నేటి నిజాలకు గతంలోనే బీజాలు

30 Nov, 2015 03:56 IST|Sakshi

మానవాళి ఎంత దూరం ప్రయాణించినా గతంతో మాటామంతీ జరుపుతూనే ఉంటుంది. వర్తమానం ఓ అడుగు ముందుకు వేయగలిగినా; సంక్షోభాలనూ, కల్లోలాలనూ ఎదుర్కొంటున్నా అందుకు సంబంధించిన చూపు, రూపు గతంలో తప్పక కనిపిస్తాయి. హైదరాబాద్ రాజ్యంలో కల్లోలాలకీ, రాయలసీమ పాలెగాళ్ల ప్రతాపాలకీ, అదే సమయంలో కోస్తాలో ఆనకట్టల నిర్మాణానికీ దోహద పడిన పరిస్థితులు ఏవి? హైదరాబాద్ సంస్థానం మిగిలిన ప్రపంచానికి దూరంగా ఉండిపోవడానికీ, ప్రజల భాషకు కూడా చోటులేని దుస్థితికీ హేతువులు ఏమిటి? అదే సమయంలో ఆధునిక విద్యలో కోస్తా ప్రాంతీయులు ముందడుగు వేయడానికి కారణం; సామాజిక సంక్షోభాలు ఉన్నా రాయలసీమలో కొంతమేర విద్యాగంధం విరియడానికి ఉన్న హేతువులు ఏమిటి? 18వ శతాబ్దపు చరిత్ర పరిణామాల అధ్యయనమే వీటికి సమాధానం ఇస్తుంది. నిజానికి దక్షిణ భారత చరిత్రను నిర్దేశించిన ఆ మూడు ప్రాంతాల చారిత్రక పరిణామాలు ఒకదానితో ఒకటి గాఢమైన అనుబంధం కలిగినవే. ఆ పరిణామాల విశ్లేషణే 'ఎర్లీ మోడరన్ ఆంధ్ర, హైదరాబాద్ అండ్ కంపెనీ రూల్- క్రీ.శ. 1724-1857' గ్రంథం.

 ఏపీ హిస్టరీ కాంగ్రెస్, తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందిస్తున్న తెలుగువారి చరిత్ర సంపుటాలలో ఆరవది ఈ పుస్తకం. మొగలుల పతనంతో భారత భూభాగంలో చిన్న రాజ్యాలు తలెత్తాయి. ఈ పరిణామానికి సమాంతరంగా జరిగినదే ఇంగ్లిష్  ఈస్టిండియా కంపెనీ విస్తరణ. నిజాం ఉత్థానపతనాలు ఈ ప్రయాణంలో చోటు చేసుకున్నవే. కలకత్తా నుంచి మద్రాసు వరకు కంపెనీ ఆధిపత్యం నెలకొల్పగలిగిందంటే ఆయా ప్రాంతాలను నిజాం కంపెనీకి ధారాదత్తం చేయడమే కారణం.

నిజాం రాజ్యం, కంపెనీ-బ్రిటిష్ ఏలుబడిలోకి పోయిన  ప్రాంతాలు వేర్వేరు రూపాలు సంతరించుకోవడమే అనేక చరిత్ర మలుపులకు కారణం. వర్తమానం మీద వాటి జాడ కూడా గాఢమైనదే. ఈ పరిణామ క్రమాన్ని ఈ గ్రంథంలోని మొదటి ఆరు అధ్యాయాలు ఆవిష్కరించాయి. అలాగే ఆంగ్లేయుల పాలనలో కోస్తాంధ్రలో ఆనకట్టలు వెలసిన తీరు, ఇంగ్లిష్ విద్య, వాణిజ్యం ఎలాంటివో 7 నుంచి 12 వరకు ఉన్న అధ్యాయాలు విశ్లేషించాయి. ఆచార్య బి. కేశవనారాయణ రాసిన 13వ అధ్యాయం 1773-1857 మధ్య ఉత్తర సర్కారు జిల్లాలలో జరిగిన తిరుగుబాట్లను చర్చించింది. ఇవన్నీ జమిందారీ వ్యవస్థ మీద నిరసనలే. వీటికి విశేష ప్రాధాన్యం ఉంది. తరువాతి అధ్యాయం 1800-1850 మధ్య రాయలసీమలో పాలెగాళ్ల చరిత్రను చర్చించింది. డాక్టర్ వై.ఎ. సుధాకరరెడ్డి ఈ వివరాలు అందించారు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం హైదరాబాద్ సంస్థానం మీద (వి. రామకృష్ణ), ఆంధ్ర ప్రాంతం మీద (వి. రాజగోపాల్) వేసిన ముద్రను గురించి కూడా ఈ పుస్తకం వివరించింది.

 ఇందులోని మొత్తం 26 అధ్యాయాలలో, 19వ అధ్యాయం మరీ ప్రత్యేకమైనది. తెలుగు భాష, సాహిత్యాలను ఐరోపా పండితులు వెలుగులోకి తేవడానికి చేసిన కృషిని ఇందులో పీటర్ ఎల్. షిమిథెనర్ లోతుగా చర్చించారు. తెలుగు ప్రాంతాలను సామాజిక, రాజకీయ కల్లోలాలలో ముంచెత్తిన 18వ శతాబ్దంలోనే భాషా సాహిత్యాల మీద కొందరు పాశ్చాత్యులు కొత్త వెలుగును ప్రసరింప చేయడం గొప్ప వైచిత్రి. సీపీ బ్రౌన్, బెంజిమన్ షుల్జ్, విలియం క్యారీ, జార్జి క్రాన్, కోలిన్ మెకంజీ, విలియం బ్రౌన్, వి.డి. క్యాంప్‌బెల్ వంటి వారు ఇందుకు చేసిన కృషిని రమణీయంగా వివరించే అధ్యాయం ఇది.
 హైదరాబాద్‌లో, కోస్తాంధ్రలో, రాయలసీమలో 18వ శతాబ్దంలో జరిగిన ఈ ఘటనలన్నీ చరిత్రాత్మకమే కాదు, అవి పరస్పర ప్రేరేపితాలు కూడా. ఇవన్నీ చదివిన తరువాత  2000 సంవత్సరం నాటి తరం చూసిన పరిణామాలకు అవే బీజాలు నాటాయన్న వాస్తవం అనుభవానికి రావడం గొప్ప అనుభూతి.

 ఆచార్య వకుళాభరణం రామకృష్ణ సంపాదక త్వంలో ఈ సంపు టాలు వెలువడుతున్నా, ఒక్కొక్క సంపుటానికి వేర్వేరు సంపాదకులు ఉన్నారు. ఈ సంపుటానికి ఆచార్య అడపా సత్యనారాయణ సంపా దకులు. హెచ్. రాజేంద్రప్రసాద్, ఏఆర్ రామ చంద్రారెడ్డి, తంగెళ్లపల్లి విజయకుమార్, గుంటూరి నాగశ్రీధర్, వి. రామకృష్ణారెడ్డి, చంద్ర మల్లంపల్లి, వి. లలిత, సల్మా అహ్మద్ ఫరూఖీ, బి. సుధారెడ్డి, బిఎస్. రోహిణీ అయ్యంగార్ ఇతర అధ్యాయాలు అందించారు.

 (డిసెంబర్ 1న హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో
 ఆరో సంపుటం ఆవిష్కరణోత్సవం సందర్భంగా) - కల్హణ

మరిన్ని వార్తలు