రంగులు వెలిసిపోతున్నాయ్!

26 Mar, 2016 05:35 IST|Sakshi
రంగులు వెలిసిపోతున్నాయ్!

అక్షర తూణీరం
 
రాను రాను రాజకీయాలలో కలనేతలు ఎక్కువైపోయాయి. కలసి వస్తుందనుకుంటే అన్నిటినీ వదిలేసి కలసిపోవడమే. పవర్ పగ్గాల కోసం ప్రాణాన్ని తప్ప దేన్నైనా వదిలేయడానికి సిద్ధం అంటున్నారు. ఏరు దాటడానికి ఇద్దరు వ్యక్తులు ఒకే నావలో కూచుంటారు. అంత మాత్రం చేత వాళ్లు మిత్రులు కారు. ఏరుదాటాక ఎవరిదారి వారిదే!
 

చూసుకోండి, రంగులు వెలిసిపోతు న్నాయ్! నిన్నగాక మొన్న పూసుకున్న ‘హోలీరంగులు వెల వెలపోతున్నాయి. పూసుకున్న రంగులు ఇలాగే అఘోరిస్తాయ్. అభిమానాలు, స్నేహాలు, బాంధవ్యాలు మాసి పోయి పేలవంగా కనిపిస్తున్నాయి. మానవ సంబంధాలేకాదు, మానవుడికి సమస్త చరాచర ప్రకృతితో ఉండాల్సిన సంబంధాలు సైతం శిథిలమై, చీలికలై, పీలికలై దరిద్రంగా వేలాడు తున్నాయి. గురు, శిష్యుల మధ్య ఉండాల్సిన శ్రావ్యమైన తీగె తెగిపోయి రెండు తరాలు దాటింది. చదువుని కేజీలుగా, అరకేజీలుగా, పీజీలుగా అంగళ్లలో అమ్ముతున్నారు. చదువుకి డబ్బు చేసింది.  దాని రంగు మారింది.

కాంక్రీట్ టవర్స్‌ని, శరీరాల్ని కాచి వడపోసే యంత్రసామాగ్రిని ఎరవేసి, రోగుల్ని లాగేస్తున్న ఆసుపత్రులు మునులేటి రంగుల్ని మార్చుకున్నాయి. డాక్టర్లు పచ్చనోట్ల రంగుల్లో పెళపెళలాడుతున్నారు.  సహజమైన పండ్ల రంగులు లేవిప్పుడు. అసలుకంటే గమకంగా కనిపిస్తూ పండ్లూ కూరలూ జనసామాన్యాన్ని ఆకర్షిస్తున్నాయి. పరోక్షంగా పై చెప్పిన ఆస్పత్రులకు కావాల్సినంత సేవ చేస్తున్నాయి. మన చట్టాలు పూర్తిగా వెలిసిపోయి, చవుడు వాసన కొడుతున్నాయి. వ్యాపారమంటే పబ్లీకున చెప్పి మరీ దగా చేయడమనే నిర్వచనం ఖరారైంది. కుక్కతోలుకి రంగులేసి పులిచర్మంగా అంటకడుతున్నారు. రంగు రుచి వాసన లేని నీళ్లకి ఆ మూడూ కల్పించి, కోట్లు దండుకుంటున్నారు.

ఆకుని చూసి చెట్టు పేరు చెబుతాం. జండాని చూసి దేశాన్ని గుర్తిస్తాం. ఆ నాడెప్పుడో పింగళి వెంకయ్య మూడు నిండు రంగులతో మువ్వెన్నెల జెండాని మనకోసం సమకూర్చారు. కాషాయవర్ణం పరిత్యాగుల పేటెంటు కలరు. దాన్ని ఆ రోజుల్లో జనసంఘ్ పార్టీ జెండాకి వేసుకుంది. కొన్నాళ్లు రెపరెపలాడింది. దీపం కొండెక్కింది. ఆ రంగులద్దుకుని భాజాపా రంగు ప్రవేశం చేసింది. రాను రాను రాజకీయాలలో కలనేతలు ఎక్కువైపోయాయి. కలసి వస్తుందనుకుంటే అన్నిటినీ వదిలేసి కలసిపోవడమే. పవర్ పగ్గాల కోసం ప్రాణాన్ని తప్ప దేన్నైనా వదిలేయడానికి సిద్ధం అంటున్నారు. ఏరు దాటడానికి ఇద్దరు వ్యక్తులు ఒకే నావలో కూచుంటారు. అంత మాత్రం చేత వాళ్లు మిత్రులు కారు. ఏకాభిప్రాయం ఉండాల్సిన పనిలేదు. ఏరుదాటాక ఎవరిదారి వారిదే! రాజకీయ లబ్ధికోసం కాషాయంలో పసుపు కలిసింది. ఏదో ఒక కొత్తరంగు వచ్చింది. ఏ రంగు సాంద్రత ఎక్కువగా ఉంటే అందులోకి మిగిలినవన్నీ చేరతాయి. సొంత ఉనికిని కోల్పోతాయన్నది కెమిస్ట్రీ సిద్ధాంతం. ఆపద్ధర్మంగా ఎండ్రకాయని, గోధురు కప్పని కాడికి కడితే, నడక అస్సలు బాగుండదు. ఎండ్రకాయ అడ్డదిడ్డంగా నడుస్తుంది. కప్పకి గెంతడం తప్ప ఏమీ తెలియదు. స్వచ్ఛమైన మాతృవర్ణాలు ఏ జెండాలోనూ కనిపించడంలేదు.

గులాబి జెండాలో ఆకుపచ్చని డాగులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ జెండాలో బోలెడన్ని రంగులు, కావాల్సినన్ని షేడ్స్ - కలిసి కలవక కనిపిస్తాయి. కాంగ్రెస్ జెండా అత్యాధునిక నైరూప్య చిత్రంలా తయారైంది. ఇక్కడ ఎర్రజెండాలు ఎగరడం మానేసి చాలా కాలమైంది. ఎగరని జెండాల రంగులు ఎంచడం కష్టం. ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒక్కలా కదలవు. ఏ రెండు జెండాలు ఒక్కలా ఎగరవు.
 
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

>
మరిన్ని వార్తలు