ఏలికల పాపం రైతుకు శాపం

24 Apr, 2015 23:07 IST|Sakshi
ఏలికల పాపం రైతుకు శాపం

రైతాంగం ప్రతి నీటి చుక్కను ఆదా చేసి, ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పడం కేవలం నూతన సాంకేతికతను అమ్ముకోవడం కోసమే. రైతుకు కావాల్సింది రుణం కాదు, ఆదాయం. చాలా ఏళ్లుగా మనం ఆహార ధరలను అదుపు చేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే రైతుకు సమంజసమైన ఆదాయాన్ని ఇవ్వ నిరాకరిస్తున్నాం. ఇలా భారాన్నంతా పేద రైతులపై మోపేకంటే వారికి
 అధిక ధరను ఇచ్చి, రైతు ఉత్పత్తులపై వినియోగదారులకు సబ్సిడీని ఇవ్వాలి. జపాన్, తదితర సంపన్న దేశాల్లో జరుగుతున్నదదే.
 కానీ మన ప్రభుత్వాలు మాత్రం ఉద్దేశపూర్వకంగానే రైతాంగం పేదరికంలో మగ్గిపోయేట్టు చేస్తున్నాయి. వ్యవసాయ ఆదాయాలు గణనీయంగా పెరగకపోతే వారి బాగు కోసం చేపట్టే ఏ చర్యా సఫలం కాదు.
 
దేశ రాజధాని ఢిల్లీ దిగ్భ్రాంతికి గురైంది. రాజస్థాన్‌లోని దౌసా గ్రామానికి చెందిన రైతు గజేంద్రసింగ్ (41) దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా సాగుతున్న రైతు ఆత్మహత్యలను ఢిల్లీ దర్బారు వాకిట్లోకే తీసుకొచ్చాడు. రాజకీయాధికార కేంద్రానికి సుదూరంగా ఉన్న ఆ సమ స్య ఇప్పుడు ఏలికలకు ఇబ్బందికరమైనంత సన్నిహితం గా నిలచి వారి కళ్లలోకి గుచ్చి గుచ్చి చూస్తోంది. అదీ మరీ ఎంత ఇరకాటంగానంటే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ ఘటనకు తాను కుంగిపోయానని, నిరుత్సా హానికి గురయ్యానని అంగీకరించక తప్పింది కాదు. ‘‘కష్టించి పనిచేసే రైతు ఏ పరిస్థితుల్లోనూ తాను ఒంటరి నని ఆలోచించరాదు. భారత రైతాంగానికి మెరుగైన భవితను సృష్టించడం కోసం మనమంతా కలసికట్టుగా పనిచేస్తున్నాం’’ అని ఆయన ఆ తర్వాత ట్వీటర్లో వ్యాఖ్యానించారు.

 రైతు ఆత్మహత్యలన్నీ రాజకీయ ప్రకటనలే

పార్లమెంటు బయట రాజకీయవేత్తలంతా అవతలి పార్టీయే రైతులను నిర్లక్ష్యం చేస్తోందంటూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటుండగా... ప్రధాన రాజకీయ పార్టీ లన్నిటి చేతులు రైతుల నెత్తుటితో తడిసినవేననే వాస్తవం మాత్రం యథాతథంగా నిలిచి ఉంది. రైతు ఆత్మహ త్యలు ఇటీవలే తలెత్తిన సమస్య కాదు. గత 20 ఏళ్లుగా, దాదాపు మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సగటున ఏడాదికి 14 నుంచి 15 వేల మం ది, ప్రతి గంటకు ఇద్దరు రైతులు ప్రాణాలను తీసుకుం టూనే ఉన్నారు. ఆత్మహత్యకు పాల్పడటానికి ఎంతో గొప్ప ధైర్యం కావాలి. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగం వాస్తవానికి తమ మరణం ద్వారా ఒక రాజ కీయ ప్రకటన చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ స్పం దన ఎరుగుని తోలు మందం వ్యవస్థను వేలాది రైతుల మరణాలు ఏ మాత్రం కదల్చలేకపోయాయి.
 
కొత్త మొహం, కొత్త పేరు... పాత కథ

జంతర్‌మంతర్ వద్ద గజేందర్ ఉరేసుకున్న తదుపరి వెంటనే టీవీ చానళ్లు రైతు ఆత్మహత్యలపై తీసిన వ్యంగ్య చిత్రం ‘పీప్లీ లైవ్’ సన్నివేశాలను తిరిగి కళ్లకు కట్టించడం మొదలెట్టేశాయి. చానళ్ల పీప్లీ లైవ్ సన్నివేశాల్లోని వారం తా  రాజస్థాన్‌లోని గజేంద్రసింగ్ గ్రామస్తులు. చనిపోయే ప్పుడు అతను ఫలానా రంగు తలపాగాయే ఎందుకు చుట్టుకున్నాడు, వగైరా విషయాలను చర్చిస్తుండటాన్ని గొప్పగా చూపారు. ఇక ఆ తర్వాత ప్రతి చానలూ వివిధ రాజకీయ పార్టీల అధికారిక ప్రతినిధులను పిలిపించి చర్చాగోష్టులను నిర్వహించేస్తోంది. టీవీ షోలకు వచ్చిన ఆ ప్రతినిధులేమో రైతు ఆత్మహత్య నివారణకు తాము చేపట్టిన చర్యల జాబితాను ఏకరువు పెడుతూ, తమ చొక్కా ఎంత తెలుపో చెప్పుకోడానికి మీడియా వేదికను వాడుకుంటున్నారు. అంతే తప్ప ఈ వరుస మృత్యు నర్తనానికి వెనుక ఉన్న మౌలిక కారణాలేమిటో తెలుసు కునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. తమ పాత్రికే యులను ఏ ఏ ప్రాంతాలకు పంపాలంటూ పత్రికల నుంచి నాకు అదే పనిగా ఫోన్లు వస్తున్నాయి. మళ్లీ ఒక కొత్త మొహం, కొత్త పేరు... కథ మాత్రం అదే.
 
వ్యవసాయ ఆదాయాల క్షీణతే అసలు కారణం

గత రెండు దశాబ్దాలుగా నిరంతరాయంగా సాగుతున్న రైతుల ఆత్మహత్యలకు ప్రాథమికమైన, అత్యంత ముఖ్య మైన కారణంగా దేన్నయినా ఎత్తి చూపాలంటే... రైతాంగ ఆదాయాల క్షీణతనే చూపుతాను. 2014 నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సమాచారం ప్రకారం రైతాంగ కుటుంబానికి వ్యవసాయ కార్యక లాపాల నుంచి లభించే సగటు ఆదాయం రూ. 3,078. కుటుంబ అవసరాలు తీరాలంటే రైతు కుటుంబం గ్రామీణ ఉపాధి కార్యక్రమం వంటి వ్యవసాయేతర కార్యకలాపాల్లో పాల్గొనడం తప్పనిసరి అవుతోంది. మొత్తంగా రైతు కుటుంబ రాబడి అలా సగటున నెలకు రూ.6,000కు చేరుతోంది. అంటే 58 శాతం రైతులు పస్తు పడుకోవాల్సి వస్తోంది. 76 శాతం వేరే అవకాశమేైదైనా దొరికితే వ్యవసాయాన్ని విడిచిపోవాలనుకునే వారే.
 
అందరి ఆదాయాలు పెరుగుతున్నా...

ఈ సమస్యను మరింత లోతుగా తరచి చూసినా సహ చరుడొకరు అద్భుతమైన తారతమ్య విశ్లేషణ చేసి చూపా డు. 1970లో గోధుమ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.1,450. కాగా నలభై ఐదేళ్ల తర్వాత, 2015 నాటికి గోధుమ సేకరణ ధర ఇంచుమించు 19 రెట్లు పెరిగింది. రైతులకు ఇచ్చే గోధుమ ధరలోని ఈ పెరుగుదలను వివిధ వర్గాల జీతాల పెరుగుదలతో పోల్చి చూద్దాం. ఈ 45 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సగటున 110 నుంచి 120 రెట్లు, స్కూల్ టీచర్ల జీతాలు  280 నుంచి 320 రెట్లు, కాలేజీలు, యూనివర్సిటీల అధ్యాపకుల జీతాలు 150 నుంచి 170 రెట్లు పెరిగాయి. ఇక మధ్యస్థ స్థాయి నుంచి ఉన్నత స్థాయి కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల జీతాలు 350 నుంచి 1,000 రెట్లు పెరి గాయి. అదే సమయంలో స్కూలు ఫీజులు 200 నుంచి 300 రెట్లు, వైద్య చికిత్స వ్యయం 200 నుంచి 300 రెట్లు, నగరాల్లో ఇంటి అద్దె సగటున 350 రెట్లు పెరిగాయి.

 రైతుపైనే ఆహార ధరల అదుపు భారం  

అంటే, ఆహార ధరలను తక్కువగా ఉంచడానికిగానూ రైతులు జరిమానా చెల్లించాల్సి వస్తున్నట్టే. ఆహార ద్రవ్యో ల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం ఈ ఏడాది కూడా గోధుమ ధరను క్వింటాలుకు రూ. 50 మాత్రమే పెం చారు. ఈ పెరుగుదల స్వల్పం, 3.2 శాతం మాత్రమే. ఈలోగా ప్రభుత్వ ఉద్యోగులకు రెండో దఫా డీఏ లభించి, 6 శాతం గంతేసింది. త్వరలోనే వారికి ఏడవ వేతన సంఘం సిఫారసుల ప్రకారం వేతనాలు లభి స్తాయి. అతి తక్కువ స్థాయి ఉద్యోగియైన బంట్రోతుకు నెలకు రూ.26,000 జీతం కోరుతున్నారు.
 
రైతుకు అధిక ధర... వినియోగదారులకు సబ్సిడీ

గత 45 ఏళ్లలో అతి తక్కువగా జరిగిన వేతనాల పెరుగు దలనే పరిగణనలోకి తీసుకున్నాగానీ గోధుమ ధర 100 రెట్లు పెరగాల్సింది అంటే గోధుమకు నేడు రైతులకు లభిస్తున్న క్వింటాలుకు రూ. 1,450కు బదులు, 1970లో ఇచ్చిన క్వింటాలు రూ.76 ధరకు 100 రెట్ల ధర న్యాయంగా లభించాల్సింది. ఆ లెక్కన రైతుకు క్విం టాలు గోధుమ ధర రూ. 7,600  లభించాల్సింది. మనకు ఇష్టమున్నా లేకున్నా అది రైతుకు దక్కాల్సిన ధర. అలా అని తెగ ఆందోళన పడిపోకండి. నేనేమీ ఆహా ర ద్రవ్యోల్బణం చుక్కలు తాకాలని కోరుకోవడం లేదు. మొత్తం భారాన్నంతా పేద రైతుపై మోపేకంటే రైతుకు అధిక ధరను ఇచ్చి, వారి ఉత్పత్తులపై వినియోగ దారు లకు సబ్సిడీని ఇవ్వాలి. జపాన్‌లో జరుగుతున్నదదే. పలు ఇతర సంపన్న దేశాలు సైతం ఇదే పద్ధతిని అను సరిస్తున్నాయి.
 
రైతు పేదరికంలో మగ్గేట్టు చేస్తున్నాం

వ్యవసాయ ఆదాయాలు గణనీయంగా పెరగకపోతే, రైతుకు అనుకూలంగా తీసుకునే ఏ చర్య అయినా పని చేస్తుందని నేననుకోను. రైతులు పంటల ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందనీ, ప్రతి నీటి చుక్కను ఆదా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పడమంతా కేవలం సరికొత్త సాంకేతికతను అమ్ముకోవడం కోసమే. ఆ రెండూ రైతుకు మరింత పరపతిని అందించి, రుణ విష వలయం నుంచి బయటపడేలా చేసేవేమీ కావు. రైతుకు కావాల్సింది రుణం కాదు, ఆదాయం. చాలా ఏళ్లుగా మనం ఉద్దేశ పూర్వకంగానే రైతుకు సమంజసమైన మం చి ఆదాయాన్ని ఇవ్వ నిరాకరిస్తున్నాం. ఒక ప్రభుత్వం తర్వాత మరో ప్రభుత్వం వారిని ఉద్దేశ పూర్వకంగానే పేదరికంలో మగ్గిపోయేట్టు చేస్తున్నాయి.

 (వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు  ఈమెయిల్: hunger55@gmail.com)
 
దేవీందర్ శర్మ
 
 
 

మరిన్ని వార్తలు