పేదల కంట్లో కారం!

30 Jul, 2013 05:39 IST|Sakshi
పేదల కంట్లో కారం!

ఈ ‘దరిద్రపు’ లెక్కల్ని సమర్థిస్తూ ఢిల్లీలో రూ.5 కే మంచి భోజనం ఉందని ఒక మంత్రివర్యులు, బొంబాయిలో రూ.12 కు రుచికరమైన విందు దొరుకుతుందని ఒక ఎంపీగారు ప్రకటించారంటే వారి బుర్రలెంత దరిద్రంలో ఉన్నాయో? పేదరికం పట్ల ఎంత చులకన? పేదల పట్ల ఎంత అపహాస్యం? ప్రజలపై కనీస గౌరవం, శ్రద్ధ లేని పాలన నుంచి, ఎన్నికలే పరమార్థంగా మారిన నేతల నుంచి ఇంతకంటే ఏం ఆశించినా అది మన తెలివితక్కువే అవుతుంది!

మన దేశానికి ఇక ముందున్న దంతా ఉత్సవాలు, వేడుకల కాలమే. ఎందుకంటే మొన్ననే ప్రణాళికా సంఘం దేశంలో పేద రికం దాదాపు కనుమరుగైపోయే దశకు చేరుకుందని ప్రకటించింది. 2004-05 నుంచి 2011-12 మధ్య కాలం లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 37 శాతం నుంచి 22 శాతానికి అమాంతం పడిపోయిందట. అంటే ఏడాదికి 2.2 శాతం చొప్పున ఏడేళ్లకి 15.3 శాతం తగ్గిం దట. పాపం! పేదలకు ఇంకా ఈ శుభవార్త తెలియదు. తెలిసినా అర్థంకాక గందరగోళపడవచ్చు. కాని వాళ్లంద రినీ ప్రణాళికా సంఘం తన అసమానశక్తి సామర్థ్యాలతో దారిద్య్రరేఖ ఎగువకు ఎత్తిపడేసింది. ఇటువంటి అద్భుతం ఎలా జరిగింది?


2011-12లో జాతీయ శాంపిల్ సర్వే తయారు చేసిన వినిమయ ఖర్చుల గణాంకాలను టెండూల్కర్ కమిటీ సూచించిన దారిద్య్ర సూచికల పద్ధతిలో విశ్లేషించి... ఈ ముసురుపట్టిన (కుంభకోణాలు, ధరల పెరుగుదల, విత్త నాలు, ఎరువుల కొరత, వరదలు, అత్యాచారాలు, వివిధ సర్వేలలో కా్రంగెస్ ఓట్ల శాతం తరుగుదల వంటి విప త్తులు) కాలంలో మన ప్రణాళికాసంఘం మనకు వండి వార్చి వేడివేడిగా వడ్డించింది.

1999-2000 కాలంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. దారిద్య్రరేఖకు దిగువన గల జనాభా 27 శాతం మాత్రమేననీ ఒక్కసారిగా దారి ద్య్రం 10 శాతం తగ్గిందని ప్రకటించింది. కాని మేధావుల విమర్శలను తట్టుకోలేక అంచనాలను సవరించి 1993- 94లలో ఉన్నట్టు 37 శాతంగా భావించమని కోరింది. 1993 నుంచి 2000 వరకు జనాభా పెరుగుదలను మాత్రం అది పరిగణనలోకి తీసుకోలేదు. 2004-05లో టెండూల్కర్ కమిటీ దారిద్య్రరేఖ గణాంకాలు తయారు చేసింది. 37 శాతం జనాభా దారి ద్య్రరేఖ దిగువన ఉన్నారని చెప్పింది. అయితే అదే కాలం లో ఎన్.సి.సక్సేనా కమిటీ ఈ సంఖ్య 50 శాతంగానూ, అసంఘటిత రంగంలో పరిశ్రమల జాతీయ కమిషన్ ఈ సంఖ్య 80 శాతంగాను ప్రకటించడంతో మళ్లీ అంచనా లను సవరించి 42 శాతం అన్నారు.

అసలు దారిద్య్రాన్ని అంచనా వేయడానికి 1990లో లక్డావాలా కమిటీ సూచించిన పద్ధతి రోజుకు ఒక్కరికి గ్రామాల్లో 2,400 కేలరీలు, పట్టణాల్లో 2,100 కేలరీల శక్తినిచ్చి ఆహారం కొనడానికి అవసరమయ్యే సొమ్ముతో వాస్తవంలో నెలకు తలసరి ఖర్చు ఎంత జరుగుతున్నదనే లెక్కతో పోల్చిచూడాలి. ఎవరైతే ఈ మేర అవసరం మేర ఆహారం కొనలేరో వారంతా దారిద్య్రరేఖకు దిగువన ఉండే పేదలన్నమాట. టెండూల్కర్ కమిటీ ‘కేలరీల’ను తగ్గించింది. అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ ప్రకా రం 1,800 కాలరీల ఆహారమైతే చాలు సరిపోతుంది. ఇది మన పట్టణ జనాభా తినగలుగుతున్న 1,776 కేలరీలకు దగ్గరగా ఉంది కాబట్టి దాని ప్రకారం లెక్కలు వేసి గ్రామీ ణులకు రోజుకు రూ.14, పట్టణాల్లో రూ.19 అని ముందు ప్రకటించి తర్వాత దాన్ని రూ.27, రూ.33లకు సవరిం చారు.

(ఆహార భద్రతా ఆర్డినెన్స్ ప్రకారం అది కనీసం రూ.50, రూ.62) అయితే అంతర్జాతీయ ఆహార వ్యవసాయసంస్థ 1,800 కేలరీలు శ్రమలేని వారికి సరిపోతుందని చెప్పిన సంగతి మరుగుపరిచింది. ఆ సంస్థ కనీసపు శక్తినివ్వగలి గిన ఆహారం గురించి చెప్పిన అంశాలను టెండూల్కర్ కమిటీ విస్మరించింది. పట్టణాల్లో మూటలు మోయటం నుంచి అనేక రకాల శారీరక శ్రమ చేసే అసంఘటిత కార్మి కులు, ఇళ్లలో అంట్లు, బట్టలుతకడం వంటి పనులు చేసే పని మనుషులు 8 గంటలు కనీసం శ్రమ చేసే గృహిణు లు, కుటీర పరిశ్రమలలో శ్రమ చేసే స్త్రీలకు ఈ ఆహారం సరిపోతుందా? ఇక గ్రామాల సంగతి చెప్పనవసరంలేదు.

ఆహారం సరిపోకపోవడం వల్లనే కదా బరువు తక్కు వ బిడ్డలు పుట్టడం, పుట్టిన బిడ్డల్లో 5 ఏళ్లలోపు 44 శాతం మంది ఆహార లోపంతో ఉన్నారని, 25 శాతం మంది పురుషులు, 56 శాతం మంది స్త్రీలు రక్తహీనతతో ఉన్నారని ప్రభుత్వమే ప్రకటించింది గదా అది కూడా జాతీయ శాంపిల్ సర్వే లెక్కలే కదా! మరి 1,800 కేలరీల ఆహారం సరిపోతుందని టెండూల్కర్ కమిటీ భావిస్తే ప్రభుత్వం ఎట్లా ఆమోదించింది? ఆహార వ్యవసాయ సంస్థ ప్రకారం 5 శాతం కంటే తక్కువ జనాభా మాత్రమే పౌష్టికాహార లోపంతో ఉన్న దేశాలన్నింటిలో తలసరి ఆహార సరఫరా 2,500 కేలరీల కంటే ఎక్కువ ఉంది. ఇరాన్‌లో 3,100 కేలరీలు, ఈజిప్టులో 3,320 కేలరీలు, మలేషియాలో 2,800 కేలరీలు ఆహారం అందుతున్నది.

టెండూల్కర్ కమిటీ అక్కడితో ఆగలేదు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల నుంచి 90 శాతం పిల్లలు బడికి వెళుతున్నారు కాబట్టి చదువుపై చేసే ఖర్చు కూడా వారు భరిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేసింది. మధ్య తరగతి ఆదాయ వర్గాల కంటే ఈ పేద పిల్లల చదువు ఖర్చు ఎక్కువగా ఉందని ఒక తమాషా పరిశీలన చేసింది. ఇదే కాలంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు ఆక లితో ఉంటున్నారని మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభు త్వం అన్ని రాష్ట్రాలకూ విస్తరించింది. పుస్తకాలు, పెన్నులు, బట్టలు కొనలేరు కాబట్టి ఉచితంగా సరఫరా చేస్తున్నది. మరోవైపు బాలకార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పిల్ల ల చదువులకు మధ్యతరగతి అప్పుల్లో కూరుకుపోతున్న దని వాస్తవాలు వెలుగుచూశాయి. మరి ఏ వాస్తవాల ఆధా రంగా టెండూల్కర్ కమిటీ ఈ లెక్కలు తయారు చేసింది?

2002లో ఆహారాన్ని బట్టి కాకుండా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని దారిద్య్రరేఖను నిర్ధారించే పద్ధతి ఒకటి ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఒక ఇంటికి సంబం ధించిన లోపాలు గమనించడం మొదటిది. రెండోది 13 సూచికల ప్రకారం మార్కులు ఇవ్వడం. ఈ రెంటినీ కలిపి ఆ కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉందా? మినహా యించ వచ్చా? అనేది తేలుస్తారు. అయితే ఈ మార్కులు వేయడానికి ఇచ్చిన సూచికలు, మార్కులు వేసిన పద్ధతి... రెండింటికీ ఒక క్రమంగాని స్థిరత్వంగాని ప్రామాణికత గాని లేకపోవటంతో ఈ పద్ధతిలో అనేక లొసుగులు బయటపడ్డాయి.

ఉదాహరణకి ‘రుణభారం’ సూచిక. ఒక కుటుంబా నికి ఆస్తులు లేవు. ఇంట్లో పెద్దగా వస్తువులు లేవు. కాబట్టి వారికి అప్పు పుట్టదు. అంటే అప్పులు ఉండవు. ఈ కుటుంబం రుణ భారం లేని కుటుంబం అవుతుంది. ఇంకో కుటుంబం వ్యాపారానికో, భూములపైనో భారీ అప్పులు తీసుకుంది. ఈ ధనిక కుటుంబం ఎక్కువ రుణ భారంతో బాధపడే కుటుంబంగా దారిద్య్రంలో ఉన్న కుటుంబంగా తేలుతుంది. ఇలాంటి మార్కుల ఆధా రంగానే టెండూల్కర్ కమిటీ పేద పిల్లల చదువు ఖర్చు మధ్య తరగతి పిల్లల కంటే ఎక్కువని తేల్చింది.

అలాగే కుటంబాల పేదరికాన్ని ఆయా గ్రామాల దారిద్య్రస్థాయి తో పోల్చి మార్కులు ఇవ్వడం కూడా తప్పే. ప్రణాళికా సంఘం అధికారిక అనుమతి ప్రకారం ప్రతి రాష్ట్రం 10 మార్కులు అదనంగా దారిద్య్రరేఖకు కలుపుకోవచ్చు. అయితే ఏ ప్రభుత్వం మాత్ర తన పాలనలో దారి ద్య్రం పెరిగిందని ప్రకటించుకుంటుంది? ఫలితంగా దారి ద్య్రరేఖ గణాంకాల్లో చేర్పులు గ్రామం నుండి గ్రామానికి జిల్లా నుంచి జిల్లాకు అధికారుల ఇష్టం మేరకు మార తాయి. ఇవన్నీ కాకుండా సర్వే పూర్తయిన తర్వాత గణాం కాలను ‘వండే’ పద్ధతి ఉండనే ఉంది! నిజానికి సర్వే నామ మాత్రంగా జరుగుతుందనీ, ఆఫీసుల్లోనే సర్వే ఫారాలు నింపుతారనీ నిపుణుల కమిటీ పేర్కొనడం గమనార్హం.

అసలు పేదరికానికి మార్కులిచ్చే పద్ధతే అన్యాయం, అసమంజసం. పేదరికానికి అనేక రూపాలున్నాయి. అది బహుముఖమైనది. ఆకలి, ఆహార లభ్యత, ఆరోగ్యం, నీరు, వైద్యం, విద్య, నివాసం, కనీస వసతులు, పరిశు భ్రత వంటి అనేక అంశాల్లో పేదరికం ఇమిడి ఉంటుంది. వీటన్నింటినీ కలిపి, విడివిడిగానూ కూడా తూచి ప్రామా ణిక గణాంకాలు తయారు చేసే శాస్త్రీయ పద్ధతిని రూపొం దించే ప్రక్రియకు ఈ నాటికీ పూనుకోకపోవడం దారుణం. పైగా ఇదే సర్వేలో కేలరీల వినిమయం, ఆకలి సూచి కలు, వినిమయ వ్యయాల లెక్కలకూ దారిద్య్రరేఖ నిర్ధా రించిన లెక్కలకూ ఎక్కడా పొంతనలేదు. ఇటీవలే జారీ చేసిన ఆహారభద్రత ఆర్డినెన్స్ ప్రకారం 67 శాతం ప్రజలు పేదలేనన్నారు. అంటే దారిద్య్రరేఖ దిగవన ఉన్న వారి సంఖ్య 80 శాతం దాటింది. మరి ప్రణాళికా సంఘం ప్రకటనలో అది 21.9 శాతం పడిపోయింది. ఈ రెంటిలో ఏది నిజం?

పిల్లులూ, కుక్కలూ బతకడానికి కూడా సరిపడని ఆదాయంతో పేదరికం అంచనా వేయడం తప్పని జాతీ యసలహా సంఘం సభ్యులు, పేదరికం అంచనాల నిపు ణులు ఎస్.సి. సక్సేనా సూచించారు. దేశంలో సాంఘిక సంక్షేమ పథకాలను సార్వజనీనం చేస్తేనే మెరుగైన ఫలి తాలు వస్తాయని ప్రపంచబ్యాంకు అధ్యయనం వెల్లడిం చింది. తలసరిన రోజుకు 1.25 డాలర్లు అంటే 80 రూపా యల ఖర్చు చేయగలిగితే దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నట్లని ఐక్యరాజ్య సమితి నిర్వచిస్తున్నది. పేదరికం తగ్గించే చర్యలు చేపట్టకుండా పేదల సం ఖ్యను తగ్గించి చూపితే అది రూపుమాసిపోదు. అది ఇంకా అనేక ఇతర మార్గాల్లో బయటపడుతుంది. అయినా ఆన వాయితీ ప్రకారం 2014-15లో ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎప్పుడో చేపట్టాల్సిన సర్వేను ఇప్పు డెందుకు చేసినట్టు?

ఆ వెనువెంటనే ప్రణాళికా సంఘం స్పందించి దారిద్య్రం భారీగా తగ్గిందని ప్రకటించడంలో అంతరార్థం ఏమిటి?
జీవన ప్రమాణాల్లో బంగ్లాదేశ్ కంటే వెనకబడి, మానవాభివృద్ధి సూచికలో 132వ స్థానంలో ఉన్న మనకు దారిద్య్రం తగ్గిందనడానికి అంత తొందరపాటు దేనికి? విపరీతంగా పెరిగిన ఆహార పదార్థాల ధరలు, విద్యుత్ రేట్లు, విద్య, వైద్య ఖర్చుల నేపథ్యంలో నిజానికి పేదవాళ్లు కొనగలిగేదెంత? తినగలిగేదెంత? ఆరోగ్యంగా ఉండ గలిగేదెంత? ఈ ‘దరిద్రపు’ లెక్కల్ని సమర్థిస్తూ ఢిల్లీలో రూ.5 కే మంచి భోజనం ఉందని ఒక మంత్రివర్యులు, బొంబాయిలో రూ.12 కు రుచికరమైన విందు దొరుకు తుందని ఒక ఎంపీగారు ప్రకటించారంటే వారి బుర్రలెంత దరిద్రంలో ఉన్నాయో? పేదరికం పట్ల ఎంత చులకన? పేదల పట్ల ఎంత అపహాస్యం? ప్రజలపై కనీస గౌరవం, శ్రద్ధ లేని పాలన నుంచి, ఎన్నికలే పరమార్థంగా మారిన నేతల నుంచి ఇంతకంటే ఏం ఆశించినా అది మన తెలివి తక్కువే అవుతుంది!
- విశ్లేషణ (దేవి - సాంస్కృతిక కార్యకర్త)

మరిన్ని వార్తలు