కష్టాల సుడి, నష్టాల దిగుబడి

15 Jun, 2017 01:02 IST|Sakshi
కష్టాల సుడి, నష్టాల దిగుబడి

మహారాష్ట్రలో రైతులు మూడంటే మూడు రోజుల పాటు నగరాలకు, పట్టణాలకు కూరగాయలు, పాలు సరఫరా కాకుండా దిగ్బంధనం చేశారు. దానితో వారి ఆగ్రహం ఎలాంటిదో జాతీయ స్థాయిలో పతాకశీర్షికలలో దర్శనమిచ్చింది. గతంలో మాదిరిగా రైతు సమస్యను గురించి వెల్లడించడానికి జాతీయ రహదారులు దిగ్బంధనం చేయడం, రైలు పట్టాల మీద బైఠాయించడం కాకుండా మహారాష్ట్రలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కిసాన్‌ క్రాంతి సంస్థ కొత్త వ్యూహం పన్నింది. అది పనిచేసింది కూడా.

ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికలలో రైతులకు ఒక హామీ ఇచ్చారు. తనకు అధికారం అప్పగిస్తే, వ్యవసాయోత్పత్తి కోసం రైతులు చేసిన వ్యయం కంటే యాభై శాతం అధికంగా లాభాలు దక్కేటట్టు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రైతులు కూడా మోదీకి కనీవినీ ఎరుగనంత ఆధిక్యం సమకూర్చి పెట్టారు. కానీ ఆ తరువాత మోదీ తను ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించనే లేదు. అసలు వాస్తవం చెప్పుకోవాలంటే, కనీస మద్దతు ధర కల్పించే అవకాశాలు ఏమీ లేవని చెబుతూ ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా అంతే.

ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి రాని క్రితం రైతులు నిర్వహించిన ఒక ఊరేగింపులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా సోయాబీన్‌ పంటకు అప్పుడు చెల్లిస్తున్న (క్వింటాల్‌కు) మార్కెట్‌ ధరను రూ. 3,800 నుంచి రూ. 6,000 లకు పెంచాలని కోరారు. కానీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా ఏనాడూ వ్యవసాయోత్పత్తుల ధరల పెంపు గురించి మాట్లాడలేదు. కందిపప్పుకు ఉన్న రూ. 5,050 కనీస మద్దతు ధరను కూడా ఈ సంవత్సరం మహారాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఇప్పించలేకపోయింది. పైగా ఈ సంవత్సరం కంది ఇతోధికంగా పండింది. కనీస మద్దతు ధర అమలు గురించి మండీల దగ్గర నిరీక్షించి నిరీక్షించి, చివరికి రైతులు రూ. 3,500 (క్వింటాల్‌కు) కూడా లేకుండా పంటను తెగనమ్ముకున్నారు.

విపక్షంలో ఉండగానే రైతు ప్రేమ
ఏ రాజకీయ పక్షమైనా సరే, ప్రతిపక్షంలో ఉండగా రైతు సంక్షేమం గురించి గొంతు చించుకుంటుంది. అరచేతిలో స్వర్గం చూపిస్తుంది. అంతే, తరువాత అధికారంలోకి వచ్చాక, ఆర్థిక ప్రాధామ్యాలు కల్పించే వర్గాల జాబితాలో అసలు రైతాంగమే వారి కంటికి కనిపించదు. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు, ఏడు దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఈ డెబ్బయ్‌ ఏళ్లలో రైతు పరిస్థితి మరీ దిగజారింది. 2016 నాటి ఆర్థిక సర్వే రైతుల గురించి ఏం చెప్పిందో చూద్దాం! దేశంలోని 17 రాష్ట్రాలలో రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 20,000 కంటే తక్కువే. నిజం చెప్పాలంటే ఒక ఆవును పోషించాలన్నా కూడా సంవత్సరానికి రూ. 20,000 సరిపోవు. ఆ ఆదాయంతో రైతు కుటుంబాలు ఎలా బతుకుతాయో తలచుకోవాలంటేనే నాకు వణుకు పుడుతుంది.

వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు చూపుతున్న వివక్ష కూడా సుస్పష్టమే. వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసే విధంగా ఆర్థిక విధానాలు ఎలా తయారవుతున్నాయో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ అధ్యక్షురాలు అరుంధతీ భట్టాచార్య మాటలలోనే వ్యక్తమైంది. రూ. 36,359 కోట్ల మేరకు ఉత్తరప్రదేశ్‌ రైతాంగ వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అరుంధతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా వ్యవసాయ రుణాలను రద్దు చేస్తే రుణ వసూళ్లు అస్తవ్యస్తంగా తయారవుతాయని ఆమె వాపోయారు. కానీ నాలుగు లక్షల కోట్ల భారీ రుణాలతో కష్టాలలో ఉన్న టెలికం కంపెనీలను బయటపడేయాలంటూ ఆమె వాదించినప్పుడు మాత్రం ఈ రుణ వసూళ్ల అస్తవ్యస్త పరిస్థితి గురించి గుర్తుకు రాలేదు. ఇది ద్వంద్వ వైఖరికి ప్రబల నిదర్శనం కాదా?

ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికే వ్యవసాయోత్పత్తులకు సరైన ధరలు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. నిజం చెప్పాలంటే, దేశానికి అవసరమైన ఆహార పదార్థాలను పండిస్తున్నందుకు రైతును శిక్షిస్తున్నారు. అది ఎలాగంటారా? 1970–2015 సంవత్సరాల మధ్య గోధుమ సేకరణ ధర కేవలం 19 రెట్లు పెరిగింది. అదేకాలంలో ప్రభుత్వోద్యోగుల మూలవేతనం పెంపు చూడండి! ఆ నలభై ఐదేళ్ల కాలంలో 120 నుంచి 150 రెట్లు పెరిగింది. కళాశాల అధ్యాపకులు, విశ్వవిద్యాలయాల ఆచార్యుల మూలవేతనం చూస్తే 150 నుంచి 170 రెట్లు పెరిగింది.

పాఠశాల ఉపాధ్యాయుల మూలవేతనం 280 నుంచి 320 రెట్లు పెరిగింది. ఇవి కాక ఉద్యోగులకు లభిస్తున్న భత్యాలు 108 ఉన్నాయి. రైతుకు మాత్రం ఒక్క భత్యం కూడా అందదు. అంటే రైతుకు వ్యతిరేకంగానే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది. అయినా రైతుకు అంతుపట్టని వాస్తవం ఒకటి ఉంది. అది– అతడు పంటను మాత్రమే పండించడం లేదు. వాస్తవంగా నష్టాలను కూడా పండించుకుంటున్నాడు. తక్కువ దిగుబడులే వ్యవసాయ సంక్షోభానికి కారణమని ఆర్థికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ వాస్తవాలేమిటో రైతులకు తెలుసు. రుణభారం పెరగడంతో రైతుల బలవన్మరణాలు పెరిగాయి.

గడచిన 21 ఏళ్లలో దాదాపు 3.18 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే ప్రతి 41 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్యకు పాల్ప డుతున్నాడు. ఈ మరణాలను ఒక బలహీనతగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకటి నిజం. వ్యవసాయ రంగంలో జరుగుతున్న ప్రతి ఒక్క బలవన్మరణం కూడా రైతులలో, వారి కుటుంబాలలో ఆగ్రహావేశాలను ప్రోది చేస్తోంది. వారిని భగ్గుమనేటట్టు చేస్తోంది. ఒక్కసారి రైతు ఆగ్రహిస్తే భారత రాజకీయాల స్వరూప స్వభావాలే మారిపోతాయన్న విషయం రాజకీయ వేత్తలకు తెలియడం లేదు.

కీలెరిగి వాత
మహారాష్ట్రలో రైతులు మూడంటే మూడు రోజుల పాటు నగరాలకు, పట్టణాలకు కూరగాయలు, పాలు సరఫరా కాకుండా దిగ్బంధనం చేశారు. దానితో వారి ఆగ్రహం ఎలాంటిదో జాతీయ స్థాయిలో పతాకశీర్షికలలో దర్శనమిచ్చింది. గతంలో మాదిరిగా రైతు సమస్యను గురించి వెల్లడించడానికి జాతీయ రహదారులు దిగ్బంధనం చేయడం, రైలు పట్టాల మీద బైఠాయించడం కాకుండా మహారాష్ట్రలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కిసాన్‌ క్రాంతి సంస్థ కొత్త వ్యూహం పన్నింది. పట్టణాలకు, నగరాలకు వెల్లువెత్తే పాలు, కూరగాయలను నిలిపివేసింది. వారి సమస్యను గురించి లోకం దృష్టికి తేవడానికి ఇదే సరైన విధానం. అది పనిచేసింది కూడా.

మధ్యప్రదేశ్‌లో కూడా విద్యావంతులైన కొందరు యువ కర్షకులు ఆమ్‌ కిసాన్‌ యూనియన్‌ నాయకత్వంలో తమ సమస్య గురించి అందరికీ తెలిసేటట్టు చేయడంలో విజయం సాధించారు. నేను మూడు దశాబ్దాల నుంచి రైతాంగ ఉద్యమాలను పరిశీలిస్తున్నాను. ఒక పెద్ద నిరసన ప్రదర్శన నిర్వహించిన తరువాత రైతు ఉద్యమం కాస్తా విచ్ఛిన్నమవడం కనిపిస్తుంది. వ్యక్తిగత భేషజాలు, సిద్ధాంతాలు, రాజకీయ అభిప్రాయాలు రైతు నేతల మధ్య తంపులు పెడుతున్నాయి. వారిలో వారు కలహించుకునేటట్టు చేస్తున్నాయి. దానితో రాజకీయాలు ప్రవేశిస్తాయి.

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ సరిగ్గా ఇదే విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పారనిపిస్తుంది. తనను కలుసుకోవడానికి వచ్చిన రైతు ప్రతినిధుల బృందంతో ఆయన ఈ విషయం చెప్పారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా రైతాంగాన్ని ఓటు బ్యాంకుగా ఎందుకు పరిగణించదో తెలుసా అని బాదల్‌ వారిని ప్రశ్నించారు. దానికి ఆయనే సమాధానం కూడా చెప్పారు, ఎందుకంటే రైతాంగం చీలికలు పేలికలుగా విడవడి ఉంది అని. రైతులంతా ఒక జాట్‌ కులస్తునిగానో, ఒక సిక్కు మతస్తునిగానో లేదా మరాఠీగానో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అంతేతప్ప, తాను ఒక రైతునన్న స్పృహతో వారు ఓటు వేయరు. దేశ జనాభాలో 52 లేదా 60 శాతం ఉన్న రైతాంగంలో ప్రతి ఒక్కరూ ఇంతే. తాను ఒక రైతునన్న ఎరుకతో ఓటు హక్కును వినియోగించుకోరు. అయితే ఈ మధ్య విద్యావంతులైన యువ రైతులు నాయకత్వ స్థానంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగి స్తోంది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా జరుగుతోంది. తమ పెద్దల వలెనే వారు కూడా పాత పద్ధతులలో పడిపోకుండా ముందుకు సాగుతామని హామీ పడాలి. ఒక కొత్త నాయకత్వం కోసం రైతాంగం కూడా ఆశగా ఎదురుచూస్తోంది. అలాంటి నాయకుడి పట్ల వారు విశ్వాసం పెంచుకోగలరు కూడా.

రైతుకూ ఇవ్వాలి భత్యం
మళ్లీ విషయానికి వద్దాం. రైతు రుణాల రద్దు నిశ్చయంగా న్యాయమైనదే. నాలుగు లక్షల కోట్లతో పీకల్లోతు కష్టాలలో ఉన్న టెలికం కంపెనీలను రక్షించడానికి ఆలోచిస్తున్న భారతీయ స్టేట్‌ బ్యాంక్, లక్షలాది మంది రైతుల రుణ భారాన్ని తగ్గించేందుకు ఎందుకు సందేహించాలో నాకు బోధపడదు. రుణాల రద్దు డిమాండ్‌తో పాటు వీటి గురించి కూడా ఆలోచించాలి. కనీస మద్దతు ధరతోనే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గృహ, వైద్య, విద్య, రవాణా భత్యాలను ఇవ్వాలి. ప్రస్తుతం కనీస మద్దతు ధర పరిధిలో ఉత్పత్తి వ్యయం మాత్రమే ఉంది. శాంతకుమార్‌ సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం కనీస మద్దతు ధర విధానంతో లబ్ధి పొందుతున్న రైతాంగం ఆరు శాతమే. కాబట్టి రాష్ట్ర రైతాంగ ఆదాయ కమిషన్‌ ఏర్పాటు చేసి, నెలకు కనీసం రైతు కుటుంబం ఒక్కంటికి రూ. 18,000 చెల్లించే ఏర్పాటు చేయాలి. అలాగే కనీస మద్దతు ధర విధానం పరిధిలో ఉన్న 24 పంటలను రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. నిజానికి ప్రస్తుతం గోధుమ, వరిలను మాత్రమే కనీస మద్దతు ధర విధానం మేరకు సేకరిస్తున్నారు. రుణభారం మిగలని రీతిలోనే రైతు రుణాల రద్దు విధానం అమలు జరగాలి.

   - దేవిందర్‌శర్మ
   వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు  hunger55@gmail.com


 

 

 

మరిన్ని వార్తలు