అవినీతి పోరు... చైనా జోరు

2 Feb, 2014 00:13 IST|Sakshi
అవినీతి పోరు... చైనా జోరు

చైనా అధ్యక్ష, ప్రధాన మంత్రులు సహా పార్టీ, ప్రభుత్వ అత్యున్నత నేతలు విదేశాల్లో భారీ ఎత్తున దాచిన సంపదల గుట్టు ఇటీవల రచ్చకెక్కింది. అవినీతిపై సమరం ప్రకటించిన ప్రభుత్వం అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలపై విరుచుకుపడుతోంది.
 
 
 ‘రక్కసులతో పోరాడేవారు ఆ క్రమంలో తామే అలా మారిపోకుండా జాగ్రత్తపడాలి (నీషే).’ చైనా అధ్యక్షుడు క్సీ జింగ్‌పింగ్ ‘పెద్ద పులులను, చిన్న కీటకాలను సైతం వదిలేది లేదు’ అంటూ గత ఏడాది మార్చిలో అవినీతి రక్కసిపై యుద్ధం ప్రకటించారు. నీషే హెచ్చరిక ఆయనకు వర్తించదు. ఆయనలాంటి వారు ‘దేవతలు’గా మారిపోకుండా జాగ్రత్తపడాలేమో. అధ్యక్షుడు క్సీ, ప్రధాని లీ పెంగ్, మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్‌జియావో బావోలు సహా దాదాపు 17 వేల మంది కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వ అగ్రనేతలు విదేశాల్లో దాచిన  ‘కష్టార్జితం’ వివరాలను ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) ఈ నెల 22న పేర్లతోసహా బయటపెట్టింది. కరీబియన్ సముద్రంలోని బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో మాజీ ప్రధాని వెన్ పుత్ర రత్నాలతో కలిసి క్సీ బావ మరిది డెంగ్ జియాగుయి భారీ రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నట్టు తేలింది. 2000-2010 మధ్య చైనా నేతలు విదేశాల్లో దాచిన సంపద నాలుగు లక్షల కోట్ల డాలర్లని అంచనా.
 
 ‘ఆర్థిక సంస్కరణలతో దేశం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల బాటపడుతుందని భావించాం. ఒకతరం గడిచే సరికే ఆర్థిక, రాజకీయ అధికారాలను దుర్వినియోగపరచి పార్టీ, ప్రభుత్వ నేతలు అత్యంత సంపన్నవంతులుగా మారిపోయారు’ అని ఓ చైనా అధ్యాపకుడు వాపోయాడు. చైనాను మార్కెట్టు పట్టాలెక్కించిన డెంగ్ జియావోపింగ్ హయాం (1980లు) నుంచి పార్టీ నాయకత్వంలో నెలకొన్న ‘సుస్థిరత’, ‘ఐక్యత’లకు ముఖ్య ప్రాతిపదిక నేతల ఉమ్మడి ఆస్తులు, పెట్టుబడుల బంధనాలేననే వాదనను కాదనలేం. డెంగ్ కుటుంబ సభ్యుల ‘కష్టార్జితం’ వివరాలు కూడా ఐసీఐజే జాబితాలో ఉన్నాయి.  
 
 పార్టీ, ప్రభుత్వ అధికారుల అవినీతిని 53 శాతం ప్రజలు ప్రధాన సమస్యగా భావిస్తుంటే, వ్యాపారులే అవినీతి, అక్రమాలు ప్రధాన సమస్యని 27 శాతం భావిస్తున్నట్టు తాజా సర్వే తెలిపింది. ఫూజియాన్ రాష్ట్రం క్వాన్‌జౌ 500 హెక్టార్లలో నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును గత నెల 18 నుంచి రైతులు అడ్డగించి ఆందోళన సాగిస్తున్నారు. రైతుల భూమిని వారికి తెలియకుండానే ప్రభుత్వం అమ్మేసింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రైతులకు పరిహారాన్ని చెల్లించి రియల్ ఎస్టేటర్లు కొనుక్కున్నారు. విదేశీ వ్యాపార సంస్థలు సైతం బ్యాలెన్స్ షీట్లలోని ‘ఇతర ఖర్చులు’ (ముడుపులు) కళ్లు చెదిరేట్టుగా పెరిగిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నాయి. అలా అని ప్రభుత్వం చేతులు ముడుచుకు కూచోలేదు. బీజింగ్‌లో గత పది రోజుల్లో ఐదుగుర్ని కటకటాల వెనక్కు తోసేసింది. అందరిపై ఒకటే ఆరోపణ... ‘ప్రజలను పోగు చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించడం.’ వారిలో గత ఆదివారం నాలుగేళ్ల  శిక్ష పడ్డ క్సు జియాంగ్ అవినీతి వ్యతిరేక, ప్రజాస్వామిక హక్కుల సంస్థ ‘న్యూ సిటి జెన్స్’ నేత. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా క్సీ ప్రభుత్వం పది నెలల క్యాంపయిన్ చేపట్టింది!  
 
 మరోవంక అవినీతిపరులకు శిక్షలు పడుతున్న వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 20 వేల మంది అవినీతిపరులను శిక్షించారు. వారిలో దాదాపు అంతా ‘కీట కాలే.’ ‘పెద్ద పులి’ ఒక్కటీ లేదు. అవినీతి నిరోధక శాఖ కంటే అవినీతిపరులైన అధికారుల మాజీ ఉంపుడుగత్తెలే సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రతీతి. 2013లో రెనిమిన్‌బో విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనంలో ఏ మాత్రం చేతనైన (అవినీతి) మగాడికైనా కనీసం ‘ప్లస్ టూ’ ఉండాల్సిందే.
 
 ఇల్లాలికి తోడు ‘రెండో ఆమె’ (ఎర్నాయి), ‘చిన్నామె’ ఉండాలి. అవి నీతిపరులైనా ‘ప్లస్సులు’ లేని ‘దద్దమ్మలు’ 5 శాతం మాత్రమే. మిగతా 95 శాతం ధీరుల్లో 40 శాతానికి ఎప్పటికప్పుడు కొత్త ‘ప్లస్సులు’ కావాలి. మాజీ ‘ప్లస్సులు’ ప్రతీకారంతో ప్రేమ పిపాసుల అనైతికత తో పాటూ అవినీతిని కూడా ‘నెట్’ కెక్కించేస్తున్నారు. మాజీ ఉంపుడుగత్తెల అవినీతి వ్యతిరేక ఉద్యమం జోరును పార్టీ అధికారిక పత్రిక ‘పీపుల్స్ డైలీ’ సైతం గుర్తించక తప్పలేదు. ‘అవినీతి వ్యతిరేక పోరాటానికి ఉంపుడుగత్తెలపైనే ఆధారపడ కూడదు’ అని గత మేలో అది ఏకంగా సంపాదకీయమే రాసింది. భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లు నమ్మించి నట్టేటముంచిన ఫాన్ హుయి (42) అనే పురావస్తు అధికారి తన మధ్యస్త స్థాయి జీతంతో కూడబెట్టిన కళ్లు చెదిరే సంపదను అతని మాజీ ఉంపుడుగత్తె జీ యింగ్నాన్  (26) గత జూలైలో ఏకంగా టీవీకి ఎక్కి మరీ బయటపెట్టింది. ‘పాత ప్రేమలను మరచి ప్రియురాళ్లు పగబట్టి ప్రతీకారానికి దిగడం న్యాయమా?’ అని నాన్‌కింగ్ మేయర్ కటకటాలు లెక్కిస్తూ వాపోతున్నారు. ఆయన 18 మంది ఉంపుడుగత్తెలను గలిగిన వీరునిగా రికార్డును సృష్టించినవాడు. ఇంతకూ అధ్యక్షుడు క్సీ 5 శాతం దద్దమ్మల్లోనే ఉండి ఉంటారంటారా?
 పిళ్లా వెంకటేశ్వరరావు
 
 

మరిన్ని వార్తలు