ఆ మాటలు నన్నెంత షాక్‌కి గురి చేశాయి..

27 Jun, 2017 08:05 IST|Sakshi
నీలి రంగు.. అసలు రంగు

ప్రజాస్వామ్య దేశంలో సీఎం చంద్రబాబు కూడా ప్రజలలో ఒక భాగం. అంతే తప్ప ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కాదు కదా ‘‘నా రాజ్యంలో ఉంటూ నా సొమ్ము తింటూ నాకే అన్యాయం చేస్తారా’’ అనడానికి.

నేను గ్రాడ్యుయేషన్‌కి వచ్చిన తరువాత చంద్రబాబునాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజనీతి, అర్థశాస్త్రాల విద్యార్థినిని కావ డం చేతననుకుంటా మార్క్సిస్టులు ఆయనను దుయ్యబట్టేందుకు వాడే ‘ఇండియన్‌ మాకియవెల్లి’ మాటతో పాటు, ఒక  దినపత్రిక ఆయనను కీర్తిస్తూ రాసే అనేక కథనాలను నేను ఆసక్తిగా చదివేదానిని. టెక్నాలజీని, అభివృద్ధిని ఆయన కావలించుకునే తీరును చూసి, ఎల్తైన కట్టడాల పట్ల, మిరుమిట్లు గొలిపే నగరాల పట్ల ఆయన మక్కువను చూసి, బిల్‌ క్లింటన్, టోనీ బ్లెయిర్‌ హైదరాబాద్‌ రావడం చూసి బాబుని చాలా మేధావి అనీ, ఆధునికుడు కామోసు అని ఒక్కోసారి భ్రాంతి చెందేదాన్ని.

కానీ ఆశ్చర్యం.. ఇంత ఘనమైన కీర్తిమంతుడు అని ఇన్ని సంవత్సరాలుగా కొన్ని దినపత్రికలు, టీవీ చానళ్లూ చెప్తూ వచ్చిన బాబు, నంద్యాలలో ‘నా పెన్షన్‌ తీసుకుంటున్నారు, నేనిచ్చే రేషన్‌ తింటున్నారు, నా రోడ్ల మీద తిరుగుతున్నారు, నేను వేసిన వీధి దీపాలలో ముందుకెళుతున్నారు. అటువంటిది మనకి ఓటెయ్యకుండా ఎలా వుంటారు? మన పరిపాలన నచ్చకపోతే మనదగ్గర నుంచి ఏమీ తీసుకోవద్దు’ అని మాట్లాడారు. ఈ మాటలు నన్నెంత షాక్‌కి గురిచేశాయంటే టీడీపీ అభిమానుల మీద నాకు చాలా జాలి వేసింది. తమ నాయకుడు ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడటం వారికి కూడా అవమానంగా అనిపిస్తుంది కదా.

ఎందుకంటే ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజలే పరిపాలించుకొనే ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు కూడా ప్రజలలో ఒక భాగం. అంతే తప్ప ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు కాదు కదా ‘నా రాజ్యంలో ఉంటూ నా సొమ్ము తింటూ నాకే అన్యాయం చేస్తారా’ అనడానికి. ఈ మాటలను బట్టి ఆయనకి  ప్రజాస్వామ్య నిర్వచనమే తెలియదని అనుకుందామా.. ఆయన బెదిరింపు ప్రజలను వారికి రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కు భావప్రకటనా హక్కుల నుంచి దూరం చేయడం లేదా?

ఇది ఒక్కటేనా? అసలేమీ చదువుకోకున్నా, సంస్కారం మాత్రం మెండుగా వున్న పల్లెటూరు వ్యక్తులు కూడా, ఈ రోజుల్లో ‘అమ్మాయైతే ఏంటి, అబ్బాయైతే ఏంటి మాకు ఇద్దరూ సమానమే’ అంటూ ఉంటే ఈయన  ‘కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా’ అని పాతరాతియుగపు  సామెతలు ఉదహరిస్తున్నారు, ఇది పరోక్షంగా స్త్రీ శిశు హత్యలను ప్రేరేపించడం లేదా 800 ఏళ్ళ క్రితమే చట్టం ముందు రాజుతో సహా అందరూ సమానమే అని ‘మాగ్నాకార్టా’ని ప్రకటించుకున్న దేశాలతో పోటీపడుతూ గ్లోబల్లీ ఫీజిబుల్‌ సొసైటీని నిర్మిస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి ఆయా దేశాలలో పెద్ద పెద్ద మేడలు మాత్రమే ఉంటాయని అనుకుంటున్నారా? వారు అన్ని రంగాలలోనే కాదు సంస్కారంలోను అభివృద్ధి సాధించిన నాగరికులని తెలుసుకోలేదా? అంత పెద్ద పదవిలో ఉంటూ ఇటువంటి మాటలు ఆ దేశాల నాయకులు ఎవరైనా మాట్లాడి ఉంటే ఆ ఆధునిక దేశాల ప్రజలు వారిని పదవీచ్యుతులని చేసి ఉండేవారు.

హాలుని గాధాసప్తశతిలో ఒక గాథ ఉంది ’’ఎంతయలుకగొన్ననేమి? సత్పురుషుల/నోటనెట్లు చెడ్డమాట వెడలు?/రాహువదనగహ్వరమున జిక్కియు జంద్రు /కరములమృతరసమే కురియుగాదే. అని. ‘నిజం కదా, రాహువు నోటిలో చిక్కిన తరుణంలో కూడా చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు కానీ విషం కాదు కదా. అంతకు ముందు కొన్ని పత్రికలు, చానళ్లూ బాబు అజ్ఞానాన్ని, వాచాలత్వాన్ని వడపోసి నాణ్యమైన బాబుని మాత్రమే మనకి చూపించేవి.

ఆయన కొమ్ము కాసే పత్రికలు కీర్తిస్తున్నట్టు బాబు సద్గుణశీల సంపన్నుడు కావడం నిజమే అయివుంటే, ఆయన నోటినుంచి కష్టాలలోనే కాదు, కలలోకూడా ఇటువంటి మాటలు వచ్చివుండేవి కాదు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుం టారా అని ఒక జాతి జాతినే హేయంగా మాట్లాడిన బాబు నిజస్వరూపం ఇదే. ఇప్పుడు పత్రిక, దృశ్య మాధ్యమ మీడియాలోకి లెక్కకు మిక్కిలి వ్యక్తులు, సామాజిక మాధ్యమాలు ప్రవేశించడం చేత, ప్రజలు ముఖ్యమంత్రి నిజరూపాన్ని చూడగలుగుతున్నారు.

అనగనగా ఒక నక్క తిండి వెదుక్కుంటూ వెళ్లి నీలి రంగు డబ్బాలో పడిపోయిందిట. నీలి రంగులో వున్న తనని గుర్తించక దూరం దూరం వెళుతున్న ఇతర నక్కలను చూసి దానికో ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచన ప్రకారం మిగిలిన నక్కలన్నిటినీ పిలిచి మీటింగ్‌ పెట్టి, నన్ను మీకోసం దేవుడు పంపాడు. నేను ప్రత్యేకం, మేధావిని, శూరధీర నక్కని, సాక్షాత్తు భగవంతుడ్ని అన్నదట. ఆ నీలి రంగు చూసి మిగిలిన నక్కలు అవును కామోసనుకుని దానిని ఇలలో వెలసిన దైవమని కొలవడం మొదలెట్టాయట. ఒకానొక మంచి రోజు పెద్ద గాలీవానా వచ్చి, నక్క నీలి రంగంతా పోయి అసలు నక్క బయటికొచ్చిందట. అంతవరకు దేవుడి పేరుతో విలాసంగా బతుకుతున్న దానిని తోటి నక్కలు ఏం చేశాయనేది మిగిలిన క«థ. అసలు సంగతేంటంటే, ఆయన కొమ్ముకాసే పత్రికలు గేలన్ల, గేలన్ల నీలిరంగు పూసి ఆయనను కాపాడటానికి ప్రయత్నిస్తుంటే, ఆ నీలిరంగుని చీల్చుకుని బయటకొస్తున్న చంద్రబాబే ప్రజాస్వామ్య వ్యతిరేక అసలు సిసలు ఫ్యూడల్‌ బాబు.

  సామాన్య కిరణ్‌
  వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966’

 

మరిన్ని వార్తలు