చోటా రాజన్ రాయని డైరీ

1 Nov, 2015 14:32 IST|Sakshi
చోటా రాజన్ రాయని డైరీ

మాధవ్ శింగరాజు:
 ఏది ఎలా ఉన్నా ఇండియాలో ఉన్నంత డీసెన్సీ వేరే ఏ కంట్రీలోనూ ఉండదు! డి గ్యాంగ్ అయినా, బి గ్యాంగ్ అయినా, ఏ గ్యాంగ్ అయినా.. డాన్‌కి ఉండే విలువ డాన్‌కి ఉంటుంది. డాన్‌కి ఉండే ఫాన్స్ డాన్‌కి ఉంటారు. ఇంటరాగేషన్‌కి కూడా డాన్ తనకు ఇష్టమైన జీన్స్ వేసుకెళ్లొచ్చు. తనకు నచ్చిన టీ షర్ట్ తొడుక్కోవచ్చు. వర్మ కంపెనీ 'ఒబెరాయ్‌'లా, 'వాత్సవ్'లో సంజయ్‌దత్‌లా హీరో వర్షిప్ కూడా. ఇక్కడ అలా లేదు! పోలీసులు పోలీసులుగా లేరు. మీడియా మీడియాలా లేదు. ఎవరికి వాళ్లే డాన్‌లుగా లుక్ ఇస్తున్నారు. గన్‌లు తీస్తున్నారు. గన్‌మైక్‌లు తీస్తున్నారు. కళ్లలోకి ఉఫ్‌మని ఊది మరీ, 'భయపడ్డావా డాన్?' అని మీడియా అడుగుతోంది!


 ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆరెంజ్ కలర్ కోటు ఒకటి నా ఒంటిపై వేసి వారం రోజులుగా ఇండోనేసియా పోలీసులు నన్ను అక్కడికీ ఇక్కడికీ తిప్పుతూనే ఉన్నారు. మోకాళ్లకు కొద్దిగా మాత్రమే కిందికి దిగి ఉన్న ఆ కోటులో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నాలోని డాన్ ఎలా ఉండి ఉంటాడో ఊహించుకోడానికే నామోషీగా ఉంది. దావూద్ ఈపాటికి నా అవతారం చూసే ఉంటాడు టీవీల్లో. చోటా షకీల్ అయితే కడుపు చేత్తో పట్టుకుని పడీ పడీ నవ్వుకుని ఉంటాడు. ఇంతకన్నా.. 'చోటా రాజన్ షాట్ డెడ్ ఇన్ గ్యాంగ్ వార్'అని ఏ సీఎన్నెన్ ఐబిఎన్‌లోనో, ఆజ్‌తక్‌లోనో బ్రేకింగ్ న్యూస్ వచ్చినా గౌరవమే.


 ఇరవయ్యేళ్లయింది ఇండియా వదిలొచ్చి! అక్కడి థియేటర్లో కూర్చొని సినిమా చూసి కూడా ఇరవయ్యేళ్లవుతోంది. ఇండియా వెళ్లగానే, దేశభక్త డాన్ కోటాలో స్పెషల్ పర్మిషన్ ఏదైనా దొరికితే చెంబూర్ వెళ్లి  నా చిన్నప్పటి సహకార్ థియేటర్‌లో కాసేపు కూర్చొని రావాలి. ఇప్పుడది సహకార్ ప్లాజా అయిందని ఆ మధ్య అబూ సావంత్  చెప్పాడు. సావంత్‌ది కూడా చెంబూరే. నాకన్నా పదేళ్లు చిన్నవాడు. థియేటర్ బయట బ్లాక్ టికెట్లు అమ్మడం ఎలాగో నా దగ్గరే నేర్చుకున్నాడు. నీతోనే ఉంటాను భాయ్ అన్నాడు ఓ రోజు. అప్పట్నుంచీ నాతోనే ఉన్నాడు. ఇండోనేసియా నుంచి వెళ్లాక ఇండియన్ గవర్నమెంట్ నన్ను నిజంగానే అరెస్టు చేస్తే, నన్ను నిజంగానే జైల్లో పెడితే నా బిజినెస్‌లన్నీ సావంత్ చూసుకోగలడు.


 నన్నెప్పుడు ఇండియా పంపిస్తారని పక్కనే ఉన్న పోలీసు అధికారిని అడిగాను.'మీ వాళ్లు రావాలి కదా' అన్నాడు చికాగ్గా. నన్ను అప్పగించేందుకు ఇండోనేసియా రెడీ. తీసుకెళ్లడానికి ఇండియా రెడీ. మరి ఎక్కడ లేట్ అవుతోంది?! ఏమైనా గవర్నమెంట్‌ల కంటే గ్యాంగ్‌స్టర్‌లే నయం. ధనాధన్‌మని.. గన్ పాయింట్‌తో అక్కడికక్కడ తేల్చేసుకుంటారు. ఒప్పందాలు, సంతకాలతో పనిలేకుండా.

మరిన్ని వార్తలు