అమెరికాతో రక్షణ బంధం

1 Sep, 2016 00:17 IST|Sakshi
అమెరికాతో రక్షణ బంధం

క్షణ రంగంలో మనతో మరింత సాన్నిహిత్యం ఏర్పడాలని పన్నెండేళ్లనుంచి తపనపడుతున్న అమెరికా కోరిక ఈడేరింది. సైనిక వసతులు, సామగ్రి, సేవలు పరస్పరం వినియోగించుకోవడానికి వీలు కల్పించే కీలక ద్వైపాక్షిక ఒప్పందం (లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్) ‘లెమోవా’పై రెండు దేశాలూ బుధవారం సంతకాలు చేశాయి. వాస్తవానికి ఇందుకు సంబంధించి నాలుగు నెలల క్రితమే ఇరు దేశాలమధ్యా సూత్రప్రాయంగా అవగాహన కుది రింది. ఇప్పుడు జరిగింది లాంఛనప్రాయమే. ఈ ఒప్పందంతో రెండు దేశాల సైనిక, నావికా దళాలు ఆహారం, ఆయుధాలు, మరమ్మతులు, ఇంధన అవసరాలు, స్థావరాల వినియోగంలాంటి అనేక అంశాల్లో పరస్పరం సహకరించుకోవడానికి మార్గం సుగమమైంది.

అయితే ఇవన్నీ అంశాలవారీ పరిశీలన అనంతరం పరస్పర అంగీకారంతో మాత్రమే అమలు జరుగుతాయన్న క్లాజ్ ఈ ఒప్పందంలో ఉంది. భారత్‌లో అమెరికా తన సైనిక స్థావరాలు నెలకొల్పుకోవడానికి ఈ ఒప్పందం అంగీకరించబోదని రక్షణమంత్రి మనోహర్ పరీకర్ వివరణనిచ్చినా... ఇది అంతర్జాతీయంగా భారత్ ప్రస్తుతం అవలంబిస్తున్న తటస్థ విధానానికి తూట్లు పొడుస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆసియా పసిఫిక్, పశ్చిమాసియా ప్రాంతాల్లో ఇప్పుడు అమెరికాకు ఉన్న తగువుల్లో మనకిష్టం లేకపోయినా తల దూర్చక తప్పని స్థితి ఏర్పడవచ్చునని హెచ్చరిస్తున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఉనికి ప్రాధాన్యత సంతరించుకుంటుందని, ఇది ప్రపంచానికి మంచి చేస్తుందని బుధవారం వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జాన్ కిర్బీ అనడాన్నిబట్టి అమెరికా మననుంచి చాలానే ఆశిస్తున్నదని చెప్పాలి.

 దౌత్యరంగంలో ప్రతి అంశమూ కీలకమైనదే. రెండు దేశాలు సమావేశం కావడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం మాత్రమే కాదు... అందుకు ఎంచుకున్న సమయమూ, సందర్భమూ కూడా పరిగణనలోకి వస్తాయి. హేగ్‌లోని అంత ర్జాతీయ సాగర జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ మూడేళ్లనాటి ఫిలిప్పీన్స్ ఫిర్యాదుపై గత నెల తీర్పు వెలువరిస్తూ దక్షిణ చైనా సముద్ర వివాదంలో చైనా వాదన చెల్లదని తీర్పునిచ్చింది. ఆ తీర్పును మన దేశం స్వాగతించడంతోపాటు అన్ని పక్షాలూ దాన్ని గౌరవించాలని హితవు పలికింది. ఈ నేపథ్యంలో భారత్, అమెరికాల సమావేశాన్ని, ఒప్పందం కుదరడాన్ని అర్ధం చేసుకుంటే ఇరు దేశాల సంబంధాలూ తామిద్దరికి మాత్రమే కాదు... ప్రపంచానికే మంచిదని కిర్బీ ఎందుకన్నారో అవగాహనకొస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో తగాదా ఉన్న మరో దేశం వియత్నాంలో ఈ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు.

చైనాలో జరగబోయే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్తూ మోదీ వియత్నాంను సందర్శిస్తారు. దేనిపైన అయినా నేరుగా అభిప్రాయం వ్యక్తం చేయని చైనా ఈ ‘లెమోవా’ ఒప్పందంపైన కూడా అధి కారంగా మాట్లాడలేదు. అయితే ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ‘గ్లోబల్ టైమ్స్’ భారత్-అమెరికాల బంధం చైనా, పాకిస్తాన్‌లకు మాత్రమే కాదు...రష్యాకు కూడా ఆగ్రహం తెప్పిస్తుందని వ్యాఖ్యానించింది. ఏ దేశాలమధ్య కుదిరే ఒప్పం దమైనా వేరే దేశం మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలనడం వరకూ ఫర్వాలేదు కానీ...ఆగ్రహం తెప్పిస్తుందని హెచ్చరించడం చెల్లుబాటు కాని విషయం. మన దేశానికి ఆగ్రహం తెప్పిస్తుందని తెలిసినా 1962లో సైనిక సామగ్రి సరఫరా మొదలుకొని తాజాగా జలాంతర్గాములు సమకూర్చడం వరకూ పాకిస్తాన్‌తో చైనా సైనికపరమైన ఒప్పందాలు అనేకం కుదుర్చుకుంది. ఏ దశలోనూ భారత్‌కు ఇవి ఇబ్బందులు కలిగిస్తాయని, కోపం తెప్పిస్తాయని చైనా అనుకున్నట్టు లేదు.

 అయితే ‘లెమోవా’ ఒప్పందంలోని మంచి చెడ్డలు మన ప్రయోజనాల వెలుగులో పరిశీలించాల్సిందే. ఈ ఒప్పందం సైనిక వసతులు మొదలుకొని అనేక అంశాల్లో పరస్పరం సహకరించుకోవడానికి వీలు కల్పిస్తున్నా ప్రపంచంలో ఏమూలనైనా స్థావరాలున్నది అమెరికాకే తప్ప మనకు కాదు. కనుక ఆచరణలో లబ్ధి పొందేది అమెరికాయే తప్ప మనం కాదు. తజికిస్తాన్‌లోని వైమానిక దళ స్థావరం మినహా మనకు ఎక్కడా స్థావరాలు లేవు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వర్తమాన తరుణంలో ఈ ఒప్పందం అందులో అనవసరంగా మన ప్రమేయాన్ని పెంచు తుందన్నది విపక్షాల ఆరోపణ. మన ప్రయోజనాలు, అవసరాలు గీటురాయిగా దేన్నయినా నిర్ణయించుకునే స్వేచ్ఛకు ఇలాంటి ఒప్పందాలు పరిమితులు విధిస్తాయని అవి ఆందోళనపడుతున్నాయి. అయితే ఇంతక్రితం ఇతర దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందానికీ, ఇప్పుడు మనతో కుదుర్చుకున్న ఒప్పందా నికీ మౌలికంగా తేడా ఉంది. వేరే దేశాలతో అమెరికా ఇంతవరకూ సైనిక వసతుల, సేవల మద్దతు ఒప్పందం  (లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్-ఎల్‌ఎస్‌ఏ) మాత్రమే కుదుర్చుకుంది.

ఆ మాదిరి ఒప్పందంపైనే మనల్ని కూడా సంతకం చేయాలని ఇన్నాళ్లనుంచి అమెరికా పట్టుబడుతోంది. మన దేశం అందుకు సంసిద్ధత కనబర చకపోవడంవల్లే ఒప్పందం ఇంత ఆలస్యమైంది. ఇది మెచ్చదగిందే. మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా ఎల్‌ఎస్‌ఏ కు అనుకూలంగా ఉన్నా యూపీఏ సర్కారులోని ఇతరులు మాత్రం పడనివ్వలేదు. ఈ ఒప్పందానికి బీజాలు వాజపేయి నేతృ త్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో పడినా మోదీ ప్రభుత్వం కూడా ఒప్పందం ముసాయిదాలో మార్పులుండాలని కోరింది. ఫలితంగా ఎల్‌ఎస్‌ఏ స్థానంలో ‘లెమోవా’ వచ్చింది. ఇరు దేశాలమధ్యా కుదరాల్సిన కీలక ఒప్పందాల పరంపరలో ఇది రెండోది. మొదటిది వాజపేయి హయాంలో కుదిరిన సైనిక సమాచార భద్రత ఒప్పందం(జీఎస్‌ఓఎంఐఏ). మరో రెండు-కమ్యూనికేషన్లు, సమాచార భద్రత ఒప్పందం(సిస్మోవా), పరస్పర మౌలిక మార్పిడి, సహకార ఒప్పందం(బెకా) ఉన్నాయి. ప్రస్తుత ఒప్పందంపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పారదర్శకంగా వ్యవహరించడం, ఆ ఒప్పందాలపై చర్చించడం అవసరమని కేంద్రం గుర్తించాలి.

 

మరిన్ని వార్తలు