గురువు... ప్రవహించే జ్ఞానం

20 Nov, 2015 00:30 IST|Sakshi
గురువు... ప్రవహించే జ్ఞానం

తరగతి గదే సమాజం అంటూ, వందేమాతరం ఉద్యమం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఆ తరగతి గదే సామాజిక ఉద్యమాలకు ఏ విధంగా ప్రాణం పోసిందీ వివరించడం జరిగింది.
 విశ్లేషణ
 చుక్కా రామయ్యగారు లబ్ధప్రతి ష్టులైన, జనామోదం పొందిన విద్యావేత్త. లబ్ధప్రతిష్టులైన వారం దరూ జనామోదం పొందిన వారు కాకపోవచ్చు. జనామోదం ఉన్న వారు లబ్ధప్రతిష్టులు కానక్కర లేదు. ఈ రెండూ ఒక్కరిలో కలసి సాగిపోవాలంటే, విజ్ఞానాన్ని సామాజిక అవసరాలకు మేళవించే శక్తి సామర్థ్యాలుండాలి. రామయ్యగారిలో ఈ శక్తి సామ ర్థ్యాలు అపారంగా ఉన్నాయి. ఆదర్శ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన విద్యాలక్ష్యాల గురించీ, సమాజానికి విద్యా వ్యవస్థకు ఉండాల్సిన సంబంధాల గురించీ ఆయనకు స్పష్ట మైన అవగాహన ఉంది. ఉపాధ్యాయ వృత్తి ఎడల ఉండవ లసిన గౌరవానికీ, నిబద్ధతకూ ఆయన నిలువెత్తు నిదర్శనం. అందుకే రామయ్యగారంటే నాకెంతో అభిమానం.
 ప్రజా పోరాటాల్లో పాల్గొన్న, పాల్గొంటున్న నేపథ్యంతో, పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ సాగిన అధ్యాపన అనుభవంతో రామ య్యగారు విస్తృతంగా రచనలు చేశారు, చేస్తున్నారు. సామాజిక సమస్యలను పరిష్కరించడం కోసం ఒక తరాన్ని ఎప్ప టికప్పుడు తయారుచేయడమే 'విద్య' ప్రధాన లక్ష్యంగా ఆయన భావించారు. ఈ లక్ష్యమే ఆయన రచనల్లో అంతస్సూ త్రం. ఆ కోవకు చెందినదే రామయ్యగారి ప్రస్తుత రచన 'విద్యాక్షేత్రం తరగతి గది' రామయ్య గారి అధ్యాపక అనుభవ సారం ఈ పుస్తకం. అందుకే ఈ పుస్తకానికి ముందుమాట రాయడం గౌరవంగా, నేర్చుకునే అవకాశంగా భావిస్తు న్నాను. గురుకులం నుంచి తరగతి గది వరకు, అక్కడి నుంచి virtual classroom వరకు జరుగుతున్న విద్యారంగ ప్రస్థానం సామాజిక ప్రస్థానంలో భాగమే. సాంప్రదాయ సామాజిక వ్యవస్థల విద్యావ్యవస్థ ప్రతిరూపమే గురుకు లాలు. పారిశ్రామిక వ్యవస్థల ప్రతిరూపమే తరగతి గదుల విద్యావ్యవస్థ. ఆధునిక సమాజాల (Post Industrial Societies) ప్రతిరూపమే virtual classrooms. మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ రూపాలు కూడా మారుతుంటాయి.


 తరగతి రూప స్వభావాలు మారుతున్నప్పటికీ, నేటి విద్యావ్యవస్థలో తరగతి గది ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. రామయ్యగారి మాటల్లో చెప్పాలంటే, 'తరగతి గది ఒక పవిత్రమైన క్షేత్రం. తల్లి గర్భకోశం లాంటిది. సమాజ సూక్ష్మ ప్రతిబింబం.'తరగతి గదిని కేంద్రంగా చేసుకుని, తన అధ్యాపక జీవితంలో తరగతి గది నేర్పిన పాఠాలెన్నింటినో రామయ్యగారు మనకందించారు.


 ప్రపంచ భవిష్యత్తు తరగతి గదుల్లో లిఖితమవుతుం దనే ప్రగాఢ విశ్వాసం రామయ్యగారికుంది. అందుకే, భువ నగిరి పాఠశాల నుంచి నాగార్జునసాగర్ రెసిడెన్షియల్ కళా శాల వరకూ సాగిన అధ్యాపక ప్రస్థానంలో పిల్లల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను కదిలించి కార్యాచరణకు సిద్ధం చేయడంలోని తన అనుభవాలను మనకందించారు. పిల్లల దగ్గర నుంచి తాను నేర్చుకున్న పాఠాల నుంచి, పిల్లలకు తను నేర్పిన పాఠాల వరకూ ఎన్నెన్నో విషయాలను సందర్భోచితంగా వివరించారు. అనుభవాల నుంచి నేర్చుకోవడం, నేర్చుకున్న దానిని సందర్భోచితంగా అన్వయించడం రామయ్యగారి ప్రత్యేకత. చాలా మందికి అనుభవం ఉంటుంది కానీ, నేర్చుకోలేరు. నేర్చుకున్న దానిని అన్వయించలేరు. కనుకనే సరళమైన భాషలో రామయ్యగారు అందించిన  తరగతి  గది నేర్పిన పాఠాల సూత్రీకరణలు నేటి తరానికి దిక్చూచిలా ఉపకరిస్తాయి.


 పాఠశాల అంటే  బల్లలు, భవనాలు,  కట్టడాలు కావు. పాఠశాల అంటే ఉపాధ్యాయుడు, విద్యార్థుల సంబంధం, అనురాగం, ప్రజాస్వామిక చర్చ, మేధోమథనం అనంటారు రామయ్యగారు. విద్యార్థి అధ్యాపక సంబంధాలే విద్యా వ్యవస్థ మౌలిక అంశంగా గుర్తిస్తూ, ఆ సంబంధాలే ఏ విధంగా విద్యార్థి భవిష్యత్తును.. సమాజ భవిష్యత్తును ప్రభా వితం చేస్తాయో వివరించడం జరిగింది. తరగతి గదే సమా జం అంటూ, వందేమాతరం ఉద్యమం నుంచి ప్రత్యేక తెలం గాణ ఉద్యమం వరకు ఆ తరగతి గదే సామాజిక ఉద్యమా లకు ఏ విధంగా ప్రాణం పోసిందీ వివరించడం జరిగింది. రామయ్యగారు విదేశాలలోని తరగతి గదుల అనుభవాలని, ముఖ్యంగా అమె రికా, ఫిన్లాండ్ దేశాల అనుభవాలని, మన దేశ అనుభవంతో పోల్చి విశ్లేషిం చారు. మనదేశంలో ప్రశ్నలకు సమాధా నాలు చెప్పడాన్ని నేర్పడానికి ప్రాధాన్య తనిస్తే అమెరికాలో సమాధానాన్ని ప్రశ్నిం చడానికి ప్రాధాన్యత ఉంటుంద న్నారు రామయ్యగారు. ప్రతిదేశానికి ప్రత్యేక మైన తరగతి గది కల్చర్ ఉంటుందని, ఇతర దేశాల తరగతి గది కల్చర్‌ని మన దేశంలోకి తేవాలనుకుంటే చాలా జాగ్ర త్తలు పాటించాలని హెచ్చరించారు. ప్రతిదీ స్విట్జర్లాండ్ నుంచో, అమెరికా నుంచో దిగుమతి చేసుకోవాలనుకునే వాళ్లకిదో మంచి హెచ్చరిక.


 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో తరగతి గది నేర్పిన పాఠాలు తెలంగాణ విద్యావ్యవస్థ పున ర్నిర్మాణానికి, దిశా నిర్దేశానికి ఎంతగానో తోడ్పడతాయి. కార్పొరేట్ శక్తులు విద్యాలయాలను మురికికూపాలుగా మారుస్తున్నాయని రామయ్యగారు హెచ్చరించారు. ఈ తరుణంలో తరగతి గదుల్లో ప్రజాస్వామిక స్వభావాన్ని, సోషలిజాన్ని ఆచరణాత్మకంగా చూపాలని ఆశించారు. ఉపాధ్యాయుల నియామకాలలో జాగ్రత్త వహించాలని, ఫిన్లాండ్ దేశంలో లాగా ప్రతి మూడు సంవత్సరాలకొకసారి ఉపాధ్యాయునికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని.. ఉపాధ్యాయుని పనిని అంచనా వేసేటప్పుడు సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. రామయ్యగారి ఈ సూచనలు తెలంగాణ విద్యావ్యవస్థ పునర్నిర్మాణానికి ఎంత గానో తోడ్పడతాయి.


 నేర్చుకోవడానికి తగిన వాతావరణం సృష్టించే కేం ద్రంగా తరగతి గదులను తయారు చేయడంలో అధ్యాప కుని పాత్ర గురించి రామయ్యగారు చేసిన సూచనలు, చెప్పిన పద్ధతులు పాటిస్తే తెలంగాణ విద్యార్థులకు ఎంతో సేవ చేసినవారమవుతాము. ప్రవహించే జ్ఞానానికి ఉపా ధ్యాయుడు ‘ప్రతీక’ కావాలనేది రామయ్యగారి కోరిక. ఇప్పుడు మనందరి కోరిక కూడా అదే.


 (చుక్కా రామయ్య 89వ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన 'పాఠం'పుస్తకాన్ని నేడు ఆవిష్కరిస్తున్నారు. ఆ పుస్తకానికి ప్రొ॥వి.ఎస్. ప్రసాద్, ఫార్మర్ డెరైక్టర్, న్యాక్  అందించిన ముందుమాట ఇది.)
 
 ప్రొ॥వి.ఎస్.ప్రసాద్

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా