ప్రభుత్వ చట్టవిరుద్ధ నిఘా పీడ ఆగేనా?

27 Aug, 2017 01:22 IST|Sakshi
ప్రభుత్వ చట్టవిరుద్ధ నిఘా పీడ ఆగేనా?

అవలోకనం
మిగతా ప్రజాస్వామ్యాల్లో వలే అధికారిక నిఘాలకు సంబంధించి మనకు రక్షణలు, అవరోధాలు లేవు. నేరపూరితమైన ప్రభుత్వ నిఘాకు స్వచ్ఛందంగా మనం మన వివరాలు ఎందుకు ఇవ్వాలి? తప్పనిసరి ఆధార్‌ నమోదు, మన జీవితంలోని అన్ని రంగాలనూ మన బయోమెట్రిక్‌ గుర్తింపులతో తప్పక అనుసంధానించాల్సి రావడం ఆగిపోవాలి. సుప్రీంకోర్టు తీర్పు మనకు ఆ ఆశను కలిగించింది.

పదిహేనేళ్ల క్రితం నేను సంపాదకీయం వహిస్తున్న ఒక వార్తాపత్రిక సల్మాన్‌ఖాన్, ఐశ్వర్యారాయ్‌ల మధ్య జరిగిన సంభాషణ రాత ప్రతిని ప్రచురించింది. ఆ కథనాన్ని జే డే అనే విలేకరి ముంబై పోలీసుల నుంచి సంపాదించారు. ఆ సంభాషణలో ప్రీతీ జింటాపై సల్మాన్‌ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్య ఉంది. ఆగ్రహించిన ప్రీతీ నాపై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు కొన్నేళ్లపాటు, చివరకు ఆమె దాన్ని వెనక్కు తీసుకునే వరకు నడిచింది. పోలీసులు, ఆ ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినది తాము కాదనడం ఆసక్తికరం. ఆ గొంతులు ఆ ఇద్దరు నటులవేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కాబట్టి అది నిజమైనదే. మరి ఆ ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినది ఎవరు?

అది మనకు ఇప్పటికీ తెలియదు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. టాటాలు, అస్సాం వేర్పాటువాదులకు బలవంతపు వసూళ్లను చెల్లించినట్టు చెప్పిన 20 ఏళ్ల క్రితం నాటి టాటా టేపులు అలాంటివే. నస్లీ వాడియా, కేశబ్‌ మహేంద్ర, జనరల్‌ శామ్‌ మానెక్‌షా, రతన్‌ టాటాల మధ్య సాగిన ఆ ప్రైవేటు సంభాషణలను రికార్టు చేసి లీకు చేశారు. ఆ పని చేసింది ఎవరు? మనకు తెలి యదు. భారత పౌరులపై ప్రభుత్వ నిఘా అధికారిక అదేశాలు లేదా పర్యవేక్షణ లేకుండానే చట్టవిరుద్ధంగా సాగుతోందని ఈ ఘటనలన్నీ తెలుపుతున్నాయి. ఈ నేరాలన్నీ రచ్చకెక్కినా చట్టవిరుద్ధ నిఘాకు గానూ ఏ అధికారినీ బోనెక్కించలేదు.

మన దేశంలో చట్టబద్ధంగా సాగే ప్రభుత్వ నిఘా విస్తృతి చాలా ఎక్కువ. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నెలకు 10,000 ఫోన్‌ ట్యాప్‌లను అనుమతించినట్టు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక ఇటీవల సమాచార హక్కు చట్టం కింద దఖలు చేసిన ఓ దరఖాస్తు వల్ల తెలిసింది. ఇలా సేకరించిన సమాచారాన్నంతటినీ ఏం చేస్తున్నారు? అది మనకు చెప్పలేదు. మిగతా ప్రజాస్వామ్యాల్లో వలే అధికారిక నిఘాలకు సంబంధించి మనకు రక్షణలు గానీ, దానికి అవరోధాలు గానీ లేవు. అమెరికాలోనైతే, ఫోన్‌ ట్యాపింగ్‌కు అధికారిక ఆమోదం లభించాలంటే పోలీసులు న్యాయమూర్తికి ఆధారాలు చూపాలి. ఆమోదం లభించినా దాన్ని కఠినమైన షరతులకు లోబడే చేయాల్సి ఉంటుంది. అది మన దేశంలో లోపించింది. లాబీయింగ్‌లను జరిపే నీరా రాడియా ఫోన్లను నెలల తరబడి ట్యాప్‌ చేశారు. ఆ తర్వాత వాటిని మీడియాకు విడుదల చేసి నేరానికి పాల్పడ్డారు. అవి నేరం జరిగినట్టు సూచించకపోయినా, కొందరు వ్యక్తులకు మచ్చతెచ్చాయి. మన ప్రభుత్వం పౌరుల ఫోన్లను ట్యాప్‌ చేసి, ఆ పని చేయలేదని నిరాకరించగలుగుతోంది. సంస్థాగతమైన ఒక క్రమం అంటూ లేకపోవడం వల్ల నిఘా ద్వారా సేకరించిన సమాచారంపై, అది చట్టబద్ధంగా సేకరించినదే అయినా, ప్రభుత్వ నియంత్రణ ఉండటం లేదు (రాడియా టేపులలాగా). జవాబుదారీతనమూ లేదు.

వ్యక్తిగత గోప్యతపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యం ఇది. మన ప్రభుత్వ నిఘా చరిత్ర తెలుసు కాబట్టి నేను ఆధార్‌ కార్డ్‌ తీసుకోలేదు. నా బయోమెట్రిక్‌ వివరాలను అప్పగించమని ప్రభుత్వం నన్ను ఎందుకు బలవంత పెట్టాలి? అది అర్థరహితం. గుర్తింపునకు ఆధారంగా, నాకు ఇప్పటికే పాస్‌పోర్ట్, డ్రైవింగ్‌ లైసెన్స్, పాన్‌ కార్డ్, నా ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ బిల్లు, నా ఎలక్ట్రిసిటీ బిల్లు, నా ఇంటి డాక్యుమెంట్లు, నా ఓటర్‌ గుర్తింపు కార్డ్‌ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే వివిధ రూపాల గుర్తింపులే. అది నా నుంచి ఇంకా ఎన్ని ఇతర విషయాలు కావాలంటుంది, ఎందుకు? నా మొబైల్‌ ఫోన్‌ను, బ్యాంకు ఖాతాను ఆధార్‌తో తప్పక అనుసంధానించాలని ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి తాఖీదులు వచ్చాయి. పాఠశాల పిల్లలను పరీక్షలకు అనుమతించాలంటే ముందుగా ఆధార్‌ తీసుకోవాలన్న భయానక గాథలనూ వినాల్సివచ్చింది. ట్యాక్స్‌ రిటర్నుల దఖ లుకు ఇప్పటికే ఆధార్‌ను తప్పనిసరి చేశారు (ఈ అర్థరహితమైన ఈ నిబంధన నుంచి తప్పించుకోడానికి నేను ముందే దఖలు చేసేశాను).

దాచుకోడానికి ఏమీలేని వారు ఆధార్‌ నమోదుకు ఎందుకు ప్రతిఘటిస్తారు? అని ప్రభుత్వ మద్దతుదార్లు వాదిస్తారు. ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యలు చాలా బలహీనమైనవి కాబట్టి నేను వద్దనుకుంటున్నా. ఆధార్‌ను బ్యాంకు ఖాతాలతో, పాన్‌ నంబర్లతో అనుసంధానించడం లక్ష్యం, ట్యాక్స్‌ దొంగలను మరింత మెరుగ్గా పట్టుకోగలుగుతామనేదే అయినా, నేను అభ్యంతరం తెలుపుతాను. నాగరిక ప్రజాస్వామ్యం ఏదైనాగానీ ప్రజలు అమాయకులనే భావిస్తుంది. ప్రతి ఒక్కరు తమ ఆర్థిక లావాదేవీలకు బయోమెట్రిక్‌ గుర్తింపును జోడించేలా నిర్బంధించడమంటే ప్రతి ఒక్కరూ నేరస్తులేనని భావించడమే. ఇది నాకు ఆమోదనీయం కాదు.

2014, ఏప్రిల్‌ 8న నరేంద్రమోదీ బెంగళూర్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సాగించారు. గెలిచిన తర్వాత తాను ఆధార్‌ను రద్దు చేస్తానని చెప్పారు. నందన్‌ నీలేకనీపై దాడి చేస్తూ ఆయన ‘‘మీరు ఏ నేరానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు మీ ఆధార్‌ ప్రాజెక్టుకు మొట్టికాయలు వేసింది?’’అని ప్రశ్నించారు. ‘‘మొట్టమొదటిసారిగా బహిరంగంగా చెబుతున్నాను. ఆధార్‌ ప్రాజెక్టుపై నేను పలు ప్రశ్నలను అడిగాను. చట్టవిరుద్ధంగా వలస వచ్చిన విదేశీయుల గురించి, జాతీయ భద్రతకు సంబంధించి వారిని పలు ప్రశ్నలు వేశాను. వారి (యూపీఏ ప్రభుత్వం) వద్ద సమాధానం లేదు’’ అని కూడా మోదీ అన్నారు. నేడు మోదీ దీనికి పూర్తిగా విరుద్ధమైన వైఖరి చేపట్టి, అవసరం లేదనుకున్న వారి పైన కూడా బలవంతంగా ఆధార్‌ను రుద్దుతున్నారు. ఇలా విరుద్ధ వైఖరిని ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో ఆయన వివరించాల్సి లేదా? ఆయన ఆ పని చేయరనుకోండి.

ఒక గూఢచార సంస్థకు చెందిన ఒక వ్యక్తిని కొద్ది రోజుల క్రితం కలుసుకున్నాను. నాపైన ఒక ఫైల్‌ ఉండేదని, అందులో నాకు సంబంధించిన చాలా వివరాలే ఉన్నాయని, వాటిలో చాలా వరకు చట్టవిరుద్ధంగా సేకరించినవేనని చెప్పారు. ఇలా చట్టవిరుద్ధ ప్రభుత్వ నిఘా కింద ఉన్న వారు లక్షల్లో కాకున్నా, వేలల్లోనైనా ఉన్నారు. ఈ నేరపూరితమైన నిఘా కార్యకలాపం సాగడానికి స్వచ్ఛం దంగా మనం మన వివరాలు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వనక్కర్లేదు. తప్పనిసరి ఆధార్‌ నమోదును, మన జీవితంలోని అన్ని రంగాలనూ మన బయోమెట్రిక్‌ గుర్తింపులతో తప్పక అనుసంధానించాల్సి రావడాన్ని ఆపివేయలి. సుప్రీంకోర్టు తీర్పు మనకు ఆ ఆశను కలిగించింది.

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
ఆకార్‌ పటేల్‌

>
మరిన్ని వార్తలు