‘ఇందు’ కే రామోజీ చిందులు

27 Sep, 2013 05:31 IST|Sakshi
‘ఇందు’ కే రామోజీ చిందులు

జగన్‌కు బెయిలు రావటంతో ‘ఈనాడు’ రోజుకో కథనం
 ఆఖరికి బాబు అర్థంలేని సందేహాలనే పేర్చి బ్యానర్ స్టోరీ

 వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై సీబీఐ దర్యాప్తును రెండేళ్లకు పైగా డ్రైవర్ సీట్లో కూర్చుని నడిపించిన రామోజీ రావుకు దర్యాప్తు ముగియటం ఏమాత్రం మింగుడు పడటం లేదు. సుప్రీంకోర్టు గడువుతో... కోర్టు ధిక్కరణ భయంతో... సీబీఐ దర్యాప్తును ముగించగా... దానివల్ల జగన్‌కు బెయిలు రావటం ఎల్లో ముఠాధిపతికి అస్సలు గిట్టడం లేదు. అందుకే కోర్టు విచారణకు సైతం స్వీకరించని చార్జిషీట్ల పేరు చెబుతూ... వారం రోజులుగా జగన్‌ను టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. ఆఖరికి తన సియామీ కవల చంద్రబాబు వ్యక్తం చేసిన అర్థంలేని సందేహాలతో బుధ, గురువారాల్లో  పతాక కథనాల్ని కూడా వండేశారు. బహుశా... ఇలా ప్రతిరోజూ ఒక కథనానికి కారణం నిద్రలేని రాత్రులు మొదలుకావటమేనేమో!!
 
 ఇందుకు భూ విందు అంటూ... బుధవారం అడ్డగోలు రాతలు అయినా విచారణకు స్వీకరించని చార్జిషీటు రామోజీకెలా వచ్చింది? అవి ఎకరా రూ. 20 వేలు కూడా విలువ చేయని భూములు అలాంటి వాటికి ఎకరాకు రూ. 1.75 లక్షల ధర నిర్ణయం అనంతపురంలో పరిశ్రమలు రావాలన్నదే వైఎస్ ఆలోచన 2006లో సైన్స్ సిటీ కోసం ఏపీఐఐసీ భూ సేకరణ ప్రకటన నీరు లేక అది వెనక్కెళ్లటంతో సేకరణ నిలిపివేత ఆ తరవాత ఏ పరిశ్రమా రాలేదు; ముందుకొచ్చిన లేపాక్షి సోమశిల నుంచి నీటి కేటాయింపు; దాన్ని తేవడానికే భారీ ఖర్చు అవన్నీ పరిగణనలోకి తీసుకుని రుణం మంజూరు చేసిన బ్యాంకు ప్రభుత్వ రేటు వేరు; బ్యాంకు రేటు వేరంటూ 2002లో నిబంధన
 ఆ నిబంధన తెచ్చింది చంద్రబాబు; దాని ప్రకారమే కేటాయింపులు అప్పటి నిబంధనల ప్రకారమే

ఇందూకు రుణమిచ్చిన బ్యాంకులు దాన్ని విక్రయ విలువగా కట్టేసి... 1,207 కోట్ల లాభమంటూ పిచ్చి రాతలు  హైదరాబాద్ నడిబొడ్డున ఐఎంజీకి 850 ఎకరాలు కేటాయించిన బాబు ఎకరా కేవలం రూ. 50 వేలకు; భళా అంటూ సమర్థించిన రామోజీ జీఎంఆర్‌కు 2,000 ఎకరాలు చాలన్నా... 5,500 ఎకరాల కేటాయింపు  లండన్ హీత్రూ విమానాశ్రయం కూడా 3,000 ఎకరాల్లోనే బాబు ఏది చేసినా రైటనే తీరులో ఈనాడు తందాన తాన కోర్టులు ఆదేశాలిచ్చినా ఆయనవైపు చూడనే చూడని సీబీఐ  ఎకరా ఇరవై వేలు చెప్పినా కొనటానికి ముందుకు రాని భూములవి.  భూగర్భ జలాల జాడ క నపడదు. వర్షం ఊసే ఉండదు.  అప్పులు తెచ్చి పంట పెడితే రైతుకు మిగిలేది అప్పు మాత్రమే.
 
 అలాంటి వెనకబడిన జిల్లాలో... ఎడారిని తలపించే భూముల్లో... ఓ పారిశ్రామిక పార్క్ పెడితే పెద్ద ఎత్తున పరిశ్రమలొస్తాయని భావించారు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అలాంటి ప్రయత్నం ఏ చంద్రబాబు నాయుడో చేస్తే... ఎల్లో మీడియాకు పూనకం వచ్చేసుండేది. ఇక ఆ జిల్లా సింగపూర్‌లా మారిపోతుందంటూ అమెరికా ఫొటోలు వేసి మరీ కథనాలు వార్చేసేది. ఆ కంపెనీ ప్రతినిధులు పచ్చి దొంగలైనా సరే... ఇంద్రులు- చంద్రులంటూ పొగిడేసేది. కానీ అలాంటి ప్రయత్నం వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేయటం దానికి ససేమిరా గిట్టలేదు. అందుకే... అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ను ఆది నుంచీ అది అడ్డుకుంటూనే వస్తోంది. ఇందూ ప్రాజెక్ట్స్ నుంచి గానీ, దాని అధిపతి శ్యాంప్రసాద్‌రెడ్డి నుంచి గానీ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లోకి రూపాయి పెట్టుబడి రాకున్నా... దాన్నీ ‘క్విడ్ ప్రో కో’ గాటన కట్టేసింది. ఎల్లో మీడియా కనుసన్నల్లో సాగిన దర్యాప్తులో సీబీఐ కూడా తందాన తాన అనేసింది. అది వేసిన చార్జిషీటంటూ... మళ్లీ అదే ఎల్లో కథనాన్ని బుధవారం వండి వార్చింది ఈనాడు. ‘లేపాక్షి పేరుతో ఇందూకు భూ విందు’ పేరిట బుధవారం పతాక శీర్షికలో ప్రచురించిన కథనంలో నిజానిజాలేంటి? ఇందూ ప్రాజెక్ట్స్ నిజంగానే జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిందా? అక్కడ భూముల విలువ నిజంగా ఎంత? బ్యాంకులు ఎందుకు ఎకరాకు రూ.15 లక్షల రుణమిచ్చాయి? ఇలా రుణం తీసుకోవటం తప్పా? ఇవన్నీ వివరించేదే ఈ ‘ఏది నిజం?’
 
 అనంతపురం - బెంగళూరు మధ్య దూరం 240 కిలోమీటర్లు. దీనికి నడిమధ్యలో... అంటే అటు అనంతపురానికి, ఇటు బెంగళూరుకు దేనికైనా 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిలమత్తూరు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చూసినా 100 కిలోమీటర్ల దూరం. గోరంట్ల, చిలమత్తూరు మండలాలు రెండూ చిత్రావతి నది పరివాహక ప్రాంతం పరిధిలోనివే. కాకుంటే 1996లో రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కర్ణాటక ప్రభుత్వం చిత్రావతిపై పరగోడు వద్ద ఓ బ్యారేజీని నిర్మించింది. దాంతో నది ఎండిపోయింది. భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లదీ అదే పరిస్థితి. వాటిపై ఆధారపడి సాగుచేస్తున్న భూములూ బీడువారాయి.
 
  పంటలు లేక, భూగర్భ జలాలూ లేక అల్లాడుతున్న ఆ గ్రామాల్లో పరిశ్రమలొస్తే జిల్లా రాత మారుతుందని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భావించింది. 2006లో సైన్స్ సిటీకి పచ్చజెండా ఊపింది. ఏపీఐఐసీ భూ సేకరణ ప్రకటనలిచ్చింది. కానీ నీటివసతి లేకపోవటంతో అక్కడ తమకు అవసరం లేదంటూ సైన్స్ సిటీ యాజమాన్యం వెనక్కెళ్లిపోయింది. దీంతో ఏపీఐఐసీ ఇతర పరిశ్రమల్ని ఆహ్వానించింది. ఎవ్వరూ ముందుకు రాలేదు. భూ సేకరణ నిలిపేసింది. ఆ తరవాత ముందుకొచ్చింది లేపాక్షి సంస్థ. ఆ సంస్థ ఇచ్చిన నిధులతోనే భూసేకరణ చేసింది ఏపీఐఐసీ. అదీ... లేపాక్షి భూముల అసలు కథ.
 
 100 కిలోమీటర్లంటే సమీపమా?

 ఇంకా విచారణకు స్వీకరించని చార్జిషీటును ఉటంకిస్తూ ‘ఈనాడు’ తన కథనంలో రాసిన అతిశయోక్తులు, అసత్యాలు చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది... ఈ భూములు బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్నాయని రాసేయటం. అసలు 100 కిలోమీటర్ల దూరాన్ని ‘సమీపంలో’ అని రాయటం ఏటైపు జర్నలిజం? విశాఖపట్నానికి, శ్రీకాకుళానికి మధ్య దూరమెంత? 100 కిలోమీటర్లు కాదా? దానర్థం విశాఖపట్నానికి శ్రీకాకుళం సమీపంలో ఉన్నట్లేనా? మధ్యలో ఒక జిల్లా కూడా ఉందే!!! అయినా నిందితుడికి కూడా అందని చార్జిషీటు ‘ఈనాడు’కెలా వచ్చింది? సీబీఐతో ఉన్న బంధం వల్లా?
 
 ధర ఎన్నడైనా రూ.70 వేలు మించిందా?
 లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు భూమి కేటాయించేదాకా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో భూమి ఎన్నడూ ఎకరా రూ.65-70 వేలు మించలేదు. దీనికి ఆధారం 2008లో ఆయా మండలాల్లో జరిగిన లావాదేవీలే. ఈ లావాదేవీల ప్రకారం 2008లో అక్కడ భూ విలువలు సర్వే నంబర్లను బట్టి రూ.20,000 నుంచి రూ.50,000 వరకు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం లేపాక్షికి ఎకరాకు రూ.1.75 లక్షల ధరను నిర్ణయించింది. 8 వేల ఎకరాల కోసం భూసేకరణ పూర్తికాక ముందే రూ.119 కోట్లను మూడు విడతలుగా ఏపీఐఐసీకి చెల్లించింది లేపాక్షి సంస్థ. ఆ నిధులతోనే భూసేకరణ చేసింది ఏపీఐఐసీ. ‘ఈనాడు’ మాత్రం అవాస్తవాలతో చెలరేగిపోయింది. 2006లో ఏపీఐఐసీ భూసేకరణ ప్రకటనలిచ్చిందని, దీనికి వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు రావటంతో నిలిపేసిందని రాశారు రామోజీ. నిజానికి సైన్స్ సిటీ ప్రతిపాదన, అది వెనక్కెళ్లిపోవటం ‘ఈనాడు’కు తెలియనివేమీ కావు. కానీ 2006 నుంచే లేపాక్షి కోసం భూములు సేకరించారని చెప్పే కుట్రలో ఇదో భాగం. అంతే!!
 
 ఇవన్నీ తలతిక్క లెక్కలు కాదా?
 రామోజీ, సీబీఐ లెక్కలు ఎంత తలతిక్కవో ఇది చూస్తే తేలిగ్గానే అర్థమవుతుంది. ఎకరాను రూ. 1.75 లక్షలకు కొనుక్కున్న లేపాక్షి సంస్థ... దాన్లో 4,650 ఎకరాలను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రూ.830 కోట్లను రుణంగా తెచ్చుకుందని, ఈ లెక్కన మొత్తం భూమి విలువ రూ.1,326 కోట్లని, దాన్లో ప్రభుత్వానికి చెల్లించిన 119 కోట్లను మినహాయిస్తే లేపాక్షి సంస్థకు రూ.1,207 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లని సీబీఐ పేర్కొందంటూ రామోజీ రాసి పారేశారు.
 
 అసలు రుణానికి, అమ్మకానికి తేడా లేదా రామోజీ? ఆ సంస్థ భూముల్ని తనఖా పెట్టి రుణం తెచ్చుకుంటే... ఆ విలువను మొత్తం భూములకు వర్తింపజేసి... లెక్కగట్టేసి... ఆ లెక్కన చూస్తే దానికి 1,207 కోట్లు లాభమనటం ఏ స్థాయి పైత్యం? ఆ సంస్థేమైనా ఆ భూముల్ని ఎకరా రూ.15 లక్షల చొప్పున విక్రయించిందా? అప్పుడు కదా దానికి లాభం వచ్చిందని చెప్పగలిగేది? రుణం తీసుకుంటే ఆ రుణం చెల్లించొద్దా? అందరూ రామోజీ మాదిరి రుణాలు ఎగ్గొట్టి కోర్టుల చుట్టూ తిప్పించేవారే ఉంటారా? అసలు ఫిలిం సిటీలో ఎకరా రూ.లక్ష చొప్పున కొని దాన్ని బ్యాంకుల వద్ద తనఖా పెట్టినపుడు ఎకరాకు రూ.లక్ష చొప్పునే రుణం తీసుకున్నారా? మరి అన్ని వేల కోట్ల అప్పులు ఎలా పుట్టాయి రామోజీ?
 
 బాబు హయాంలోనే ఆ నిబంధనలు...
 లేపాక్షి భూముల విషయానికొస్తే అవన్నీ ఎడారి భూములు. అక్కడ ఏ పరిశ్రమ లేదా ప్రాజెక్టు రావాలన్నా నీరు తప్పనిసరి. అందుకే సోమశిల నుంచి దీనికి ప్రభుత్వం నీరు కేటాయించింది.  ఆ నీటిని తీసుకురావటానికి కడప జిల్లా నుంచి లేపాక్షి దాకా పైప్‌లైన్లు వేయాలంటే... ఆ ఖర్చు ఎకరాకు రూ.10 నుంచి 15 లక్షలు అవుతుంది. అది లేపాక్షి సంస్థ భరించాల్సిందే. ఆ ఖర్చు భరించి పైప్‌లైన్ వేస్తేనే.. సోమశిల నీళ్లు తెస్తేనే ఇక్కడ పెట్టే పరిశ్రమలకు నీళ్లందుతాయి. అప్పుడే ఏ ప్రాజెక్టయినా ఇక్కడకొస్తుంది. బ్యాంకులు రుణాలిచ్చే ముందు ఆ భూములకు విలువ కట్టే ముందు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటాయి.
 
 అందుకే బ్యాంకుల విలువకు అక్కడ ప్రభుత్వం కట్టిన విలువతో సంబంధం ఉండదు. ఈ నిబంధనను 2002లో అమల్లోకి తెచ్చింది, అమలు చేయించింది కూడా చంద్రబాబే. బాబు హయాంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఇదే రకంగా తనఖాలూ పెట్టుకున్నాయి. అప్పటి నుంచి ఇటీవలి దాకా అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఈ నెల్లోనే మార్చారు. ఇకపై బ్యాంకులు అక్కడి మార్కెట్ విలువకన్నా ఎక్కువ మొత్తాన్ని రుణంగా మంజూరు చేయరాదనే నిబంధన విధించారు. మరి నిబంధనల ప్రకారం బ్యాంకులు రుణాలిచ్చినపుడు అది తప్పెలా అవుతుంది? రుణం వేరు... అమ్మకం వేరన్న సంగతి సీబీఐకి గానీ, రామోజీకి గానీ తెలియదనుకోవాలా? చిలమత్తూరు, గోరంట్ల, కోడూరు మండలాల్లో లేపాక్షి సంస్థ రాకముందు ఎకరా రూ.50 వేలు కూడా పలకని పరిస్థితి ఉండేదని, అందుకే రూ.1.75 లక్షలుగా నిర్ణయించేసరికి చాలామంది తమ భూములు కొనుక్కోవాలంటూ డిమాండ్లు చేశారని సీబీఐకి తెలియదా? రామోజీకి తెలియదా? తెలుసుకోవాల్సిన అవసరం దర్యాప్తు సంస్థలకు లేదా?
 
 జగన్ సంస్థల్లో ఇందూ పెట్టుబడులు సున్నా!
 లేపాక్షికి భూముల్ని కేటాయించినందుకు ప్రతిగా శ్యామ్ ప్రసాద్‌రెడ్డి రూ.50 కోట్లను జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారని ‘ఈనాడు’ రాసిపారేసింది. నిజానికి జగన్ సంస్థల్లోకి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి నుంచి గానీ, ఇందూ ప్రాజెక్ట్స్ నుంచి గానీ రూపాయి కూడా పెట్టుబడిగా రాలేదు. ఇందూ ప్రాజెక్ట్స్‌కు చెందిన ఇందూ టెక్‌జోన్‌కు శంషాబాద్ అవతల భూమి కేటాయించకముందే... లేపాక్షికి భూములు కేటాయించక ముందే... ‘సాక్షి’లో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టిన పెట్టుబడిని ఇందూతో ముడిపెడుతోంది సీబీఐ. దాన్ని కావాలని వదిలిపెట్టి నేరుగా ఇందూ పెట్టుబడులు సాక్షిలోకి వచ్చాయని రాసేశారు రామోజీ!!
 
 నిజానికి నిమ్మగడ్డ ప్రసాద్‌కు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి అంతకు ముందు నుంచే వ్యాపార లావాదేవీలున్నాయి. అందులో భాగంగానే శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు ప్రసాద్. నిజానికి అప్పటికే ప్రసాద్ చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. కేర్ ఆసుపత్రి, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మా టీవీ... ఇలా చాలా సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రసాద్... వాటిలో భాగంగానే శ్యామ్‌ప్రసాద్ రెడ్డికి చెందిన సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్ట్‌మెంట్లు చేయడానికే ఆయన ఒక ఫండ్‌ను కూడా ఏర్పాటు చేశారంటే ఆయన ఎంతటి సీరియస్ ఇన్వెస్టరో అర్థం చేసుకోవచ్చు. మ్యాట్రిక్స్ నుంచి మొదలుపెడితే ప్రతిచోటా విజయవంతమైన ఇన్వెస్టరుగా అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఆర్జించారాయన.
 
 అలాంటి ప్రసాద్ కేవలం జగన్ మోహన్‌రెడ్డి సంస్థలో పెట్టుబడులు పెట్టారనే కారణంతో... ఆయనకు ఇందూ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డితో సంబంధాలున్నాయనే కారణంతో... ఇందూకు ఆ తరవాత ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను చూపెట్టి వీటన్నిటికీ లింకు పెట్టడాన్ని ఏమనుకోవాలి? మోకాలు కూడా కాకుండా... బోడిగుండుకూ, అరికాలుకూ లింకు పెడుతున్నారనుకోవద్దా? ఇంతకన్నా ఘోరమేమైనా ఉంటుందా? పారిశ్రామిక వేత్తగా, సీరియస్ ఇన్వెస్టర్‌గా నిమ్మగడ్డ ప్రసాద్‌కు ఈ రాష్ట్రంలో ఎందరో పారిశ్రామిక వేత్తలతో సంబంధాలుండొచ్చు. అలాంటి ప్రసాద్ కేవలం సాక్షిలో ఇన్వెస్ట్ చేశారనే కారణంతో... ఆ పారిశ్రామికవేత్తలందరినీ వెదికి, వారిలో ప్రభుత్వ ప్రాజెక్టులు చేపట్టిన ప్రతివారినీ పట్టుకుని లింకులు పెట్టుకుంటూ పోతే... వాటికి ‘క్విడ్ ప్రో కో’ ఆపాదిస్తూ పోతే ఏమవుతుంది? దాన్ని దర్యాప్తు అంటారా? అలాంటి వార్తలు రాసేవాటిని పత్రికలంటారా?
 
 ఇదేమైనా ఐఎంజీ బాగోతమా?
 లేపాక్షి సంస్థ భూములకు దరఖాస్తు చేసేనాటికి ఆర్‌ఓసీలో రిజిస్టరు కూడా కాలేదని, ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందని రాసేసింది ‘ఈనాడు’. అసలు ఏ ప్రాజెక్టయినా ఒప్పందం కుదిరే వరకూ దాని మాతృసంస్థ పేరుతోనే నడుస్తుంది. ఖరారయ్యాక, ఒప్పందం చేసుకునే ముందు మాత్రమే దాన్ని ఏ పేరుతో పెట్టాలనుకున్నారో ఆ పేరుతో ఓ కంపెనీ ఏర్పాటు చేస్తారు. ఆ సంగతి సీబీఐకిగానీ, రామోజీకి గానీ తెలియదనుకోవాలా? ఈ దేశంలో ఏ సంస్థయినా ఇలానే చేస్తుంది కదా!! ఒప్పందం, కేటాయింపు ఇవన్నీ సదరు గ్రూప్ సంస్థ అనుభవం, సత్తా ఆధారంగానే జరుగుతాయి కదా? ఇవన్నీ తెలియదా?
 
 అయినా ఇందూ సంస్థ ఏమైనా ఐఎంజీ లాంటిదా? ఎక్కడో అనంతపురంలో ఎకరా రూ. 1.75 లక్షలకు చేసిన భూ కేటాయింపును ప్రస్తావిస్తున్న రామోజీరావుకు గానీ, సీబీఐకి గానీ... హైదరాబాద్ నడిబొడ్డున... 850 ఎకరాలను... ఎకరా కేవలం రూ. 50 వేల చొప్పున ఊరూపేరూ లేని బోగస్ సంస్థకు కట్టబెట్టిన బాబు బాగోతం ఎన్నడూ కనిపించదెందుకు? దీనిపై దర్యాప్తునకు ఆదేశించినపుడు కూడా సీబీఐ తనకు సిబ్బంది లేరని తప్పించుకుందంటే ఏమనుకోవాలి? దీనిపై కోర్టు విచారణకు ఆదేశించినపుడు సైతం ఒక్క కథనం రాసే ధైర్యం రామోజీరావు చెయ్యలేదంటే ఎలా భావించాలి?
 
 ఊరూపేరూ లేని సంస్థ తరఫున బిల్లీరావు, పేట్‌రావు అనే ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేయటం... చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఆగమేఘాలపై భూ కేటాయింపు చేసేయటం... భూములతో పాటు స్టేడియాలను కూడా అప్పగించటం... ఇవన్నీ ఏమనుకోవాలి? అనంతపురంలో ఎకరా రూ. 1.75 లక్షలకు కేటాయిస్తే అది తప్పా? అది పరిశ్రమల కోసం కాదా? హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా రూ.50 వేలకు కట్టబెట్టేస్తే... అది ఈ రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయడానికా? ఒలింపిక్ విజేతలు పుట్టకురావటానికా? ఎందుకింత దౌర్భాగ్యపు రాతలు రామోజీ? అప్పట్లో ఐఎంజీని ఆకాశానికెత్తేసింది మీ పత్రికే కదా? ఎందుకని? అది చంద్రబాబు కేటాయించింది కాబట్టా? ఇదేమో రాజశేఖరరెడ్డి కేటాయించింది కనకనా? ఇవేం విలువలు?
 
 భూ కేటాయింపుల్లో బాబును మించేదెవరు?
 అసలు భూ కేటాయింపుల్లో చంద్రబాబును మించిన వారెవరైనా ఉన్నారా? ఆయన కేటాయింపుల్లో అవకతవకలపై ఎన్ని ఆరోపణలొచ్చినా, ఆఖరికి కోర్టులు కూడా ఆదేశాలు జారీ చేసినా ఎన్నడూ సీబీఐ అటువైపు చూడదెందుకు? ఎన్నడూ రామోజీ ఒక్క రాత కూడా రాయరెందుకు? అసలు జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హైదరాబాద్‌లో 2,000 ఎకరాలు సరిపోతుందని కేంద్ర సంస్థలు సైతం నివేదికలు ఇవ్వలేదా? వాటన్నిటినీ పక్కనబెట్టి ఏకంగా 5,500 ఎకరాలు కేటాయించిన ఘనత బాబుది కాదా?
 
 అదెన్నడూ రామోజీకి తప్పుగా ఎందుకు కనిపించలేదు? ఎక్కడైనా ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికైనా ఇన్ని వేల ఎకరాలిచ్చారా? అంతర్జాతీయ ఖ్యాతి పొందిన సింగపూర్ చాంగీ విమానాశ్రయానికి కూడా మొత్తం భూమి 3,200 ఎకరాలే. ప్రపంచంలోనే అత్యధిక ఎయిర్‌ట్రాఫిక్ ఉండే న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం మొత్తం ఏరియా కూడా 4,900 ఎకరాలు. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయాన్ని చూస్తే మొత్తం ఏరియా 3,000 ఎకరాలు. అత్యంత బిజీ ఎయిర్‌పోర్టయిన ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం కొలువైంది కూడా 4,900 ఎకరాల్లోనే. కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ విమానాశ్రయానికి 5,500 ఎకరాలివ్వటమే అంతర్జాతీయ రికార్డు.

మరిన్ని వార్తలు