యూరప్‌పై వేర్పాటువాదం నీడ

12 Sep, 2014 00:34 IST|Sakshi
యూరప్‌పై వేర్పాటువాదం నీడ

స్కాట్లాండ్ స్వతంత్రం కోసం జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణ యూరప్ అంతటా ఉత్కంఠను రేపుతోంది. ఎడతెగని ఆర్థిక సంక్షోభం కారణంగా స్పెయిన్, బెల్జియం, ఇటలీ తదితర దేశాలలో ఇప్పటికే వెల్లువెత్తుతున్న వేర్పాటువాద ఉద్యమాలకు స్కాట్లాండ్ స్వాతంత్య్రం కొత్త ఊపిరిలూదుతుందని ఈయూ నేతలు ఆందోళన చెందుతున్నారు.
 
‘‘ఒక శకానికి సంబంధించిన మౌలికమైన భ్రమలన్నీ అడుగంటిపోయినప్పుడు ఆ శకం చరమాంకానికి చేరిందనుకోవచ్చు’’ (ఆర్థర్ మిల్లర్). యూరప్ నేడు సరిగ్గా అలాంటి ఘట్టాన్నే చేరుతున్నట్టు అనిపిస్తోంది. యునెటైడ్ కింగ్‌డమ్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ ఐర్లాండ్ (బ్రిటన్) సెప్టెంబర్ 18 కోసం ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తోంది అందుకే. 307 ఏళ్ల క్రితం రెండు రాచ కుటుంబాల కలయికతో ఇంగ్లండ్‌లో భాగమైన స్కాట్లాండ్ నేడు తిరిగి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడం కోసం తహతహలాడుతోంది. ఈ నెల 18న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో 40 లక్షలకు పైగా స్కాట్లాండ్ ఓటర్లు  ‘అవును’ లేదా ‘కాదు’ అంటూ దాని భవితపై తీర్పు చెప్పనున్నారు. స్కాట్లాండ్ అంతటా, ఎక్కడ ఎటు చూసినా ‘యస్’ అన్న నీలి రంగు పోస్టర్లు, జెండాల రెప రెపలే. బ్రిటన్‌లో భాగంగానే ఉండాలని కోరుకుంటున్న స్కాటిష్ పౌరులు సైతం స్వతంత్ర స్కాట్లాండ్ వాదమే నెగ్గాలని లోలోపల కోరుకునే విచిత్ర పరిస్థితి ఎదురవుతుందని ప్రధాని డేవిడ్ కామెరాన్ ఊహించలేదు. మహా అయితే 30 శాతానికి  మించి అవును అనరని ఆయన గట్టి లెక్కలే వేశారు. ఆ ధీమాతోనే 2012లో స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణకు ఆమోద ముద్ర పడనిచ్చారు. దురదృష్టవశాత్తూ జాతీయ ఉద్వేగాలు కూడికలు, తీసివేతలకు ఒదిగేవి కావు. ఎంత జాగ్రత్తగా కట్టిన లెక్కలైనా అతి తరచుగా తప్పుగా తేలుతూనే ఉంటాయి.  స్కాట్లాండ్ విషయంలో అదే జరిగింది. అనూహ్యమైన రీతిలో బ్రిటన్ నుండి స్వతంత్రాన్నే కోరే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. నేడు ఐక్యతావాదులు, వేర్పాటువాదుల్లో ఎవరు ఆధిక్యతను సాధిస్తారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. స్కాటిష్ ప్రజల తీర్పు కోసం  బ్రిటన్ మాత్రమే కాదు యూరోపియన్ రాజ్యాలన్నీ ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. నెత్తుటి ఏరులు పారించి గీసిన జాతీయ రాజ్యాల, దేశాల భ్రమాత్మక శకం ‘చరమాంకానికి’ ఆ తీర్పు నాంది కాగలదనే భయం వాటిని వెన్నాడుతోంది.

 యూరప్‌ను వెంటాడుతున్న వేర్పాటువాద భూతం


స్కాట్లాండ్ బ్రిటన్ తలనొప్పి కాదు... యునెటైడ్ కింగ్‌డమ్‌లా జాతీయ రాజ్యాలుగా, దేశాలుగా చెలామణి అవుతున్న బహు జాతుల దేశాలన్నిటికీ తలనొప్పే. కాబట్టే యూరోపియన్ యూనియన్ రాజధాని బ్రసెల్స్ పరిస్థితి అగమ్య గోచరం అవుతోంది. ఇప్పటికే స్వాతంత్య్రం కోరుతున్న బెల్జియంలోని ఫ్లెమిష్ జాతీయులు కూడా స్కాట్లాండ్ బాట పడితే, ఆ దేశం నిట్ట నిలువునా రెండుగా చీలిపోతే? బహుశా డేవిడ్ కామెరాన్ కంటే ఎక్కువగా నిద్రలేకుండా గడుపుతున్నది స్పెయిన్ ప్రధాని మరియానో రజోయ్ కావాలి. ఇప్పటికే బ్రస్సెల్స్‌లో స్కాటిష్, ఫ్లెమిష్ వేర్పాటువాదులతో కలిసి భారీ ప్రదర్శనలను నిర్వహిస్తున్న కెటొలోనియన్లకు స్కాట్లాండ్ స్వాతంత్య్రాన్ని మించిన ప్రేరణ మరేం కావాలి? బాస్క్ మాత్రం రజోయ్ మాటలను చెవిన పెడుతుందా? ఇటలీలోని పడానియా మాత్రం తక్కువ తిందా? చివరికి మధ్యధరా సముద్రం లోని నలుసులాంటి ద్వీపం కోర్సికా ఇంకా ఫ్రాన్స్ పాలన సమ్మతం కాదని స్వాతంత్య్రం ప్రకటించుకోకుంటుందా? యూరప్ ఈ కొస నుండి ఆ కొసనున్న ఉక్రెయిన్ వరకు కనీసం 30 వేర్పాటు ఉద్యమాలు యూరప్ సరిహద్దులను తిరగ రాస్తామంటున్నాయి.  అంతేకాదు అమెరికాలో కొన్ని ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమిస్తున్నాయి. కెనడాలోని క్యుబెక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. ఆ పోరాటానికి  యూరోపియన్ ఉదారవాదులు, వామపక్షాల మద్దతు సైతం లభిస్తోంది. క్యుబెక్‌లో 80 శాతం ఫ్రెంచి మాట్లాడేవారైనందున దానికి స్వాతంత్య్రం అవసరమైతే... యూరప్‌లోని స్కాటిష్ తదితర జాతుల ప్రజలకు అవసరం కాకుండా పోతుందా? అవుననే వారంటున్నారు. కాబట్టే యూరప్‌లో పెచ్చు పెరిగిపోతున్న జాతీయవాదం ముప్పంటూ గగ్గోలు పెడుతున్నారు.
 
స్కాటిష్ జాతి ప్రత్యేక అస్థిత్వం

 సెప్టెంబర్ 18 స్కాట్లాండ్ చరిత్రలో ఓ ఉజ్జ్వల ఘట్టానికి సంకేతం. అది సరిగ్గా ఏడు శతాబ్దాల క్రితం స్కాట్లాండ్ ప్రథమ స్వాతంత్య్ర యుద్ధంలో విజయం సాధించిన రోజు. ఆ రోజున బన్నాక్‌బర్న్ యుద్ధ రంగంలో ఇంగ్లండ్ రాజు రెండవ ఎడ్వర్డ్ సేనలు ‘అనాగరిక’ స్కాటిష్ స్వాతం త్య్ర యోధుల చేతుల్లో ఓటమిని చవి చూశాయి.  స్కాట్లాం డ్ జాతీయ స్వాతంత్య్ర ఆకాంక్షలకు ప్రతీకగా, జానపద కథానాయకునిగా మారిన చారిత్రక వ్యక్తి, జాతీయ హీరో విలియం వాలెస్ (మెల్ గిబ్సన్ హాలీవుడ్ క్లాసిక్ ‘బ్రేవ్ హార్ట్’ హీరో) నినాదం ‘స్కాట్లాండ్ శాశ్వతం’ అక్షర సత్య మనడానికి రుజువు నేడు వెల్లువెత్తుతున్న జాతీయతా వెల్లువే. 1706 నాటి ‘ట్రీటీ ఆఫ్ యూనియన్’ రాజకీయ ఐక్యతను సాధించిందే తప్ప... స్కాటిష్ భాషాసంస్కృతు లను, విలక్షణమైన వారి జాతీయాభిమానాన్ని, గౌరవాన్ని రూపు మాపలేకపోయింది. అందుకు కారణం జాతుల విలక్షణతలను ప్రతిబింబించే రాజకీయ వ్యవస్థను నిర్మించలేని ఇంగ్లండు అహంకారం, అభిజాత్యమేనని చెప్పనవసరం లేదు. కాబట్టే బ్రిటన్ ఐక్యతకు ముప్పు వాటిల్లనున్నా... స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణ బ్యాలెట్ పేపర్‌పై ‘అవును’, ‘కాదు’ అనే రెండిటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశమే తప్ప మూడో అవకాశం లేదు. నిజమైన ఐక్యతను కాపాడే మూడో అవకాశం లేకపోలేదు. అది, నేటి యూనిటరీ వ్యవస్థ స్థానంలో బ్రిటన్‌లో ఫెడరల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. కాకపోతే అలాంటి సమూలమైన రాజ్యాంగ సవరణల ఊసే అది ఎత్తడం లేదు. అదే వైఖరిని స్పెయిన్, ఇటలీ తదితర దేశాలు కూడా అనుసరిస్తున్నాయి. అలాంటప్పుడు వేర్పాటువాదం వినా గత్యంతరం లేదని మైనారిటీ జాతులు భావిస్తే తప్పవుతుందా?
 
ఇప్పుడే ఎందుకు?

 ముందెన్నడూ లేని విధంగా నేడే ఈ జాతుల లేదా వేర్పాటు ఉద్యమాలు ఎందుకు ముందుకొస్తున్నాయి? స్కాట్లాండే సమాధానం చెబుతుంది. ప్రపంచ వ్యాపార, వలసవాద శక్తిగా బ్రిటన్ వెలిగిన కాలంలో (1885-1939)   ఇంగ్లండ్‌తో ఐక్యత వలన స్కాట్లాండ్‌కు కలిగిన ఆర్థిక ప్రయోజనాలు ఆ తదుపరి ఆవిరి అయ్యాయి. ప్రత్యేకించి 1960లు, 1970లలో స్కాట్లాండ్ ఆర్థికంగా దిగజారింది. 1979లో మార్గరేట్ థాచర్ అధికారంలోకి వచ్చేసరికి స్కాట్లాండ్‌లో 15 బొగ్గు గనులుండగా ఆమె గద్దె దిగేనాటికి  రెండు మిగిలాయి! నాటి నుండి నేటి వరకు, ప్రత్యేకించి 2008 ఆర్థిక సంక్షోభం తదుపరి సంక్షేమ వ్యయాలపై కోతలు పడుతూనే ఉన్నాయి. ఫలితంగానే స్కాటిష్ నేషనలిస్టు పార్టీ అధికారంలోకి రాగలిగింది. యూరోపి యన్ ఆర్థిక వైఫల్యమే స్కాట్లాండ్ సహా యూరప్ అంతటా జాతీయవాదం, వేర్పాటువాదం పెరగడానికి ఏకైక కారణం. నార్వేలా స్కాట్లాండ్ కూడా చమురు నిధులతో ప్రభుత్వ విద్య, వైద్యం, పెన్షన్లను అమలు చేయగలదని వేర్పాటువాదుల వాదన. చిన్న దేశంగా అది మనలేదనడానికి లేదు. దానికంటే చాలా చిన్నవైన మాల్టా, సైప్రస్, లగ్జెంబర్గ్‌లు ఈయూలో ఉన్నాయి. చిన్న దేశమైన డెన్మార్క్ విజయాలే స్కాట్లాండ్ లాంటి దేశాల ఉనికికి హామీ. ప్రజాభిప్రాయ సేకరణ స్కాట్లాండ్‌కు నేడు స్వాతంత్య్రం ఇవ్వకపోయినా అధిక అధికారాల బదలా యింపును, అధిక స్వయంప్రతిపత్తిని ఇస్తుంది. జాతీయ దేశాలుగా వెలుగుతున్న పెద్ద జాతుల పాలకులు మైనారిటీలకు ప్రాతినిధ్యం ఇచ్చేలా ఫెడరల్ విధానాలకు మరలకపోతే, ఆర్థిక సంక్షోభం పరిష్కారం కాకపోతే పరిస్థితి విషమించకా తప్పదు. అది పచ్చి మితవాద జాత్యహంకార ధోర ణులకు దారితీయకా తప్పదు. తప్పు పట్టాల్సింది జాతీయ ఆకాంక్షలను కాదు.

  పిళ్లా వెంకటేశ్వరరావు

 

>
మరిన్ని వార్తలు