అభినందన వెనుక అభిశంసన

11 Oct, 2014 23:38 IST|Sakshi
అభినందన వెనుక అభిశంసన

త్రికాలమ్
 

భారతీయులకో, భారతదేశానికో అంతర్జాతీయ ఖ్యాతి లభించినప్పుడు ఆనం దించని దేశవాసులు ఉండరు. కొన్ని సందర్భాలు మాత్రం సందిగ్ధంలో పడవే స్తాయి. గుండెనిండా దేశభక్తి నింపుకున్నవారికి సైతం సంకటావస్థలు ఎదురవు తాయి. ఏ విధంగా స్పందించాలో తెలియని అయోమయం ఆవహిస్తుంది.  బాల బంధు కైలాష్ సత్యార్థికీ, సాహస బాలిక మలాలా యూసఫ్జాయికీ ఉమ్మడిగా ఈ యేడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రకటించిన సన్నివేశం ఇటువంటిదే.

తనపైనా, తన సహచరులపైనా ఎన్ని దాడులు జరిగినా  బాలకార్మికుల విముక్తికోసం మొక్కవోని ధైర్యంతో, అకుంఠిత దీక్షతో మూడు దశాబ్దాలు అహరహం శ్రమించినందుకు సత్యార్థికి అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతి దక్కింది. పాకిస్థాన్‌లో నెలకొన్న హింసాయుత వాతావరణంలో తాలిబాన్‌ను ఎదిరించి, ప్రాణాలకు తెగించి బాలికలకు చదువుకునే హక్కు సాధించడం కోసం పోరాడుతున్న మలాలాను అతి పిన్నవయస్సులోనే అత్యున్నత పురస్కారం వరించింది. వారిని సహస్రాభినందనలతో ముంచెత్తడం సముచితం. ఇది వారి వ్యక్తిగత విజయం. ఇందులో భారతదేశం కానీ పాకిస్థాన్ కానీ గర్వించవలసింది ఏమైనా ఉన్నదా? రెండు దేశాల అగ్ర నాయకులూ, వివిధ రంగాల ప్రముఖులూ సంతోషం వెలిబుచ్చడంలో అర్థం ఉందా? నోబెల్ కమిటీ చేసిన ప్రకటనలో అభినందన వెనుక దాగున్న అభిశంసనను రెండు దేశాల ప్రజలూ, పాలకులూ గమనించాలి. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

మలాలా పాకిస్థాన్‌లో పుట్టకపోయినా, సత్యార్థి భారత దేశంలో పుట్టి పెరగక పోయినా నోబెల్ శాంతి బహుమతి వచ్చేది కాదు. సత్యార్థి సత్య నాదెళ్ళలాగానే ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తికాగానే అమెరికా వెళ్ళి ఉంటే ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీకి అధిపతి అయ్యేవాడేమో కానీ ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీవో)ను నెలకొల్పి బాలకార్మికుల విముక్తికోసం బచ్‌పన్ బచావ్ ఆందోళన్ నిర్వహించవలసిన అవసరం ఉండేది కాదు.

అమెరికాలో తివాచీ కార్ఖానాలలో కానీ ఇటుక బట్టీలలో కానీ బాలకార్మికులను నియమించిన దాఖలా లేదు. ఇప్పుడు చదువుకుంటున్న ఇంగ్లండ్‌లోనే మలాలా పుట్టి ఉంటే బాలికల విద్యాహక్కు కోసం అక్కడ పోరాటం చేయవలసిన అవసరం ఉండేది కాదు. అక్కడ తాలిబాన్‌లు లేరు. బాలికల చదువుపైనా, టీకాలు వేయడంపైనా నిషేధం లేదు. బడికి వెళ్ళే బాలికలను చంపివేసే రాక్షసత్వం లేదు. పాకిస్థాన్‌లో పుట్టింది కనుకనే మలాలా తాలిబాన్ తూటాలకు గాయపడవలసి వచ్చింది. అక్కడ పెరిగింది కనుకనే బడికి వెళ్ళడం పెద్ద సాహస కార్యం అయింది. తనబోటి బాలికలకు చదువుకునే హక్కు ఉండాలంటూ పోరాటం చేసే స్ఫూర్తి లభించింది.

మలాలాకు పాశ్చాత్య దేశాలలోని ప్రభుత్వాల, రాజకీయ వ్యవస్థల, మీడియా వ్యవస్థల సహకారం సంపూర్ణంగా లభించింది. ఇంట్లో తుపాకీ మోత బయట పల్లకీ మోత చందం ఆమె పరిస్థితి. సత్యార్థి 49 దేశాలలో బాలకార్మికుల విమోచన కోసం కృషి చేసినప్పటికీ  మొన్నటి వరకూ మీడియా సంస్థలు పట్టించుకోలేదు.

నోబెల్ శాంతి బహుమతి ప్రకటన జరిగినప్పుడు దాయాది దేశాలు ఏ  స్థితిలో ఉన్నాయి? సరిహద్దులో కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. కాల్పులు జరుపుకుం టున్నాయి. పరస్పరం దూషించుకుంటూ మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇండియాలో  ఇప్పుడు ఉన్నది మన్మోహన్ ప్రభుత్వం కాదనీ నరేంద్ర భాయ్ మోదీ సర్కార్ ఉన్నదని గమనించాలనీ పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బడాయి పోతున్నారు.  మన సైనికులు పాకిస్థాన్ సైనికులకు తగిన శాస్తి చేశారనీ (ముహ్‌తోడ్ జవాబ్ దియే), శత్రు సైనికులు తోకముడిచారనీ ప్రధాని మోదీ సగర్వంగా చాటుతూ  ఎన్నికల ప్రచారాన్ని  రక్తికట్టిస్తున్నారు. కాంగ్రెస్ ఉపా ధ్యక్షుడు రాహుల్ గాంధీ సరిహద్దు ప్రహసనాన్ని ప్రచారాస్త్రంగా సంధించారు.  పాకిస్థాన్ శాంతిని కోరుకుంటున్నదనీ, ప్రజలూ, సైనికులూ ప్రశాంతంగా బక్రీద్ వేడుకలు జరుపుకుంటున్నారనీ, కాల్పులు విరమించాలనీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. రెండు ముఖ్యమైన రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సరిహద్దులో నిజంగా ఏమి జరిగిందో సైన్యాధికారు లకూ, ప్రభుత్వాధినేతలకూ, ఇంగ్లిష్ టీవీ చానళ్ళకు మాత్రమే తెలుసు.

యుద్ధ సన్నాహాలలో ఉన్న రెండు దేశాలకు చెందిన ఇద్దరు సాహసులకూ శాంతి బహుమతి ప్రకటించడం ద్వారా నోబెల్ కమిటీ ఒక సందేశం ఇచ్చింది. ఒక హెచ్చరిక చేసింది.   రెండు దేశాలలో శాంతి కాముకులు ఉన్నారు. జనాభాలలో అత్యధికులు శాంతిప్రియులే. బహుమతి ప్రకటన తర్వాత మలాలా, సత్యార్థి చెప్పినట్టు రెండు దేశాల అధినేతలూ రెండు దేశాలలోనూ, రెండు దేశాల మధ్యా  శాంతి సుస్థిరత లు నెలకొల్పే మహోద్యమానికి నాయకత్వం వహించాలన్నది సందేశం.

రెండు దేశాలలోనూ అమానవీయమైన, అవమానకరమైన పరిస్థితులు నెలకొ న్నాయనీ, వాటిని సరిదిద్దుకోవాలనీ హెచ్చరిక. అమెరికా అగ్రవాదానికి ఒకవైపు అండగా ఉంటూనే దాన్ని ధిక్కరించే ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం అనే ఒకానొక ప్రమాదకరమైన, వంచనాత్మకమైన, ఆత్మహత్యాసదృశమైన విధానంవల్ల పాకిస్థాన్ అశాంతితో, అరాచకత్వంతో అట్టుడికి పోతోంది. ఎప్పుడు ఎక్కడ ఏ మానవ బాంబు పేలుతుందో, ఎంతమందిని పొట్టనపెట్టుకుంటుందో తెలియని అనిశ్చితి. ప్రజాస్వామ్య పాలనకోసం అర్రులుచాస్తున్న ప్రజలు ఒక వైపు. ఎప్పుడు పడి పోతుందో తెలియని ప్రభుత్వం మరో వైపు. అధికారం కబళించేందుకు అదను కోసం కాచుకొని కూర్చున్న సైన్యాధిపతులు ఇంకోవైపు. ఈ పరిస్థితిని సకాలంలో సరిచేసుకోవాలన్న హెచ్చరిక నోబెల్ ప్రకటనలో అప్రకటితంగా ఉంది.
 భారత్‌కు స్వాతంత్య్రం 1947లో వచ్చినప్పటికీ ఆర్థిక, సామాజిక పరిస్థితులు 2014లో కూడా అంతే అథమస్థాయిలో ఉన్నాయన్న అభిశంసన కూడా నోబెల్ నిర్ణయం వెనుక ఉన్నది. పేదరికం, దురాశ, అసమానతలు, పీడన వంటి దుర్భర మైన పరిస్థితుల నుంచి సమాజానికి విముక్తి కలిగించేందుకు కృషి చేయాలన్న సందేశం, లేకపోతే అశాంతి అనివార్యమన్న హెచ్చరిక గమనించకపోతే మన ఉపఖండానికి నిష్కృతి ఉండదు.

ఇండియాలో పుట్టి అమెరికాలోనో, బ్రిటన్‌లోనో పరిశోధన చేసి నోబెల్ బహు మతి గెలుచుకున్న భారత సంతతి శాస్త్రవేత్తలను కూడా మన ఖాతాలో వేసుకొని సంబరం చేసుకుంటాం. వారు విదేశాలకు వెళ్ళకుండా స్వదేశంలోనే ఉంటే నోబెల్ బహుమతి కాదు కదా భట్నాగర్ అవార్డుకు కూడా నోచుకునేవాళ్ళు కాదు. 2009లో రసాయనశాస్త్రంలో నోబెల్ గెలుచుకున్న వెంకట్‌రామన్ రామకృష్ణన్ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం చెప్పులరిగే దాకా తిరిగి చివరికి అమెరికా వెళ్ళిపోయాడు. ఇండియాలో కనుక ఉద్యోగం దొరికి ఉంటే నోబెల్ వచ్చేది కాదని ఆయనే వ్యాఖ్యానించాడు.

దేశంలో ఉండి పరిశోధన చేస్తున్న శాస్త్రజ్ఞులకు అత్యున్నత పురస్కారం లభించకపోవడానికి లేనిపోని కారణాలు చెప్పుకొని సమాధానపడతాం. మన ప్రతిభను గుర్తించడం లేదని ఫిర్యాదు చేస్తాం. ఇందులోనూ రాజకీయాలేనని ఈసడించుకుంటాం. అసలు సమస్య మన వ్యవస్థలోనూ, మన దృక్పథంలోనూ ఉన్నదని గుర్తించడానికి నిరాకరిస్తాం. ఈ రోజుకూ మరుగుదొడ్లు సవ్యంగా లేని పాఠశాలలూ, కళాశాలలూ ఉన్న దేశంలో ప్రయోగశాలలు ఉంటాయని ఎట్లా ఊహించగలం.

కనీస సౌకర్యాలు లేని విద్యాసంస్థల నుంచి నోబెల్ వంటి సర్వోన్నత బహుమతిని గెలుచుకోగల ప్రతిభావంతులు ఎట్లా తయారవుతారు? ప్రపంచం మొత్తం మీద అగ్రశ్రేణికి చెందిన రెండు వందల విశ్వవిద్యాలయాల జాబితాలో మన దేశానికి చెందిన విశ్వవిద్యాలయం ఒక్కటి కూడా లేదంటే మనం ఎక్కడ ఉన్నామో గ్రహించాలి. విశ్వవిద్యాలయాల కులపతులు విద్యామంత్రుల దగ్గరా, విద్యాశాఖ కార్యదర్శుల దగ్గరా పడిగాపులు కాయాలి. అనేక విశ్వవిద్యాలయాలకు కులపతుల నియామకమే జరగదు. ఇన్ని భయంకరమైన లోపాలు విద్యారంగాన్ని పట్టిపల్లార్చుతున్నా  పట్టించుకోకుండా, ప్రమాణాలు  పెంచుకునే ప్రయత్నమే చేయకుండా మనకు ఎవరో పనికట్టుకొని అన్యాయం చేస్తున్నారంటూ బాధపడటం ఆత్మవంచన.

’స్వచ్ఛ్ భారత్ అభియాన్’ను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించినందుకు ఆయనను అందరూ అభినందిస్తున్నారు. ఆయన ప్రశంసార్హుడే. సందేహం లేదు. ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తర్వాత కూడా ఇటువంటి దుస్థితిలో ఎందుకున్నామో ప్రశ్నిం చుకోవాలి. ప్రపంచంలోని బాలకార్మికులలో అత్యధికులు మన దేశంలో ఉన్నం దుకూ, సత్యార్థి వంటి సంఘ సేవకులు ఎంతోమంది పోరాటం చేస్తున్నా బాల కార్మికుల సంఖ్య తగ్గక పోగా ఏటేటా పెరుగుతున్నందుకూ సమష్టిగా సిగ్గుపడాలి. సర్వశిక్షాఅభియాన్ అమలు జరుగుతున్నప్పటికీ, విద్యను సార్వజనీనం చేయాలనీ, అందరికి చదువుకునే హక్కు కల్పించాలనీ చట్టాలు చేసుకున్నప్పటికీ చట్టాలను సవ్యంగా అమలు చేయలేకపోతున్నందుకు మనలను మనమే నిందించుకోవాలి. దాదాపు ఇటువంటి సిగ్గుమాలిన పరిస్థితులే పాకిస్థాన్‌లోనూ ఉన్నాయి.
 మతోన్మాదం, ఉగ్రవాదుల బెడద, సైన్యం పెత్తనం వారికి అదనం. నోబెల్ గెలుచుకొని చరితార్థులైనందుకు సత్యార్థినీ, మలాలానూ మనసారా అభినందిస్తూ, మన దేశాలు ఇంకా సామాజికంగా, ఆర్థికంగా, నైతికంగా వెనకబడి ఉన్నందుకు మనమూ, మన పొరుగువారూ మనస్తాపం చెందాలి. ఈ పరిస్థితులను మార్చ డానికి కృతనిశ్చయంతో కార్యోన్ముఖులం కావాలి. ఇదీ ఈ  సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి నీతి.
 
ప్రపంచంలోని బాలకార్మికులలో అత్యధికులు మన దేశంలో ఉన్నందుకూ, సత్యార్థి వంటి సంఘ సేవకులు ఎంతోమంది పోరాటం చేస్తున్నా బాలకార్మికుల సంఖ్య తగ్గక పోగా ఏటేటా పెరుగుతున్నందుకూ సమష్టిగా సిగ్గుపడాలి.
 
 కె. రామచంద్రమూర్తి
 

మరిన్ని వార్తలు