ఓటమి కూడా గెలుపే కదా!

25 Nov, 2013 23:57 IST|Sakshi
ఓటమి కూడా గెలుపే కదా!

మాల్దీవుల్లో సైన్యానికి, న్యాయవ్యవస్థకు మధ్యన పెనవేసుకున్న ఈ అపవిత్ర బంధం దక్షిణ ఆసియాలో ఒక ధోరణిగానే బలపడుతోంది.  మయన్మార్ ‘ప్రజాస్వామ్యా’నికి భిన్నంగా  మాల్దీవుల్లో  కొత్త మొహంతో పాత నియంత పాలన సాగుతుంది.
 
 అపురూపమైన పగడపు దిబ్బల దేశం మాల్దీవులు చరి త్రగా మిగలనుంది. భూతాప ప్రకోపానికి సముద్ర మట్టా లు పెరుగుతుండటం వల్ల జలసమాధి కానున్న ద్వీప దేశాల్లో అది ముందు వరుసలో ఉంది. రెండు రోజుల క్రితం వార్సాలో ముగిసిన వాతావారణ మార్పుల అంతర్జాతీయ సదస్సుకు దాని గోడు వినిపించలేదు. కానీ ఈ నెల 16న జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మన విదేశాంగశాఖకు ‘ప్రజాస్వామ్య’ విజయం కనిపించింది. మాల్దీవులు ‘మార్పు’నకు పట్టం గట్టిందని మన జాతీయ మీడియాకు తోచింది. లండన్ నుంచి వెలువడే ‘టెలి గ్రాఫ్’ పత్రికకు మాత్రం... సెప్టెంబర్ 7 ఎన్నికల్లో ఆధిక్యతను సాధించిన (47 శాతం ఓట్లు) మాజీ అధ్యక్షుడు మొహ్మద్ నషీద్ ‘గెలుపును సుప్రీంకోర్టు దురాక్రమిం చింది’ అని అది రాసింది.
 
 అత్యంత నిష్పాక్షికంగా, అవకతవకలకు తావులేని విధంగా జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టు ఆ ఎన్నికను కొట్టి పారేసింది. వాయిదాల మీద వాయిదాలతో సెప్టెంబర్ 28న జరగాల్సిన రెండో రౌండు ఎన్నికలతో ఎట్టకేలకు ఈ వ్యవహారం 16న కొలిక్కి వచ్చింది. మనం మరచినంత తేలిగ్గా ఆ పత్రిక... ఈ రద్దుల, వాయిదాల చరిత్రను మరచిపోలేక పోయినట్టుంది. గత ఫిబ్రవరిలో మొహ్మద్ వహీద్ హస్సన్ అకారణంగా సైన్యం సహాయంతో మొట్టమొదటి ప్రజాస్వామిక అధ్యక్షుడు నషీద్‌తో బలవంతంగా రాజీనామా చేయించి స్వయంగా అధ్యక్షుడయ్యాడు.
 
 నషీద్‌తో పాటూ భారత్‌సహా ప్రపంచ దేశాలన్నీ తక్షణమే ఎన్నికలను నిర్వహించాలని కోరాయి. 2013 జూలైలో ఎన్నికలను నిర్వహిస్తానన్న వహీద్ ఇప్పటి వరకు నెట్టుకొచ్చారు. నవంబర్ 9న తిరిగి జరిపిన ఓటింగ్‌లో సెప్టెంబర్ ఫలితాలే పునరావృతమయ్యాయి. ఏ అభ్యర్థికీ 50 శాతం ఓట్లకు మించలేదు. మరో వాయిదాతో 16న జరిగిన రెండో రౌండు ముఖాముఖి ఎన్నికలో యమీన్ 51 శాతం ఓట్లతో గెలిచాననిపించుకోగలిగారు. సుప్రీంకోర్టు పాత్రధారిగా కొట్టివేత, సాగదీతలతో వహీద్‌ను ముందుంచి సైన్యం ఆడిన నాటకం రక్తికట్టింది. ఇంతకూ నషీద్‌ను ఓడించిన యమీన్ అబ్దుల్ గయూమ్ ఎవరు? మాల్దీవులను మూడు దశాబ్దాల పాటూ, 2008 వరకు నిరంకుశ నియంతృత్వానికి గురిచేసిన నియంత మహ్మద్ అబ్దుల్ గయూమ్‌కు తమ్ముడు, ఆయన పార్టీ పీపీఎం నేత. గయూం బంటు యమీన్ ప్రజాస్వామ్యవాదేననున్నా... గెలిచే అభ్యర్థి ఓడిపోయేంత వరకు ఎన్నికల ప్రక్రియను సాగదీయడం ఎలాంటి ప్రజాస్వామిక ప్రక్రియ?
 
 మాల్దీవుల్లో సైన్యానికి, న్యాయవ్యవస్థకు మధ్యన పెనవేసుకున్న ఈ అపవిత్ర బంధం దక్షిణ ఆసియా ప్రాం తంలో నేడు ఒక ధోరణిగానే బలపడుతోంది. శ్రీలంకలో అధ్యక్షుడు మహింద రాజపక్స ఒకవంక దేశాన్ని సైనికీకరణకు గురిచేస్తున్నారు. మరోవంక న్యాయవ్యవస్థను గుప్పి ట పెట్టుకుంటున్నారు. తానే నియమించిన ఒక సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించి మరీ అడ్డు తొలగిం చుకున్నారు. పాకిస్థాన్‌లో కూడా న్యాయవ్యవస్థకు సైన్యానికి మధ్యన ఇలాంటి అనుబంధం బలపడుతోంది. ఈ అపవిత్ర బంధానికి ఉన్న మరో కోణం... మత ఛాందసవాద ఉన్మాదం. మలుపులు తిరిగిన మాల్దీవుల ఎన్నికల కథను కంచికి చేర్చినది కూడా అదే. మూడో స్థానంలోని అభ్యర్థిగా నిలిచిన మాల్దీవుల కుబేరుడు అబ్దుల్ ఖాసీంకు అవి మద్దతు పలికాయి. రెండో రౌండ్లో మతోన్మాదశక్తులు గయూం సోదరునివైపు మొగ్గు చూపాయి. ఈ వాయిదాల కాలమంతా పీపీఎమ్ మతోన్మాద ఛాందసవాద శక్తులను బుజ్జగిస్తూనే గడిపింది. మయన్మార్ ‘ప్రజాస్వామ్యా’నికి భిన్నంగా  మాల్దీవుల్లో  కొత్త మొహంతో పాత నియంత పాలన సాగుతుంది.
 
  శ్రీలంక, మయన్మార్‌లలో బౌద్ధ మతోన్మాదం, పాక్, మాల్దీవుల్లో ఇస్లామిక్ మతోన్మాదం నిజమైన ప్రజాస్వామ్యానికి ఆ దేశాలను ఆమడ దూరంలో ఉంచడానికి హామీని కల్పించడానికి ప్రయత్నిస్తునాయి. నేడు ఎన్నికల ఆటలో ఓడిన నషీద్ దేశాధ్యక్షునిగా 2009లో విలక్షణమైన ప్రపంచ రికార్డును నెలకొల్పారు. సముద్రం అట్టడుగున మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు! మాల్దీవులను సముద్రం మింగేయబోతున్నవిషయాన్ని సముద్రంలో మునిగి చెపితేనన్నా అంతర్జాతీయ సమాజానికి పడుతుందేమోనని ఆశించారు. పట్టలేదు. నేడు మాల్దీవుల ప్రజాస్వామ్యం గంగలో కలుస్తున్నా ఎవరికీ పట్టదు. యమీన్‌తో సత్సంబంధాలకోసం తాపత్రయం తప్ప మనకు మరేమీ పట్టదు గాక పట్టదు. చైనా బూచి మనకు నిద్ర పట్టనీయదు.
 - పిళ్లా వెంకటేశ్వరరావు

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా