మూడు నాల్కల ముచ్చట

24 Sep, 2013 04:16 IST|Sakshi
మూడు నాల్కల ముచ్చట

జగతిలో పెట్టుబడులుపై సీబీఐ రకరకాల వాదనలు
ప్రాజెక్టులు చేపట్టిన వారి పెట్టుబడులు ‘క్విడ్ ప్రో కో’ అట
అలా చేపట్టని వారి విషయంలో రెండు రకాల వాదన
కొందరి విషయంలో పెట్టుబడులు కరెక్టేనంటూ సమర్థన
మరికొందరి విషయంలో వారు మోసపోయారనే వాదన
తాజా మెమోతో మరింతగా బయటపడ్డ సీబీఐ డొల్ల వాదన
రాజకీయ కుట్రతోనే 16 నెలలుగా జైల్లో జగన్
ఏ కేసులోనూ జరగనన్ని విచిత్రాలు ఈ కేసులో జరిగిన తీరు
‘ముక్కల చార్జిషీట్ల’ నుంచి... మీడియా సంచలనాల దాకా
చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో దర్యాప్తు ముగించిన సీబీఐ
దర్యాప్తు ముగియడంతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు

 
 వాళ్లంతా ఇన్వెస్టర్లే. అంతా ఒకే ధరకు షేర్లు కొన్నవాళ్లే. కాకపోతే వాళ్లలో కొందరు మాత్రమే అసలైన ఇన్వెస్టర్లట..!! వాళ్ల ఇన్వెస్ట్‌మెంట్లే అసలైనవట! మిగతా వాళ్ల ఇన్వెస్ట్‌మెంట్లు మాత్రం ‘క్విడ్ ప్రో కో’ అట. ఇదీ... వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ చెబుతూ వచ్చిన కథ, కథనం.

 
 సీబీఐ చెబుతూ వచ్చిన కథనం ఆధారంగానే జగన్‌మోహన్‌రెడ్డిని 16 నెలల పాటు జనానికి దూరం చేశారు. ఈ స్క్రీన్‌ప్లేతోనే జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలను నానా ఇబ్బందులూ పెట్టారు. ఆఖరికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికీ బురద పులిమే ప్రయత్నాలు చేశారు. అసలు ఈ కథనాన్ని ఎవరైనా నమ్ముతారా? ఒక కంపెనీలో షేర్ హోల్డర్లంతా ఒకే ధరకు షేర్లు కొన్నపుడు వారిలో కొందరివి అసలైన ఇన్వెస్ట్‌మెంట్లని, మరికొందరివి ‘క్విడ్ ప్రో కో’ ఇన్వెస్ట్‌మెంట్లని చెప్పటంలో అర్థమేమైనా ఉందా? ఇదంతా ఎందుకంటే జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి సీబీఐ సోమవారం కోర్టుకు ఒక మెమో అందజేసింది. దాన్లో జగతి పబ్లికేషన్స్ ఇన్వెస్టర్లకు సంబంధించి కొన్ని కంపెనీల పేర్లను వెల్లడిస్తూ... ఎలాంటి క్విడ్ ప్రో కో ఉన్నట్లు తేలలేదని స్పష్టం చేసింది. ఇలా సీబీఐ పేర్కొన్న కంపెనీల్లో పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, ఆర్‌ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ వంటివి ఉన్నాయి. వీటిలో పీవీపీ బిజినెస్ వెంచర్స్ రూ.55 కోట్లు, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్ రూ.30 కోట్లు, ఆర్‌ఆర్ గ్లోబల్ రూ.49 కోట్లు చొప్పున జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్ట్ చేశాయి.
 
 అంటే మూడు సంస్థలూ కలిపి రూ.134 కోట్లు పెట్టుబడి పెట్టాయి. మూడు సంస్థలూ ఒక్కో షేరు రూ.350 చొప్పునే కొనుగోలు చేశాయి. వీటి పెట్టుబడులు క్విడ్ ప్రో కో అనేందుకు ఆధారాలు లేవని చెప్పిన సీబీఐ... ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి 10 చార్జిషీట్లు దాఖలు చేసింది. ప్రతి చార్జిషీట్లోనూ కొందరిని పేర్కొంటూ... వారికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వపరంగా ఏ ప్రాజెక్టు దక్కిందో చెబుతూ... అందుకు ప్రతిఫలంగానే వారు జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడి పెట్టారనే వాదన చేసుకుంటూ వచ్చింది. దానికి క్విడ్ ప్రో కో అని పేరు పెట్టింది. ఇలా చార్జిషీట్లలో సీబీఐ పేర్కొన్న సంస్థల్లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్, రాంకీ ఇన్‌ఫ్రా, వాన్‌పిక్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ వంటి పలు సంస్థలున్నాయి. అవి కూడా జగతి పబ్లికేషన్స్‌లో షేరు రూ.350 చొప్పునే కొన్నాయి. మరి ఈ సంస్థలు కూడా పీవీపీ బిజినెస్ వెంచర్స్, జూబ్లీ మీడియా, ఆర్‌ఆర్ గ్లోబల్ మాదిరి లాభాల కోసమే ఇన్వెస్ట్‌మెంట్ చేశాయని భావించాల్సిన పని లేదా? ప్రభుత్వపరంగా వీటికి ప్రాజెక్టులు దక్కడమే తప్పా? అయినా ఈ సంస్థలన్నీ ప్రభుత్వం నుంచి అప్పుడే ప్రాజెక్టులు తీసుకున్నవేమీ కాదే? ప్రభుత్వమేమీ వీటికి నిబంధనల్ని పక్కనపెట్టి ప్రాజెక్టులు కేటాయించలేదే? అరబిందో, హెటెరో రాష్ట్రంలో ఫార్మా దిగ్గజాలు. అలాంటి సంస్థలకు ఒక చోట ప్లాంటు కోసం భూమి కేటాయిస్తే... దాన్ని తక్కువ రేటుకిచ్చారని, అందుకే అవి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయని వాదించడం కరెక్టా? రాంకీదీ అలాంటి కథే.
 
 వాన్‌పిక్ వ్యవహారమైతే మరీ ఘోరం. ఆ సంస్థ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్ జాతీయ స్థాయిలోనూ పలు సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్లు చేశారు. వాటి ద్వారా లాభాలు కూడా ఆర్జించారు. అగ్రశ్రేణి ఇన్వెస్టర్‌గా రుజువు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెడితే... అది కేవలం వాన్‌పిక్ ప్రాజెక్టును పొందినందుకే అని చెప్పారంటే ఏమనుకోవాలి? జగన్‌కు చెందిన భారతి సిమెంట్‌లో కూడా ప్రసాద్ పెట్టుబడి పెట్టి, తన వాటాను విక్రయించుకుని లాభాన్ని ఆర్జించారు. దాన్నీ క్విడ్ ప్రో కో అన్నారంటే ఏమనుకోవాలి? ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ కూడా అంతే. అవి సిమెంట్ కంపెనీలు కాబట్టి, సహజంగానే మరో సిమెంట్ కంపెనీలో వాటా తమకు అనుకున్న ధరకు, అనుకున్నట్టుగా వస్తే కొనటానికి మొగ్గు చూపుతాయి. అదే రీతిన అవి భారతి సిమెంట్‌లో పెట్టుబడి పెట్టాయి. అవకాశం రాగానే విక్రయించుకుని లాభాలు కూడా ఆర్జించాయి. అయినా సరే, వాటి పెట్టుబడులను క్విడ్ ప్రో కో అన్నారంటే ఏమనుకోవాలి? అసలు క్విడ్ ప్రో కో పెట్టుబడులకు లాభాలొస్తాయా?
 
 అంతా రాజకీయమయం...
 ఇక్కడ గమనించాల్సిందొక్కటే. కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఈ రాష్ట్రంలో ఒక వర్గానికి అస్సలు గిట్టదు. అందుకే వైఎస్ మరణానంతరం జనమంతా ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని అక్కున చేర్చుకోవడాన్ని వారు సహించలేకపోయారు. మరో రాజశేఖరరెడ్డి తయారు కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అందుకే కాంగ్రెస్‌లోని వైఎస్ వ్యతిరేకులతో చేతులు కలిపారు. కొన్ని రాజకీయ పక్షాలు, వారికి వత్తాసు పలికే మీడియా, దర్యాప్తు సంస్థలు, కొందరు వ్యక్తులు కలిసి నడిపిన ఈ కుట్ర ఏ స్థాయిలో సాగిందంటే... ఈ దేశ చరిత్రలో ఎన్నడూ ఏ కేసులోనూ జరగని వైపరీత్యాలు ఈ కేసులో మాత్రమే జరిగాయి.
 
 ఆదినుంచీ రాంగ్ రూట్లోనే...
 ఈ కేసులో ప్రధానమైన ఆరోపణ క్విడ్ ప్రో కో. అంటే ఇచ్చిపుచ్చుకోవటం. వైఎస్ హయాంలో పలు సంస్థలకు భూములు కేటాయించడంతో పాటు అనుమతులు మంజూరు చేశారని, అందుకు ప్రతిగా అవి జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయనేది ప్రధానారోపణ. కేంద్రంలోనైనా... ఏ రాష్ట్రంలోనైనా ఇలా ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు వచ్చినప్పుడు మొదట తేల్చేది ఆ నిర్ణయం తప్పా, కాదా అని. ఆ నిర్ణయాన్ని నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్నారా. లేక అదంతా నిబంధనల ప్రకారమే జరిగిందా అని. ప్రభుత్వ నిర్ణయం తప్పని తేలితే ఆ పెట్టుబడుల్ని క్విడ్ ప్రో కో అనొచ్చు. కానీ ఇక్కడ సీబీఐ ఆ నిర్ణయాల జోలికి పోలేదు. అవి తప్పో ఒప్పో పట్టించుకోలేదు. జగన్‌ను టార్గెట్ చేసి... ఆయన సంస్థల్లోకి పెట్టుబడిగా వచ్చిన ప్రతి రూపాయినీ అనుమానించింది. సదరు ఇన్వెస్టర్లు ప్రభుత్వ ప్రాజెక్టులేమైనా పొందారో లేదో చూసింది. పొంది ఉంటే... అవన్నీ క్విడ్ ప్రోకోలేనంటూ వారిని వేధించింది. దారుణమేంటంటే.. ఒకవేళ ఏ ప్రభుత్వ ప్రాజెక్టూ చేపట్టని ఇన్వెస్టర్లుంటే... వారు పెట్టుబడులు పెట్టి మోసపోయారని మరీ కేసు పెట్టింది. పెపైచ్చు వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించే ఒక వర్గం మీడియాకు లీకులిచ్చి మరీ కథనాలు రాయిస్తూ... వారి పరువు ప్రతిష్టలను దెబ్బతీయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది.
 
 అసలు కేటాయింపుల్లో తప్పేంటి?
 అసలు సీబీఐ నెత్తీనోరూ బాదుకుంటున్న ఈ కేటాయింపుల్లో తప్పేముంది? భూములు, గనుల కేటాయింపు... సెజ్‌లు, ప్రాజెక్టులకు అనుమతులు... కంపెనీలకు లెసైన్సులు, రాయితీలు, మినహాయింపులు ఇస్తే తప్పేంటి? ఒక్క వైఎస్ హయాంలోనే ఇలా ఇచ్చారా? అంతకు ముందరి ప్రభుత్వాలేవీ ఇవ్వలేదా? ప్రస్తుత ప్రభుత్వం ఏ భూ కేటాయింపులూ చేయడం లేదా? రాయితీలివ్వడం లేదా? ఏ జీవోనైనా అంతకు ముందరి జీవోల్ని అనుసరించో, నిబంధనల్ని పాటించో జారీ చేస్తారు కదా? దర్యాప్తులో ఇవన్నీ చూడాలి కదా! వైఎస్ హయాంలో కంపెనీలకు నీళ్లిచ్చినందుకు కూడా క్విడ్ ప్రో కో పెట్టుబడులొచ్చాయని తాను చేస్తున్న వాదన ఎంత అసంబద్ధమో సీబీఐకి తెలియదా? ప్రభుత్వ కేటాయింపులు, అనుమతులు ఏమాత్రం తప్పు కాదని దానికి తెలియదనుకోగలమా? మొన్నటికి మొన్న కిరణ్ సర్కారు పలు పరిశ్రమలకు పన్ను రాయితీలివ్వలేదా? గతేడాది ప్రిజమ్ సిమెంట్స్‌కు కర్నూలు జిల్లాలో 1,000 ఎకరాలు కేటాయించలేదా? ఇలాంటివాటన్నిటినీ సీబీఐ ఎందుకు అధ్యయనం చేయడం లేదు? వైఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ తప్పుగా చూపించాలన్న తహతహ ఎందుకు?
 
 చార్జిషీట్లలోనూ రెండునాల్కలే...
 పెట్టుబడి అంటే ఇన్వెస్టర్, ప్రమోటర్ మధ్య ఒప్పందం. తమకు అన్యాయం జరిగిందనో, తాము మోసపోయామనో వారిలో ఎవరూ ఫిర్యాదు చేయనంతవరకూ దాన్లో ఏ దర్యాప్తు సంస్థా జోక్యం చేసుకోదు. కానీ సీబీఐ మాత్రం ముందే ఒక నిర్ణయానికి వచ్చేసి... దానికి అనుగుణంగా కేసును తయారు చేసుకుంటూ వెళ్లింది. ఇన్వెస్టర్లను వేధిస్తూ... వారు వైఎస్ హయాంలో ఏ ప్రాజెక్టులు చేపట్టారో వెతికి మరీ చూసి... వాటికి బదులుగానే ఆ పెట్టుబడులు పెట్టారని సీబీఐ వాదించింది. వారిని వేధించింది. కానీ సీబీఐ ఎంత వెదికినా కొంతమంది ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్టులూ చేపట్టినట్టు కనిపించలేదు. దాంతో, వారికి మోసపూరిత నివేదికలిచ్చి, లాభాలొస్తాయని ఆశ చూపించి జగతి ప్రతినిధులు వారితో పెట్టుబడులు పెట్టించారని, వారికి వడ్డీ కూడా దక్కలేదని, వారు మోసపోయారని తెగ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మేరకు ఏకంగా ఒక చార్జిషీటు (నంబర్-2) కూడా వేయడం మరీ విచిత్రం. మళ్లీ అదే సీబీఐ... కొందరి పెట్టుబడులేమో క్విడ్ ప్రో కో అనటానికి ఆధారాలేమీ లేవని పేర్కొంది. అంటే... ఒకే ఒరలో రెండు కాదు, మూడు కత్తులన్నమాట!
 
 ఇన్వెస్టర్లు మోసపోయారా?
 ‘‘2008లో టి.ఆర్.కణ్ణన్ అనే వ్యక్తిని విజయసాయిరెడ్డి కలిశారు. జగతిలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలని అడిగారు. కణ్ణన్ ఓకే చేశారు. 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లిలో సిమెంట్ ప్లాంట్ పెట్టారు. 2010 ఆగస్టు 19న (రోశయ్య హయాంలో) ఆయనకు లెసైన్స్ మంజూరయింది. దుబాయ్ ఎన్నారై మాధవ్ రామచంద్రతో 2008లో విజయసాయిరెడ్డి మాట్లాడారు. త్వరలో జగతి పబ్లికేషన్స్ పబ్లిక్ ఇష్యూకు వెళ్లబోతోందని, భారీ లాభాలు వస్తాయని ఆశపెట్టారు. డెలాయిట్ నివేదిక ప్రతిని కూడా ఆయనకు పంపడంతో ఆయన రూ.19.65 కోట్లు పెట్టుబడి పెట్టారు. దండమూడి అరుణ్‌కుమార్ కూడా సాయిరెడ్డి మాటలు నమ్మి రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టారు. వారికి ఇప్పటిదాకా ఎలాంటి డివిడెండూ రాలేదు. పెట్టుబడిపై వడ్డీ కూడా రాలేదు. లాభాలపై తప్పుడు సమాచారమిచ్చి వారి ద్వారా పెట్టుబడి పెట్టించారు. తరవాత వారెన్ని ఫోన్లు చేసినా జగతి ప్రతినిధులు స్పందించలేదు’’ ఇదీ రెండో చార్జిషీట్లో సీబీఐ మోపిన అభియోగం.
 
 ఈ ప్రశ్నలకు బదులుందా?
 .    అసలు సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడులనా, లేక ఇన్వెస్టర్లు మోసపోయారనే అంశాన్నా? ఒకే విచారణలో ఈ రెండంశాలూ ఉండటం ఎలా సాధ్యం? ప్రాజెక్టులు దక్కిన వారినైతే అందుకే పెట్టారని చెప్పడం... లేనివారైతే మోసపోయారని చెప్పడం... కొందరి పెట్టుబడులు క్విడ్ ప్రో కో కాదని చెప్పడం... ఒకే కంపెనీలో ఈ మూడు రకాల పెట్టుబడులూ ఉంటాయా?
 .    అసలు జగతిలో గానీ, భారతి సిమెంట్‌లో గానీ పెట్టుబడి పెట్టి తాము మోసపోయామంటూ ఏ ఇన్వెస్టరైనా ఫిర్యాదు చేశారా? కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్లు చేసినపుడు లాభనష్టాలు సహజమని సీబీఐకి తెలియదా? మరి భారతి సిమెంట్‌లో ప్రతి ఇన్వెస్టరుకూ లాభం వచ్చింది కదా? దాన్నెందుకు పట్టించుకోవడం లేదు?
 .    డెలాయిట్ నివేదిక ఆధారంగా పెట్టుబడులు పెట్టించారని, మోసం చేశారని చెబుతున్న సీబీఐ... అదే నివేదికలో ఉన్న ‘డిస్‌క్లెయిమర్’ను ప్రస్తావించలేదెందుకు? ఆ నివేదిక ఆధారంగా పెట్టినవారు దాన్లోని డిస్‌క్లెయిమర్‌ను చూసుకోరా? ఇన్వెస్టర్లకు వచ్చే నష్టాల్ని విచారించటానికా సీబీఐ ఈ దర్యాప్తును చేస్తున్నది?
 .    ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’తో సమానంగా సర్క్యులేషన్ ఉన్న ‘ఈనాడు’ తన గ్రూప్ విలువను రూ.7,800 కోట్లుగా అంచనా కట్టినప్పుడు ‘సాక్షి’ విలువ దాన్లో సగం కూడా చెయ్యదా? ‘సాక్షి’ కొత్త సంస్థ. కానీ 35 ఏళ్లుగా నడుస్తున్న ‘ఈనాడు’ 2008 నుంచి తన దగ్గర పెట్టుబడి పెట్టిన అంబానీకి ఒక్క పైసా అయినా డివిడెండ్ ఇచ్చిందా?
 
 అఏ కేసులోనైనా ఒక ఎఫ్‌ఐఆర్‌కు ఒకటే చార్జిషీటు. కానీ ఈ కేసులో వీలైనంత ఎక్కువకాలం జగన్‌ను జైల్లో ఉంచటానికి వీలైనన్ని ఎక్కువ చార్జిషీట్లు వేసేందుకు కుట్ర పన్నారు.  అఅసలు జగన్‌మోహన్‌రెడ్డిని కనీసం విచారణకు కూడా పిలవకుండానే ఆయన్ను మొదటి నిందితుడిగా పేర్కొంటూ మూడు చార్జిషీట్లు వేశారు. దేశంలో ఏ కేసులోనూ ఇలా జరగలేదు. చిన్న కేసైనా, పెద్ద కేసైనా నిందితుడిని విచారించాకే చార్జిషీటు వేస్తారు.
 అచార్జిషీటును విచారణకు స్వీకరించే నిమిత్తం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా జగన్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన కోర్టు ఎదుట హాజరయితే... వ్యక్తిగత పూచీపై అక్కడికక్కడే బెయిలొచ్చే అవకాశముండేది. అది తెలిసిన సీబీఐ... అలా హాజరవడానికి మూడు రోజుల ముందే, తన ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చింది. మూడు రోజులు విచారించాక... కొన్ని గంటల్లో కోర్టు ఎదుట హాజరవుతారనగా అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. చరిత్రలో ఏ కేసులోనూ ఇలా జరిగిన దాఖలాలు లేవు.
 అజగన్‌కు చెందిన మీడియా గొంతు నులమటానికీ సీబీఐ ప్రయత్నించింది. సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సాక్షి ఆస్తులనూ అటాచ్ చేయబోయింది. మరో వంక సీబీఐతో ప్రభుత్వమూ జతకలిసింది. సాక్షికి ప్రకటనలివ్వడాన్ని నిషేధిస్తూ ఏకంగా జీవోలనే జారీ చేసింది.
 అనిజానికి తన అరెస్టును జగన్ ముందే ఊహించారు. అందుకే ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేశారు. కానీ చట్టప్రకారమే అంతా జరుగుతుందని భావించిన కోర్టు... అరెస్టు జరగదని, అదంతా ఆయన భయం మాత్రమేనని చెప్పింది. ఒకవేళ ఆయనది భయమే అనుకున్నా... ఆయన భయపడ్డట్టే జరిగింది.
 అఅరెస్టు అక్రమమంటూ జగన్ దిగువ కోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేశారు. అప్పటి నుంచి హైడ్రామా మొదలయింది. బెయిల్‌పై తీర్పు వచ్చే ముందు... సంచలనాత్మక సంఘటనలు చోటు చేసుకోవటం మొదలయ్యాయి. అవి ఏ స్థాయిలో అంటే న్యాయం సైతం నివ్వెరపోయేంతగా!! ఇంతకుముందు జగన్ ఆరుసార్లు బెయిల్ కోసం వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేస్తే, ప్రతిసారీ ఏదో ఒక సంచలనమే. ప్రతిసారీ ఎల్లో మీడియాలో తీర్పు ముందు రోజున జగన్‌కు వ్యతిరేకంగా తాటికాయలంత అక్షరాలతో పతాక కథనాలే. ప్రతిసారీ ఏదో జరిగిపోతోందన్న రీతిలో చంద్రబాబు, ఆయన తాబేదార్లు ఢిల్లీకి వెళ్లి మరీ నానాయాగీ చేయడమే.
 
 జగన్ కేసులో ఎప్పుడేం జరిగింది..?
 2010 నవంబర్ 5: హైకోర్టుకు 5 పేజీల లేఖ రాసిన శంకర్రావు. 75 పేజీల అనుబంధ పత్రాల సమర్పణ
 2011 జనవరి 24: ఆ లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు
 2011 ఫిబ్రవరి 9: శంకర్రావు మరో అఫిడవిట్.
 2011 మార్చి 14: జగన్ ఆస్తులపై సీబీఐ, ఏసీబీ దర్యాప్తు కోరుతూ
 టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు, బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి పిల్.
 2011 జూలై 11: ఎమ్మార్‌పై సీబీఐ ప్రాథమిక దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
 2011 జూలై 12: వైఎస్ జగన్, సాక్షిలో పెట్టుబడులపై సీబీఐ ప్రాథమిక విచారణకు హైకోర్టు ఆదేశం
 2011 జూలై 22: హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ
 జగన్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
 2011 జూలై 26: సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ నివేదిక
 2011 ఆగస్టు 1: హైకోర్టుకు సీబీఐ రెండో నివేదిక
 2011 ఆగస్టు 4: శంకర్రావు, టీడీపీ నేతల పిటిషన్లపై తీర్పు వాయిదా
 2011 ఆగస్టు 10: ఎమ్మార్, జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై దర్యాప్తు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం
 2011 ఆగస్టు 17: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎఫ్‌ఐఆర్ (ఆర్‌సీ 19(ఎ)) నమోదు చేసిన సీబీఐ
 2011 ఆగస్టు 18: జగన్ సంస్థలు, సాక్షి కార్యాలయాల్లో సీబీఐ సోదాలు
 2011 నవంబర్ 4: ఓఎంసీ కేసులో సాక్షిగా సీబీఐ ఎదుట హాజరైన జగన్
 2012 జనవరి 2: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో జగతి పబ్లికేషన్స్
 ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి అరెస్టు
 2012 మార్చి 31: ఫార్మా కంపెనీల పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు
 2012 ఏప్రిల్ 13: ఆడిటర్ విజయసాయిరెడ్డికి బెయిల్
 2012 ఏప్రిల్ 24: వ్యక్తుల పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు
 2012 మే 7: జగన్ కంపెనీల్లో రాంకీ ఫార్మా పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు
 2012 మే 7: మొదటి చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ప్రత్యేక కోర్టు. జగన్‌కు సమన్లు జారీ. మే 28న హాజరవాలంటూ జగన్‌కు కోర్టు సమన్లు
 2012 మే 8: జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రా సంస్థల బ్యాంకు (ఎస్‌బీఐ, ఓబీసీ) ఖాతాలను స్తంభింపజేసిన (ఫ్రీజ్) సీబీఐ
 2012 మే 9: జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రా సంస్థలకు చెందిన మరో రెండు బ్యాంకు (ఎస్‌బీఐ, ఓబీసీ) ఖాతాలను స్తంభింపజేసిన సీబీఐ
 2012 మే 22: విచారణకు హాజరు కావాలంటూ జగన్‌కు సీబీఐ నోటీసులు
 2012 మే 23: ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి
 2012 మే 24: అరెస్టు చేస్తారని జగన్‌ది కేవలం అపోహ మాత్రమేనంటూ ఆయన పిటిషన్‌ను కొట్టివేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు
 2012 మే 25: విచారణకు హాజరైన జగన్
 2012 మే 27: జగన్ అరెస్టు.. 2012 మే 28: ప్రత్యేక కోర్టులో హాజరు...
 రిమాండ్‌కు తరలింపు, బెయిల్ పిటిషన్ దాఖలు.
 2012 ఆగస్టు 13: వాన్‌పిక్‌పై చార్జిషీట్ దాఖలు
 2012 అక్టోబర్ 5: జగన్ బెయిల్‌పై సుప్రీంకోర్టు తీర్పు... దర్యాప్తు పూర్తయిన తర్వాత జగన్ బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని ఆదేశం
 2013 ఏప్రిల్ 8: దాల్మియా పెట్టుబడులపై చార్జిషీట్ దాఖలు
 2013 మే 9: నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశం. దర్యాప్తు తర్వాత బెయిల్ కోసం జగన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టీకరణ
 2013 సెప్టెంబర్ 10: పెన్నా, ఇండియా, రఘురామ్ సిమెంట్స్‌కు       సంబంధించి మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ
 2013 సెప్టెంబర్ 11: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జగన్
 2013 సెప్టెంబర్ 12: కౌంటర్ దాఖలుకు గడువు కోరిన సీబీఐ,
 విచారణ 18కి వాయిదా
 2012 సెప్టెంబర్ 17: ఇందూ టెక్, లేపాక్షి నాలెడ్జి హబ్‌కు సంబంధించి రెండు చార్జిషీట్లు దాఖలు
 2013 సెప్టెంబర్ 18: బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి...
 తీర్పును 23కు వాయిదా వేసిన ప్రత్యేక కోర్టు
 2013 సెప్టెంబర్ 23: జగన్‌కు బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు

మరిన్ని వార్తలు