‘ఆవ’చేలో అవాస్తవాల పంట

25 Sep, 2016 01:05 IST|Sakshi
‘ఆవ’చేలో అవాస్తవాల పంట

విశ్లేషణ
రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా మూడు దశాబ్దాల క్రితం ఒక విప్లవానికి నాంది పలికారు. దానినే తరువాత  వంటనూనెల విప్లవం (ఎల్లో రివల్యూషన్) అని వ్యవహరించారు. 1986 సంవత్సరంలో ఆయన చమురుగింజల టెక్నాలజీ మిషన్‌ను ప్రారంభించారు. అప్పటిదాకా వంటనూనెల దిగుమతులకు రాజ పోషకురాలిగా ఉన్న భారతదేశాన్ని 1993-94 ఆర్థిక సంవత్సరానికల్లా చమురు గింజల టెక్నాలజీ మిషన్ ఆ నూనెల ఉత్పత్తిలో ఇంచుమించు స్వయం సమృద్ధ దేశంగా మలిచింది. అంటే ఒక్క దశాబ్దంలోపుననే అంత మార్పు తెచ్చింది. వాస్తవానికి ఇది గొప్ప విజయం కిందే లెక్క.
 
ఆ తరువాతే పతనం మొదలైంది. ఆ పసుపు విప్లవాన్ని చావగొట్టి చెవులు మూసేయాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తెచ్చిన ఒత్తిడుల ముందు భారతదేశం సంతోషంగా సాష్టాంగ పడింది. నిజానికి ఆశాజనకంగా ఉన్న దేశీయ వంటనూనెల ఉత్పత్తి రంగం ఆర్థిక సరళీకరణ అనే బలివితర్ది మీద ఎలా బలైపోయిందో తెలుసుకోవడానికి ఇదొక తిరుగులేని ఉదాహరణ. వంట నూనెల దిగుమతుల సుంకాల మీద హద్దూపద్దూ లేని తీరులో కోతలు విధించారు. దీనితో చౌకబారు ఉత్పత్తులు దేశంలోకి వెల్లువెత్తాయి. ఫలితం- రైతులు చమురుగింజల ఉత్పత్తికి దూరంగా జరిగారు. దిగుమతి సుంకాలలో తగ్గుదల అంటే అదేమీ సాధారణ తగ్గింపు కాదు, దాదాపు 300 శాతం ఉన్న సుంకాలను దశలవారీగా సంపూర్ణంగా తొలగించారు. శరాఘాతం వంటి ఈ పరిణామంతో రైతులు చమురుగింజల సేద్యానికి నీళ్లొదిలారు. చమురుగింజల ప్రాసెసింగ్ పరిశ్రమ తలుపులు కూడా మూసుకు పోయాయి. ప్రస్తుతం భారతదేశం తన వినియోగానికి అవసరమైన వంటనూనెలలో 67 శాతం దిగుమతి ద్వారానే సమకూర్చుకుంటున్నది. అందుకు చెల్లిస్తున్న మూల్యం ఏకంగా రూ. 66,000 కోట్లు.
 
ఆహ్వానించదగిన యోచన
 భారత్ తన వంటనూనెల దిగుమతి వ్యయాలను బాగా కుదించుకోవాలనే యోచనలో ఉందంటూ ఈ మధ్య పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దావె రాయిటర్ అంతర్జాతీయ వార్తా సంస్థతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఆ ప్రకటన నిస్సందేహంగా ఆహ్వానించదగినది. వంటనూనెల దిగు మతుల మీద ఆధారపడే పరిస్థితిని బాగా తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ కూడా ఒక సంద ర్భంలో ప్రకటించారు. కాస్త చదువుకున్న ఏ పౌరుడినైనా అడగండి! అతడేం చెబుతాడు? దిగుమతులను తగ్గించుకుని, దేశ రైతాంగానికి సాయపడాలనే చెబుతాడు. ఒకప్పుడు వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కలిగిన ఈ దేశం, లోపభూయిష్టమైన వాణిజ్య విధానాల పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలోనే ఆ నూనెలు దిగుమతి చేసుకునే దేశాలలో రెండో అతిపెద్ద దేశంగా మారవలసిన దుస్థితికి దిగజారిందన్న వాస్తవాన్ని కనీసం మంత్రులైనా గ్రహించాలి.
 
భారత ఆహార సంస్థ విభజన కోసం ఏర్పాటు చేసిన శాంతకుమార్ ఉన్నత స్థాయి సంఘం ఎదుట నా వాదన వినిపించాను. చమురుగింజల విప్లవాన్ని వాణిజ్య సరళీకరణ ఏ విధంగా ధ్వంసం చేసిందో నేను వివరిస్తే ఆయన బాగా అర్థం చేసుకున్నారు. మన వాణిజ్య విధానాలను పునఃపరిశీలించాలంటూ శాంత కుమార్ సంఘం చేసిన సిఫార్సు ఉద్దేశం చౌక దిగుమతుల నుంచి దేశీయ ఉత్పత్తులను రక్షించడమే. కేంద్రమంత్రులు రాధామోహన్‌సింగ్, అనిల్‌దావె దేశంలో వంటనూనెల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వాటి దిగుమతుల మీద సుంకాలను పెంచే విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. అందుకు కృషి చేయాలి. అంతేగానీ వంటనూనెల ఉత్పత్తుల పెంపు పేరుతో వివాదాస్పదమైన జన్యు మార్పిడి ఆవ వంగడాలను వాణిజ్య స్థాయిలో సాగు చేయడానికి అనుమతిం చడం పరిష్కారం కాదు.
 
ఒక విషయం సుస్పష్టం. 2015లో భారత్ రూ.66,000 కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకోవడానికి కారణం ఆ సంవత్సరం చమురు గింజల ఉత్పత్తి తగ్గడం వల్ల మాత్రం కాదు. మనం దిగుమతులను ప్రోత్సహిం చడానికే అంత మూల్యం చెల్లించాం. ఇదే భారత దిగుమతుల వ్యయం పాలిట గుదిబండగా మారిపోయింది. కేంద్రం నియమించిన జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) సురక్షితం అన్న ముద్రతో మూడు రకాల జన్యుమార్పిడి ఆవ వంగడాలకు (డీఎంహెచ్-11 సహా మరో రెండు రకాలు) పచ్చజెండా ఊపింది. ఇలాంటి వంగడాలకు మంత్రిత్వ శాఖల మధ్య పనిచేసే ఈ సంస్థ అనుమతి తప్పనిసరి. వాస్తవం ఏమిటంటే సురక్షిత వంగడం అంటూ దానికి ఆపాదించిన ఆ అంశాలు ఏవో మాత్రం వారు బహిర్గతం చేయలేదు.

అయితే ఈ అంశాలను వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు వెల్లడించవలసిందనీ, వారి అభిప్రాయాలను ఆహ్వానించవల సిందనీ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) జీఈఏసీని ఆదేశించింది. ఆ సమా చారంలో నన్ను దిగ్భ్రాంతికి గురిచేసిన అంశం ఒకటి ఉంది. అది- జన్యు మార్పిడి ద్వారా సృష్టించిన ఆవ వంగడం సాగుతో కలుపు మందు వాడకం బాగా పెరుగుతుందన్న సంగతి తెలిసినా జీఈఏసీ సభ్యులలో ఎలాంటి అలజడి కనిపించడంలేదు. నిజానికి జన్యుమార్పిడి ఆవ వంగడం సాగులో పెరిగిన కలుపు మందు వాడకం బహుళజాతి బేయర్ కంపెనీకి బాగా ఉపయోగ పడుతోంది. ఎందుకంటే ఆ మందును ఆ కంపెనీయే విక్రయిస్తున్నది.
 
పురుగు మందులు వాడక తప్పదు
 జన్యుమార్పిడి కంపెనీలు మొదట ఏం చెప్పినా, బీటీ పత్తికి కూడా రసా యనిక ఎరువుల వాడకం బాగా పెరిగింది. ఆ విధంగా దేశంలో పురుగు మందుల వాడకం విపరీతమైంది. కేంద్ర పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) వెల్లడించిన వివరాల ప్రకారం 2005 సంవత్సరంలో దేశంలో పత్తి పంటకోసం రూ. 649 కోట్ల రూపాయల విలువైన రసాయనిక పురుగు మందులను వినియోగించడం జరిగింది. 2010 సంవత్సరానికి దేశంలో జరుగుతున్న దేశీయ వంగడపు పత్తి సాగులో 92 శాతం బీటీ పత్తి రకాల వంగడాల వైపు మళ్లింది. ఆ ప్రకారం చూస్తే పురుగు మందుల వాడకం రూ. 880.40 కోట్లకు చేరింది. చైనాలో కూడా అన్ని సమస్యలకు సత్వర పరిష్కారమన్నట్టు ప్రవేశపెట్టిన బీటీ కాటన్ రకాలను సాగులో పెట్టారు. అయితే తెగుళ్ల నివారణకు గతంలో కంటే 20 రెట్లు ఎక్కువగా రసాయనిక మందులను అక్కడ ఉపయోగించవలసి వచ్చింది. బ్రెజిల్ మరొక ఉదాహరణ. అక్కడ పురుగు మందుల వాడకం ఒక దశాబ్ద కాలంలో 190 శాతం పెరిగిపోయింది. నిజానికి అర్జెంటీనాకు బ్రెజిల్ కొన్ని జన్యుమార్పిడి వంగడాలను ఇచ్చింది.
 
తెల్ల పురుగు ఆశించడం, ఇతర తెగుళ్లతో  2015లో వచ్చిన సంక్షోభం తరు వాత దేశంలో రైతులు మూకుమ్మడిగా బీటీ కాటన్ పత్తిని బహిష్కరించారు. ఈ పరిణామం నుంచి పర్యావరణ మంత్రిత్వ శాఖ గుణపాఠం నేర్చుకోవాలి. తెల్లపురుగు ఆశించి పంట నాశనమైనందుకు జన్యుమార్పిడి వంగడాల సరఫరా సంస్థలను ఎందుకు బాధ్యులను చేయరాదో నాకు అవగతం కావడం లేదు. ఈ పురుగు ఆశించి పంట నాశనమైన కారణంగా ఒక్క పంజాబ్‌లోనే 300 మంది పత్తి రైతులు బలవన్మరణాల పాలైనారు. కాటన్ రైతులు ఇంత దారుణమైన సంఖ్యలో మరణిస్తుంటే వ్యవసాయ మంత్రిత్వశాఖ, రైతు సంక్షేమ సంస్థలు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నాయి? భారతదేశంలో మనిషి ప్రాణం అంటే అంత చులకనా? నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు రైతు సంక్షేమం వ్యవసాయ శాఖకు చట్టబద్ధమైన బాధ్యత.
 
ఇదొక వృథా చర్చ
 జన్యుమార్పిడి ఆవ వంగడాలతో 26 శాతం అధిక దిగుబడి వస్తుందంటూ చేసే ప్రచారం ఎంత అసంబద్ధమో ఇప్పటికే జన్యుమార్పిడి పంటల రహిత భారత ఉద్యమ సమాఖ్య చాటి చెప్పింది. ఆ సమాఖ్య వారు  కొన్ని ఇతర ఆవ వంగడాల మాదిరిగానే జన్యుమార్పిడి వంగడం ఎంత వ్యర్ధమైనదో కూడా వెల్లడించారు. ప్రస్తుతం జన్యుమార్పిడితో సంబంధం లేని ఐదు ఆవ వంగడాలు ఉన్నాయి. వీటి దిగుబడి డీఎంహెచ్-11 జన్యుమార్పిడి ఆవ వంగడం కంటే చాలా ఎక్కువ. అందుకే, ఎంతో తక్కువ దిగుబడి ఉండే జన్యుమార్పిడి ఆవ వంగడంతో వంట నూనెల దిగుమతి వ్యయాన్ని ఎలా కుదించగలరో నేను అర్థం చేసుకోలేక పోతున్నాను. ఈ విధంగా చూస్తే జన్యుమార్పిడి ఆవ వంగడం గురించి చర్చ మొత్తం ఒక చెత్త వంగడం కేంద్రంగా జరుగుతున్న చర్చ అని అనిపించడం లేదా? దేశంలోని మొత్తం వంటనూనెల వినియోగంలో ఆవ నూనె వాటా పదిశాతం.

ఇప్పుడు దృష్టి సారించవలసిన అంశం ఏమిటంటే, వంటనూనెల దిగుమతుల మీద సుంకం పెంపు. దీనితో పాటు దేశీయ ఉత్పత్తికి సేకరణ ధరను పెంచడం కూడా. జన్యుమార్పిడి ఆవ వంగడమే సమస్యలన్నింటికీ పరిష్కారమంటూ చేసే వాదనలను ఇక కట్టిపెట్టాలి. ఇది నిజం కాదు. మనం కొనుగోలు చేస్తున్న ఆవనూనెలో ఎక్కువ భాగం కల్తీయే అంటూ టీవీ చానళ్లు ప్రసారం చేసే వ్యాపార ప్రకటనలలో బాబా రాందేవ్ చెప్పడం మనం చూస్తున్నాం. ఇది తక్షణం దృష్టి సారించవలసిన రంగం. ఆవనూనె మార్కెట్‌ను శుద్ధం చేయడానికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆహార ప్రమాణాల భద్రత సంస్థతో చేతులు కలుపుతాయని నేను భావిస్తున్నాను. వినియోగదారునికి కావలసినది ఇలాంటి చర్యే.
 

దేవిందర్‌శర్మ,
 వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
 ఈమెయిల్ : hunger55@gmail.com

>
మరిన్ని వార్తలు