అటు రుణం, ఇటు రణం

6 Oct, 2015 01:30 IST|Sakshi
అటు రుణం, ఇటు రణం

ప్రపంచ బ్యాంక్ సంస్కరణల ప్రభావంలో పడి సోషలిస్ట్ చైనా కూడా సంక్షోభానికి గురైంది. ఈ సంక్షోభంలో  చైనా తన కరెన్సీ (యువాన్) విదేశీ మారకం విలువను తగ్గించుకోవలసి వచ్చింది. అయినా ఆ దేశం అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? అమెరికన్ నిపుణుల అంచనా ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా తన వస్తూత్పత్తి ఎగుమతుల ద్వారా (అమెరికా సహా) భారీ స్థాయిలో నలుమూలలకు పాకిపోయిన ఫలితంగా చైనా విదేశీ మారకం ద్రవ్య నిల్వలు కేవలం మిలియన్లలో కాదు, సరాసరి ట్రిలియన్ డాలర్లలోనే పేరుకుపోయాయి.
 
 ‘విదేశీ రుణం ఒక రాచపుండు. ఆ రుణాన్ని రాబట్టడానికి వర్ధమాన, బడుగుదేశాల మీద సంపన్న రాజ్యాలు ప్రయోగించే కీలక ఆయుధమే వడ్డీ, చక్రవడ్డీ. ఈ ఆయుధం ఎలాంటిది? ఆటంబాబు కన్నా, లేజర్ ఆయుధం కన్నా ప్రమాదకరమైనది.’ - బ్రెజిల్ నేత లూయీ ఇగ్నాసియో సిల్వా (రుణ విమోచన కోసం యుద్ధం ప్రకటించిన హవానా దేశాలు 1985లో నిర్వహించిన మహాసభలో)రాజ్యాంగ నిర్దేశాలకూ, ప్రజా ప్రయోజనాలకూ చెల్లుచీటి ఇచ్చి, అడ్డ దారులలో అయినా అధికారంలో కొనసాగదలచిన పాలకపక్షాలన్నీ దేశాన్ని రుణాల నుంచి బయటపడవేయడానికి బదులు ప్రజా వ్యతిరేక సంస్కరణల ద్వారా ప్రజా బాహుళ్యాన్ని నిరంతరం రుణగ్రస్తులను చేస్తూనే ఉంటాయి. ఇది 108 దేశాల అనుభవం. ఇండియా సహా కొన్ని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు విపరీత వడ్డీలకు అప్పు ఇచ్చే సంస్థ (వరల్డ్ బ్యాంక్) ఒకటైతే, ఆ రుణం తీర్చలేని దేశానికి మరింత రుణం ఇవ్వజూపే సంస్థ (ఐఎంఎఫ్) మరొకటి. ఆ రెండింటి నుంచి బయటపడలేనపుడు దేశ ఆర్థిక వ్యవస్థా చట్రాన్నే మార్చే సంస్కరణలను పునర్ నిర్మాణం పేరిట రుద్దుతారు. కాగా ఈ రుణం మీద వచ్చే వడ్డీలు, చక్రవడ్డీలను అమెరికా ఇతర యూరప్ సంపన్నదేశాల ప్రభుత్వాలు పంచుకుంటాయి.
 
 బడ్జెట్లు మనవే కానీ...
 భారత పాలకపక్షాలు చివరకు దేశాన్ని ఏ దుస్థితికి నెట్టాయంటే- మన బడ్జెట్లను, లేదా మన ‘ప్రగతి దృశ్యాన్ని’ సామ్రాజ్యవాద దేశాధిపతులకు నివేదించుకుని, అవసరమైతే బడ్జెట్లను దిద్దించుకుని వారికి అనుకూలమైన సవరణలు చేసుకునే వెసులుబాటు కల్పించే వరకు వచ్చాం. ఈ పని పీవీ నరసింహారావు ప్రధానిగా, డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఆర్థికమంత్రిగా ఉన్న కాలంలో మొదట అమెరికాలో జరిగింది. తరువాత వాజపేయి ప్రధానిగా ఉండగా ఈ పద్ధతితో విదేశీ గుత్త పెట్టుబడులను ధారాళంగా ఆహ్వానించడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు బీజేపీ-సంఘపరివార్ ఎన్డీయే సర్కార్ కింద ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హయాంలోనూ అదే మరో రూపంలో కొనసాగుతోంది. గతంలో ఆర్థికమంత్రి హోదాలో మన్మోహన్‌సింగ్ మన బడ్జెట్‌ను అమెరికా పట్టుకుపోయి ‘ఏ ప్రతిపాదనలైతే మీ పెట్టుబడులకు అనుకూలమో ఆ విధంగానే మార్పులూ చేర్పులూ’ చేయించారు. ఆ మార్పుల మేరకే అమెరికా కనుసన్నలలో నడిచే ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్య్రవనిధి సంస్థలు రంగంలోకి దిగి 1991లో ప్రజా వ్యతిరేక సంస్కరణలకు తెరతీయించాయి. అరుణ్‌జైట్లీ కూడా మోదీ తరు వాత అమెరికా పర్యటనకు వెళ్లబోతున్న సందర్భంగా అక్కడి గుత్తపెట్టుబడి వర్గాల ప్రతినిధులకు భారత ప్రగతి గురించి నివేదించుకుంటారని వార్తలు (4-10-‘15) వెలువడ్డాయి.
 
 2007-2008 నుంచి కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం లేదా సంక్షోభ దశ నుంచి అమెరికా, ఆ దేశం మీద ఆధార పడిన కొన్ని యూరప్ దేశాలు ఇంకా తేరుకోలేదు. పెపైచ్చు అంతర్జాతీయ వాణి జ్యంలోనూ డాలర్ విలువ పడిపోకుండా నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతున్నాయి. నిరుద్యోగం కూడా పెరిగిపోతున్న దశ ఇది. ఈ సమయంలో ప్రపంచ బ్యాంక్ సంస్కరణల ప్రభావంలో పడి సోషలిస్ట్ చైనా కూడా సంక్షోభానికి గురైంది. ఈ సంక్షోభంలో  చైనా తన కరెన్సీ (యువాన్) విదేశీ మారకం విలువను తగ్గించుకోవలసి వచ్చింది. అయినా ఆ దేశం అంత ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏమై ఉంటుంది? అమెరికన్ నిపుణుల అంచనా ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా తన వస్తూత్పత్తి ఎగుమతుల ద్వారా (అమెరికా సహా) భారీ స్థాయిలో నలుమూలలకు పాకిపోయిన ఫలితంగా చైనా విదేశీ మారకం ద్రవ్య నిల్వలు కేవలం మిలియన్లలో కాదు, సరాసరి ట్రిలియన్ డాలర్లలోనే పేరుకుపోయాయి. అందువల్లనే నిమ్మకు నీరెత్తినట్టు కొనసాగుతోంది. ఏనాడూ సోషలిస్ట్ దేశాలు రూపాయి వాటా పెట్టి రేపటి కల్లా రూ. 10లు గుంజుకునే స్టాక్‌మార్కెట్ జూదానికి పాల్పడలేదు. అలాం టిది చైనాలో సోషలిస్టు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ పేరిట సంస్కరణలు ప్రవేశ పెట్టి, ప్రజలను కొత్త సంస్కృతికి అలవాటు చేసి ఈ సంక్షోభం తెచ్చుకుంది.
 
 వడ్డీరేట్లతో బురిడీ
 కాగా అమెరికా ఫెడరల్ బ్యాంక్ మొన్నటి దాకా ఇండియా లాంటి దేశాలలో బహుళ జాతి కంపెనీలకు వ్యాపారాలు, పెట్టుబడి కేంద్రాలు చూసే పనిలో ఉంది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గితే అక్కడ నుంచి తరలుతున్న పెట్టుబ డులను ఆపి, ప్రయోజనం పొందాలని, ఇదే తన సంక్షోభానికి పరిష్కారమనీ అనుకుంది. కానీ పెట్టుబడి స్థాణువై ఉండిపోతే లాభాలు, సూపర్ లాభాలు రావు; దోపిడీకి వీలుండదు. కాబట్టి వడ్డీరేట్లు తగ్గించడానికి ఆలోచిస్తున్నానని అమెరికా మొదట ఎందుకు ప్రకటించింది! తాను వడ్డీరేటు తగ్గించుకుంటు న్నానన్న భ్రమలు కల్పిస్తున్నది- ఇండియా లాంటి దేశాలను మరింతగా సంక్షోభంలో నెట్టడానికే. ఆ బుట్టలో పడిపోయిన భారత్ పాలకవర్గాలు వడ్డీరేట్లను తగ్గించాలని రిజర్వుబ్యాంకుపై ఒత్తిడి చేశారు. వడ్డీరేట్లు తగ్గకుంటే పెట్టుబడులు రావని హెచ్చరించారు. ఇందువల్ల బడా పెట్టుబడిదారులు లాభపడతారు గానీ, చిన్న మొత్తాల పొదుపుదారులు నష్టపోతారు. ద్రవ్యో ల్బణం, పెరిగిన ధరలు ఇంకా తగ్గుముఖం పట్టనేలేదు. కనుక ఈ దశలో పరిశ్రమాధిపతులకు వడ్డీరేట్లు తగ్గించాలని బ్యాంకులను ఆదేశించలేననీ, అది అనర్థానికి దారితీస్తుందనీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పట్టు పట్టారు. ఇంతవరకు పెరిగిన వడ్డీరేట్ల వల్ల ప్రయోజనం పొందిన బ్యాంకులు ఆ ఫలితాలను వినియోగదారులకు పంపిణీ చేయలేదని కూడా ఉదారవాద బ్యూరోక్రాట్‌గా పేరొందిన రాజన్ చెప్పారు.

అనేక ప్రయోజనకర విధా నాలను, పథకాలను తారుమారు చేస్తూ చివరికి పౌరుల సమాచార హక్కు చట్టాన్ని తారుమారు చేసేందుకు, పంటభూములను సహితం పరిశ్రమాభి వృద్ధి పేరిట దేశ, విదేశీ గుత్తపెట్టుబడిదారులకు మళ్లించడానికి చట్టాలను వక్రీకరించి, లొంగదీసే ప్రయత్నంలో నేటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంకొక వైపు నుంచి ప్రణాళికా సంఘ వ్యవస్థకు చెదలు పట్టించి, ఫెడరల్ వ్యవస్థా స్వభావానికి ఎసరు పెట్టాలని చూస్తున్నారు. సెక్యులర్ వ్యవస్థకు చేటు తెచ్చే విధానాలు అనుసరిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న రాజన్, కందకు లేని దురద కత్తికెందుకని సరిపెట్టుకుని, వడ్డీరేట్లు తగ్గించి చేతులు దులుపుకు న్నాడు. అయితే చైనా కూడా ఆర్థిక సంక్షోభానికి గురైనా, దాని జాతీయోత్ప త్తుల సగటు విలువతో మన ఉత్పత్తుల విలువను పోల్చుకోరాదనీ, మన జీడీపీ విలువను 11 శాతం నుంచి 6-5 శాతానికి దఫదఫాలుగా దిగజార్చు కుంటూ వచ్చిన వైనాన్ని మరువరాదనీ రాజన్ గుర్తుచేశారు.
 
 మోదీ అమెరికా పర్యటన గుత్తపెట్టుబడుల కోసం ప్రకటనలు గుప్పిస్తూ ఉండగానే ఇటు రాజన్ వ్యంగ్య ధోరణిలో ఇలా ప్రకటించారు: ‘మనందరికన్నా మోదీయే దూకుడులో ముందడుగులో ఉన్నారు. కానీ ఆయన పర్యటనలకు దీటుగా చేతలూ ఉండాలి. మోదీ విదేశీయాత్రల వల్ల ఇండియా పట్ల ప్రపంచ స్పం దన సానుకూలంగా ఉన్నట్టు తోస్తున్నది. విదేశీ పెట్టుబడులు గుప్పించడమే పరమావధిగా ఇండియాను మార్కెట్ చేయడానికి ప్రధాన మంత్రి చొరవ చూపుతున్నారు కానీ, అందుకు తగిన ఆచరణ క్రియలో కనపడాలి కదా!’ అన్నారు. ఇండియాను విదేశీ గుత్త పెట్టుబడులతో మార్కెట్ చేసుకునే క్రమాన్ని వివరిస్తే ఆర్థికమంత్రి జైట్లీ ‘ప్రపంచంలోని మిగతా దేశాలన్నింటి కన్నా వేగవంతంగా ఇండియాయే అభివృద్ధి సాధిస్తున్న’దని చెప్పారు. అయితే ‘రాజకీయపరమైన అడ్డుగోడలు’ ఏమీలేకపోవడమే ఇందుకు కారణాల’నీ అన్నారు. అంటే బీజేపీ-పరివార్ కూటమి, కాంగ్రెస్ యూపీఏ కూటమి మధ్య అధికార పీఠం కోసం తప్ప మౌలికంగా పాలనా విధానాలలో చెప్పుకోదగిన భేదాలు లేవని జైట్లీ చెప్పకనే చెప్పినట్టయింది.
 
 రుణం పెట్టి రణం తెచ్చి...
 రోజులు గడిచినా తేలని అంశం ఒకటి ఉండిపోయింది. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం విజయవంతం కావడానికి ఏది అవసరం?  నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎరువుగా వాడుకోండి, కానీ వస్తూత్పత్తిపైన, మార్కెటింగ్ పైన, వాటి ఎగుమతి వ్యాపార లావాదేవీల మీద భారతీయత మాత్రమే ముద్ర వేసుకోవాలి. కాని ఈ పేరుతో ‘వాస్కోడిగామాలై’ వచ్చి ఇండియాలో మళ్లీ కాలుమోపే విదేశీ గుత్తవర్గాలూ (మల్టీ నేషనల్స్), విదేశీ సామ్రాజ్య పాలకులూ ఈ నామమాత్రపు స్వాతంత్య్రాన్ని కూడా హరించి వేసేందుకు ప్రజలు అనుమతించరు. అందుకే ఇటీవల కాలంలో కొందరు ప్రజాస్వామ్య వాదులు, ప్రగతిశీల శక్తులు రెండో స్వాతంత్య్ర సమరం జరగాలని గుర్తు చేస్తున్నారు.

ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల తరఫున ఆసియా, ఆఫ్రికాలో బ్యాంకు సంస్కరణలకు బాధ్యుడిగా నియమితుడైన ఉప సంచాలకుడు డాక్టర్ డేలీ సన్ బుదూ పదవీ విరమణ చేస్తూ బ్యాంక్ ఎండీకి రాసిన బహిరంగలేఖలోని అంశాలను పరిశీలించండి! ‘ఈ దేశాలలో మనం అమలు జరిపించిన సంస్కరణల వల్ల నా చేతులు రక్తసిక్తమైనాయి. నా చేతులను కడుక్కోవడానికి ప్రపంచ దేశాలలోని సబ్బులన్నీ తెచ్చి రుద్దినా, ఆ పాపం మాత్రం తొలగదు. నాకీ అధికారం వద్దు సెలవు’. ‘రుణం పెట్టి రణం తెచ్చి, జనం ధనం ఇంధనమై చరణ కరాబంధనమై’ అని డాలర్ వికృతరూపాన్ని శ్రీశ్రీ ఎప్పుడో అక్షరబద్ధం చేశాడు.
 (వ్యాసకర్త మొబైల్: 9848318414)
 - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

మరిన్ని వార్తలు