చక్రభ్రమణం బుక్ రివ్యూ

22 Dec, 2013 23:54 IST|Sakshi
చక్రభ్రమణం బుక్ రివ్యూ

మన నవలలు
 మగవాళ్ల మతిభ్రమణం
 
 పురుషుడు స్త్రీని అనుమానిస్తే స్త్రీ వల్లకాటికెళ్లాలి.స్త్రీ పురుషుణ్ణి అనుమానించినా స్త్రీయే వల్లకాటికెళ్లాలి.
       
 రవీంద్ర- పెళ్లికి ముందే మాధవిని శంకించాడు. ఒక్క రవీంద్రనే ఏముంది అతడి తల్లి, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులూ... ఎందుకు? మాధవి బిఏ చదువుకుందట. అంత చదువుకున్న అమ్మాయి అందరిలా ఉంటుందా? మాట వింటుందా? మగని ఎదుట తల దించుకుని ఉంటుందా? వంటా వార్పూ చేస్తుందా? పిల్లలకు జోల పాడుతుందా? అంతెందుకు సంప్రదాయబద్ధంగా చీరైనా కట్టుకుంటుందా? బి.ఏ చేస్తే... అదీ ఒక ఆడపిల్ల బి.ఏ చేస్తే ఇన్ని శంకలు చుట్టుముడతాయి. ఆడదానికి చదువే శాపం. చదువొస్తే ఏముంది? లోకం తెలిసిపోదూ. రహస్యాలు తెలిసిపోవూ. భూమీ గాలీ ఆకాశం నీరూ ఆగ్నీ... అన్నీ సమీపానికి వచ్చి తోడు నిలవవూ.
 
 సరే. పెళ్లయ్యింది. మాధవి ఏమైనా పిచ్చిదా? ఇన్ని శంకలు తన పట్ల ఉన్నాయని గ్రహించి ఇంట్లో నోరు మూసుకొని అదే ఒక సంపదగా అదే ఒక సంస్కారంగా అదే ఒక వ్యక్తిత్వంగా మసలుతూ ఆఖరుకు వంట మనిషి కూడా లేకుండా గుట్టుగా సంసారం నెట్టుకొని వస్తూ ఉంది. ఉండబట్టలేక అప్పుడప్పుడు ఏవో కథలు రాసుకుంటూ ఉంది. ఇందులో ప్రమాదం ఏమీ లేదు. పోస్ట్‌మేన్ తప్ప మరో పరపురుషుని ప్రమేయమూ ఉండదు. పర్‌ఫెక్ట్. ఇదంతా చూసి రవీంద్రకు... ఒక్క రవీంద్రకేమిటి సకల పురుషజాతికీ గర్వం. సంతోషం. ఆనందం.  ఇలాంటి భార్య ఉంటే నలుగురికీ షో పీస్‌లా చూపించాలని తహతహ. చక్రవర్తి దొరికాడు. డాక్టరు. సంఘంలో పేరుంది. పరపతి ఉంది. కారు ఉంది. తోట కూడా ఉంది. ఇలాంటి వాడి ఎదుట తన భార్యను ప్రెజెంట్ చేయడం ఏ మగాడికైనా సరదా. చూశావా... నీకు డబ్బుంటే ఏంటోయ్... నాకు ఎంత చక్కని భార్య ఉందో చూడు, ఎంత అణకువ కలిగిన భార్య ఉందో చూడు, అన్నీ తెలిసినా అసలేమీ తెలియనట్టుగా ఉండే భార్య ఉంది చూడు అనీ.... ఏదో పైచేయి పీకులాట.
 
 చక్రవర్తి వచ్చాడు. మాధవిని చూశాడు. గందరగోళ పడ్డాడు. అతడికి మాధవి చిన్నప్పటి అమ్మలా అనిపించింది. పెరిగి పెద్దయ్యాక ఆదరించి అన్నయ్యా అంటూ వెంట తిరిగిన చెల్లెల్లా అనిపించింది. వయసులోకి వచ్చాక ఆప్యాయంగా ఆరాధించిన తన క్లాస్‌మేట్ శ్రీదేవిలా అనిపించింది. తనకిష్టమైన మెత్తని స్వభావం మాధవిలో ఉంది. తనకిష్టమైన పాడే గుణం మాధవిలో ఉంది. తనకిష్టమైన వీణానాదం మాధవిలో ఉంది. ఆ మాట, పలకరింపు, నడత, పూలను చూసినా కొమ్మన ఉన్న పూతను చూసినా మబ్బు పట్టి మూసుకున్న నింగిని చూసినా వీచే గాలిని పెదాలతో పలకరించినా ఆమెలోని స్పందనాగుణం, కరుణ, ఆ రసానుభూతి... ఇవన్నీ కలిసి ఆమె ఒక అపురూపమైన సోల్ మేట్‌లా అతడికి కనిపించింది. ఆత్మబంధువు. అయితే అదంతా అర్థంకాక లోకానికి అర్థమయ్యేలా
 ‘చెల్లెలు’ అనే ముతక పిలుపును తగిలించుకున్నాడుగాని వాస్తవానికి మాధవి అతడి దృష్టిలో వక్షం,
 కటి ప్రాంతాలకు ఏ విలువా లేని చిన్ననాటి స్నేహితురాలు. కాని ఇది ఎలా చెప్పడం. నలుగురితో కలిసి చదవడమే పాపం అనుకునే ఈ సంఘంలో ఏ వరుసా లేని పరాయి పురుషుడు ఆత్మీయుడిగా ఉండటం, ఉంటానని చెప్పడం ఎలా సాధ్యం? చక్రవర్తి సతమతమవుతున్నాడు. అతడిలో మాధవి పట్ల రేగుతున్న భావాలు అర్థం కాక అతడి భార్య నిర్మల సతమతమవుతోంది. మాధవి, చక్రవర్తుల సాన్నిహిత్యం చూసి ఎంత సులువుగా ఉందామనుకున్నా వీలుగాక రవీంద్రా సతమతమవుతున్నాడు.
 
 మలుపు వచ్చింది. హెడ్డాఫీసు నుంచి వైరు అందింది. రవీంద్ర క్యాంప్ వెళ్లాడు. వెళుతూ వెళుతూ మాధవి ఉత్తమనిషి కాకపోవడం వల్ల, పైగా నలతగా ఉంటూన్నందు వల్ల ఆమె పరామర్శ బాధ్యతను చక్రవర్తికి అప్పగించి వెళ్లాడు. అసలే కొత్త స్నేహితురాలు. పైగా మానసికంగా తన కవలసోదరి.
 
 పెద్దరికం వహించిన అతడి సంస్కారానికి ఆమె ఒక పసి పాపాయి. అందుకే చక్రవర్తి ముందు వెనుకా చూడకుండా వేళాపాళా లేకుండా ఆమె ఇంటికి రాకపోకలు సాగించాడు. ఆమెతో మాట్లాడుతుంటే సంతోషం. అసలు ఆమెను చూడటం అంటేనే సంతోషం. కాని లోకులకు ఇది వింతగా అనిపించింది. ఒక పురుషుడు... ఒక స్త్రీ. హవ్వ. చక్రవర్తి భార్య అందరి కంటే ముందు మేల్కొని ఏమిటేమిటో ఊహించుకుని రవీంద్రకు దొంగ ఉత్తరం రాసి ఉన్నదంతా వివరించింది. రవీంద్ర నమ్మాడు. కాదు... నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే హటాత్తుగా అర్ధరాత్రి ఊడిపడి వేళగాని వేళలో ఇల్లంతా లైట్లు వేసి మాధవితో తగువుకు సిద్ధమవుతుంటే అదే సమయంలో అటుగా వెళుతున్న చక్రవర్తి ఈ వేళలో దీపాలేమిటి అని కంగారు పడి ఇంట్లోకి వచ్చాడు. అంతే. అపవాదుకు ఆధారం దొరికింది. నింద నిజమై కూచుంది.
 
 అనుమానం... అనుమానం... పెనుభూతం. కోరలు సాచింది. బంగారం లాంటి స్నేహం నాశనమయ్యింది. బంగారం లాంటి కాపురం నాశనమయ్యింది. బంగారంలాంటి ఇరు కుటుంబాలు, ఇరు
 వైపులా వ్యక్తిత్వాలు, ఇరువైపులా ప్రశాంతి. ఆనందం అన్నీ చెల్లాచెదురయ్యి అకాల వడగాడ్పుకు మాడి మసైపోయాయి. నింద మోసినందుకు మాధవి పుట్టింటికి చేరింది. నింద వేసినందుకు నిర్మల కూడా పుట్టిల్లు చేరింది. మగాళ్లు అంతకు మించి చేయలేరు. వాళ్లకు అంతకు మించి చేతగాదు. వాళ్లు ఎవరితోనైనా తిరగొచ్చు. ఎవరితోనైనా కులకొచ్చు.  కాని స్త్రీ-  అదీ మన ఇంటి స్త్రీ మాత్రం నైతికంగా పైస్థానంలో ఉండాలి. చక్రవర్తి పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకున్నాడు. లోకం ఏమనదు. రవీంద్ర పెళ్లాన్ని పుట్టింటికి తరిమేసి వేరొకరిని ఇంట్లోనే ఉంచుకున్నాడు. లోకం ఏమనదు. కాని స్త్రీ మాత్రం కాస్త చదువుకున్నా, బజారుకు వెళుతున్నా, ఆఫీసుల్లో ఉద్యోగాల్లో సాటి ఉద్యోగులతో స్నేహంగా మసులుతున్నా, దూరపు బంధువులతో కాసింత చనువుగా ఉన్నా, ఆఖరుకు పాలవాడి గూర్చి పేపర్ బాయ్ గూర్చి అయ్యయ్యో అన్నా తప్పు... నింద... అనుమానం... శిక్ష.
 
 ఈ చక్రం తిరుగుతూనే ఉంది. స్త్రీ వేదనను స్త్రీ స్వేచ్ఛనూ ఇరుసుగా చేసుకున్న పురుషాహంకార చక్రం. స్త్రీలకీ వ్యక్తిత్వాలు ఉంటాయనీ, వారికీ సంస్కారం ఉంటుందనీ, వారికీ ఉచ్ఛం నీచం తెలుసుననీ, వారూ ఎవరికీ తేరగా లేరనీ, వాళ్లూ మగవాళ్లవంటి మనుషులేననీ, పోనీ మగవారి కంటే మెరుగైన మనుషులేననీ, వారిని శరీరాలుగాగాక కన్నూ ముక్కూ మేధా కంఠం ఉన్న మనుషులుగా చూడాలని మగవాళ్లు ఎప్పటికి తెలుసుకుంటారో.
 
 చక్రభ్రమణం ఎలాగో సుఖాంతం అయ్యిందిగాని మగవాళ్ల మతిభ్రమణం మాత్రం అంతం కాలేదు. ఏదైనా చేసి చూద్దాం అనుకునే ప్రతిభ గల అసంఖ్యాక ఆడవారు ఎందరు ఈ తలనొప్పులు పడలేక మౌనంగా మాధవిలా నాలుగ్గోడల మధ్య ఉండిపోతున్నారో. ఈ జీవితమే బాగుందండీ అని అబద్ధాలాడుతున్నారో. దీనికి వెలుతురు ఎప్పుడో.
 
 ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి  తన పందొమ్మిదో ఏట రాసిన తొలి నవల - చక్రభ్రమణం.  అసంఖ్యాక పాఠకులు మెచ్చిన నవల ఇది. దీని కథ, సారమూ ఎలా ఉన్నా తెలుగులో ‘కమర్షియల్ రైటింగ్’కు నాందీ ప్రస్తావన చేసిన తొలి నవలగా పండితులు దీనిని గుర్తిస్తారు. ఈ నవలతో తెలుగులో ‘పాప్యులర్ ఫిక్షన్’ ఊపందుకుని సీరియస్ రైటింగ్ మందగించిందని అన్నవారూ ఉన్నారు. ఇది సినిమావాళ్ల దృష్టిలో పడ్డ తొలి సాంఘిక నవల కావడాన ఆ తర్వాతి నవలలన్నీ అదే దృష్టితో రాయడానికి దారి వేసిందని అనేవారూ ఉన్నారు.
 
 ఏమైనా చక్రభ్రమణం సూపర్ హిట్. ఉపకారం తప్ప అపకారం చేయని స్త్రీల సున్నితమైన రచనలకు మార్గం వేసిన నవల ఇది. పైకి తేలిగ్గా చెప్తున్నట్టు కనిపించినా ఇందులోని గాఢమైన అభిలాష మాత్రం పురుష పరివర్తనే. అందుకు సాధనంగా ఎంచుకున్న మాధవి పాత్రకు బహుశా కౌసల్యాదేవి తన సౌందర్యాన్ని, సంస్కారాన్ని, గానాన్ని, రచనాభివేశాన్ని కొంత ఇవ్వడం వల్లనో ఏమో అది సజీవంగా కనిపిస్తుంది. సులభ గంభీరమైన వచనంతో ఎక్కడా పాఠకుణ్ణి జారనివ్వక, పడనివ్వక గిరగిరా తిప్పి చేదు వాస్తవాల రుచి చూపి కాస్త తలతిరిగేలా చేసే నవల ఇది. ఈ భ్రమణం తెలియకపోతే తెలుగు నవలా భ్రమణం అసంపూర్ణం.
 
 నవల: చక్రభ్రమణం
 రచయిత్రి: ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
 రచనాకాలం: 1961
 తెలుగు నవలల్లో తొలి కమర్షియల్ నవలగా గుర్తింపు పొందింది. సినిమాగా వచ్చిన తొలి సాంఘిక నవల కూడా. ఆ రోజుల్లో దీనికి వచ్చిన పాఠకాదరణ చూసి ఎక్స్‌ప్రెస్ అధినేత గోయెంకా ప్రత్యేకంగా ఒక మనిషి ద్వారా పట్టుచీర, ప్రత్యేక నగదు కౌసల్యాదేవికి పంపారట. ఈమె రాసిన ‘ప్రేమ్‌నగర్’ ఖ్యాతి అందరికీ తెలిసిందే. కౌసల్యాదేవి ఇంటర్వ్యూలుగాని, ఫొటోలుగాని పెద్దగా అందుబాటులో లేవు. ఈ ఫోటో ఆమె సోదరి అచ్యుతరాణి ద్వారా సాక్షికి అందింది. చక్రభ్రమణం మార్కెట్‌లో లభ్యం. వెల: రూ.60

 


 
 డాక్టర్ చక్రవర్తి...
 ‘చక్రభ్రమణం’ 1961లో ఆంధ్రప్రభ వీక్లీ పోటీల్లో మొదటి బహుమతి పొందిన నవల. ఇది బయటకు రావడానికి ముందే సినిమాగా బాగుంటుందని జడ్జీల్లో ఒకరైన త్రిపురనేని గోపీచంద్ అన్నపూర్ణా వారికి సూచించారట. తాత్సారం జరిగింది. ఈలోపు నవల బయటికొచ్చి సూపర్ హిట్ అయ్యింది. నవలా హక్కులు కొనడానికి అన్నపూర్ణ సంస్థ నుంచి దుక్కిపాటి మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు, ఆయన అసిస్టెంట్ కె.విశ్వనాథ్ రాజమండ్రి వెళ్లారు.
 
  కౌసల్యాదేవి పరదా చాటు నుంచి వారితో మంతనాలు చేస్తూ ఆ ఉత్సాహంలో నా కథను సినిమా స్టయిల్లో చౌకబారు చేయకుండా కొంచెం హుందాగా తీయండి వంటి మాట ఏదో మాట్లాడారట. అంతే. దుక్కిపాటికి కోపం వచ్చేసి- మాకు తెలియదా ఎలా తీయాలో... మా చరిత్ర ఎలాంటిదో తెలియదా అని అందర్ని తీసుకొని లేచి వచ్చేశారు. పెద్ద ఇరకాటం. ఈలోపు కె.విశ్వనాథే కొంచెం చొరవ చూపి ఇరు వర్గాలకు సంధి కుదిరిస్తే ఎట్టకేలకు రైట్స్ చేతులు మారాయి పదివేల రూపాయల పెద్ద మొత్తానికి!
 

మరిన్ని వార్తలు