ధర్మం, సత్యం శాశ్వతం

26 Jan, 2014 01:02 IST|Sakshi
ధర్మం, సత్యం శాశ్వతం

‘ధర్మం ఉన్నది. సత్యం ఉన్నది. అవి శాశ్వతాలు. అయితే, ఒక్కోకప్పుడు పాపం వల్ల ధర్మం కుంటుపడవచ్చు. అసత్యం చేత సత్యానికి చేటురావచ్చు. ఇట్లా పాపుల వల్ల, అసత్యవాదుల వల్ల ధర్మం, సత్యం మరుగునపడటం కొద్దిసేపే. అధర్మం, అసత్యాలది పైచేయి అయినప్పుడు, సమర్థులైన వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని రక్షించాలి.
 
 పాండవుల వనవాసం, అజ్ఞాతవాసం ముగిసింది.  మాట ప్రకారం తమకు రావలసిన అర్ధరాజ్యం తమకు ఎలానూ వస్తుందనే ధైర్యంతో ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు. అది సంపాదించుకోవటానికిముందుగా తమకిష్టమైన కృష్ణుణ్ణి కౌరవుల వద్దకు రాయబారం పంపుతారు. ఆ పని నెరవేర్చటం కోసం కృష్ణుడు, ధృతరాష్ట్రుడు కొలువు తీరి ఉన్న సభకు వచ్చి, పాండవులు తనతో ఏమి చెప్పి పంపించారో, దాన్ని మంచి మాటల్తో చెబుతాడు. అలా చెబుతూ మధ్యలో అంటాడు.
 
 ‘ధర్మం ఉన్నది. సత్యం ఉన్నది. అవి శాశ్వతా లు. అయితే, ఒక్కొక్కప్పుడు పాపం వల్ల ధర్మం కుంటుపడవచ్చు. అసత్యం చేత సత్యానికి చేటురావచ్చు. ఇట్లా పాపుల వల్ల, అసత్యవాదుల వల్ల ధర్మం, సత్యం మరుగునపడటం కొద్దిసేపే. అధర్మం, అసత్యాలది పైచేయి అయినప్పుడు, సమర్థులైన వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని రక్షించాలి. సమర్థులైనవాళ్లు ఎవరైతే ఉన్నారో, వాళ్లు తమకేమీ పట్టనట్టు ఉంటే, ఆ కీడు వాళ్లకుగాని, ధర్మానికి, సత్యానికి ముప్పు వాటిల్లదు. అవి ఎప్పుడూ దృఢంగా నిలిచే ఉంటాయి. వాటిని ఎవ్వరూ కదల్చలేరు. ఎందుకంటే ఈ రెంటినీ రక్షిస్తూ భగవంతుడున్నాడు. ఎవరు అడ్డుపడినా, ఆ భగవంతుడే ధర్మాన్ని ఒడ్డుకు చేరుస్తాడు. సత్యానికి శుభం కలుగజేస్తాడు!
 
 అట్లా శ్రీకృష్ణుడు చెబుతుండగా, కౌరవ పెద్దలందరూ సభలో ఉన్నారు. ముఖ్యంగా భీష్ముడు, ద్రోణుడు వాళ్లు ధర్మాన్ని, సత్యాన్ని కాపాడటంలో సమర్థులు. ఆ కాపాడటమనే బాధ్యతను వాళ్లు తీసుకోవాలి. లేకపోయినట్లయితే, వాళ్లకు చేటు మూడుతుంది గాని, ధర్మానికి, సత్యానికి కాదు. ఇంతటి భావాన్ని ఇముడ్చుకున్న పద్యం, తిక్కన భారతం ఉద్యోగపర్వం మూడో ఆశ్వాసం లో ఉన్నది. ‘‘సారపు ధర్మమున్ విమల సత్యము...’’తో మొదలవుతుంది. ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం. ధర్మం, సత్యం గొప్పదనం గురించి భారతం లో చాలా చోట్ల వినవస్తుంది. ధర్మము, సత్యము అనే ఈ రెండే భారతమనే బండినడవటానికి రెం డుచక్రాలుగా ఉపయోగపడ్డాయని పెద్దలంటారు.
 - దీవి సుబ్బారావు

మరిన్ని వార్తలు