‘హోదా’తోనే వృద్ధి సాధ్యం

12 Oct, 2015 01:40 IST|Sakshi
‘హోదా’తోనే వృద్ధి సాధ్యం

రాష్ట్ర విభజనానంతరం రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారింది. రాబడికన్నా ఖర్చు రెండింతలకు పైగా పెరిగింది. ఏపీని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రంగా గుర్తించి కేంద్రం గ్రాంట్ల రూపంలో భారీగా నిధులను, పన్నుల మినహాయింపులను ఇస్తే తప్ప పరిస్థితి చక్కబడదు. నత్తనడక నడుస్తున్న రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి నడిపించగలగడం ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సాధ్యం. అప్పుడే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర అత్యుత్తమాంధ్రగా ఎదుగుతుంది. కోస్తాంధ్ర  వృద్ధి చెందుతుంది.
 
 సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం రాష్ట్ర వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు ప్రధానంగా హైదరాబాద్‌లోనే  కేంద్రీకృతమయ్యాయి. విభజనకు ముందు 2012-13 కాలంలో రాష్ట్ర రాబడి రూ.70,548 కోట్లు. అందులో హైదరాబాద్ వాటానే రూ.34,000 కోట్లు. విభజన అనంతరం 2014లో నవ్యాంధ్రకు రాబడి లోటు ఉంది. గత ఆరునెలల కాలానికి రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం కేవలం రూ.19,372 కోట్లు. ఇతరత్రా వచ్చిన ఆదాయం రూ.1,911 కోట్లు. గతంలో ఉన్న ఆర్థిక లోటు రూ.1,699.51 కోట్లు. ద్రవ్య లోటు రూ.8,452.38 కోట్లు. గత నెల సెప్టెంబర్ వరకూ ప్రభుత్వ ఖర్చు మాత్రం రూ.53,681.13 కోట్లు. రాబడికన్నా వ్యయం రెండింతలు పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్ప మరో మార్గం లేదు.
 
 ప్రత్యేక హోదా ఎవరికి? ఎలా?
 అవసరమైన నిధులు సమకూర్చుకోలేని, తక్కువ వనరులు, ఆర్థికలోటు ఉన్న రాష్ట్రాలకు చేయూతనందించడం తన బాధ్యతగా భావించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఇస్తుంది. దీనివల్ల పన్నుల్లో రాయితీ వస్తుంది. పదేళ్లపాటు 90 శాతం నిధులు ఉచితంగా వస్తాయి. ఈ రకంగా వచ్చిన గ్రాంటును తిరిగి చెల్లించనవసరం లేదు. కేవలం 10 శాతం మాత్రమే అప్పుగా తిరిగి వడ్డీతో చెల్లించవచ్చు. ఈ వెసులుబాటు 1969లో తొలిసారిగా అస్సాం, జమ్మూ కశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాలకు దక్కింది. అనంతరం దశలవారీగా అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, సిక్కింలు సహా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లభించింది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే అధికారం జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ)కి ఉంటుంది.
 
 అందులో ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికాసంఘం (ఇప్పుడు నీతి ఆయోగ్) సభ్యు లు. అయితే ప్రధానమంత్రి నిర్ణయమే ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రత్యేక హోదాకు ప్రణాళికా సంఘం కొన్ని అర్హతలను కూడా నిర్దేశించింది. 1. కొండ లతో కూడిన నైసర్గిక పరిస్థితులుండి, పంటలు పండించే వసతులు పెద్దగా లేని ప్రాంతాలు,  2. ఆర్థిక, మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రాలు, 3. జన సాంద్రత తక్కువగా ఉండి, నాగరికతకు దూరంగా విసిరివేయబడినట్టుండే ఆదివాసీ ప్రాంతాలు అధికంగా ఉన్నవి. 4. దేశ సరిహద్దు ప్రాంతాల్లో పొరుగు దేశాల ఆటుపోట్లకు ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు, 5. రాష్ట్ర వార్షిక స్థూల ఆదాయం తక్కువగా ఉండి గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు అందించలేని ఆర్థికలోటు ఏర్పడినపుడు ప్రత్యేకహోదా ఇస్తారు.
 
 విభజనతో పెరిగిన ఆర్థికమాంద్యం...
 రాష్ట్ర విభజనానంతరం రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారింది. రాబడికన్నా ఖర్చు రెండింతలకు పైగా పెరిగింది. దీనికితోడు జనసాంద్రత ఒక్కసారిగా పెరిగింది. ఉద్యోగరీత్యా రాజధాని ప్రాంతానికి వలస వచ్చినందువల్ల నివాసం, విద్యుత్, నీరు, నిత్యావసర వస్తువుల ఖర్చు విపరీతంగా పెరిగింది. సామాన్యుడు జీవించలేని పరిస్థితి కనిపిస్తోంది. దినసరి వేతన కూలీలను సరైన ఆదాయం రాకపోగా ఉన్నది చాలక పస్తులుండే స్థితికి ఈ కాలం నెట్టేస్తోంది. ఈ స్థితిలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదవారి పేదరికం మరింత పెరిగింది. సాధారణంగా ప్రతి రాష్ట్రంలోనూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు 87 శాతం ఉంటారు.
 
 ఈ ఉభయ మధ్యతరగతుల ప్రజల జీవనం పంటిబిగువున సాగే స్థాయికి నేడు రాష్ట్రం దిగజారింది. రాష్ట్రంలో 970 కి.మీ. తీరప్రాంతం ఉంది. శ్రీకాకుళం, విశాఖ నుంచి నెల్లూరు, తడ వరకూ తీర ప్రాంత రక్షణ ఒక సవాలుగా ఉంది. తీర ప్రాంత నౌకాదళం ప్రతిక్షణం అప్రమత్తంగా రాష్ట్రాన్ని కాపాడుతూనే ఉంది. అడపాదడపా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా, చైనా నుంచి ముష్కరమూ కల దొంగచాటు రాకపోకలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. దొంగ రవాణా పెరిగి జాతీయ వాణిజ్యాన్ని, రాష్ట్ర వాణిజ్యాన్ని రకరకాలుగా దెబ్బతీస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా లభించడం తీర రక్షకదళం పటిష్టమై రాష్ట్ర భద్రతతో పాటు దేశ భద్రతకు కూడా మార్గం సుగమం కాగలదు.
 
 ప్రత్యేకహోదాతో అభివృద్ధి...
 నేడు రాష్ట్రంలో విశాఖ ఉక్కు కర్మాగారం మినహా మరో భారీ పరిశ్రమ లేదు. కోస్తా, రాయలసీమలోనూ అంతటి భారీ పరిశ్రమల అవసర ముంది. ప్రత్యేక హోదాతో పరిశ్రమల స్థాపనకు అవకాశం కలుగుతుంది. రాష్ట్రానికి పన్ను రాయితీ, ఎక్సైజ్ డ్యూటీలో వంద శాతం మినహాయింపు లభిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది,  నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయొచ్చు. పరిశ్రమలతో నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. సగటు తలసరి ఆదాయం రూ.60 వేల నుంచి రూ.3-4 లక్షల వరకు పెరుగుతుంది. నిరుద్యోగ నిర్మూలనలో రాష్ట్రం ముందు వరసలో ఉంటుంది. యువత జవసత్వాలను, తెలివిని రాష్ట్రం సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు.  గ్రామాలు పట్టణాలుగా, అవి నగరాలుగా ఎదుగుతాయి. ప్రజల జీవనస్థాయి పెరుగుతుంది. రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టేది రైతు. రైతు చల్లగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రత్యేక హోదా రైతులకు నీటిప్రాజెక్టుల రూపంలో భరోసానిస్తుంది. కరువు పరిస్థితులు తగ్గిపోయి ఏటా సక్రమంగా ఇంటికి పంటలు వస్తాయి. రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడతారు. బలవన్మరణాలు ఆగిపోతాయి.
 
 విద్య, వైద్యంలో నాణ్యమైన సేవలు...
 విద్యారంగం ఉన్నతపథంలో నడిచే దేశం, రాష్ట్రం అత్యున్నత స్థాయికి చేరుతుందన్న జార్జి వాషింగ్టన్ మాటలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. విద్యారంగం నేడు ప్రైవేటు సంస్థలు, కార్పొరేటు సంస్థల చేతుల్లో బందీగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు అరకొర వసతులతో కునారిల్లుతున్నాయి. ప్రత్యేక హోదాతో ఐఐటీ, ఐబీఎం వంటి జాతీయ సంస్థలు ఏర్పడటమే కాదు, ప్రభుత్వ విద్యావ్యవస్థకు జవసత్వాలు సమకూరుతాయి. ప్రపంచ స్థాయి మేధావి వర్గానికి మన రాష్ట్రం కేంద్రం అవుతుంది. ఫార్మారంగం కూడా వృద్ధి చెందితే మందుల ధరలు వెసులుబాటు కాగలవు. వైద్యరంగంలో పేదలకూ నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వస్తుంది.  స్త్రీ స్వయంశక్తి, స్వయం పోషక విధానంతో కుటుంబ జీవితంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తా యనటంలో ఆశ్చర్యం లేదు. జాతీయ సగటు ఆదాయంలో వృద్ధి కలుగు తుంది. ఇందుకు మన పొరుగునున్న కేరళ రాష్ట్రం మంచి ఉదాహరణ. మహి ళా శిశు మరణాలు చాలావరకు తగ్గిపోతాయి. జాతీయ ఆయుర్దాయం సగటు పెరుగుతుంది. ప్రజల జీవన విధానంలో ప్రస్ఫుటమైన మార్పు వస్తుంది.
 
 రాజకీయంగా జరిగిందేమిటి?
 యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ మనుగడ కోసం తెలుగు రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండగా, అర్ధ రాత్రివేళ రాష్ట్ర విభజన జరిగిందనిపించారు. అప్పటి రాజకీయ నాటకంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు ఐదేళ్ల హోదా ఏ మాత్రం చాలదు...పదేళ్లు ఇవ్వాలని గట్టిగా వాదించి, బీజేపీతోపాటూ రాష్ట్ర ప్రజల అభినందనలు అందుకున్నారు. దీన్ని యూపీఏ ప్రభుత్వం సహేతుకంగా నిర్ధారిస్తూ మాటలతో మభ్యపెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడే కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రమాణపూర్వకంగా పదేళ్లపాటు హోదా ఇస్తామని నినదించాయి.  
 
 రోజుకో మాటతో దాటవేత...
 తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ, నాటి హామీని కార్యరూపంలో పెట్టే విషయాన్ని రోజుకో మాట చెబుతూ దాటేస్తుండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. డాక్టర్ గాడ్గిల్ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నపుడు 1992-97 మధ్య కాలంలో పన్నుల దామాషా ప్రకారం 25 శాతం, భూభాగం ప్రకారం 10 శాతం, జనావాసం, ఆవాసయోగ్య జనాభాను బట్టి 47.5 శాతం ఆయా రాష్ట్రాలకు పన్నుల రాయితీనిచ్చారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు పూర్తిగా ఇవ్వాలి. పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో మినహాయింపునివ్వాలి. ఇప్పటికీ రాష్ట్రంలో పాలన నత్తనడక నడుస్తోంది. దీన్ని గాడిలో పెట్టి నడిపించే శక్తి  ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సాధ్యం. అప్పుడే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుంది.  ఉత్త రాంధ్ర అత్యుత్తమాంధ్రగా ఎదుగుతుంది. కోస్తాంధ్ర  వృద్ధి చెందుతుంది.
 (వ్యాసకర్త ఉపకులపతి  
 దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం,
 మొబైల్ : 98481 23655)
 - ప్రొ॥జి. కృపాచారి

మరిన్ని వార్తలు