భారతావనిలో బాల్యమే నేరమా?

25 Dec, 2015 01:12 IST|Sakshi
భారతావనిలో బాల్యమే నేరమా?

ఈ బిల్లు స్పష్టంగానే అన్యాయమైనది. అది బాలలకు, మహిళలకు కూడా వ్యతిరేకమైనదే. అంతర్జాతీయ బాలల న్యాయ శాస్త్రానికి సంబంధించి మన దేశం సంతకాలు చేసిన పలు అంతర్జాతీయ ఒప్పందాలను, సూత్రాలను అది ఉల్లంఘిస్తోంది. చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే బాలల వయసును తగ్గించడం వల్ల బాలల నేరాల రేట్లు ఏ దేశంలోనూ తగ్గలేదు. పైగా ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని 15 (3) అధికరణానికి విరుద్ధమైనది. అది బాలల ‘‘కోసం’’ ప్రత్యేక చట్టాలను చేయడాన్ని అనుమతిస్తుంది, వారికి ‘‘వ్యతిరేకంగా’’ కాదు.
 
 ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న జరిగిన సామూహిక అత్యాచారం కేసు విషయంలో వెల్లువెత్తిన ఆగ్రహావేశంలో కొట్టుకుపోయిన వారు, దాన్ని వాడుకున్న వారు రెండో విజయాన్ని సాధించారు. నిజానికి ఆగ్రహించిన ప్రజలు కోరుకున్నది ‘నిర్భయ కేసు’లో శిక్షపడ్డ బాల నేరస్తుడ్ని శిక్షించాలని మాత్రమే. అయితే ఆ క్రమంలో జరిగినది మాత్రం న్యాయాన్ని మరింత ఎక్కువగా గాయపరిచారు. ‘అతి క్రూరమైన’ నేరాలకు పాల్పడ్డ 16 ఏళ్లు పైబడ్డ బాలలను కూడా పెద్దలలాగే, పెద్దల న్యాయ స్థానాలలోనే విచారించడాన్ని అనుమతించే తాజా బిల్లును... ‘జువనైల్ జస్టిస్’ (కేర్ అండ్ ప్రొటెక్షన్) బిల్లుగా (బాలల న్యాయ (సంరక్షణ, పరిరక్షణ) బిల్లు)గా పేర్కొనడమే తప్పు.

రెండో విజయం అని ఎందుకు అన్నాం? రేపటి అగ్రరాజ్యంగా చెప్పుకుంటూ, ఆచరణలో ఇప్పటికే సమాచార సాంకేతిక అగ్రరాజ్యంగా ఉన్న దేశం మనది. అయినా, ఇటు పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక కార్యకలాపాలకు చట్టబద్ధమైన కనీస వయో పరిమితిని తగ్గించడానికి నిరాకరిస్తూనే, అటు కొత్త ‘జువనైల్ జస్టిస్’కు (బాలల న్యాయం) ఆమోదం పలికింది. 18 ఏళ్లకు ఒక్కరోజు తక్కువగా ఉన్న ఆడపిల్లయినా ఇక పరస్పర అంగీకారంతో లైంగిక కార్యకలాపాలను నెరపితే... ఆమె తల్లిదండ్రులు ఆమె సహచరునిపై అత్యాచార నేరాన్ని మోపగలుగుతారు. ఆ ‘విజయం’ తదుపరి లభించినది కాబట్టే జువెనైల్ జస్టిస్‌ను రెండో విజయం అంటున్నాం.

 రిపబ్లిక్ అంతరాత్మపై మరో దాడి
 ఈ రెండో విజయం ఫలితంగా మగపిల్లలైతే 21 ఏళ్లకంటే, ఆడపిల్లలైతే 18 ఏళ్లకంటే ఒక్కరోజు ‘తక్కువ’ వయస్కులై ఉండి ప్రేమలో పడితే... దాన్ని ‘అవమానంగా’ భావించే ‘పితృస్వామిక సమాజం’లోని మన కుటుంబాలు, గతంలో పెట్టే ‘కిడ్నాపింగ్’ కేసుకు తోడు, అత్యాచార ఆరోపణను జోడిస్తారు. మూలాల వరకు అవినీతి వ్యాపించిపోయిన మన సమాజంలో ‘పెద్దలు’ అయిన కొడుకులను, కూతుళ్లను వారి తల్లిదండ్రులు మైనర్లని  సులువుగా చూపగలరు. సెల్‌ఫోన్ కొనడంకంటే, తప్పుడు జనన ధృవీకరణ పత్రాలను పుట్టించడం ఏమంత కష్టం కాదు. ఈ మంగళవారంనాడు బాలల (అ)న్యాయ బిల్లు ఆమోదం పొందుతున్నప్పుడు ఆగ్రహం రేకెత్తించాల్సిన ఈ అంశాలేవీ ఎవరికీ పట్టలేదు. నాకు కనిపించింది ఇదే కావచ్చు, మరో వెయ్యీ ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రస్తుత ప్రభుత్వం భారత రిపబ్లిక్ అంతరాత్మపై సాగిస్తున్న దాడుల పరంపరలో మరొకటి మాత్రమే.

 ఈ బాలల (అ)న్యాయ బిల్లు ఏ ఆగ్రహ తరంగంపై నుంచి వచ్చి పడిందో... ఆ ఆగ్ర హానికీ, ఈ బిల్లుకూ ఎలాంటి సంబంధమూ లేదు. అదే మనలాంటి వాళ్లందరికీ ఆందోళన కలిగించాల్సిన విషయం. అవును, ఆనాటి పాశవిక అత్యాచారం, హత్య కేసుకు, దాని ఫలితంగా వెల్లువెత్తిన ఆగ్రహానికీ, ఈ బిల్లుకూ ఏ సంబంధమూ లేదు. భారత ప్రభుత్వం ‘అతి క్రూర’ నేరాలకు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ‘ఈ చట్టానికి విరుద్ధంగా’ నడిచిన బాలలందరూ ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్షకు అర్హులవుతారు. తద్వారా ఈ బిల్లు శిక్షార్హమైన నేరం చేసిన 16 ఏళ్లు పైబడిన బాలలందరికీ పెద్దలతో సమా నంగా శిక్షలను తప్పనిసరి చేస్తుంది. అమానుషమైన ఆ అత్యాచారం,  హత్య లపై కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని మన ప్రభుత్వం వాడుకుంది. 16 ఏళ్లు పైబడిన బాలలు చేసే అన్ని నేరాలనూ పెద్దలతో సమానంగా, పెద్దల న్యాయ స్థానాల్లో విచారించి, శిక్షించడాన్ని అనుమతించింది.  

 ఈ బిల్లులో వాడిన ‘ఈ చట్టానికి విరుద్ధంగా నడుచుకున్న బాలలు’ అన్న పద బంధాన్ని గమనించండి. ఏమాత్రం దూరాలోచనా లేకుండానే దాన్ని న్యాయపరిభాషలోకి చేర్చేశారు. ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించేవిగా నిర్వచించిన క్రూర నేరాలను పక్కన పెట్టండి. రాజద్రోహం నుంచి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వరకు 16 ఏళ్లు పైబడిన పిల్లలందరినీ పెద్దల్లాగే విచారిస్తారు. మన దేశంలోనే సాగుతున్న అంతర్గత యుద్ధాల్లో ఇరుక్కున్న పిల్లలకు ఇక ఏ గతి పడుతుందో ఊహించడం సులువే. దేశానికి గుండెకాయలాంటి ప్రాంతంలో రేగుతున్న మావోయిస్టు తిరుగుబాటు నుంచి శివార్లలో సాగుతున్న జాతి పోరాటాల వరకు అవి విస్తరించాయి. అలాంటి ప్రాంతాల్లో చట్టాలను అమలుపరచే యంత్రాంగం ఏలా పనిచేస్తుంటుం దనేది దృష్టిలో ఉంచుకుంటే... ఇకపై అక్కడి 16 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలపై దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని అభియోగాలు మోపి, పెద్దవారి కోర్టుల్లో విచారిస్తారనేగా?

 న్యాయాన్ని పక్కనపెట్టి రాజకీయానికి పట్టం
 ఈ బిల్లు బాహాటంగానే అన్యాయమైనది. అంతేకాదు, అది బాలలకే కాదు, మహిళలకు కూడా వ్యతిరేకమైనదే. అంతర్జాతీయ బాలల న్యాయ శాస్త్రానికి సంబంధించి భారతదేశం సంతకాలు చేసిన పలు అంతర్జాతీయ ఒప్పం దాలకు, సూత్రాలను ఈ బిల్లు ఉల్లంఘిస్తోంది. చట్టానికి విరుద్ధంగా ప్రవ ర్తించే బాలల వయసును తగ్గించి, వారిని పెద్దలుగా చూడటం వల్ల బాల నేరాల రేట్లు ఏ ఒక్క దే శంలోనూ తగ్గలేదు. ఆ సంగతి అలా ఉంచండి... ఈ బిల్లు భారత రాజ్యాంగంలోని 15 (3) అధికరణానికి కూడా విరుద్ధమైనది. ఆ అధికరణం బాలల ‘‘కోసం’’ మాత్రమే ప్రత్యేక చట్టాలను చేయడాన్ని అనుమతిస్తుంది. అంతేగానీ ‘‘వ్యతిరేకంగా’’ మాత్రం కాదు.

అయితే, ప్రజా గ్రహాన్నే ప్రధానం చేసి, దాన్నే చట్టం చేయడానికి ఆమోదయోగ్యమైన మూల కారణంగా మార్చేయడమే ఈ బిల్లుకు ఆమోదం పలకడానికి సంబంధించి అత్యంత ఆందోళనకర అంశం. ఈ విషయాన్ని శాసనకర్తలే స్వయంగా అంగీకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు, శశిథరూర్ మాట లనే తీసుకోండి. ఈ ఏడాది మే 6న లోక్‌సభలో బిల్లుపై చర్చలో పాల్గొంటూ ఆయన ‘‘ఈ బిల్లును మనం పాస్ చేసేట్టయితే, ముందు తరాల వారు మనపై కటువైన తీర్పు చెబుతారని  మన ట్రైజరీ బెంచీలలోని సభ్యులకు స్పష్టం చేస్తున్నాను. బాలలే మన భవిత. మనం బాలలను సంరక్షించాలి, కాపాడాలే తప్ప నాశనం చేయకూడదు...  న్యాయం కంటే రాజకీయ ప్రయో జనానికే ప్రభుత్వం ప్రాధాన్యాన్నిచ్చిందని చెప్పాల్సిరావడం విషాదకరం’’ అన్నారు.

 బుధవారం నాడు కూడా రాజ్యసభలో పలువురు విజ్ఞులు ఈ బిల్లును ఇప్పటి రూపంలో ఆమోదించడాన్ని వ్యతిరేకించారు. మరింత చర్చ కోసం దాన్ని సెలక్ట్ కమిటీకి పంపాలని కూడా ప్రతిపాదించారు.అయినాగానీ, చర్చ ముగిసేసరికి వామపక్ష పార్టీలను మినహాయిస్తే మిగతా పార్టీలన్నీ న్యాయం కంటే ‘‘రాజకీయ ప్రయోజనాని’’కే పట్టంగట్టాయి. బిల్లును ప్రవేశపెట్టిన మహిళా, శిశు అభివృద్ధి మంత్రి మనేకాగాంధీ , తదుపరి చర్చకు సమాధానం చెప్పేటప్పుడు అదే పనిగా నిర్భయ తల్లిదండ్రులు ప్రేక్షకుల గేలరీ నుంచి మిమ్మల్ని ‘‘చూస్తున్నారు’’ అని గుర్తుచే స్తుండటంతో అలా చేయడం వారికి తప్పలేదేమో.

 పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక కార్యకలాపాలకు కనీస వయసును ఆడ, మగ పిల్లలు ఎవరికైనా 18 ఏళ్లుగా అలాగే ఉంచుతూ ఇలాంటి చట్టాన్ని చేస్తున్నందున... ఈ బిల్లును ఆమోదించడం ప్రత్యేకించి మరీ ప్రమాదకరమైన పరిణామం. ఒకవంక ఆడపిల్లలకు, మగపిల్లలకు మధ్య సంబంధాలు రోజురోజుకూ విస్తరిస్తుండగా, మరోవంక పితృసామిక విలువలు బలంగా వేళ్లూనుకుని ఉండటమనే విపరీత పరిస్థితి నేటి మన సమాజంలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో నవ యవ్వనంలోని యువతీ యువకుల మధ్య పరస్పర అంగీకారంతో ఏర్పడే శారీరక సంబంధాలు, అతి తరచుగా అత్యాచారం కేసులుగా నమోదవుతుంటాయి. చాలా సందర్భాల్లో ఆడపిల్ల తల్లిదండ్రులే అలాంటి కేసులు పెడుతుంటారు.

 ఆగ్రహం సంస్కరణకు ప్రత్యామ్నాయం కాదు
 ఈ బిల్లుపై ఒక్కసారి రాష్ట్రపతి సంతకం చేశారంటే , అది అలాంటి నవ యువ ప్రేమికులలో చాలా మందికి శాపంగా మారుతుందని వేరే గుర్తు చేయన వసరం లేదు. ఈ ఒక్క కారణంగానే సమాజం ఈ బిల్లును తిరస్కరించా ల్సింది. కుటుంబ తగాదాలు, భూత గాదాల నుంచి వ్యక్తిగత శత్రుత్వాల వరకు బాలలు పెద్ద సంఖ్యలో ముద్దాయిలుగా కేసుల్లో నమోదవుతున్న పరిస్థితి మన సమాజంలో ఉంది. ఇక యువ ప్రేమ జంటలను బలవంతంగా వేరు చేసే తల్లిదండ్రులకు కొదవే లేదు. కుటుంబాల మధ్య జరిగే ఈ యుద్ధాల్లో పిల్లలు లేచిపోతే లేదా తల్లిదండ్రులను ధిక్కరించి పెళ్లి చేసుకుంటే ఇంతవరకూ కిడ్నాపింగ్ (అది ఇంకో ‘క్రూర నేరం’) కేసులు మాత్రమే పెట్టుకుంటున్నారు. ఇకపై మగపిల్లాడిపైన కిడ్నాపింగ్‌కు తోడు, అత్యాచారం కేసు కూడా నమోదవుతుంది.

 అత్యాచారాలకు పాల్పడే వారిపట్ల... వారు బాలలే అయినా పెద్దలే అయినా... ఎంత ఆగ్రహం బద్దలైనా గానీ, చివరకు పరస్పర అంగీకారంతో కలిసే జంటలే ఈ కొత్త చట్టం బాధితులు కానుండటం విచారకరం. నిర్భయ ఘటనపై ప్రజాగ్రహపు తొలి వెల్లువలో ముందు వరుసన నిలిచిన పౌర సమాజ సభ్యులు మరణ శిక్షను వ్యతిరేకించినవారే. పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక కార్యకలాపాలకు కనీస వయోపరిమితిని తగ్గింపును కోరినవారే. చివరికి, వారు ఆశించినదానికి వ్యతిరేకమైన ఫలితం లభించింది. మరణశిక్షలకు అర్హుల జాబితాలోకి రేపిస్టులు కొత్తగా చేరారు. అలాగే పరస్పర అంగీకారంతో లైంగిక కార్యకలాపాల కనీస వయోపరిమితి తగ్గింపూ జరగలేదు.
 ఆగ్రహావేశంలో కొట్టుకుపోయే పౌర సమాజంలోని ఒక భాగమైనా, ఇప్పటికైనా.... క్రిమినల్ న్యాయ సంస్కరణలకు ఆగ్రహం ప్రత్యామ్నాయం కాదనే గుణపాఠం నేర్చుకుంటుందని ఆశ. బిల్లులో అంతర్నిహితమై ఉన్న అన్యాయాన్ని రాష్ట్రపతి గుర్తించి, దాన్ని పునరాలోచనకు తిప్పి పంపుతారనే ఆశతో అప్పటి వరకూ ఎదురు చూద్దాం.

 countercurrents.org సౌజన్యంతో   
 వ్యాసకర్త ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఆసియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్: ఎ.పి. సమీర్

మరిన్ని వార్తలు