
 
పౌరసమాజంలో చైతన్యం కొరవడటాన్ని అలుసుగా తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను వచ్చే నాలుగేళ్లు అదే పౌరసమాజం భరించాలి. ప్రభుత్వ దాష్టీకాలతో వేడి తగులుతున్నది నాక్కాదు కదా అని, ఎవరికి వారు నిమ్మలంగా కూర్చుంటే, ఏదో రోజు వేడిసెగ నీ డ్రాయింగ్ రూమ్‌లోకీ చొచ్చుకువస్తుంది. ప్రపంచం కీర్తిస్తున్న ఆమోదయోగ్య పాలనా వ్యవస్థ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య ఫలాలు అందుకునేందుకు, నిరంతర అప్రమత్తతే మనం చెల్లించే మూల్యం అంటారు విజ్ఞులు.
 
 ‘‘మొదట వాళ్లు సామ్యవాదుల కోసం వచ్చారు.
 నేను సామ్యవాదిని కాదు కదా! అని మాట్లాడలే.
 తర్వాత వాళ్లు కార్మిక సంఘాల వారి కోసం వచ్చారు,
 నేను కార్మిక సంఘం వాడ్ని కాదు కదా, అని స్పందించలే!
 తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు,
 నేను యూదును కాదు కదా అని మాట్లాడలేదు.
 ..... ఆ తర్వాత వాళ్లు నా కోసం వచ్చారు,
 చూద్దును కదా! నా కోసం మాట్లాడే వాళ్లెవరూ మిగలలే!’’

జర్మనీలో నాజీల దాష్టీకాలను నిరసిస్తూ గళమెత్తిన మార్టిన్ నీమొల్లర్ చెప్పిన ఈ పంక్తులు రాజ్యం అణచివేతకు వ్యతిరేకంగా ప్రపంచం నలుమూ లల సాగిన ఎన్నో ప్రజాపోరాటాలకివి స్ఫూర్తి వాక్యాలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడీ స్ఫూర్తి కొరవడుతోంది. పాలనా వ్యవస్థల నుంచి ఎన్ని దాష్టీకాలు, ఎన్నెన్ని దురాగతాలు నిరాఘాటంగా సాగుతున్నా పౌర సమాజం నిర్లిప్తంగా, చేతనా రహితంగా ఉంటోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఏం చేసినా తమకు ఎదురులేద న్నట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దల నిర్వాకాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. నిన్నటికి నిన్న....ఉద్యోగ బాధ్యతే కర్తవ్యంగా ప్రాణాలను పణంగా పెట్టి ఇసుక దోపిడీని అడ్డుకొన్న ఓ మహిళా అధికారికి చివరకు దక్కిందేంటి? అవార్డుతో సన్మానించాల్సిన ఎమ్మార్వోది తప్పని, ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డ పాలకపక్ష ఎమ్మెల్యేకి అండగా నిలవాలని రాష్ట్ర మంత్రి వర్గమే నిర్ణయిస్తే... ఇక అరాచకాలకు అడ్డేది? నియమబద్ధ పాలనకు దిక్కేది? ఈ దుస్థితిని నిలదీసే స్వరమే లేకుండాపోతోంది తెలుగునేలపై. ఏదో సామెత చెప్పినట్టు, ఏదీ తమ దాకా వస్తే గాని ఈ జనాలకు పట్టేలా లేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే, ఏమిటిదని నిలదీస్తే... రాజకీయం చేస్తున్నారంటూ ఓ ప్రతి విమర్శ చేసి, ఏమీ పట్టనట్టు పాలకులు దులిపేసుకొని పోతున్నారు. ఇది తమకేమాత్రం పట్టని వ్యవహారమన్నట్టు పౌర సమాజం మౌన ప్రేక్షక పాత్ర వహిస్తోంది. దాన్నే జనామోదంగా చెప్పుకుంటూ, తప్పు చేసిన వారే గొంతు పెంచి జబ్బలు చరచుకునే అవాంఛనీయ స్థితి రోజురోజుకూ బలపడుతోంది.

దేనికి బాధ్యత వహించారని!
ఎన్నికల్లో గెలవడమంటే, ఏం చేయడానికైనా లెసైన్సు అనే దురభిప్రాయం పాలకుల్లో బలపడుతోంది. ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలకు వీసీలు లేక ఉన్నత విద్య గంగలో కలిసినా ప్రజలు ఉద్యమించట్లేదు. నిర్దాక్షిణ్యంగా ఇరవై మంది కూలీల్ని ఎర్రచందనం స్మగ్లర్ల ముద్ర వేసి సర్కారు కాల్చి చంపినా పౌర సమాజం గట్టి స్వరంతో ఇదేంటని ప్రశ్నించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొండాటాడి అయిదు కోట్ల డీల్‌లో... యాభై లక్షల రూపాయల నోట్ల కట్ట లతో ఓ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డా పౌరసమాజం గొంతు పెగ ల్లేదు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి జరిపిన ఏర్పాట్లు వెలవెలబోయి, పుణ్యం చేకూరుస్తుందనుకున్న పుష్కర ఘాటే 28 మందికి వధ్యశిలగా మారినా సభ్య సమాజం చోద్యం చూసింది. రాష్ట్ర ప్రభుత్వపు అధినేత ప్రచార యావే, అసాధారణ తొక్కిసలాటకు కారణమైనా... ఏమీ జరగనట్టే తెల్లా రింది, రెండు వారాల పుష్కరోత్సవం కూడా ముగుస్తోంది.

ఎమ్మార్వోపై ఎమ్మెల్యే దాడి పైన ఉన్నతస్థాయి విచారణ అన్నారు, ఇప్పుడేమీ లేదు. తొక్కిసలాట మరణాలపై న్యాయ విచారణ అన్నారు, రేపు దాన్నెంత నీరు గారుస్తారో తెలీదు. అన్ని అరిష్టాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పెద్ద అయిన ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ విషయం లోనైనా విమర్శిస్తే వింతైన అన్వయాలు చెబుతున్నారు. రాష్ట్రం ఏమైనా సరే, అలా విమర్శించడం తప్పని, అది తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు వత్తాసు పలకడమనో, విపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూల మనో, చంద్రబాబునాయుడ్ని అప్రదిష్ట పాల్జేయడానికనో సిద్ధాంతీకరి స్తున్నారు. రాజకీయ పార్టీల వారెవరైనా విమర్శిస్తే, గత చరిత్ర వల్లెవేస్తూనో, అసందర్భపు ప్రస్తావనతోనో... ‘మీకా నైతిక హక్కు లేదు’ అంటారు. అన్ని హక్కులున్న పౌర సమాజం ఏమీ ప్రశ్నించదని ధీమా కాకపోతే, జనం అడిగితేనైనా సమాధానం చెప్పాలి కదా! అన్న ఇంగితం కూడా ఉండట్లేదు.

పోరాటాల పురిటిగడ్డకేమైంది?
మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో పౌరసమాజం నిస్తేజంగా కనిపిస్తోంది. మహామహా పోరాటయోధుల పురిటిగడ్డ ఇదేనా? అనే సందేహం కలుగు తోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత అక్కడ పెద్దగా పౌర ఉద్యమాల అలికిడే లేదు. ఫక్తు వ్యాపార దృక్పథంతో, పాలకపక్షాలతో అంటకాగే కార్పొరేట్ శక్తులు, సంపన్నవర్గాల ఆధిపత్యంలోకి మెజారిటీ ప్రాంతాలు జారి పోవడం ఒక విపరిణామమే! వారి స్వప్రయోజనాలే రాష్ట్రప్రయోజనాలవు తున్నాయి, వారికిష్టమైందే అమలవుతోంది. వారికి నచ్చందేదీ రాష్ట్రప్రజలకు అవసరం లేనిదవుతోంది. ఇది చూసి, కడుపు రగిలిపోతున్న మెజారిటీ ప్రజలు ఎవరికి వారే కుమిలిపోతున్నారు. వారిని ఉద్యమ బాటకెక్కించే శక్తులేవీ పౌరసమాజంలో బలంగా లేవు.

విశాలాంధ్ర ఏర్పడ్డాక, దశాబ్దాల తరబడి హైదరాబాద్ కేంద్రంగా జరిగిన పౌరహక్కుల పోరాటాలు, ప్రజాం దోళనలకు నేతృత్వం వహిస్తున్నది తెలంగాణ వారో, ఆంధ్రప్రాంతపు వారే అయినా... హైదరాబాద్‌లో స్థిరపడ్డ వారో అవడం కూడా ఇందుకో కారణం కావచ్చు. జనాందోళనలకు సంబంధించి అస్తిత్వపరమైన కొత్త తరం నాయ కత్వం ఇక్కడ ఎదిగి రాలేదేమోనన్న భావన వ్యక్తమౌతోంది. 1956కు పూర్వం ఈ ప్రాంతంలో జ్వలించిన పౌర చైతన్యంతో పోలిస్తే, ఇప్పుడే చైతన్యం లేనట్టే లెక్క. రంపచోడవరం, నర్సీపట్నం కేంద్రంగా మన్యంవీరుడు అల్లూరి సీతా రామరాజు నడిపిన సాయుధ పోరు నుంచి స్వాతంత్య్రోద్యమ కాలంలో వేది కయిన చీరాల-పేరాల, మలబారు పోలీసుల్ని మదనపల్లె తిప్పికొట్టిన ఆందో ళనల వరకు ఎన్ని పోరాటాలో! అంతకు ముందు సామాజిక చైతన్యం రగి ల్చిన త్రిపురనేని రామస్వామి చౌదరి, స్వాతంత్య్ర సమరయోధులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ వంటి వైతాళికుల నుంచి వామపక్ష ఉద్యమకారుల దాకా ఈ ప్రాంతానికి పెద్ద చరిత్రే ఉంది.

పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి (శివసాగర్), తెన్నేటి విశ్వ నాథం, గౌతు లచ్చన్న వంటి యోద్ధలకు నెలవైన నేల. ఆచార్య రంగా, వావి లాల గోపాలకృష్ణయ్య, ఎం.వి.రమణారెడ్డి, డా.రాజశేఖరరెడ్డి, మైసూరారెడ్డి వంటి నాయకులెందరో రాజకీయ- రాజకీయేతరంగా, సామాజికంగా కూడా ఎన్నో ప్రజాందోళనలు, ఉద్యమాలను నడిపి పౌర సమాజాన్ని నిరంతరం చైతన్యశీలిగా ఉంచారు. ఇప్పుడా జాడలే లేవు. విపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ప్రజా సమస్యకు స్పందిస్తూ  జనంలోకి వెళుతున్నా, రాజకీయపక్షాలైనా, ప్రసారమాధ్యమాలైనా దాన్ని రాజకీయ దృష్టికోణంలోనే చూస్తున్నాయి. ముఖ్యంగా మధ్య కోస్తా జిల్లాలు పాలకపక్షపు అతిచేష్టలకు, నిష్క్రియకు సమానంగా చెవులూపుతున్న స్పందనారహిత వాతావరణం కనిపిస్తోంది. అందుకేనేమో, ఆరేడు దశాబ్దాల కిందటే మహామేధావి, అభ్యుదయవాది సి.ఆర్.రెడ్డి ఓ వ్యాఖ్య చేశారు. విజయవాడ కేంద్రంగా ఓ గొప్ప విద్యా సం స్థను నెలకొల్పాలని ప్రతిపాదించినపుడు, తానాశించిన స్పందన రాకపోవ డంతో విశాఖ వెళుతూ... ‘‘ఇదొక మేధావుల ఎడారి’’ (ఇంటలెక్చు వల్ సహారా) అన్నారని చెబుతారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నిజమనిపిస్తున్నాయి.

చీకట్లో చిరుదివ్వె...
ప్రభుత్వం, పాలకపక్షాల నుంచి నియంతృత్వ పోకడలు పెరుగుతున్న క్రమం లో... ఇప్పుడిప్పుడే కొత్త ఆలోచనలు రగులుతున్నాయి. ప్రజాభిప్రాయానికి తావివ్వని సర్కారు ఏకపక్ష వైఖరిని నిరసిస్తున్న వారంతా సంఘటిత మౌతున్నారు. మేధావులు, ఆలోచనాపరులకు ఈ ప్రాంతమేమీ గొడ్డుపోలే దని గట్టి సంకేతాలివ్వడానికి భావసారూప్యత కలిగిన కొంత మంది ఆగస్టు 9న గుంటూరులో ఓ సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ‘స్తబ్దత నిజమే! అది వీడాల్సిన అవసరముంది’ అని అంగీకరిస్తున్నారు. 13 జిల్లాల ప్రాతినిధ్యంతో ‘ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం’ జరుపుతున్న ఈ సన్నాహక భేటీ చీకట్లో చిరుదివ్వె కానుంది. తర్వాత విశాఖపట్నం, విజయవాడ, కర్నూ ల్‌లలో ఒకచోట పెద్ద సదస్సునో, బహిరంగసభనో నిర్వహించాలనుకుంటు న్నారు.

ప్రభుత్వ ప్రజాకంటక నిర్ణయాలన్నింటికీ వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపించాలన్నది ఈ సదస్సు ఉద్దేశమని చెబుతున్నారు. ‘రాయల సీమ ఉద్యమ వేదిక’ దీనికి మద్దతు ప్రకటించింది. రాయలసీమతో పాటు అంతో ఇంతో ఉత్తరకోస్తాలో ప్రజా పోరాటాల జాడలు మినుకుమినుకుమం టున్నాయి. అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగానో, భోగాపురం భూసేకర ణను ప్రతిఘటించడమో శ్రీకాకుళం కేంద్రంగా ఉత్తర కోస్తాలోనే కొంత పౌర చైతన్యం కనిపిస్తోంది. బెంగాల్లో పురుడుపోసుకున్న నక్సల్బరీ ఉద్యమానికి మెట్టినిల్లై సాయుధ పోరాటంతో చరిత్రకెక్కిన శ్రీకాకుళానికి ఇంకా ఆ చేవ తగ్గలేదనిపిస్తోంది. రాయలసీమలో కూడా కొంత కదలిక మళ్లీ మొదలైంది.

విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటై కొత్త ప్రభుత్వాలు కొలువు దీరి ఏడాది మాత్రమే గడిచినా ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంది. పౌరసమాజంలో చైతన్యం కొరవడటాన్ని అలుసుగా తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలను వచ్చే నాలుగేళ్లు అదే పౌరసమాజం భరించాలి. ప్రభుత్వ దాష్టీ కాలతో వేడి తగులుతున్నది నాక్కాదు కదా అని, ఎవరికి వారు నిమ్మలంగా కూర్చుంటే, ఏదో రోజు వేడిసెగ నీ డ్రాయింగ్ రూమ్‌లోకీ చొచ్చుకువస్తుంది. ప్రపంచం కీర్తిస్తున్న ఆమోదయోగ్య పాలనా వ్యవస్థ ప్రజాస్వామ్యం. ప్రజా స్వామ్య ఫలాలు అందుకునేందుకు, నిరంతర అప్రమత్తతే మనం చెల్లించే మూల్యం అంటారు విజ్ఞులు. ఏమరుపాటుగా ఉంటే ఫలాలు అందవు సరి కదా ‘తగు మూల్యం’ చెల్లించాల్సి ఉంటుంది ఏ పౌరసమాజానికైనా! అధి కారపు నీడలో రాజ్యాంగాన్ని, చట్టాల్ని ఏ ప్రభుత్వాలూ చెరబట్టకూడదని కోరుకునే ప్రజాస్వామ్యవాదులు, అదే రాజ్యాంగానికి లోబడి పౌరసమాజం చైతన్యశీలంగా ఉండాలని ఆశిస్తారు. నాలుగు రోజులు జాప్యమౌతుందేమో కానీ, జనం జాగృతమవడం ఖాయం.
‘‘.... / పుడమి తల్లికి/ పురుటినొప్పులు / కొత్త సృష్టిని స్ఫురింపించాయి’’ అన్న శ్రీశ్రీ స్ఫూర్తి మనకు సదా చోదకశక్తి.
దిలీప్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
ఈమెయిల్: dileepreddy@sakshi.com.

మరిన్ని వార్తలు