ఒంగిన ఆకాశం

13 Nov, 2014 01:13 IST|Sakshi
ఒంగిన ఆకాశం

జీవన కాలమ్: ఒక నాయకుడు- అందునా ముఖ్యమంత్రి ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, కేవలం ఓ పసిపిల్ల ఉత్సాహానికి ఊతం ఇవ్వడానికి తన కార్యక్రమాన్ని సడలించుకుని ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ దేశంలో చర్మం ముదిరిన నాయకులు చేయడం మనం వినలేదు.
 
 ఓ పదకొండేళ్ల అమ్మాయి మొన్న మహారాష్ట్రలో ముఖ్య మంత్రి పదవీ స్వీకారాన్ని చూసింది. ఆ సంఘటన ఆ అమ్మాయిని ఆకర్షించింది. ఎం దుకు? మహారాష్ట్ర చరిత్రలో జరగని విధంగా కేవలం ఉద్ధతి, నిజాయితీ, సేవాతత్పరత పెట్టు బడులుగా 44 ఏళ్ల వ్యక్తి - మొద టిసారిగా మహారాష్ట్ర చరిత్రలో, భారతీయ జనతా పార్టీ నాయకుడు పదవీ స్వీకారం చేయడాన్ని చూసింది. ఇవన్నీ నా మాటలు. బహుశా ఆ అమ్మాయికి ఇన్ని తెలియక పోవచ్చు. 27వ యేటే ఈ కుర్రాడు నాగపూర్ మేయరు కావడం కూడా ఆమెకి తెలియకపోవచ్చు. రాజకీయ రంగంలో పదవుల్లోకి రావడమే లక్ష్యంగా నాయకుల సాముగరిడీలు ఆ పిల్ల దృష్టికి వచ్చి ఉండవచ్చు.

ఈ సంఘటన- ముఖ్యంగా ‘అనుభవం తప్ప పదవికి ఏ పెట్టు బడీలేని’ ఒక నాయకుడి చిరునవ్వు ఆమెను ఆకర్షించి ఉండవచ్చు. మళ్లీ ఇవన్నీ నా మాటలు. ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయాలని అనిపించిందా అమ్మాయికి. 44 ఏళ్ల వ్యక్తి మొదటిసారిగా ముఖ్యమంత్రి అవడం సాధ్యమ యితే, తాను ఇంటర్వ్యూ చేయగలగడం ఎందుకు సాధ్యం కాదు? అరమరికలు లేని స్వచ్ఛమైన మనస్సే ఇంత సూటిగా ఆలోచించగలదు. మొన్న ఆదివారం దృష్టి హర్‌చంద్‌రాయ్ అనే ఈ పిల్ల ముఖ్యమంత్రి ఇంటికి - సహ్యాద్రికి- వచ్చేసింది, తన పిన్నమ్మను వెంటబెట్టుకుని. వాచ్‌మన్‌లు లోనికి రానివ్వ లేదు. న్యాయంగా అక్కడితో కథ ముగియవచ్చు. కాని ఈ పిల్ల ముఖ్యమంత్రికి ఓ ఉత్త రం పంపింది- గేటు దగ్గర నుంచి. న్యాయంగా వాచ్ మెన్‌లు ఆ ఉత్తరాన్ని బుట్టదాఖలు చెయ్యవచ్చు. కాని వాళ్లు ముఖ్యమంత్రికి ఈ ఉత్తరాన్ని అందజేశారు. ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ ఉత్తరాన్ని చూశారు.
 
ఆయన నాగపూర్  వెళ్లే హడావుడిలో ఉన్నారు. ఇంకా తన ప్రభు త్వానికి రాజకీయమైన గండం గడవలేదు. ఆయన ఆ కాగితాన్ని బుట్టలో పారే స్తే న్యాయంగా ఈ కథ ఇక్కడా ముగియవచ్చు. కానీ ఫడ్నవీస్ ప్రయాణాన్ని కాస్త నిలు పుకుని ఆ అమ్మాయిని లోపలికి పిలిపించారు. 20 నిమి షాలు ఇంటర్వ్యూ ఇచ్చారు. చివరి ప్రశ్న ముఖ్యమంత్రిది. ‘‘చదువయ్యాక జర్నలిస్టువి అవుతావా?’’ అన్నారు పద కొండేళ్ల వయసులోనే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ సాధిం చిన అమ్మాయిని. దృష్టి నవ్వి, ‘‘నేను డాక్టర్ని అవుతాను’’ అంది. ఒక నాయకుడు- అందునా ముఖ్యమంత్రి ఏ ప్రయో జనాన్ని ఆశించకుండా, కేవలం ఓ పసిపిల్ల ఉత్సాహానికి ఊతం ఇవ్వడానికి తన కార్యక్రమాన్ని సడలించుకుని ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ దేశంలో చర్మం ముదిరిన నాయ కులు చేయడం మనం వినలేదు. అందుకూ ఈ వార్త నేల బారు హృదయాన్ని తాకే గెశ్చర్ (సంకేతం).
 
మరో సంఘటన. చాలాయేళ్ల కిందటిమాట. తిరువ నంతపురంలో తుంబా అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఓ సైంటిస్ట్ పనిచేస్తున్నాడు. తెల్లవారి లేస్తే చీకటి పడే దాకా ప్రయోగశాలలో ఊపిరాడని పని. ఏ రాత్రికో ఇంటికి వచ్చే వాడు. ఒక రోజు భార్య చెప్పలేక చెప్పలేక భర్తకి చెప్పింది. ‘‘పిల్లలు ఎన్నాళ్లుగానో సినిమాకి తీసుకెళ్లమని అడుగుతు న్నారు’’ అని. సైంటిస్ట్ బాధపడిపోయాడు. మర్నాడు పిల్లల్ని సాయంకాలం సిద్ధంగా ఉంచమన్నాడు- సినిమాకి. ఆఫీసుకి వస్తూనే బాస్‌తో చెప్పాడు- పిల్లలు సిని మాకి వెళ్లాలంటున్నారు, ఆ సాయంకాలం కాస్త త్వరగా ఇంటికి వెళ్తానని. బాస్ తప్పనిసరిగా వెళ్లమన్నాడు. తీరా పనిలో పడి ఒక దశలో వాచీ చూసుకుంటే రాత్రి ఎనిమి దిన్నర అయింది. పిల్లలు జ్ఞాపకం వచ్చారు. బాధపడి పోయాడు. సిగ్గుపడుతూ భార్యకీ, పిల్లలకీ సంజాయిషీ చెప్పడానికి సిద్ధపడుతూ ఇంటికి వచ్చాడు.

భార్య ఆనందంగా ఎదురొచ్చింది. పిల్లలు కనిపించలేదు. ‘‘పిల్ల లేరీ?’’ అనడిగాడు. ‘‘మీ బాస్‌అట. ఆయన వచ్చి పిల్లల్ని సినిమాకి తీసుకెళ్లారు’’ అంది భార్య. సైంటిస్ట్ బిత్తర పోయాడు. ఆ బాస్ పేరు అబ్దుల్ కలామ్. ఈ దేశంలో మొదటి అణ్వస్త్ర పరీక్ష జరిపించిన శాస్త్రవేత్త. ఈ దేశానికి రాష్ర్టపతి. అంతేకాదు- భారతరత్న. అన్నిటికన్నా గుర్తుంచుకోవల సిన మరో విషయం ఉంది. అతి సామాన్యమైన మత్స్య కారుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.
 
ఔదార్యం, ఉదాత్తత ఏదైనా ఆకాశంలో ఉండదు. నేలని ఆకాశం ఎత్తుకి నిలుపుతుంది. హృదయంలో ‘చెమ్మ’ ఉన్న వ్యక్తి దృష్టి ఆకాశంలో ఉండదు. నేల మీద నిలబడే వ్యక్తిలో ఉంటుంది. అతను ఆకాశంలోంచి దిగడు. మన మధ్య నుంచే వస్తాడు. ఇవాళ టీ అమ్ముకునే మనిషి దేశంలో కల్లా పెద్ద కుర్చీ లో కూర్చోవడానికి, మొన్న దుబాయ్‌లో వె ల్డర్‌గా పని చేసిన ఒకాయన మంత్రి కావడానికి, 44 ఏళ్ల నాయకుడు పదకొండేళ్ల అమ్మాయి మనసును ఆకట్టుకోవడానికి మూలాధారాలు వెదికితే కనిపిస్తాయి. వాటిని ఓ పద కొండేళ్ల అమ్మాయి ఈ దేశంలో గుర్తుపట్టడం ఈ దేశానికి శుభసూచకం.
 - గొల్లపూడి మారుతీరావు
(వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత, నటుడు)

 

మరిన్ని వార్తలు