కష్టాన్ని చూపేదే మంచి కథ కాదు!

22 Nov, 2015 00:00 IST|Sakshi
కష్టాన్ని చూపేదే మంచి కథ కాదు!

 ‘సమాజాన్నో, వ్యక్తులనో మార్చడం మీదే దృష్టంతా కేంద్రీకరించడంతో, కథ ఒక కళారూపమన్న విషయం మరుగునపడి పనిముట్టుగానే మిగిలిపోయింది.
 - కన్నెగంటి చంద్ర
 
 అమెరికాలో స్థిరపడ్డ కవీ కథకుడూ కన్నెగంటి చంద్ర యిటీవల ఇండియా వచ్చినప్పుడు ‘’ వేదిక ఆధ్వర్యంలో ‘కథ’పై ఆయనతో చర్చాగోష్టి జరిగింది. అందులో వెల్లడైన కొన్ని అభిప్రాయాలు:

 రచయిత తన్ను తాను సందేశమిచ్చే వున్నత స్థానంలో కూర్చోబెట్టుకొని పాఠకుల స్థాయిని తక్కువగా అంచనా వేయడం వల్ల తెలుగులో కథలు నీతిబోధకి పరిమితమై పోతున్నాయన్న చంద్ర వాదనతో సమావేశానికి హాజరైనవాళ్లు ఏకీభవించారు.

 అయితే మన రాతలు సమాజంపైన చూపుతున్న ప్రభావం చాలా తక్కువనీ వ్యక్తుల్ని క్రియాశీలంగా మార్చడానికి దోహదం చేసే సాహిత్యం రావడంలేదనీ చంద్ర చేసిన మరో ప్రతిపాదనపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. అంతిమంగా చర్చ సాహిత్య ప్రయోజనం- రచయితల కర్తవ్యాల వైపు సాగింది.

 ‘సమాజాన్నో, వ్యక్తులనో మార్చడం మీదే దృష్టంతా కేంద్రీకరించడంతో, కథ ఒక కళారూపమన్న విషయం మరుగునపడి పనిముట్టుగానే మిగిలిపోయింది. కష్టాన్నీ, బాధనూ ఎత్తిచూపడం మంచి కథకు కొలమానంగా మారింది. అది ముందెన్నడూ ఎరగనిదయితే మరీ మంచిదిగా భావించబడుతుంది. స్పందించే హృదయాలు సానుభూతి చూపక తప్పదు కానీ కథ అందుకే పరిమితమవుతూంది. కథను కథగా నిలిపే మిగతా అంశాలేవీ గమనించే, ఆస్వాదించే వీలు రచయితలూ, పాఠకులూ కల్పించుకోలేకుండా ఉన్నారు.’ అన్న చంద్ర ఆలోచన ‘కళ కళ కోసమే’ అన్న ధోరణిని బలపరిచేదిగా వుందని శ్రోతల్లో కొందరు అభిప్రాయపడ్డారు.

 అనిల్ అట్లూరి నిర్వహణలో జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో వి.రాజారామ మోహనరావు, దాసరి శిరీష, కొండవీటి సత్యవతి, వాసిరెడ్డి నవీన్, కుప్పిలి పద్మ, టైటానిక్ సురేష్, రమణమూర్తి, యాళ్ల అచ్యుతరామయ్య, జి.ఎస్.రామ్మోహన్ లాంటివాళ్లు పాల్గొన్నారు. తెలుగు కథకులు కల్పనా చాతుర్యమూ, ఊహా నైపుణ్యమూ చూపాలి. పాఠకుడికీ కథలో జాగా ఇవ్వాలి. అప్పుడే తెలుగులో ప్రపంచస్థాయిలో మంచి కథలు వస్తాయన్న ఆశంసతో గోష్టి ముగిసింది.
ఎ.కె.ప్రభాకర్ 040-27761510

మరిన్ని వార్తలు