జనహితం.. ఐక్యతాబంధం

22 Jan, 2015 02:08 IST|Sakshi
మల్లెపల్లి లక్ష్మయ్య

 కొత్త కోణం
 అంబేద్కర్ లేకుండానే రాజ్యాంగ రచన సాగే పరిస్థితి ఒక దశలో ఏర్పడిందనేది నమ్మలేని నిజం. రాజ్యాంగ సభ చైర్మన్, రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఆ సమయంలో కీలక పాత్ర పోషించారు. ‘‘సభలో, సభా కమిటీలలో అంబేద్కర్ ప్రదర్శించిన విజ్ఞానాన్ని, వివేచనను, ఆయన కృషిని చూశాక అటువంటి వ్యక్తిని సభలోకి తీసుకోకపోతే, జాతి నష్టపోతుందనే నిర్ణయానికి వస్తున్నాను... రాజ్యాంగ సభలో ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన తప్పక సభకు ఎన్నిక కావాలి’’ అని  రాజేంద్రప్రసాద్ కరాఖండిగా చెప్పారు.  
 
 భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి సరిగ్గా ఆరున్నర శతాబ్దాలు. జనవరి 26, 1950 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో దేశం సర్వసత్తాక ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా అవతరించింది. రిపబ్లిక్ డే అంటేనే వెంటనే స్ఫురించేది భారత రాజ్యాంగం. దానికి కర్తగా అద్భుత ప్రతిభాప్రపత్తులను ప్రదర్శించిన దార్శనికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. నిజానికి రాజ్యాంగ రచన కోసం ఏర్పాటైన రాజ్యాంగ నిర్ణాయక సభలో ఆయనకు సభ్యత్వమే లేని పరిస్థితి ఏర్పడిందంటే ఎవరూ నమ్మలేరు. కానీ అలాంటి పరిస్థితే ఏర్పడింది, అయినా అంబేద్కర్ మన రాజ్యాంగ రచనకు నిర్దేశకుడైన వైనం ఆసక్తికరం. బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందిన భారతదేశం సొంత రాజ్యాం గాన్ని రూపొందించుకునే ప్రయత్నాలు మొదలైన తదుపరి పరిణామాలు అప్పట్లో యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘానికి అంబేద్కర్ చైర్మన్ కావడం మరింత విస్మయకర అంశమైంది. లోతైన పరిశోధన తరువాత కొన్ని ముఖ్యాంశాలు బయటపడ్డాయి. ప్రత్యే కించి ఆనాటి రాజ్యాంగ సభ చైర్మన్, ప్రప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంలో నిర్వహించిన కీలక పాత్ర నాటి చరిత్రను కొత్త కోణంలో చూపుతోంది.

 అంబేద్కర్ లేని రాజ్యాంగ సభా?
  స్వాతంత్య్రానంతరం 1946 జూలైలో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బొంబాయి నుంచి షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ తరఫున పోటీ చేసిన అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఓడించింది. కమ్యూనిస్టులు కూడా వారికి తోడైనట్టు అంబేద్కర్ స్వయంగా తెలిపారు. అయితే అప్పటి తూర్పు బెంగాల్ నుంచి ఎన్నికైన జోగేంద్రనాథ్ మండల్ రాజీనామా చేసి ఆయనను జైసూర్ కుల్నా నుంచి రాజ్యాంగ సభకు పంపారు. ఇండిపెండెంట్ షెడ్యూల్డ్ కులాల సభ్యులు ముగ్గురు, ఆంగ్లో ఇండియన్, ముస్లిం లీగ్ సభ్యులు ఒక్కొక్కరు ఓటు వేసి అంబేద్కర్‌ను గెలిపించారు. అయితే దేశ విభజన వల్ల తూర్పు బెంగాల్ పాకిస్తాన్‌లో భాగమైంది. అంబేద్కర్ ఆ దేశ రాజ్యాంగ సభ సభ్యుడయ్యారు. అందులో కొనసాగడం ఇష్టం లేక ఆయన రాజీనామా చేశారు. భారత రాజ్యాంగ రచనా సంఘంలో అంబేద్కర్‌కు స్థానం ఉండని స్థితిలో కథ మలుపు తిరిగింది. అంబేద్కర్‌ను రాజ్యాంగ సభలోకి తీసుకో వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

 అది బాబూ రాజేంద్రప్రసాద్ చూపిన చొరవతోనే జరిగిందని ఆయన రాసిన ఒక ఉత్తరం వెల్లడిస్తోంది. 1947, జూన్ 30న నాటి బొంబాయి ప్రధాన మంత్రి బి.జి. ఖేర్‌కు ఆయన ఇలా రాశారు: ‘‘డాక్టర్ అంబేద్కర్ విషయంలో ఎన్ని అభిప్రాయాలున్నప్పటికీ ఆయనను తిరిగి రాజ్యాంగ సభలోకి తీసుకోవాలి. రాజ్యాంగ సభలో, వివిధ సభా కమిటీలలో ఆయన ప్రదర్శించిన విజ్ఞానం, వివేచన, చేసిన కృషిని చూసిన తర్వాత ఈ నిర్ణయానికి వస్తున్నాను. అటువంటి వ్యక్తిని రాజ్యాంగ సభలోకి తీసుకోక పోతే, జాతి నష్టపోతుంది... జూలై 14న ప్రారంభమయ్యే రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేద్కర్ ఉండాలని కోరుకుంటున్నాను. అందువలన ఆయన తప్పనిసరిగా సభకు ఎన్నిక కావాలి.’’ రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఆవశ్యకతను రాజేంద్రప్రసాద్ ఆ విధంగా కరాఖండిగా చెప్పారు. గాంధీజీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్‌ల అంగీకారం లేకుండా ఆయన తన నిర్ణయాన్ని అమలు చేయగలిగేవారు కారు. బొంబాయి నుంచి అప్పటి వరకు సభలో ప్రతినిధిగా ఉన్న న్యాయ నిపుణులు జయకర్ రాజీనామా చేయడం వలన ఒక స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి అంబేద్కర్ ఎన్నిక జరగా లని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు.

 కానీ అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ ఆ స్థానం నుంచి సభకు ఎంపిక కావడం కోసం ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు మౌలాంకర్‌ను ఎంపిక చేసింది. ఆయనను ఒప్పించే బాధ్యతను సర్దార్ పటేల్‌కు అప్పజెప్పింది. 1947 జూలై 3న మౌలాంకర్‌కు రాసిన ఉత్తరంలో పటేల్ ‘‘ఇప్పుడు మీకు తొందరేం లేదు. రాజ్యాంగ సభకు ఎన్నికవడానికి కాంగ్రెస్ మరొకసారి అవకాశం కల్పిస్తుంది. ఈసారి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఉండాలని అందరం భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

  ప్రణాళికా రచన కాదు... రాజ్యాంగ సృజన
 నెహ్రూ, జూలై చివరి వారంలో భారత తొలి మంత్రివర్గంలో చేరి, న్యాయ శాఖామంత్రిగా పనిచేయాలని అంబేద్కర్‌ను కోరారు. ప్రణాళికా మంత్రిగా ఉంటే ప్రణాళికల రూపకల్పన దశలోనే ఎస్‌సీ, ఎస్‌టీలకు ప్రాధాన్యత ఇవ్వగలుగుతామని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ముందుగా న్యాయశాఖ బాధ్యతలు తీసుకోవాలని, ఆ తరువాత ప్రణాళికా శాఖను సైతం అప్పగిస్తామని నెహ్రూ అంబేద్కర్‌కి హామీ ఇచ్చారు. అయితే 1947 ఆగస్టు 29న ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా సంఘాన్ని ప్రకటించారు. అంబేద్కర్‌ను దానికి చైర్మన్‌గా నియమించారు. ఆ రోజు నుంచి అంబేద్కర్ రాజ్యాంగ రచన అనే బృహత్ కార్యానికి తన సర్వశక్తులు వెచ్చించారు. ఆయన కృషిని, దాని ఫలితాన్ని దేశం ఆనాడే గుర్తించింది. రాజ్యాంగ రచనా బాధ్యతలను అంబేద్కర్‌కి అప్పగించడం ఎంత సరైన నిర్ణయమని ఆనాడే భావించారో కమిటీ సభ్యుల అభిప్రాయాలను బట్టే తెలుస్తుంది. ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించిన చివరి రోజున కమిటీ సభ్యులలో ఒకరైన టి.టి. కృష్ణమాచారి మాట్లాడుతూ.. ఈ కమిటీలో ఏడుగురు సభ్యులున్నప్పటికీ, అంబేద్కర్ మాత్రమే పూర్తి కాలం పనిచేసిన ఏకైక వ్యక్తి. ఇందులో ఒకరు రాజీనామా చేశారు. మరొక సభ్యుడు మరణించారు. వారి స్థానాల్లో ఎవరినీ తీసుకోలేదు. మరొక సభ్యుడు ప్రభుత్వ పనులలో తీరికలేకుండా ఉన్నారు. ఇంకొక ఇద్దరు సభ్యులు అనారోగ్య కారణాల వలన ఢిల్లీకి దూరంగా ఉన్నారు. దీనితో రాజ్యాంగ రచనా సంఘం బాధ్యత ఒక్క అంబేద్కరే తన భుజాన వేసుకోవాల్సి వచ్చింది. అంతే దీక్షతో ఆయన ఆ పనిని పరిపూర్తి చేశారు కూడా. ఆయన చేసిన ఈ కృషి ప్రశంసనీయమైనది’’ అన్నారు.

 అంబేద్కర్ పేరును ప్రతిపాదించిన రాజ్యాంగ సభ చైర్మన్ బాబూ రాజేంద్రప్రసాద్ కూడా తన చివరి ప్రసంగంలో ఆయన కృషిని కొనియాడారు. ‘‘డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌ను రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్‌గా ఎన్నుకోవడం ఎంత సరైనదో అందరికన్నా ఎక్కువగా నేను గుర్తించగలిగాను. ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగ రచనా కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా సాగించారు. ఆయన తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేయడం మాత్రమే కాదు. ఎంతో తపనతో నిర్వహించారు. దీనికి మనమంతా ఆయనను అభినందించాలి.’’ ఆయన చేసిన అనితర సాధ్యమైన కృషి మీద విపులమైన అధ్యయనాలు ఎన్నో వచ్చాయి. భారత రాజ్యాంగాన్ని ఓ శక్తివంతమైన ఆయుధంగా మలచి అంబేద్కర్ కోట్లాది ప్రజలకు అందించారు.

 జనహితానికి విభేదాలు కావు అడ్డంకి
 రాజ్యాంగంలో ఉన్న అన్ని ప్రకరణలతో పాటు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఈ రోజుకే కాదు, ఏనాటికైనా దేశ పురోగమనానికి మార్గదర్శ కాలుగా ఉంటాయి. వాటి రూపకల్పనలో కూడా కీలక భూమికను పోషించినది అంబేద్కర్ కావడం విశేషం. ఈ సందర్భంగా మరొక విషయాన్ని మనం ఇక్కడ సంక్షిప్తంగానైనా ప్రస్తావించుకోవాలి. అంబేద్కర్ రాజ్యాంగ సభ సభ్యునిగా గానీ, రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్‌గా గానీ ఉంటారని ఆయనతో సహా అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. అందువల్లనే 1947 మార్చిలో ఆయన రాజ్యాంగ సభకు తన ప్రతిపాదనగా పంపడానికి ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అన్న నివేదికను రూపొందించారు. ఆ తరువాత దానిని రాజ్యాంగ సభకు అందజేశారు. అంబేద్కర్ రాజకీయంగా గాంధీజీ అభిప్రాయాల పట్ల, కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల తన వ్యతిరేకతను 1930 నుంచి నిరంతరం తెలియజేస్తూనే ఉన్నారు. 1942లో ఏకంగా గాంధీజీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శనాత్మకమైన ఒక పెద్ద గ్రంథాన్ని రచించారు. రాజకీయ రిజర్వేషన్ల విషయంలో గాంధీజీతో పెద్ద వివాదం జరిగింది. ఇది తీవ్రమైన సైద్ధాంతిక ఘర్షణకు కూడా దారితీసింది. చివరకు గాంధీజీ నిరాహారదీక్ష దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో నిర్మాణం అయిన రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఉంటారని ఊహించకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు.

 అయితే తూర్పు బెంగాల్ నుంచి మొదట రాజ్యాంగ సభలో సభ్యునిగా ప్రవేశించిన అంబేద్కర్ చేసిన ప్రసంగాలు, అనుసరించిన వైఖరి కాంగ్రెస్ పార్టీని ఆలోచనలో పడేసింది. రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్‌గా అంబేద్కర్ నియామకానికి మార్గం సుగమం చేసినది అదే. అలాగే కాంగ్రెస్‌తో అంబేద్కర్‌కి రాజకీయ వైరుధ్యం ఉన్నప్పటికీ పట్టుదలకి పోకుండా... దేశ ప్రజల, ఎస్‌సీ, ఎస్‌టీల రక్షణ, భద్రత, సంక్షేమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అలా తనను తాను తగ్గించుకొని రాజ్యాంగ రచనా సంఘానికి నేతృత్వం వహించడం, ఒంటరిగా ఆ బృహత్తరమైన బరువు బాధ్యతలను దక్షతతో నిర్వహించడం అంబేద్కర్ రాజకీయ విజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం. రెండు విరుద్ధమైన శిబిరాలు దేశ ప్రయోజనాల కోసం ఒకటిగా మారడం వల్లనే భారత ప్రజలు ప్రజాస్వామ్య ఫలాలను అందించే అతి అరుదైన రాజ్యాంగాన్ని రచించుకోవడం సాధ్యమైంది.
  (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ నం: 9705566213)

మరిన్ని వార్తలు